ప్యారిస్‌ ఒలింపిక్స్‌ : నీతా అంబానీ ‘ఇండియా హౌస్‌’ విశేషాల వీడియో | Paris Olympics Nita Ambani gives a glimpse of the India House | Sakshi
Sakshi News home page

ప్యారిస్‌ ఒలింపిక్స్‌ : నీతా అంబానీ ‘ఇండియా హౌస్‌’ విశేషాల వీడియో

Published Tue, Jul 30 2024 12:32 PM | Last Updated on Tue, Jul 30 2024 1:40 PM

Paris Olympics Nita Ambani gives a glimpse of the India House

ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ)  సభ్యురాలు, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ నీతా అంబానీ ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో  భారతీయ కళలు, ఔన్నత్యాన్ని చాటుకున్నారు. రిలయన్స్ ఫౌండేషన్ ఆశయాలకు అనుగుణంగా, ఐవోఏ భాగస్వామ్యంతో రూపొందించిన ప్రతిష్టాత్మక ఇండియా హౌస్‌కు సంబంధించిన విశేషాలతో కూడిన వీడియోను విడుదల చేశారు. 

 

ఒలింపిక్స్‌లో భారతీయ అథ్లెట్లకు నిలయం భారతదేశపు  తొలి కంట్రీ హౌస్‌ను ఏర్పాటు చేశారు. భారతీయ అథ్లెట్లను ఉత్సాహ పరిచేందుకు, వారి విజయ సంబరాలకు ఉద్దేశించినదే ఈ ఇండియా హౌస్‌ అని నీతా వెల్లడించారు. ఈ సందర్భంగా  నీతా, బనారస్, కాశ్మీర్ నుండి వచ్చిన చేతిపనులు విశేషాలను పంచుకున్నారు. ఇంకా అద్బుతమైన హస్తకళలు, సాంప్రదాయ భారతీయ ఆభరణాలు కూడా ఇందులో ఉన్నాయి. భారతీయ అథ్లెట్ల నైపుణ్యాలు, జాతీయ క్రీడా సమాఖ్యలకు మద్దతు ఇవ్వడంలో భారత విశ్వసనీయతను చాటడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అంతేకాదు భారత్‌ను విశ్వక్రీడా వేదికగా నిలపడంతోపాటు, భవిష్యత్తులో ఒలింపిక్ క్రీడలను నిర్వహించాలనే ఆకాంక్షకు ఇది నిదర్శనమన్నారు.  ఈ సందర్బంగా ఆమె అతిథులకు భారతీయ వంటకాలను రుచి చూపించారు. 

 

భారతీయ ఆహారం, బాలీవుడ్ సంగీతం లేకుండా భారతదేశంలో ఏ వేడుకలు పూర్తి కావనీ, మన సంప్రదాయాలు, మన కళ, సంస్కృతి ఇవన్నీ మన అథ్లెట్లను ఉత్సాహపరచడం కోసమే అన్నారు.  కళాకారుల నృత్యాలకు నీతా కూడా ఉత్సాహంగా కాలు కదపడం విశేషం.  ఇంకా  రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ కుమార్తె ఈశా  ఆనంద్‌ పిరామిల్‌కూడా కన్పించారు. ఇండియా హౌస్ లాంచ్ వేడుకలో గాయకుడు షాన్ వేదికపై ప్రదర్శనను  ఈ వీడియోలో చూడవచ్చు. ప్యారిస్‌ ఒలింపిక్స్‌ ప్రారంభమైన  మరుసటి రోజు జులై 27న లా విల్లెట్‌ ప్రాంతంలో ఈ ఇండియా హౌస్‌ను ప్రారంభించారు. ఈ వేడుకలో ఇండియన్‌ ఒలింపిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు పీటీ ఉష, బీసీసీఐ సెక్రటరీ జై షా, ఒలింపిక్‌ స్వర్ణ పతక విజేత అభినవ్‌ బింద్రాతో పాటు పలువురు సెలబ్రిటీలు ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.  ఒలింపిక్స్‌ ముగింపు తేదీ వరకు ఆగస్టు 11 వరకు ఈ హౌస్‌ను సందర్శకులు వీక్షించే అవకాశం ఉంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement