న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మొదటి విడత జరిగే లోక్‌సభ ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్రతో కూడిన నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న 535 లోక్‌సభ స్థానాలకు మొత్తం ఏడు విడతలుగా జరిపేందుకు ఎన్నికల సంఘం గత వారం ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మొదటి విడతలో ఏప్రిల్ 11వ తేదీన 20 రాష్ట్రాల్లోని 91 పార్లమెంటరీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అత్యంత ఉత్కంఠగా జరగబోయే ఈ ఎన్నికల్లో మరోసారి అధికారం చేపట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండగా, కాషాయ దళాన్ని నిలువరించేందుకు ప్రతిపక్షాలు ఐక్యంగా ఎన్నికల క్షేత్రంలోకి దిగుతున్నాయి.
మొదటి విడత ఎన్నికలు జరిగేదిక్కడే
ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం (25), తెలంగాణ(17), ఉత్తరాఖండ్(5)ల్లోని మొత్తం స్థానాలకు, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో రెండు సీట్ల చొప్పున, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, అండమాన్ నికోబార్, లక్షదీవుల్లోని ఒక్కో సీటుకు మొదటి విడతలో ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా, ఉత్తరప్రదేశ్‌లోని 80 స్థానాలకు గాను 9 చోట్ల, బిహార్‌లోని 40 సీట్లకు గాను 4, పశ్చిమబెంగాల్‌లోని 42 స్థానాల్లో 2, మహారాష్ట్రలో 7, అసోంలో 5, ఒడిశాలో 4, జమ్మూకశ్మీర్ 6 సీట్లలో 2 చోట్ల కూడా మొదటి విడతలో ఎన్నికలు జరగనున్నాయి.
నామినేషన్ల దాఖలుకు 25వ తేదీ ఆఖరు
నోటిఫికేషన్ జారీ అయిన 18వ తేదీ నుంచి మొదలయ్యే నామినేషన్ల ప్రక్రియ 25వ తేదీ వరకు కొనసాగుతుంది. నామినేషన్ పత్రాల పరిశీలన 26వ తేదీతో, నామినేషన్ల ఉపసంహరణకు 28వ తేదీతో గడువు ముగియనుంది. మొదటి విడత ఎన్నికలు జరిగే 91 నియోజకవర్గాల్లో బరిలో మిగిలే అభ్యర్థులు ఎవరనే విషయంలో మార్చి 28వ తేదీన స్పష్టతరానుంది. అన్ని చోట్లా ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా అంటే, సాయంత్రం 4, 5, 6 గంటలకు ముగియనుంది.
తొలి విడత నోటిఫికేషన్ జారీ
Published Tue, Mar 19 2019 3:00 AM | Last Updated on Tue, Mar 19 2019 8:42 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment