మంత్రివర్గంలోకి అమిత్‌ షా..! | Union Cabinet passes resolution to dissolve 16th Lok Sabha | Sakshi
Sakshi News home page

కొత్త సర్కారు దిశగా..

Published Sat, May 25 2019 2:02 AM | Last Updated on Sat, May 25 2019 6:34 AM

Union Cabinet passes resolution to dissolve 16th Lok Sabha - Sakshi

శుక్రవారం ఢిల్లీలో కేబినెట్‌ మంత్రుల సమావేశంలో ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ: కేంద్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు దిశగా రంగం సిద్ధమయ్యింది. శుక్రవారం సమావేశమైన కేంద్ర కేబినెట్‌ 16వ లోక్‌సభ రద్దుకు సిఫారసు చేసింది. సమావేశం ముగిసిన తర్వాత ప్రధాని మోదీ, మిగతా కేంద్రమంత్రులు  రా6ష్టపతిని కలసి రాజీనామాలు సమర్పించారు. కేంద్ర మంత్రివర్గం రాజీనామాలు సమర్పించే సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి వారిని విందుకు ఆహ్వానించారు. వారి రాజీనామాలను ఆమోదించిన రాష్ట్రపతి కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించే వరకు కొనసాగాల్సిందిగా ప్రధానిని కోరినట్లు రాష్ట్రపతిభవన్‌ తెలిపింది.

అంతకుముందు ప్రధాని గైర్‌హాజరీలో మోదీ నాయకత్వాన్ని, గత ఐదేళ్లలో ప్రభుత్వం చేసిన కృషిని ప్రశంసిస్తూ కేంద్ర మంత్రులు ఒక తీర్మానం ఆమోదించారు. కాగా కొత్త మంత్రివర్గ పదవీ ప్రమాణ స్వీకారోత్సవం ఈ నెల 30న జరిగే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. జూన్‌ 3వ తేదీలోగా 17వ లోక్‌సభ కొలువుదీరాల్సి ఉంది. ఒకటీరెండు రోజుల్లో ముగ్గురు ఎన్నికల కమిషనర్లు రాష్ట్రపతిని కలసి కొత్తగా ఎన్నికైన సభ్యుల జాబితాను అందజేయడంతో కొత్త సభ ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుంది.

నేడు ఎన్డీయే సమావేశం
మోదీని తమ నేతగా ఎన్నుకునేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఎంపీలు శనివారం సమావేశం కానున్నారు. కూటమి ప్రధాని అభ్యర్థిగా మోదీ ముందే ఖరారైన నేపథ్యంలో లాంఛనపూర్వకంగా ఈ భేటీ జరగనుంది. పార్లమెంటు సెంట్రల్‌ హాల్లో సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం జరగనుంది. అంతకుముందు పార్లమెంట్‌ హౌస్‌లో బీజేపీ ఎంపీలు  సమావేశమవుతారు. ఎంపీలు తనను నేతగా ఎన్నుకున్న తర్వాత మోదీ వారినుద్దేశించి ప్రసంగిస్తారని సమాచారం. ఇలావుండగా ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు మే 28న మోదీ తన నియోజకవర్గం వారణాసిని సందర్శించే అవకాశం ఉందని పార్టీవర్గాలు వెల్లడించాయి. శుక్రవారం వారణాసి నుంచి వచ్చిన బీజేపీ కార్యకర్తలు మోదీని కలసి ఆయన ఎన్నికకు సంబంధించిన అధికారిక సర్టిఫికెట్‌ను అందజేశారు. సౌత్‌ బ్లాక్‌లో పీఎంఓ అధికారులతో ప్రధాని సమావేశమయ్యారు.

ఈసారి మంత్రివర్గంలో అమిత్‌ షా
లోక్‌సభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి రెండోసారి అధికార పీఠాన్ని అధిరోహించేందుకు బీజేపీ సిద్ధమైన నేపథ్యంలో అందరి దృష్టీ కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై పడింది. ఈసారి మోదీ మంత్రివర్గంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా సమా పలు కొత్త ముఖాలు కనబడే అవకాశం ఉందని తెలుస్తోంది. అమిత్‌ షాను మంత్రివర్గంలోకి తీసుకునే పక్షంలో ఆయనకు హోం, ఆర్థిక, విదేశీ వ్యవహారాలు, రక్షణ.. ఈ నాలుగు కీలక శాఖల్లో ఏదో ఒకటి అప్పగించవచ్చని తెలుస్తోంది.

ప్రస్తుత ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌లు ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండటంతో వీరు కొత్త మంత్రివర్గం లో ఉంటారా? లేదా? అన్న అనుమానాలు న్నాయి. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ కీలక శాఖతో కేబినెట్‌లో కొనసాగే అవకాశం కన్పిస్తోంది. అమేథీలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌పై సంచలన విజయం సాధించిన స్మృతీ ఇరానీకి పార్టీ ముఖ్యమైన బాధ్యతనే అప్పగించవచ్చు. వీరితో పాటు సీనియర్‌ మంత్రులు రాజ్‌నాథ్‌æ, నితిన్‌ గడ్కారీ, రవిశంకర్, గోయెల్, ప్రకాశ్‌ జవదేకర్‌లు కూడా కొనసాగవచ్చని తెలుస్తోంది. మిత్రపక్షాల్లో శివసేన (18), జేడీ(యూ) (16)లు మంచి ఫలితాలు సాధించిన నేపథ్యంలో వారికి కూడా చోటు దొరకవచ్చు. ఇక పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణల నుంచి కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చే సూచనలున్నాయని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.

సూర్యాస్తమయం అయినా వెలుగు కొనసాగుతుంది
ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలంపై సూర్యాస్తమయం అయినా ప్రజల జీవితాలను కాంతివంతం చేసేందుకు దాని వెలుగు ఇంకా కొనసాగుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘ఓ కొత్త ఉదయం ఎదురుచూస్తోంది...’ అంటూ శుక్రవారం ఒక ట్వీట్‌లో మోదీ పేర్కొన్నారు. మనమందరం కలలుగన్న నవ భారత సృష్టికి, 130 కోట్ల మంది ప్రజల కలలు నెరవేర్చేందుకు తన ప్రభుత్వం మరింత కృత నిశ్చయంతో ఉందని ఆయన తెలిపారు.  

అడ్వాణీ, జోషీలతో మోదీ–షా భేటీ
సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా శుక్రవారం ఆ పార్టీ సీనియర్‌ నేతలు ఎల్‌కే అడ్వాణీ, మురళీమనోహర్‌ జోషీలను కలుసుకున్నారు. అమిత్‌ షాతో కలిసి తొలుత అడ్వాణీ ఇంటికెళ్లిన మోదీ, ఆయనకు పాదాభివందనం చేశారు. అనంతరం సార్వత్రిక ఎన్నికల ఫలితాల సరళిపై కొద్దిసేపు చర్చించారు. సమావేశం అనంతరం మోదీ స్పందిస్తూ..‘ఈరోజు బీజేపీ విజయం సాధించిందంటే అడ్వాణీలాంటి గొప్ప వ్యక్తులు దశాబ్దాలపాటు కష్టపడి పార్టీని నిర్మించడమే కారణం. వీరంతా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి సరికొత్తగా తీసుకెళ్లారు’ అని ట్వీట్‌ చేశారు. అనంతరం మోదీ, షా ద్వయం మురళీ మనోహర్‌ జోషి ఇంటికెళ్లారు. వీరిద్దరికి సాదరస్వాగతం పలికిన జోషి, మోదీకి శాలువాను బహూకరించారు. ఈ సందర్భంగా జోషికి పాదాభివందనం చేసిన మోదీ, తనవెంట తెచ్చిన స్వీట్స్‌ను అందించారు. దీంతో జోషి ధన్యవాదాలు తెలిపారు.

‘డా.మురళీమనోహర్‌ జోషి గొప్ప విద్యావేత్త. భారత విద్యావ్యవస్థను మెరుగుపర్చడంలో ఆయన పాత్ర చాలా కీలకమైంది. నాతో పాటు చాలామంది కార్యకర్తలకు మార్గదర్శిగా వ్యవహరించిన జోషి, బీజేపీని బలోపేతం చేసేందుకు నిరంతరం కృషి చేశారు’ అని మోదీ ప్రశంసించారు. ఈ సమావేశం అనంతరం జోషి మీడియాతో మాట్లాడుతూ.. మోదీ, అమిత్‌ షాలు బీజేపీకి బ్రహ్మాండమైన విజయాన్ని అందించారని కితాబిచ్చారు. ఎన్నికల్లో విజయం అనంతరం తనకు శుభాకాంక్షలు చెప్పిన అమెరికా ఉపాధ్యక్షుడు పాంపియో, రష్యా అధ్యక్షుడు పుతిన్, కెనడా ప్రధాని ట్రూడో, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్, సౌదీ రాజు బిన్‌సల్మాన్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. బాలీవుడ్‌ నటీనటులు శిల్పాశెట్టి,  మాధవన్, సంగీత దర్శకుడు రెహమాన్, సరోద్‌ విద్వాంసుడు అమ్జాద్‌ ఆలీఖాన్, బాక్సర్‌ మేరీకోమ్‌లకు ధన్యవాదాలు చెప్పారు.

సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీ పాదాలకు నమస్కరిస్తున్న ప్రధాని మోదీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement