కొచి: హైకోర్టులు ఇచ్చే తీర్పులు కక్షిదారులకు అర్థమయ్యేలా వారికి తెలిసిన భాషలో ఉండాలని రాష్ట్రపతి కోవింద్ సూచించారు. తీర్పులకు సంబంధించిన అనువాద ప్రతులను అధికారికంగా జారీ చేసేందుకు యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. కేసులను త్వరగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని, తీర్పుల ఆలస్యం వల్ల ఎక్కువగా బాధ పడేది పేదలు, అణగారిన వర్గాలేనని పేర్కొన్నారు. కేరళ హైకోర్టు వజ్రోత్సవాల్లో శనివారం ఆయన పాల్గొని ప్రసంగించారు.
తీర్పు వెలువరించడం మాత్రమే ముఖ్యం కాదని, ఆ తీర్పును కక్షిదారులకు అర్థమయ్యే భాషలో ఇవ్వాలని సూచించారు. ‘హైకోర్టులు తమ తీర్పులను ఇంగ్లిష్‌లో వెలువరిస్తాయి. అయితే మన దేశం విభిన్న భాషలు గలది. తీర్పు ఇంగ్లిష్‌లో ఇవ్వడం వల్ల అందులో తమకు ఉపయోగపడే ముఖ్యమైన అంశాలు కక్షిదారులకు అర్థం కాకపోవచ్చు. దీంతో తీర్పును అర్థం చేసుకునేందుకు కక్షిదారులు న్యాయవాదులు లేదా ఇతర వ్యక్తులపై ఆధారపడాల్సి వస్తుంది.
దీని వల్ల మరింత సమయం, వ్యయం వృథా అవుతుంది’ అని తెలిపారు. ‘తీర్పుల అనువాద ప్రతులను స్థానిక లేదా ప్రాంతీయ భాషల్లో అందించే యంత్రాంగముండాలి. తీర్పువెలువడ్డ 36 గంటల్లోగా అనువాద ప్రతులను కక్షిదారులకు అందేలా చూడాలి. ఉదాహరణకు కేరళ హైకోర్టు తీర్పు కాపీలు మలయాళంలో, పట్నా హైకోర్టు తీర్పు కాపీలు హిందీలో ఉండేలా చూడాలి’ అని అన్నారు. కేసుల పరిష్కారంలో జాప్యం వల్ల ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకం పోయే ప్రమాదం ఉందని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment