వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డితో సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ: అధికార టీడీపీ డబ్బులు వెదజల్లి రాజ్యసభ ఎన్నికల్లో గెలుపొందేందుకు ప్రయత్నిస్తోందని వైఎస్సార్ సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి గురువారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ సీపీకి చెందిన ఎమ్మెల్యేలకు రూ. 25 కోట్లు వంతున ఆఫర్ చేస్తూ అవినీతి చర్యలకు పాల్పడుతోందని రాష్ట్రపతి దృష్టికి తెచ్చారు. సీఎం చంద్రబాబు రూ.కోట్లు ఇస్తామంటూ ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను మభ్యపెట్టి లాక్కుంటున్న తీరును రాష్ట్రపతికి వివరించారు.
స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా స్పందించలేదు
వైఎస్సార్ సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను అధికార టీడీపీ ప్రలోభాలకు గురిచేసి ఫిరాయింపులకు ప్రోత్సహించిందని, ఇప్పుడు మళ్లీ రాజ్యసభ ఎన్నికల్లో నెగ్గేందుకు మరో నలుగురిని లాక్కొనేందుకు ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 25 కోట్లు ఆఫర్ చేస్తోందని రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. అధికార పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కొద్ది రోజుల క్రితం తమ పార్టీ ఎమ్మెల్యేలను కలసి టీడీపీలో చేరాలంటూ రూ. 25 కోట్లు ఆఫర్ చేసి ప్రలోభపెడుతున్నారని చెప్పారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు ఫిర్యాదు చేసినా ఆయన చర్యలు తీసుకోకుండా టీడీపీ తొత్తుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
ఆ నిరసనలు రాజ్యాంగ విరుద్ధం
కేంద్ర క్యాబినెట్‌లో కొనసాగుతున్న టీడీపీ ఎంపీలు అశోక్‌గజపతిరాజు, సుజనాచౌదరి వారు ఆమోదించిన రాష్ట్రపతి ప్రసంగాన్ని పార్లమెంటులో వ్యతిరేకిస్తూ నిరసన తెలపటం ఆర్టికల్ 74, 75కు వ్యతిరేకమని రాష్ట్రపతి దృష్టికి తెచ్చారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయలేదని రాష్ట్రపతికి విజయసాయిరెడ్డి వివరించారు. గత ప్రధాని ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ, విశాఖకు రైల్వే జోన్, దుగరాజపట్నం పోర్టు, విశాఖ–చెన్నై కారిడార్, పోలవరం మొత్తం ఖర్చును భరించడం లాంటి అంశాలను కేంద్ర బడ్జెట్‌లో పొందుపరచలేదన్నారు. ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్ర ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని వైఎస్సార్ సీపీ తరఫున రాష్ట్రపతికి నివేదించినట్లు అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాకు తెలిపారు. సీఎం చంద్రబాబు అవినీతి చర్యల గురించి కూడా రాష్ట్రపతికి వివరించామన్నారు.
చంద్రబాబుపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం..
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు ప్రలోభపెట్టి కొనుగోలు చేస్తున్న తీరుపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు విజయసాయిరెడ్డి తెలిపారు.బాబు తనపై చేసిన విమర్శలను ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి తిప్పికొట్టారు. రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను ఎవరినైనా కలుస్తానన్నారు. బాబులా తాను అవినీతికి పాల్పడడం లేదని, లంచాలు తీసుకోవడం లేదని, చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నానన్నారు.ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తున్న టీడీపీ నేతల వివరాలను త్వరలో బయట పెడతామని ప్రకటించారు.
జగన్ పాదయాత్రపై రాష్ట్రపతి వాకబు
వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర గురించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వాకబు చేశారు. జగన్ యోగక్షేమాల గురించి, పాదయాత్రపై రాష్ట్రపతితో భేటీ సందర్భంగా అడిగినట్లు విజయసాయిరెడ్డి మీడియాకు తెలిపారు. ప్రతిపక్ష నేత పాదయాత్ర జరుగుతున్న తీరు గురించి రాష్ట్రపతికి వివరించినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment