న్యూఢిల్లీ/రామేశ్వరం: మాజీ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 86వ జయంతి సందర్భంగా.. దేశానికి ఆయన చేసిన సేవలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలు గుర్తుచేసుకున్నారు. దేశ యువతను సృజనాత్మకతవైపు పురికొల్పిన మహానుభావుడు కలాం అని రాష్ట్రపతి కొనియాడారు. రామేశ్వరం నుంచి వచ్చిన కొందరు విద్యార్థులతో రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రామ్‌నాథ్ కోవింద్ పాల్గొన్నారు. ఓ శాస్త్రవేత్తగా, మేధావిగా, భారత రాష్ట్రపతిగా అన్ని పదవులకు కలాం న్యాయం చేశారని ప్రశంసించారు. కలాం జీవితం కోట్ల మందికి స్ఫూర్తిదాయకమని ప్రధాని మోదీ తెలిపారు. కలాం బతికున్నప్పుడు ఆయన ఇచ్చిన సందేశాల వీడియోను ట్వీటర్ ద్వారా షేర్ చేశారు.
అటు కలాం సొంతరాష్ట్రం తమిళనాడులోనూ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కలాంకు పుష్పాంజలి ఘటించారు. రామేశ్వరం సమీపంలోని కలాం స్మారకం వద్ద ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ప్రజలు భారీ సంఖ్యలో కలాంకు నివాళులర్పించారు. చాలాచోట్ల విద్యార్థులు, ప్రజలు మొక్కలు నాటి పుష్పాంజలి ఘటించారు. పలువురు సినీ కళాకారులు కూడా అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో పాల్గొని మొక్కలు నాటారు. 1931 అక్టోబర్ 15న రామేశ్వరంలో జన్మించిన కలాం 2002 నుంచి 2007 వరకు రాష్ట్రపతిగా ఉన్న విషయం తెలిసిందే. జూలై 27, 2015న కలాం గుండెపోటుతో కన్నుమూశారు.
Comments
Please login to add a commentAdd a comment