Sports Authority of India (Tsai)
-
మహిళా జట్లకు మహిళా కోచ్ తప్పనిసరి
న్యూఢిల్లీ: క్రీడాకారిణిలకు తరచూ ఎదురవుతోన్న కోచ్‌ల వేధింపులకు ముగింపు పలకాలని భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇకపై మహిళల జట్లు ఆడేందుకు ఎక్కడికి వెళ్లినా మహిళా కోచ్‌ను తప్పనిసరిగా నియమించాలని జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)లను ఆదేశించింది. దేశవాళీ టోర్నీ, విదేశీ పర్యటనలకు వెళ్లే అమ్మాయిల బృందంలో మహిళా కోచ్ ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఇటీవల స్లోవేనియాలో జరిగిన పోటీలకు వెళ్లిన మహిళా సైక్లిస్ట్ పట్ల చీఫ్ కోచ్ ఆర్.కె.శర్మ అనుచితంగా ప్రవర్తించాడు. ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, ‘సాయ్’ అతన్ని పదవి నుంచి తప్పించి, విచారణ చేపట్టింది. మరో మహిళా సెయిలర్‌కు జర్మనీలో ఇలాంటి అనుభవమే ఎదురవడంతో ‘సాయ్’ డైరెక్టర్ జనరల్ సందీప్ ప్రధాన్ 15 ఎన్‌ఎస్‌ఎఫ్‌లకు చెందిన అధికారులతో సమావేశమయ్యారు. ‘సాయ్’ నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించేలా ఓ ప్రత్యేక అధికారిని జట్టులో నియమించాలని కూడా ఆయన ఆదేశించారు. చదవండి: FIFA U17 Womens World Cup 2022: ఫిఫా వరల్డ్ కప్ 2022 షెడ్యూల్ విడుదల -
నీరజ్ చోప్రా కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో తెలుసా?
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించిన బల్లెం వీరుడు నీరజ్ చోప్రా కోసం ప్రభుత్వం భారీగానే ఖర్చు చేసింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా షేర్ చేసిన డాక్యుమెంట్ ప్రకారం టోక్యో ఒలింపిక్స్‌కు ముందు నీరజ్ చోప్రా 450 రోజుల పాటు జావెలిన్ త్రో కోసం విదేశాల్లో శిక్షణ పొందాడు. ఈ శిక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం 4.85 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. చోప్రా ప్రస్తుత ఒలింపిక్స్ కోసం 26 పోటీలలో పాల్గొన్నాడు. దక్షిణాఫ్రికా, పోలాండ్, టర్కీ, ఫిన్లాండ్, చెక్ రిపబ్లిక్ స్వీడన్ వంటి దేశాల్లో విదేశీ శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేసుకున్నాడు. తొలుత 2017లో నీరజ్ చోప్రా కోచ్‌గా జావెలిన్ త్రో లెజెండ్ ఉవే హోన్ బాధ్యతలు స్వీకరించగా.. 2019లో చోప్రా మోచేతి శస్త్రచికిత్స తర్వాత ఆయన కోచ్‌గా డాక్టర్ క్లాస్ బార్టోనియెడ్జ్ నియమితులయ్యారు. ఆయనకు ప్రభుత్వం రూ.1.22 కోట్లు చెల్లించింది. నీరజ్ కోసం కొనుగోలు చేసిన నాలుగు జావలిన్లకు రూ. 4,35,000 ప్రభుత్వం ఖర్చు చేసింది. ఒలింపిక్స్‌కు కొన్ని రోజుల ముందు నీరజ్ యూరప్ టోర్నమెంట్లో పాల్గొనేందుకు 50 రోజులపాటు స్వీడన్లో ఉన్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.19.22 లక్షలు ఖర్చు చేసింది. ఇందుకు ప్రతిఫలంగా నీరజ్ చోప్రా దేశానికి స్వర్ణపతకం అందించి వందేళ్ల నిరీక్షణకు ముగింపు పలికాడు. -
మరో నెల రోజులు అక్కడే: రూ. 11.65 లక్షల ఖర్చు
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియాకు మరో నెల రోజులు అదనంగా అమెరికాలో ప్రాక్టీస్ చేసే అవకాశం లభించింది. పురుషుల 65 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్ బెర్త్ సాధించిన బజరంగ్ డిసెంబర్ 4 నుంచి మిచిగాన్‌లోని క్లిఫ్ కీన్ రెజ్లింగ్ క్లబ్లో సాధన చేస్తున్నాడు. ఫిబ్రవరి మొదటి వారం వరకు అతను అక్కడే ప్రాక్టీస్ చేసే వీలు కలి్పస్తూ గతవారం ఒలింపిక్ సెల్ మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నట్లు భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) వెల్లడించింది. ఇందుకు అయ్యే రూ. 11.65 లక్షల వ్యయాన్ని భరిస్తామని తెలిపింది. క్లిఫ్ కీన్ రెజ్లింగ్ క్లబ్లో నాణ్యమైన ప్రాక్టీస్ లభిస్తోందని బజరంగ్ పేర్కొన్నాడు. ‘ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి. మంచి భాగస్వాములు అందుబాటులో ఉన్నారు. భారత్‌లో 74 కేజీలు, 79 కేజీల కేటగిరీ భాగస్వాములతో ప్రాక్టీస్ చేసేవాడిని. ఇక్కడ నా వెయిట్ కేటగిరీకి చెందిన రెజ్లర్లతో సాధన చేస్తున్నా’ అని బజరంగ్ తెలిపాడు. మార్చిలో రోమ్ టోరీ్నతో ఈ ఏడాది పతకాల వేటను ప్రారంభిస్తానన్నాడు. (చదవండి: భారత జట్టుకు నిరాశ ) -
భారత షట్లర్లకు కరోనా కష్టాలు!
సార్‌బ్రుకెన్ (జర్మనీ): కోవిడ్–19 కారణంగా వచ్చిన సుదీర్ఘ విరామం తర్వాత టోర్నీలో పాల్గొనేందుకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని భావించిన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులకు చేదు అనుభవం ఎదురైంది. ఇక్కడ ప్రారంభమైన సార్లార్ లక్స్ ఓపెన్ సూపర్–100 టోర్నీనుంచి మన షట్లర్లు అజయ్ జయరాం, శుభాంకర్ డే అర్ధాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది. బుధవారమే మరో ఆటగాడు లక్ష్య సేన్ కూడా టోర్నీకి దూరమయ్యాడు. కరోనా భయమే దీనికంతటికీ కారణం. వివరాల్లోకెళితే... ఆటగాళ్లతో పాటు కోచ్ హోదాలో టోర్నీకి వచ్చిన లక్ష్య సేన్ తండ్రి డీకే సేన్ బుధవారం కరోనా ‘పాజిటివ్’గా తేలారు. దాంతో ఆయనతో కలిసి ఉన్న లక్ష్య సేన్ టోర్నీనుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే సేన్‌తో కలిసి సాధన చేసిన, ప్రయాణించిన జయరామ్, శుభాంకర్ కూడా తప్పుకోవాలని టోర్నీ నిర్వాహకులు సూచించారు. ఈ విషయాన్ని ‘బీడబ్ల్యూఎఫ్’ కూడా ప్రకటించింది. దాంతో వీరిద్దరు కూడా నిష్క్రమించాల్సి వచ్చింది. అయితే నిబంధనల ప్రకారం కనీసం 10 నవంబర్ వరకు ఐసోలేషన్‌లో ఉండాలని చెప్పిన నిర్వాహకులు అందుకు తగినట్లుగా కనీస ఏర్పాట్లు కూడా చేయలేదు. ఎక్కడ ఉండాలో, అన్ని రోజులు ఖర్చులు ఎలా భరించాలనే విషయంపై కూడా స్పష్టతనివ్వకుండా వారి మానాన వారిని వదిలేశారు. నిజానికి వీరిద్దరికి ఎలాంటి లక్షణాలు లేవు. జర్మనీ రావడానికి ముందే చేయించుకున్న పరీక్షల ‘నెగెటివ్’ రిపోర్టులు కూడా ఉన్నాయి. డీకే సేన్ రిపోర్టు వచ్చే సమయానికి జయరామ్ ఒక మ్యాచ్ కూడా ఆడేశాడు. ఈ విషయంలో టోర్నీ ఆరంభంలో సరైన కోవిడ్–19 నిబంధనలు పాటించని నిర్వాహకులతో పాటు పరీక్షలు చేయించుకోకుండా వచ్చిన లక్ష్యసేన్ తప్పు కొంత వరకు ఉండగా... వీరిద్దరు కూడా బాధితులయ్యారు. తాజా పరిణామాలతో ఆందోళన చెందిన జయరామ్ తన బాధను ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. ఎట్టకేలకు భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) దీనిపై స్పందించింది. వారి భోజన, వసతి ఖర్చులను తాము భరించనున్నట్లు స్పష్టం చేసింది. దాంతో ఊరట పొందిన జయరామ్...సాధ్యమైనంత తర్వాత స్వదేశం తిరిగొస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు. -
ప్రేక్షకులు లేకుండానే గ్రాండ్‌ప్రి ఈవెంట్లు
న్యూఢిల్లీ: ఇండియన్ గ్రాండ్‌ప్రి (ఐజీపీ) అథ్లెటిక్స్ సిరీస్‌లో భాగంగా జరిగే తొలి రెండు పోటీలను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించేలా భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) సోమవారం నిర్ణయం తీసుకుంది. మన దేశంలోనూ కోవిడ్–19 తీవ్రమవుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏఎఫ్ఐ తెలిపింది. ఐజీపీ–1 ఈ నెల 20వ తేదీన... ఐజీపీ–2 ఈ నెల 25వ తేదీన పటియాలాలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ వేదికగా జరగనున్నాయి. భారత్‌లో కరోనా వ్యాప్తి జరగకుండా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విదేశీయుల ప్రయాణాలపై ఆంక్షలు విధించగా... స్పోర్ట్స్ ఈవెంట్లలో పెద్ద ఎత్తున జనం ఒకేచోట గుమికూడకుండా చర్యలు తీసుకోవాలంటూ అన్ని జాతీయ క్రీడల సమాఖ్యలను కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ కోరింది. -
జాగో భారత్..భాగో!
తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా అనుకుంటే ఎలా? పొద్దున లేస్తూనే కాస్త ఒళ్లు వంచాలి. శరీరానికి చెమట పట్టేలా నడవాలి. చల్లటి గాలి పీల్చాలి. ప్రకృతిని ఆస్వాదించాలి.. అప్పుడే మనకు ఆరోగ్యమైనా, ఆనందమైనా.. ఆ రెండూ ఉంటేనే మనం ఫిట్‌గా ఉంటాం. భారత్ ఫిట్‌గా ఉంటుంది. ఇప్పుడు దీన్నే కేంద్ర ప్రభుత్వం మహోద్యమంలా చేపట్టేందుకు సిద్ధమైంది. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఆగస్టు 29న ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు మన్‌కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఇంతకీ మనం ఎంత ఫిట్‌గా ఉన్నాం? ప్రపంచ దేశాల ప్రమాణాలతో పోటీ పడుతున్నామా? ప్రపంచ దేశాల ఆరోగ్య ప్రమాణాలు, సంతోష సూచీలు చూస్తే మనం ఎన్నో దేశాల కంటే వెనుకబడే ఉన్నామని చెబుతున్నాయి. మనం ఎక్కడ ఉన్నాం? ఆరోగ్యం, వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడంలో భారత్ ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోంది. 32 ప్రాణాంతక వ్యాధులపై వివిధ దేశాలు చేస్తున్న పోరాటం ఆధారంగా ఇచ్చే గ్లోబల్ హెల్త్‌కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీ (హెచ్ఏక్యూ) ర్యాంకింగ్స్‌లో మొత్తం 195 దేశాలకు.. భారత్ 145వ స్థానంలో ఉంది. 1990లో 153వ స్థానంలో ఉన్న భారత్.. 2016 వచ్చేసరికి 145వ స్థానానికి వచ్చింది. అయితే హెచ్ఏక్యూ సూచీలో శ్రీలంక, బంగ్లాదేశ్, బ్రెజిల్, రష్యా, దక్షిణాఫ్రికా ప్రపంచ సగటు ప్రమాణాల కంటే మనం వెనుకబడే ఉన్నాం. 2016లో హెచ్ఏక్యూ ప్రపంచ సగటు 54.4గా ఉన్నప్పుడు భారత్‌కు 41.2 స్కోర్ వచ్చింది. 1990లో 24.7 మాత్రమే. అందరికీ ఆరోగ్యం కోసం కేంద్రం ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 19,567 ఆరోగ్య కేంద్రాలను 2020 నాటికి 40 వేలకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఫిట్ ఇండియా ఎలా ముందుకు? శారీరక ఆరోగ్యం, మానసిక ఉల్లాసమే ప్రధాన ధ్యేయంగా ఫిట్ ఇండియా ఉద్యమాన్ని యువజన. క్రీడా శాఖ ముందుకు తీసుకెళ్లనుంది. విద్యాసంస్థలు ఫిట్నెస్ రన్స్, మారథాన్ రన్స్, సైకిల్ ర్యాలీలు చేపట్టడం, పిల్లలు సంప్రదాయ క్రీడలు ఆడేలా చర్యలు తీసుకోవడం.. పల్లెపల్లెల్లో.. నగరాల్లోని అన్ని ప్రాంతాల్లో వాకింగ్ పార్క్‌లు ఏర్పాటు చేయాలని క్రీడా శాఖ ప్రతిపాదించింది. శారీరక శ్రమతో పాటు పౌష్టిక ఆహారం తీసుకునేలా అవగాహన పెంచనుంది. ఇందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇతర ప్రభుత్వ రంగ సంస్థలతో సలహా మండలి ఏర్పడింది. యోగా భామ, బాలీవుడ్ నటి శిల్పా శెట్టికి ఫిట్ ఇండియా సలహా మండలిలో చోటు దక్కింది. విద్యార్థులు రోజూ కనీసం 10 వేల అడుగులు వేసేలా చర్యలు చేపట్టాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అన్ని విద్యా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఇవన్నీ రాకుండా ఉండాలంటే శారీరక శ్రమ చేయకపోతే గుండె సంబంధిత వ్యాధులు, టైప్–2 డయాబెటిస్, ఊబకాయం, హైపర్ టెన్షన్, కీళ్ల నొప్పులు వచ్చే అవకాశాలు అధికం. వ్యాయామంతో పాటు కంటి నిండా నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కూడా చాలా అవసరం. రోజూ జిమ్‌లకు వెళ్లి ఎక్సర్సైజ్లు, వెయిట్‌లిఫ్టింగ్ చేయనక్కర్లేదు. రోజుకు 30 నిమిషాల వాకింగ్, మెట్లు ఎక్కడం, దిగడం వంటివి చేసినా శరీరానికి సరిపోతుంది. మనం సంతోషంగా ఉన్నామా? సంతోషం సగం బలం అంటారు. ఇవాళ రేపు సంతోషమే పూర్తి బలంగా మారిపోయింది. ఉరుకుల పరుగుల జీవితాలు, పెరిగిపోతున్న ఒత్తిడితో సంతోష సూచీలో మన దేశం చాలా వెనుకబడి ఉంది. ఐక్యరాజ్యసమితి ఈ ఏడాది మార్చిలో విడుదల చేసిన సంతోష సూచీలో మొత్తం 156 దేశాలకు గాను భారత్ 140వ స్థానంలో ఉంది. గత మూడేళ్ల ర్యాంకింగ్‌లు చూస్తే వరుసగా 118, 122, 132గా ఉంది. మన పొరుగుదేశాలైన పాకిస్తాన్, చైనా, భూటాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లో ప్రజలు మనకంటే సంతోషంగా ఉన్నారని ఆ నివేదిక వెల్లడించింది. -సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
‘సాయ్’లో ఘోరం
► నలుగురు మహిళా అథ్లెట్ల ఆత్మహత్యాయత్నం ► ఒకరు మృతి క్రీడా శాఖ విచారణ న్యూఢిల్లీ : భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్)లో దారుణం చోటు చేసుకుంది. కేరళలోని అళెప్పీ సాయ్ వాటర్ స్పోర్ట్స్ సెంటర్లో నలుగురు మహిళా అథ్లెట్స్ ఆత్మహత్యా ప్రయత్నానికి పాల్పడ్డారు. బుధవారం జరిగిన ఈ ఘటనలో 15 ఏళ్ల అపర్ణా రామభద్రన్ మృతి చెందగా మిగతా ముగ్గురు టీనేజర్ల పరిస్థితి విషమంగానే ఉంది. వీరంతా విషపూరిత పండు (సెర్బెరా ఒడోలమ్)ను తిని ఈ దారుణానికి పాల్పడ్డారు. ఇంటర్ చదువుతున్న అపర్ణ పదో తరగతిలోనే సాయ్కు ఎంపికైంది. సీనియర్ల, కోచ్, సిబ్బంది వేధింపులు భరించలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తమతో తెలిపిందని అపర్ణ తల్లి గీత ఆరోపించింది. అయితే ఆమె ఆరోపణలను సాయ్ హాస్టల్ వార్డెన్ ఖండించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. నలుగురి సంతకంతో కూడిన ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు మధ్యాహ్నం 3 గంటలకు సంఘటన జరగ్గా రాత్రి 9 గంటలకు ఆస్పత్రికి తీసుకురావడం వెనుక గల కారణంపై విచారణ చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ పద్మకుమార్ తెలిపారు. ఇలాంటి దుర్ఘటన జరగడం దురదృష్టకరమని డెరైక్టర్ జనరల్ ఇంజేటి శ్రీనివాస్ అన్నారు. ఈ వ్యవహారంపై స్పందించిన కేంద్ర క్రీడా శాఖ విచారణకు ఆదేశించింది.