సత్తాచాటుతున్న యువకుడు
శ్రీకాకుళం న్యూకాలనీ: జాతీయ క్రీడోత్సవ పోటీలు ప్రారంభమయ్యాయి. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియంలో ఈనెల 29న జాతీయ క్రీడల దినాన్ని పురస్కరించుకుని శాప్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న క్రీడాపోటీలు శనివారం ఉత్సాహభరితంగా సాగాయి. తొలిరోజు అథ్లెటిక్స్ విభాగంలో పోటీలను నిర్వహించారు. జూనియర్ బాలబాలికలకు, ఓపెన్ విభాగంలో సీనియర్ క్రీడాకారులకు (పురుషులు, మహిళలకు) ఈ పోటీలను వేరువేరుగా నిర్వహించారు. 100, 800 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్, హైజంప్, షాట్‌పుట్ అథ్లెటిక్ ఈవెంట్స్‌లో పోటీలు జరిగాయి. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన క్రీడాకారుల వివరాలను జిల్లా క్రీడాప్రాధికార సంస్థ సిబ్బంది నమోదు చేసుకున్నారు. పోటీలకు జిల్లా నలుమూలల నుంచి సుమారు 500 మంది వరకు క్రీడాకారులు హాజరై తమ ప్రతిభను నిరూపించుకున్నారు.