క్రీడా పోరుకు సై | all set for games | Sakshi
Sakshi News home page

క్రీడా పోరుకు సై

Published Fri, Aug 26 2016 10:59 PM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM

హైజంప్‌లో ఓ క్రీడాకారుడి విన్యాసం (ఫైల్‌)

హైజంప్‌లో ఓ క్రీడాకారుడి విన్యాసం (ఫైల్‌)

జాతీయ క్రీడోత్సవ పోటీలకు రంగం సిద్ధం
నేటి నుంచి మూడు రోజులపాటు క్రీడా పోటీలు
వేదిక... కోడిరామ్మూర్తి స్టేడియం
అరకొర నిధులిచ్చి చేతులు దులుపుకున్న శాప్‌


శ్రీకాకుళం న్యూకాలనీ: జాతీయ క్రీడోత్సవ పోటీలకు రంగం సిద్ధమైంది. ఈనెల 29న హాకీ మాంత్రికుడు, మేజర్‌ థ్యాన్‌చంద్‌ జయంతిని పురష్కరించుకుని శనివారం నుంచి మూడు రోజుల పాటు కోడిరామ్మూర్తి స్టేడియంలో జరగనున్న జాతీయ క్రీడా దినోత్సవ పోటీలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా ఒలింపిక్, పీఈటీ సంఘ సహకారంతో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో పోటీలు సాగుతాయి. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే అథ్లెటిక్స్‌ పోటీలతో క్రీడలు ప్రారంభంకానున్నాయి. పోటీల్లో పాఠశాలస్థాయి బాలబాలికలకు, ఓపెన్‌లో విభాగంలో అన్ని వయస్కులవారికి పోటీలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అథ్లెటిక్స్‌లో 100, 800 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్, హైజంప్, షాట్‌ఫుట్, 400 మీటర్ల రిలే పరుగు పందాల్లో పోటీలు నిర్వహిస్తారు. 28న హాకీ పోటీలు నిర్వహిస్తారు. జూనియర్‌ విభాగంలో బాల బాలికలకు మాత్రమే నిర్వహించనున్నారు.


29న శ్రీకాకుళంలో జాతీయ క్రీడా రన్‌ను నిర్వహించాలని నిర్ణయించారు. ఆ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ రన్‌ను శ్రీకాకుళం పాతబస్టాండ్‌ వద్ద గల పొట్టి శ్రీరాములు జంక్షన్‌ నుంచి కోడిరామ్మూర్తి స్టేడియం వరకు కొనసాగుతుందని క్రీడాధికారులు తెలిపారు. క్రీడోత్సవ పోటీల్లో విజయం సాధించిన క్రీడాకారులకు 29న సాయంత్రం బహుమతులు అందజేయనున్నారు. అదే సమయంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించిన, జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులకు కలెక్టర్‌ చేతుల మీదుగా సత్కరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
 

నిధులు అరకొరే..


క్రీడాపోటీల నిర్వహణ, సామియానా, బహుమతులు, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులకు సత్కారాలు, వగైరా ఖర్చులకు భారీగానే నిధులు అవసరమవుతాయి. రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్‌)మాత్రం కేవలం రూ.20 వేలు నిధులు కేటాయించి చేతులు దులుపుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిధులతో ఘనంగా పోటీలు నిర్వహించి, క్రీడాకారులను సత్కరించిన వీడియోలు, ఫొటోలు కూడా పంపించాలని శాప్‌ సూచించడంపై క్రీడాధికారులు మండిపడుతున్నారు. అనవసర ఆర్భాటాలకు కోట్లాది రూపాయలు ఖర్చుచేసే సర్కారు క్రీడాపోటీలకు మాత్రం కనీస నిధులు కేటాయించకపోవడాన్ని క్రీడా విశ్లేషకులు తప్పుబడుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement