ఎన్‌డీఏ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఎల్‌కే అడ్వాణీకి పుష్పగుచ్ఛమిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ. చిత్రంలో అమిత్ షా, మురళీమనోహర్ జోషి, ఉద్ధవ్ ఠాక్రే
న్యూఢిల్లీ: నవ భారత నిర్మాణానికి నూతన శక్తితో తమ ప్రభుత్వం నూతన ప్రయాణాన్ని ప్రారంభిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. కుల, విశ్వాసపరమైన మరే ఇతర వివక్షకు తావులేకుండా పనిచేయాల్సిందిగా కొత్తగా ఎన్నికైన ఎంపీలను ఆయన కోరారు. ‘జాతీయ ఆశయాలు .. ప్రాంతీయ ఆశలు (నేషనల్ యాంబిషన్స్, రీజనల్ ఆస్పిరేషన్స్– నారా)’ ఎన్డీయే కూటమికి తానిచ్చే నినాదంగా మోదీ చెప్పారు. ఎన్డీయే ఈ రెండు మార్గాల్లో ముందుకు వెళుతోందని, అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ఈ రెండిటి కలయిక అవసరమని పేర్కొన్నారు.
ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ నేతగా మోదీ శనివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సమావేశమైన ఆయా పార్టీలకు చెందిన ఎంపీలు మోదీని తమ నేతగా ఎన్నుకున్నారు. ప్రకాశ్‌సింగ్ బాదల్ (అకాలీదళ్) మోదీ పేరును ప్రతిపాదిస్తూ తీర్మానం ప్రవేశపెట్టగా..నితీశ్ కుమార్ (జేడీయూ), ఉద్ధవ్ థాకరే (శివసేన) తదితర నేతలు బలపరిచారు. మోదీ 353 మంది ఎంపీల పార్లమెంటరీ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎంపికైనట్లు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఎంపీల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. అంతకుముందు బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా మోదీని ఆ పార్టీ ఎంపీలు ఎన్నుకున్నారు.
మోదీ పేరును షా ప్రతిపాదించగా పార్టీ మాజీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కారీలు మద్దతు పలికారు. బీజేపీ సీనియర్ నేతలు ఎల్‌కే అద్వాణి, మురళీ మనోహర్ జోషి తదితరులు వేదికపై ఆసీనులయ్యారు. ఎన్డీయే నేతగా ఎన్నికైన తర్వాత శనివారం రాత్రి మోదీ రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దీంతో మోదీని ప్రధానిగా కోవింద్ నియమించారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. అంతకుముందు ఎన్డీయే నేతలు రాష్ట్రపతిని కలిసి తమ ఎంపీల జాబితాను అందజేశారు.
కేబినెట్ కూర్పుపై మీడియా కథనాలు నమ్మొద్దు
ఎన్డీయే పక్ష నేతగా ఎన్నికైన సందర్భంగా మోదీ 75 నిమిషాలకు పైగా ప్రసంగించారు. ఎన్నికల్లో మైనారిటీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారంటూ పరోక్షంగా ప్రతిపక్ష పార్టీలను విమర్శించారు. వారు ఎప్పుడూ భయంతో బతికేలా చేశారన్నారు. వారి విశ్వాసాన్ని కూడా పొందాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. 1857 నాటి స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని ఆయన గుర్తుచేశారు. ఆనాడు స్వాతంత్య్రం కోసం అన్ని మతాలూ చేతులు కలిపాయన్నారు. సుపరిపాలన కోసం ఇప్పుడు మళ్లీ అలాంటి ఉద్యమం ప్రారంభించాల్సి ఉందని మోదీ చెప్పారు.
తమపై విశ్వాసం ఉంచిన వారితో పాటు, ఎవరి విశ్వాసం చూరగొనాల్సి ఉందో వారితో కూడా తాము ఉంటామన్నారు. ఈ సందర్భంగా మోదీ కొత్త ఎంపీలకు పలు సూచనలు కూడా చేశారు. వీఐపీ సంస్కృతిని విడనాడటంతో పాటు ప్రచారం కోసం మీడియాకు ప్రకటనలివ్వద్దని చెప్పారు. కొత్త మంత్రివర్గ కూర్పుపై మీడియాలో వచ్చే కథనాలను నమ్మవద్దన్నారు. అవన్నీ గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా,, కొన్ని సందర్భాల్లో దురుద్దేశపూరితంగా ఉంటాయని అన్నారు. ఎన్డీయే ఎంపీలందరి వివరాలను తానింకా పరిశీలించాల్సి ఉందని చెప్పారు. నియమ, నిబంధనలను అనుసరించి బాధ్యతలు అప్పగించడం జరుగుతుందని అన్నారు.
ప్రజలను ఏకం చేసిన ఎన్నికలు
ఎన్నికలు ఎప్పుడూ విభజించడంతో పాటు అంతరాన్ని సృష్టిస్తాయని, కానీ 2019 ఎన్నికలు ప్రజలను, సమాజాన్ని ఏకం చేశాయని చెప్పారు. ఈసారి ప్రభుత్వ అనుకూల వాతావరణం ఉండటం గమనార్హమని, దాని ఫలితంగానే సానుకూల తీర్పు వెలువడిందని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సేవ చేయడానికి మించిన మంచి మార్గం మరొకటి లేదన్నారు. 2014–19 మధ్య పేదల కోసం ప్రభుత్వాన్ని నడిపామని, ఆ పేదలే ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని తాను చెప్పగలనని మోదీ అన్నారు. ఇప్పుడు లభించిన భారీ విజయం అంతే పెద్ద బాధ్యతను మనపై ఉంచిందని చెప్పారు. దేశాభివృద్ధికి ఎన్డీయే ఎంపీలందరూ కలసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
పాల్గొన్న తెలంగాణ బీజేపీ ఎంపీలు
లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన నలుగురు తెలంగాణ బీజేపీ ఎంపీలు శనివారం ఢిల్లీలో జరిగిన ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ, ఎన్డీయే పక్ష సమావేశంలో పాల్గొన్నారు. సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డి, అదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌లు హాజరయ్యారు. ఎన్డీయే భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తన తల్లి హీరాబా మోదీ ఆశీస్సులు తీసుకునేందుకు ప్రధాని ఆదివారం గుజరాత్ వెళ్లనున్నారు.
వీఐపీ సంస్కృతిని దేశం అసహ్యించుకుంటుంది. విమానాశ్రయంలో సెక్యూరిటీ చెక్ కోసం మీరెందుకు క్యూలో నిలబడలేరు? అందులో తప్పేం లేదు. ‘రెడ్ లైట్’ (ఎర్ర బుగ్గ) సంస్కృతికి మోదీ స్వస్తి చెప్పారని ప్రజలు చెప్పుకుంటారు. మనోహర్ పరీకర్ ఏం చేసేవారో మీరు చూశారు. ఆయన్ను అనుసరించండి. ఎలాంటి వలలోనూ పడకండి.
ప్రభుత్వ వ్యతిరేకత హానిచేస్తుంది. కానీ మనం చేసిన పని ప్రభుత్వ అనుకూల గాలి సృష్టించింది. ఫలితంగా సానుకూల ఓటును మనం చూడగలిగాం.
16వ లోక్‌సభ రద్దు
కేంద్ర మంత్రివర్గం సిఫారసు నేపథ్యంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 16వ లోక్‌ససభను రద్దు చేసినట్లు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రుల రాజీనామాలను రాష్ట్రపతి శుక్రవారం ఆమోదించిన విషయం విదితమే. మోదీ మే 30న నూతన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కాగా ప్రమాణ స్వీకార తేదీ, సమయాన్ని, కొత్త మంత్రులుగా నియమించే వారి పేర్లను అందజేయాల్సిందిగా ప్రధానిని రాష్ట్రపతి కోవింద్ కోరినట్లు రాష్ట్రపతి భవన్ తెలిపింది. మోదీ 30న ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశముందని బీజేపీ శ్రేణులు తెలిపాయి.
రాష్ట్రపతిభవన్‌లో మోదీకి ప్రధానిగా నియామక పత్రం ఇస్తున్న రాష్ట్రపతి కోవింద్
శనివారం ఢిల్లీలో పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఎన్‌డీఏ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి హాజరైన ఎన్‌డీఏ ఎంపీలు, కూటమి నేతలు
పార్లమెంటు ప్రాంగణంలో తెలంగాణ బీజేపీ ఎంపీలు బండి సంజయ్ కుమార్, కిషన్ రెడ్డి, సోయం బాపూరావు
పార్లమెంటు లోపలికి వస్తూ ఎంపీ సన్నీడియోల్ విజయసంకేతం, పార్లమెంటు ద్వారం వద్ద మోకరిల్లాక నమస్కరిస్తున్న ఎంపీ హన్స్‌రాజ్ హన్స్
Comments
Please login to add a commentAdd a comment