జాగో భారత్‌..భాగో! | Narendra Modi Launch Fit India Movement Health Target For Nation | Sakshi
Sakshi News home page

జాగో భారత్‌..భాగో!

Published Wed, Aug 28 2019 2:37 AM | Last Updated on Wed, Aug 28 2019 10:41 AM

Narendra Modi Launch Fit India Movement Health Target For Nation - Sakshi

తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా అనుకుంటే ఎలా? పొద్దున లేస్తూనే కాస్త ఒళ్లు వంచాలి. శరీరానికి చెమట పట్టేలా నడవాలి. చల్లటి గాలి పీల్చాలి. ప్రకృతిని ఆస్వాదించాలి.. అప్పుడే మనకు ఆరోగ్యమైనా, ఆనందమైనా.. ఆ రెండూ ఉంటేనే మనం ఫిట్‌గా ఉంటాం. భారత్‌ ఫిట్‌గా ఉంటుంది. 

ఇప్పుడు దీన్నే కేంద్ర ప్రభుత్వం మహోద్యమంలా చేపట్టేందుకు సిద్ధమైంది. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఆగస్టు 29న ఫిట్‌ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఇంతకీ మనం ఎంత ఫిట్‌గా ఉన్నాం? ప్రపంచ దేశాల ప్రమాణాలతో పోటీ పడుతున్నామా? ప్రపంచ దేశాల ఆరోగ్య ప్రమాణాలు, సంతోష సూచీలు చూస్తే మనం ఎన్నో దేశాల కంటే వెనుకబడే ఉన్నామని చెబుతున్నాయి. 

మనం ఎక్కడ ఉన్నాం? 
ఆరోగ్యం, వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడంలో భారత్‌ ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోంది. 32 ప్రాణాంతక వ్యాధులపై వివిధ దేశాలు చేస్తున్న పోరాటం ఆధారంగా ఇచ్చే గ్లోబల్‌ హెల్త్‌కేర్‌ యాక్సెస్‌ అండ్‌ క్వాలిటీ (హెచ్‌ఏక్యూ) ర్యాంకింగ్స్‌లో మొత్తం 195 దేశాలకు.. భారత్‌ 145వ స్థానంలో ఉంది. 1990లో 153వ స్థానంలో ఉన్న భారత్‌.. 2016 వచ్చేసరికి 145వ స్థానానికి వచ్చింది. అయితే హెచ్‌ఏక్యూ సూచీలో శ్రీలంక, బంగ్లాదేశ్, బ్రెజిల్, రష్యా, దక్షిణాఫ్రికా ప్రపంచ సగటు ప్రమాణాల కంటే మనం వెనుకబడే ఉన్నాం. 2016లో హెచ్‌ఏక్యూ ప్రపంచ సగటు 54.4గా ఉన్నప్పుడు భారత్‌కు 41.2 స్కోర్‌ వచ్చింది. 1990లో 24.7 మాత్రమే. అందరికీ ఆరోగ్యం కోసం కేంద్రం ఇప్పటికే ఆయుష్మాన్‌ భారత్‌ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 19,567 ఆరోగ్య కేంద్రాలను 2020 నాటికి 40 వేలకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. 

ఫిట్‌ ఇండియా ఎలా ముందుకు? 
శారీరక ఆరోగ్యం, మానసిక ఉల్లాసమే ప్రధాన ధ్యేయంగా ఫిట్‌ ఇండియా ఉద్యమాన్ని యువజన. క్రీడా శాఖ ముందుకు తీసుకెళ్లనుంది. విద్యాసంస్థలు ఫిట్‌నెస్‌ రన్స్, మారథాన్‌ రన్స్, సైకిల్‌ ర్యాలీలు చేపట్టడం, పిల్లలు సంప్రదాయ క్రీడలు ఆడేలా చర్యలు తీసుకోవడం.. పల్లెపల్లెల్లో.. నగరాల్లోని అన్ని ప్రాంతాల్లో వాకింగ్‌ పార్క్‌లు ఏర్పాటు చేయాలని క్రీడా శాఖ ప్రతిపాదించింది. శారీరక శ్రమతో పాటు పౌష్టిక ఆహారం తీసుకునేలా అవగాహన పెంచనుంది. ఇందుకు స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఆలిండియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్, సైక్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఇతర ప్రభుత్వ రంగ సంస్థలతో సలహా మండలి ఏర్పడింది. యోగా భామ, బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టికి ఫిట్‌ ఇండియా సలహా మండలిలో చోటు దక్కింది. విద్యార్థులు రోజూ కనీసం 10 వేల అడుగులు వేసేలా చర్యలు చేపట్టాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ అన్ని విద్యా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.

ఇవన్నీ రాకుండా ఉండాలంటే
శారీరక శ్రమ చేయకపోతే గుండె సంబంధిత వ్యాధులు, టైప్‌–2 డయాబెటిస్, ఊబకాయం, హైపర్‌ టెన్షన్, కీళ్ల నొప్పులు వచ్చే అవకాశాలు అధికం. వ్యాయామంతో పాటు కంటి నిండా నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కూడా చాలా అవసరం. రోజూ జిమ్‌లకు వెళ్లి ఎక్సర్‌సైజ్‌లు, వెయిట్‌లిఫ్టింగ్‌ చేయనక్కర్లేదు. రోజుకు 30 నిమిషాల వాకింగ్, మెట్లు ఎక్కడం, దిగడం వంటివి చేసినా శరీరానికి సరిపోతుంది. 

మనం సంతోషంగా ఉన్నామా? 
సంతోషం సగం బలం అంటారు. ఇవాళ రేపు సంతోషమే పూర్తి బలంగా మారిపోయింది. ఉరుకుల పరుగుల జీవితాలు, పెరిగిపోతున్న ఒత్తిడితో సంతోష సూచీలో మన దేశం చాలా వెనుకబడి ఉంది. ఐక్యరాజ్యసమితి ఈ ఏడాది మార్చిలో విడుదల చేసిన సంతోష సూచీలో మొత్తం 156 దేశాలకు గాను భారత్‌ 140వ స్థానంలో ఉంది. గత మూడేళ్ల ర్యాంకింగ్‌లు చూస్తే వరుసగా 118, 122, 132గా ఉంది. మన పొరుగుదేశాలైన పాకిస్తాన్, చైనా, భూటాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లో ప్రజలు మనకంటే సంతోషంగా ఉన్నారని ఆ నివేదిక వెల్లడించింది. 

-సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement