కరోనా..160 నాటౌట్‌.. | Special Story On National Sports Day | Sakshi
Sakshi News home page

160 నాటౌట్‌..

Published Sat, Aug 29 2020 10:34 AM | Last Updated on Sat, Aug 29 2020 10:36 AM

Special Story On National Sports Day - Sakshi

కరోనా మహమ్మారి ఒంటరి ఇన్నింగ్స్‌ ఆడుతోంది. క్రీడాకారులను స్టేడియంలోకి రానీయకుండా ఏకధాటిగా బ్యాటింగ్‌ చేస్తోంది. 160 రోజులుగా పాజిటివ్‌ కేసులను నమోదు చేస్తూ హడలెత్తిస్తుండటంతో ఆటల పోటీలకు బ్రేక్‌ పడింది. ముందుగా నిర్ణయించిన క్రీడా పోటీలు వాయిదా పడ్డాయి. ఈ ఏడాది మార్చినెలాఖరులో మూతపడిన స్టేడియాలు, మైదానాలు ఇంత వరకు తెరుచుకోలేదు. లాక్‌డౌన్‌ కారణంగా జిల్లా వ్యాప్తంగా అంతటా ఇదే పరిస్థితి. ఉదయం లేస్తే.. గ్రౌండ్‌కు పరుగెత్తే క్రీడాకారులు ప్రాక్టీసు లేక, ఆన్‌లైన్‌ గేమ్‌లు, జూమ్‌ యాప్‌ల ద్వారా ఆయా క్రీడల్లో శిక్షణ తీసుకుంటున్నారు. కరోనా త్వరగా అవుట్‌ కావాలని క్రీడాకారులు ఆకాంక్షిస్తున్నారు. నేడు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడారంగం పరిస్థితిపై ప్రత్యేక కథనం.  

కర్నూలు (టౌన్‌): క్రీడా మైదానాలు వెలవెలబోతున్నాయి. ఆటల పోటీలు సాగడం లేదు. క్రీడాభిమానుల చప్పట్లు మారుమోగడం లేదు. పతకాలు మెరవడం లేదు.. ప్రశంసాపత్రాల్లో క్రీడాకారుల పేర్లు కనిపించడం లేదు. మాయదారి కరోనా మహమ్మారి స్టేడియాలకు తాళం వేసేలా దాపురించింది. కర్నూలు నగరంలోని స్పోర్ట్సు అథారిటీ స్టేడియం, ఇండోర్‌ స్టేడియం, స్టేడియానికి చెందిన స్విమ్మింగ్‌ పూల్‌తో పాటు ఎస్టీబీసీ కళాశాల క్రీడా మైదానం, బీక్యాంపు క్రీడా మైదానాలు క్రీడాకారులతో కళకళలాడుతూ ఉండేవి. ఫుట్‌బాల్, అథ్లెటిక్స్, క్రికెట్, వాలీబాల్, స్కేటింగ్, బాస్కెట్‌బాల్‌ క్రీడాకారులు నిత్యం శిక్షణ తీసుకుంటూ కనిపించే వారు. ప్రస్తుతం ఈ స్టేడియాలు క్రీడాకారులు లేక వెలవెల బోతున్నాయి. ఐదు నెలలుగా పోటీలు కూడా నిలిచిపోయాయి.

 ప్రతి ఏడాది క్రీడా క్యాలెండర్‌ ప్రకారం నిర్ణయించిన వేళల్లో క్రీడా పోటీలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే మార్చి నెల 23వ తేదీ నుంచి కరోనా మహమ్మారితో జిల్లా వ్యాప్తంగా క్రీడాపోటీలు నిలిచిపోయాయి. ముందే నిర్ణయించిన తేదీల మేరకు మార్చి నెల 25 నుంచి 30వ తేదీ వరకు యోగా జాతీయ పోటీలు, స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి రగ్బీ అండర్‌ 14, అండర్‌ 17, అండర్‌ 19 పోటీలు, వాటర్‌ పోలో గేమ్స్‌ జాతీయ పోటీలు నిర్వహించాల్సి ఉంది. ఈ పోటీలన్నీ కరోనా దెబ్బకు వాయిదా పడ్డాయి. జూన్‌ నెలలో జరగాల్సిన ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ కూడా వాయిదా పడింది. ఎస్‌జీఎఫ్‌ లోని 34 క్రీడాంశాల్లో పోటీలు నిలిచిపోయాయి. స్పోర్ట్సు క్యాలెండర్‌ ప్రకారం జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహించి జాతీయ పోటీలను మార్చి 31వ లోపు ముగించాల్సి ఉంటుంది. అయితే కరోనా ప్రభావంతో ఈ క్రీడలన్నీ నిలిచిపోయాయి. వేలాది మంది క్రీడాకారులు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని ప్రాక్టీసు చేసినా... కరోనా వల్ల అందరూ నిరుత్సాహ పడ్డారు.   

మంజూరైనా... అందని వైఎస్‌ఆర్‌ క్రీడా నగదు పురస్కారాలు 
జిల్లా క్రీడాభివృద్ధి అధికారుల నిర్లక్ష్యంగా క్రీడాకారులకు ప్రోత్సాహం కరువైంది. వైఎస్‌ఆర్‌ క్రీడా నగదు పురస్కారాల పేరుతో జిల్లాలోని క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించిన ప్రోత్సాహక నగదు అందజేస్తారు. దీంతో జిల్లావ్యాప్తంగా 109 మంది క్రీడాకారులు ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి క్రీడాకారులను ఆదుకోవాలని వారికి ప్రోత్సాహకాలు ప్రకటించారు. ఇందుకు సంబంధించి రూ. 28 లక్షలు ప్రభుత్వం విడుదల చేసింది. గత ఏడాది క్రీడా దినోత్సవం రోజు కొందరికి రూ. 4 లక్షలు అందించారు. ఇతర మొత్తం క్రీడాకారులకు ఇవ్వాల్సి ఉన్న సకాలంలో జిల్లా క్రీడా శాఖ అధికారులు స్పందించకపోవడంతో నిధులు వెనక్కు వెళ్లిపోయాయి. 

క్రీడా సంబరాలు లేవు.. 
1928, 1932, 1936లో ఒలింపిక్స్‌ పతకాలు సా«ధించిన ధ్యాన్‌చంద్‌ పుట్టిన రోజును జాతీయ క్రీడా దినోత్సవంగా క్రీడాశాఖ నిర్వహిస్తుంది. ఏటా ఆరోజు జిల్లా క్రీడాశాఖ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించడం, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులను సన్మానించడం వంటి ఎన్నో కార్యక్రమాలు చేపడతారు. వారం రోజుల నుంచే స్కూల్‌గేమ్స్‌ క్రీడలు, జూనియర్‌ స్థాయి క్రీడలు, అథ్లెటిక్స్‌ వంటి క్రీడలు సబ్‌ జూనియర్, జూనియర్, సీనియర్‌ లెవల్‌లో జరిగేవి. మండల, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా కేంద్రంలో ఫైనల్‌ గేమ్స్‌ నిర్వహించే వారు. విజేతలకు జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని పతకాలు, సీనియర్‌ క్రీడాకారులకు సన్మానం వంటి కార్యక్రమాలు, అదే రోజు నగరంలో 2కే రన్, 5కే రన్‌ తదితర కార్యక్రమాలు నిర్వహించే వారు. అయితే ఈ ఏడాది కరోనా వల్ల జాతీయ క్రీడా దినోత్సవంలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదు. కేవలం నగరంలోని స్పోర్ట్స్‌ అధారిటీ స్టేడియంలోని యోగా హాల్‌లో ధ్యాన్‌చంద్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్నట్లు స్పోర్ట్స్‌ అథారిటీ ముఖ్యకార్య నిర్వహణాధికారి నాగరాజు నాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.  

క్రీడాకారులకు శిక్షణ అవసరం 
క్రీడాకారులకు శిక్షణ అవసరం. లాక్‌డౌన్‌ కారణంగా అవుట్‌ డోర్‌ శిక్షణకు దూరంగా ఉండాల్సి వస్తోంది. నేను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించా.  వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులకు ప్రోత్సాహక నగదు పురస్కారాలు ప్రకటించింది. ఇందులో నేను ఎంపికయ్యాను. నగదు పురస్కారాల అందజేతలో జాప్యం జరుగుతోంది. అధికారులు వెంటనే స్పందించాలి.  
– జాఫ్రీన్, డెఫ్‌ ఇండియన్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి, కర్నూలు 
   

లాక్‌డౌన్‌తో అవకాశాలు కోల్పోయారు 
కరోనా వ్యాధిని అరికట్టడానికి విధించిన లాక్‌డౌన్‌ కారణంగా క్రీడాకారులు ఎన్నో అవకాశాలు  కోల్పోయారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అరుదైన అవకాశం వచ్చినా పోటీలు వాయిదా పడ్డాయి. శిక్షణ లేకపోవడంతో ప్రతిభకు మెరుగలద్దడం కష్టం. ప్రైవేటు క్రీడా కోచ్‌లు కూడా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.
 – రామాంజనేయులు, జిల్లా ఒలింపిక్‌ సంఘం కార్యదర్శి, కర్నూలు 

ధ్యాన్‌ చంద్‌ విగ్రహం ఏర్పాటు చేయాలి 
కర్నూలు జిల్లా హాకీ క్రీడకు పుట్టినిల్లు వంటిది. జిల్లాకు చెందిన ఎంతో మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చాయి. రాష్ట్రంలోనే కర్నూలు జిల్లా హాకీ క్రీడాకారులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. హకీ క్రీడకు ఉన్న గుర్తింపునకు న్యాయం చేస్తూ నగరంలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయ ఆవరణలో ధ్యాన్‌చంద్‌ విగ్రహం ఏర్పాటు చేయాలి.   
– దాసరి సుధీర్, జిల్లా హాకీ అసోసియేషన్‌ కార్యదర్శి, కర్నూలు        

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement