జీవితమే ఒక ఆట | Life is a game | Sakshi
Sakshi News home page

జీవితమే ఒక ఆట

Published Mon, Aug 29 2016 2:03 AM | Last Updated on Mon, Sep 4 2017 11:19 AM

జీవితమే ఒక ఆట

జీవితమే ఒక ఆట

క్రీడారంగంలో రాణించడమే వారి లక్ష్యం. అదే వారి స్వప్నం. అహర్నిశలు శ్రమించి క్రీడా మెళకువలు నేర్చుకొని.. జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నా జిల్లా క్రీడాకారులకు గుర్తింపు దక్కడం లేదు. పతకాల పంట పండించినా.. ప్రశంసా పత్రాలు కైవసం చేసుకున్నా వారికి కించిత్తు ప్రోత్సాహం కూడా సర్కారు వైపు నుంచి లభించడం లేదు. దీంతో ఎంతోమంది ప్రతిభావంతులైన క్రీడాకారులు స్వయం ఉపాధి బాటలో పయనిస్తున్నారు. ఇంకొంతమంది వ్యవసాయ కూలీ పనులకు వెళ్తూ దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. వారి క్రీడా ప్రస్థానంపై ‘జాతీయ క్రీడా దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేక కథనం.
 
  • ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం కరువు
  • స్వయం ఉపాధి బాటలో కొందరు, కూలీ పనులకు ఇంకొందరు..
  • నేడు జాతీయ క్రీడా దినోత్సవం 
పాన్‌షాప్‌ నడుపుకుంటూ..
మహబూబాబాద్‌ : మానుకోటకు చెందిన ఆ క్రీడాకారుడి పేరు అక్తర్‌ పాషా. ఖోఖో మైదానంలో చిరుతలా రయ్‌మని దూసుకుపోయే వేగం ఆయనకు సొంతం. అనన్య సామాన్యమైన క్రీడా నైపుణ్యాలున్నా సర్కారు చేదోడు మాత్రం అందలేదు. దీంతో పాన్‌షాప్‌ నడుపుతూ స్వయం ఉపాధిని పొందుతున్నారాయన. జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో 12 సార్లు పాల్గొని ప్రతిభ కనబరిచారాయన. 1989 సంవత్సరంలో జరిగిన జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో బంగారు పతకాన్ని సాధించారు. 1993లో మధ్యప్రదేశ్‌లో జరిగిన 38వ జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. 1996లో తమిళనాడులో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో, అదే ఏడాది అక్కడే జరిగిన సీనియర్‌ సౌత్‌జోన్‌ పోటీల్లో తెలంగాణ జట్టు తరఫున పాల్గొన్ని కాంస్య పతకాన్ని చేజిక్కించుకున్నారాయన. 1995, 1996, 1997 సంవత్సరాల్లో జరిగిన అంతర్‌ విశ్వవిద్యాలయ స్థాయి పోటీల్లో కాకతీయ యూనివర్సిటీ జట్టు తరఫున పాల్గొన్నారు. 
నడక పోటీలు, లాంగ్‌జంప్‌లోనూ..
కడపలో జరిగిన 5 కిలోమీటర్ల నడక పోటీల్లో తృతీయ బహుమతిని సాధించారు అక్తర్‌పాషా. వరంగల్‌లో నిర్వహించిన 200 మీటర్ల పరుగు పందెంలో రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతిని సాధించారు. వరంగల్‌లో నిర్వహించిన లాంగ్‌జంప్‌ పోటీల్లో ద్వితీయ బహుమతిని కైవసం చేసుకున్నారు. డిగ్రీ (బీఏ) పూర్తి చేసిన ఆయనకు అనంతర కాలంలో క్రీడారంగంలోని ప్రతిభ ఆధారంగా ఉద్యోగ అవకాశాలు లభించలేదు. దీంతో తొర్రూరు బస్టాండ్‌లో పాన్‌షాప్‌ ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందుతున్నారు. ఆయన కుమారుడు అఫ్రోజ్‌ ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా, కుమార్తె సమ్రీన్‌ 9వతరగతి చదువుతోంది. తనకు మెుండిచెయ్యి చూపిన క్రీడలపై తన పిల్లలు దృష్టిసారించకుండా ఆయన చూస్తున్నారు. చదువులపై ఎక్కువ శ్రద్ధపెట్టాలని తమ పిల్లలకు ఆయన సూచిస్తున్నారు.
వ్యవసాయ పనులకు వెళ్తూ కుటుంబానికి ఆసరాగా..
కేసముద్రం : ‘క్రీడలు వద్దు.. చదువులే ముద్దు’ అని తల్లిదండ్రులు, తోటివారు స్వర్ణలతకు చెప్పారు. ఆమె ఉప్పరపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఏడోతరగతి చదువుతున్న సమయమది. ఎవరు ఎన్ని చెప్పినా.. ఆమె తనకు ఇష్టమైన క్రీడ తైక్వాండోపై ఆసక్తిని మాత్రం తగ్గించుకోలేదు. అందులో క్రీడా నైపుణ్యాలను పెంచుకుంటూ జాతీయస్థాయిలో పోటీల్లో ప్రతిభ కనబరిచేలా ఎదిగింది. అనంతర కాలంలో ఆమె ఉత్సాహాన్ని చూసి తల్లిదండ్రులు సైతం తమ ఆలోచనా ధోరణిని మార్చుకున్నారు. అప్పు చేసి మరీ డబ్బులు తెచ్చి తన కుమార్తె క్రీడా పోటీలకు వెళ్లేందుకు డబ్బులు ఇచ్చేవారు. స్వర్ణలతలోని క్రీడా స్ఫూర్తి ఓ వైపు.. కన్నబిడ్డకు చేదోడునిచ్చేందుకు అప్పులు చేసేందుకు సిద్ధమైన తల్లిదండ్రులు రాజబోయిన వెంకన్న, అరుణల ప్రోత్సాహం మరోవైపు.  ఇవన్నీ వెరసి రాష్ట్ర, జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో స్వర్ణలత ఓ మెరుపై మెరిసింది. ఆమెలోని ప్రతిభను గుర్తించి కేసముద్రం విలేజ్‌లోని శ్రీవివేకవర్ధిని స్కూల్‌ కరస్పాండెంట్‌ చిర్ర యాకాంతం గౌడ్‌ స్వర్ణలతను ప్రోత్సాహించారు. తన పాఠశాలలో 9,10 తరగతులను చదివించారు. ఇదే సమయంలో కేసముద్రం స్టేషన్‌లో తైక్వాండో క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించే వేసవి శిక్షణా శిబిరం, ప్రతి ఆదివారం నిర్వహించే శిబిరాలకు ఆమె హాజరయ్యేది. ఈ శిక్షణతో పలు పతకాలను సాధించింది. ప్రస్తుతం ఆమె వ్యవసాయ కూలీ పనులకు వెళ్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటూనే,  స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ సెకండియర్‌ చదువుతోంది. తండ్రికి ఇటీవలæనడుము నొప్పితో ఆపరేషన్‌ జరగడంతో ఆయన ఇంటికే పరిమితమయ్యారు. దీంతో కుటుంబ బాధ్యతను స్వర్ణలత పంచుకుంటోంది. అంతేకాకుండా ప్రతి ఆదివారం కేసముద్రం స్టేషన్‌ పరిధిలోని జెడ్పీఎస్‌ఎస్‌లో నిర్వహించే క్రీడా శిబిరానికి హాజరై విద్యార్థులకు తైక్వాండోపై అవగాహన కల్పిస్తోంది.
ప్రైవేట్‌ స్కూల్‌లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా..
డోర్నకల్‌ : డోర్నకల్‌కు చెందిన మండలోజు సుధాకర్‌ దశాబ్ద కాలంగా వెయిట్‌ లిఫ్టింగ్, పవర్‌ లిఫ్టింగ్‌ క్రీడల్లో విశేషంగా రాణిం చాడు. స్పోర్ట్స్‌ కోటా ద్వారా ఉద్యోగం కోసం అనేక ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. దీంతో గార్లలోని ఓ ప్రైవేటు పాఠశాలలో అతి తక్కువ వేతనంతో వ్యాయామ ఉపాధ్యాయుడిగా ఆయన పనిచేస్తున్నారు. డోర్నకల్‌లో వ్యాయామశాల నిర్వహిస్తూ ఉత్సాహవంతులైన యు వతీ యువకులకు వెయిట్‌ లిఫ్టిం గ్‌లో శిక్షణ ఇస్తున్నారు. 
కూలీ పనులే దిక్కాయె..
నర్సింహులపేట : 12 సార్లు జాతీయ స్థాయి, 50 సార్లు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొన్నారు మండలంలోని కొమ్ములవంచకు చెందిన తాళ్ల శ్రీలత. ఆయా టోర్నమెంట్లలో ప్రతిభ కనబర్చి పలు మెడల్స్, ప్రశంసా పత్రాలను ఆమె కైవసం చేసుకున్నారు. అయినా సర్కారు చేదోడు మాత్రం అందలేదు. హైదరాబాద్‌ నగరంలోని దోమలగూడలో ఉన్న ఓ కళాశాలలో వ్యాయామ ఉపాధ్యాయ కోర్సు(బీపీడీ) పూర్తి చేశారు శ్రీలత. ఆ పట్టా ఆధారంగా  ఆమెకు నర్సంపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పీఈటీగా కొంతకాలం పనిచేశారు. అయితే అతి తక్కువ వేతనం లభిస్తుండటంతో ఆ పనికి వెళ్లడం లేదు. ప్రస్తుతం కూలీ పనులకు వెళ్తూ ఉపాధి పొందుతోంది శ్రీలత. తమ కుమార్తెకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవాలని ఆమె తల్లిదండ్రులు యాకయ్య, లక్ష్మి కోరుతున్నారు. 
 
కబడ్డీ రంగన్నకు కరువైన ప్రోత్సాహం
కురవి : అంతర్జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించినా ఆ క్రీడాకారుడికి ప్రభుత్వ ప్రోత్సాహం మాత్రం అందనే లేదు. మైదానంలోకి దిగగానే పాయింట్ల పట్టిక పరుగులు తీయించే క్రీడా నైపుణ్యం ఉన్నా.. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయి. సర్కారు పట్టించుకోనితనం ఓ వైపు.. చిమ్మచీకటిలా చుట్టుముట్టిన పేదరికం మరోవైపు ఆవరించినా చెక్కుచెదరని ఆత్మసై్థర్యంతో వ్యవసాయ పనులు చేసుకుంటూ ముందుకుసాగుతున్నారు జెర్రిపోతుల రంగన్నగౌడ్‌. ఆయన కురవి మండలంలోని చింతపల్లివాసి. పాఠశాల స్థాయి నుంచే క్రీడాపోటీల్లో ప్రతిభ కనబరిచారాయన. ఉపాధ్యాయుల ప్రోత్సాహం తోడవడంతో అనంతర కాలంలో ఇంతింతై వటుడింతై అన్నట్లుగా దూసుకుపోయారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయ క్రీడా పోటీల్లో పాల్గొని సత్తాచాటారు. ఈక్రమంలో ఎన్నో బహుమతులను కైవసం చేసుకున్నారు. సీనియర్‌ క్రీడాకారుడు అజీజ్‌ఖాన్‌ శిష్యరికంలో రంగన్న కబడ్డీలో రాటుదేలారు. ఆ క్రీడలో ఆల్‌రౌండర్‌గా పేరు గడించారు. తాను ఎంతో ఇష్టపడిన క్రీడా రంగంలో అవకాశాలు దరిచేరకున్నా.. సొంతూరు మాత్రం రంగన్నకు రాజకీయ రంగంలో ఓ అవకాశాన్ని కల్పించింది. దీంతో చింతపల్లికి సర్పంచ్‌గా ఐదేళ్లపాటు అంకితభావంతో సేవలు అందించారు. జీవిత పయనంలో అందరికీ ఆదర్శంగా ఉండేలా ఓ గిరిజన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నారు.
కొబ్బరి బోండాలు అమ్ముతూ..
మడికొండ : నాడు కుంగ్‌ఫూ జాతీయ స్థాయి పోటీల్లో రాణించిన నల్ల రామకృష్ణ, నేడు కుటుంబ పోషణ కోసం కొబ్బరిబోండాలు అమ్ముతున్నారు. స్వయం ఉపాధిని నమ్ముకొని స్ఫూర్తిదాయకంగా ముందుకుసాగుతున్నారు. 1986లో కుంగ్‌ఫూలో మెళకువలు నేర్చుకున్న ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ జాతీయ స్థాయి పోటీల్లో సత్తాచాటారు. 1987లో హైదరాబాద్‌ హెచ్‌సీఎల్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే, కుంగ్‌ఫూ పోటీల్లో రెండో స్థానంలో నిలిచాడు. 1988లో వైజాగ్‌లోని గాజువాకలో జరిగిన కుంగ్‌ఫూ పోటీలో మొదటిస్థానంలో నిలిచారు. 1990లో హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో బ్రౌన్‌బెల్ట్‌ విభాగంలో మొదటి స్థానం కైవసం చేసుకున్నారు. 1996లో బ్లాక్‌ బెల్ట్‌లో మూడో డిగ్రీని పూర్తి చేశారు రామకృష్ణ. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం దక్కకపోవడంతో ఉన్నత స్థాయి పోటీల్లో ఆయన పాల్గొనలేకపోయారు. 
 
బాధ్యత మరిచిన క్రీడా సంఘాలు
వరంగల్‌ స్పోర్ట్స్‌ :  దశాబ్దాల క్రితమే ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌ క్రీడల్లో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన ఘనుడాయన. భారత జాతీయ క్రీడ హాకీ వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన క్రీడాకెరటం ఆయన. అంతర్జాతీయ క్రీడా వేదికల్లో మన దేశానికి ఎన్నెన్నో పతకాలు, అపురూప విజయాలను సాధించిపెట్టిన ధ్యాన్‌చంద్‌ను భారత జాతి మరిచిపోలేదు. నేడు(సోమవారం) ఆయన జయంతిని ‘జాతీయ క్రీడా దినోత్సవం’గా జరుపుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత క్రీడా సంఘాలలో విబేధాలు ఏర్పాడ్డాయి. ఎక్కువ సంఖ్యలో క్రీడాసంఘాలు రెండుగా చీలిపోయి కొనసాగుతున్నాయి. ఒలింపిక్‌ సంఘంలోనూ రెండు వర్గాలు ఏర్పడ్డాయి. దీంతో అసలు సంఘం మాదేనంటే మాదే అంటూ ఆయా వర్గాలు ప్రకటించుకుంటున్నాయి. అంతే కానీ ధ్యాన్‌చంద్‌  జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని తమ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడంపై వారు దృష్టిసారించడం లేదు. పాఠశాలల వార్షికోత్సవాలు, పండుగలకు సైతం ఆటల పోటీలు నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అలాంటిది ధ్యాన్‌చంద్‌ జయంతి సందర్భంగా కనీసం రెండు రోజులైనా జిల్లా స్థాయి క్రీడాపోటీలు నిర్వహిస్తే బాగుండు అనే అభిప్రాయం చాలామందిలో వ్యక్తమవుతోంది. 
 
ధ్యాన్‌చంద్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి
ప్రపంచ స్థాయిలో భారత్‌ పేరు ప్రఖ్యాతులను నిలబెట్టిన క్రీడా దిగ్గజం ధ్యాన్‌చంద్‌ విగ్రహాన్ని హన్మకొండలోని జేఎన్‌ఎస్‌లో ఏర్పాటు చేయాలి. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా సీనియర్‌ క్రీడాకారులను సన్మానించాలి. ఇందుకోసం జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ కృషిచేయాలి. ఈవిషయంలో కలెక్టర్‌ చొరవ చూపాలి. 
– రాజనాల శ్రీహరి, శాప్‌ మాజీ డైరెక్టర్‌
 
నేడు జేఎన్‌ఎస్‌లో క్రీడాపోటీలు
జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు(సోమవారం) హన్మకొండలోని జేఎన్‌ఎస్‌లో హాకీ, జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, క్రికెట్‌ పోటీలను నిర్వహిస్తున్నాం. ఉదయం క్రీడాకారులు, క్రీడాభిమానులు, క్రీడా సంఘాలతో ర్యాలీ నిర్వహిస్తున్నాం. అందరూ హాజరుకావాలి.
– ఇందిర, డీఎస్‌డీఓ
 
క్రీడాకారులను సన్మానించాలి
గతంలో స్పోర్ట్స్‌ డే సందర్భంగా ఆర్‌డీడీ సారయ్య హయాంలో జాతీయ స్థాయి పోటీల్లో రాణించిన జిల్లా క్రీడాకారులను సన్మానించేవాళ్లం. అంతేకాకుండా సన్మాన వేదిక నుంచే క్రీడాకారులకు స్పోర్ట్స్‌ స్కాలర్‌షిప్‌ను ఇచ్చేవారు. ఈ ఆనవాయితీ తర్వాత కాలంలో కొనసాగకపోవడం బాధాకరం. 
– మంచిక అభినయ్‌ వినయ్‌కుమార్, సాఫ్ట్‌బాల్‌ జాతీయ క్రీడాకారుడు  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement