సాక్షి,కర్నూలు (ఓల్డ్‌సిటీ): రాష్ట్రంలో కర్నూలు పొట్టేలు మాంసానికి ప్రత్యేకత ఉంది. ఇక్కడి మాంసం రుచికరంగా ఉండటమే కాకుండా ధర కూడా ఎక్కువగా ఉంటుంది. నగరంలో సుమారు 70 మంది మాంస విక్రయదారులు ఉన్నారు. పొట్టేళ్లను సమీప ప్రాంతాల్లో జరిగే సంతల్లో కొంటుంటారు. నగరానికి 70 కిలోమీటర్ల దూరంలోని పెబ్బేరు గ్రామం పొట్టేళ్ల సంతకు ప్రసిద్ధి.
అక్కడ సంత శనివారం జరుగుతుంటుంది. అలాగే జిల్లాలోని పత్తికొండ, నందికొట్కూరు కూడా సంత జరిగే ప్రాంతాలు. అక్కడ సోమవారం జరుగుతుంటుంది. ఇక్కడి మాంస విక్రయదారులు ఈ మూడు ప్రాంతాల నుంచి వారం రోజులకు సరిపడే పొట్టేళ్లు తెచ్చుకుని కోస్తుంటారు. ఈ ప్రాంతంలో నెల్లూరు జుడిపి, నెల్లూర్ బ్రౌన్ అనే రెండు రకాల జాతి పొట్టేళ్లు లభిస్తాయి. పైగా పొట్టేలు మాంసంలో కరోనా నిరోధించే శక్తి ఎక్కువ. ఇందులో ఒక ప్రత్యేక ఎంజైమ్ ఉంటుంది. కోడి మాంసంలో అది లభించదు. ఇక్కడి పొట్టేళ్లు సారవంతమైన నేలల్లో మేస్తాయి. ఈ నేలల్లో వాటికి మంచి పోషకాహారాలు లభిస్తాయి.
పొరుగు జిల్లాతో పోలిస్తే..
అనంతపురం జిల్లాతో పోలిస్తే ఇక్కడి మాంసమే నాణ్యమైనది. రుచిలోనూ మేలైన రకంగా ఉంటుంది. ఈ విషయం శాస్త్రీయంగా నిర్ధారణ అయింది. ఆ జిల్లాలోని పొట్టేళ్లలో కర్ణాటక ప్రాంతంలోని మాండియా బ్రీడ్ కలుస్తుంటుంది. పొట్టేళ్ల సంతాన ఉత్పత్తి సమయంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఆడ పొట్టేలు కానీ లేక మగ పొట్టేలు కానీ మాండియా బీడ్‌కు చెందినదైతే సంతానోత్పత్తి ద్వారా వచ్చిన పొట్టేలు మాంసంలో రుచి ఉండదు.
అందువల్ల ధరల్లోనూ తేడా ఉంటుంది. అనంతపురంలో మాంసం ధర రూ. 400కు కిలో ఉంటే కర్నూలులో మాత్రం రూ. 700 పల్కుతోంది. అయితే అనంతపురం మాంసంలో ఎముకలు, పేగులు వంటి వ్యర్థ పదార్థాలు 30 శాతమే ఉంటాయి. కర్నూలు మాంసంలో ఆ శాతం 40 దాకా ఉంటుంది. వ్యర్థాలు ఎక్కువ ఉండటం కూడా మాంసం ధరపై ప్రభావం చూపిస్తుందని కొందరు విశ్లేషకులు చెబుతారు.
జాతీయ పరిశోధన కేంద్రానికి రవాణా..
జాతీయ పరిశోధనా కేంద్రం హైదరాబాదులోని చెంగిచెర్లలో ఉంది. కర్నూలు మాంసం నిత్యం ఈ కేంద్రానికి ఎగుమతి అవుతుంటోంది. వధశాలలు ఎలా ఉండాలి, ఏ ప్రాంతంలో మాంసం కోయాలి, ఎలాంటి జంతువులను కోయాలి, ఏఏ జాగ్రత్తలు పాటించాలి వంటి అనేక అంశాలను అక్కడి శాస్త్రవేత్తలు పరిశోధనల ద్వారా నిర్ధారిస్తుంటారు. వారు పరిశోధనలకు కర్నూలు మాంసాన్నే ఉపయోగిస్తారు. అదే సంస్థలోని విక్రయ కేంద్రంలోనూ కర్నూలు మాంసాన్ని అందుబాటులో ఉంచుతారు. మాంసానికి కూడా ఇంత స్టోరీ ఉంటుందా అనేది ఇప్పుడే తెలుస్తోంది కదూ! ఇది ముమ్మాటికి నిజం.
నేల స్వభావం, అక్కడి గడ్డిమేత ఆధారంగా తేడా: డాక్టర్ రమణయ్య, పశుసంవర్ధక శాఖ జేడీ
నేల స్వభావం, అక్కడి గడ్డిమేత ఆధారంగా జీవాల మాంసాల్లో తేడా ఉంటుంది. కర్నూలు నగరంతో పాటు చుట్టూ ఉండే నేల సారవంతమైనది. ఇక్కడ మొలిచే గడ్డిలోనూ తేడా ఉంటుంది. ఈ గడ్డిని మేతగా తీసుకునే జీవాల మాంసంలోనూ తేడా కనిపిస్తుంది. కర్నూలుతో పోలిస్తే హైదరాబాదు మాంసానికి కూడా రుచి తక్కువే. అందువల్లే అక్కడి పరిశోధనా కేంద్రం వారు చెంగిచెర్లకు తెప్పించుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment