వైఎస్సార్‌సీపీకి 160 సీట్లొస్తాయి
- ‘మీట్ ది ప్రెస్’లో పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టీకరణ
- ప్రత్యేక హోదా సాధన కోసమే ‘జై ఆంధ్రప్రదేశ్’ సభ
సాక్షి, విశాఖపట్నం/అగనంపూడి(విశాఖ): రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్‌సీపీకి 158 నుంచి 160 సీట్లు వస్తాయని పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి చెప్పారు. తాజా సర్వేల ద్వారా ఈ విషయం వెల్లడైందన్నారు. గత ఎన్నికల్లో అన్ని పార్టీలకు 45 శాతం ఓట్లు వస్తే ఒక్క వైఎస్సార్‌సీపీకే 44 శాతం ఓట్లు పోలయ్యాయని గుర్తుచేశారు. ప్రస్తుతం టీడీపీ, దాని అనుబంధ పార్టీల ఓట్లశాతం 45 నుంచి 15కు తగ్గిందని, వైఎస్సార్‌సీపీ ఓట్ల శాతం 44 నుంచి మరింత పెరిగిందని వివరించారు. వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరం (వీజేఎఫ్) శనివారం విశాఖపట్నంలో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో విజయసాయిరెడ్డిమాట్లాడారు. గడచిన రెండున్నరేళ్లలో ప్రజాప్రయోజనాల కోసం పనిచేశామా? లేక స్వార్థ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేశామా? అనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆత్మపరిశీలన చేసుకోవాలని కోరారు. ‘మీట్ ది ప్రెస్’లో విజయసాయిరెడ్డి ఇంకా ఏం చెప్పారంటే...
జగన్ ఆదేశాలను శిరసావహిస్తాం..
‘‘సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ స్వార్థ ప్రయోజనాల కోసమే రాష్ట్రాన్ని విభజించారు. వారికి చంద్రబాబు కూడా మద్దతు పలకడం వల్లే రాష్ట్రం విడిపోయింది. 2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక పార్టీ అధినేత వైఎస్ జగన్ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి, ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తారు. ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ‘జై ఆంధ్రప్రదేశ్’ సభలను నిర్వహిస్తున్నాం. ప్రత్యేక హోదాపై అవసరమైతే పార్టీ ఎంపీలతో రాజీనామా చేయిస్తామన్న జగన్ ఆదేశాలను శిరసావహిస్తాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా చెబుతున్నారు. ఇంకా ఆ పార్టీ విధివిధానాల్లో స్పష్టత లేదు. స్పష్టత వచ్చాక స్పందిస్తాం. మా పార్టీ అధినేత జగన్ లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు. కానీ, వాటిలో వాస్తవం లేదని సీబీఐ చార్జిషీట్లలో తేటతెల్లమైంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై దీక్షలు, ధర్నాలతో రానున్న రెండున్నరేళ్లు ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తాం. నేను అనుకోకుండా రాజకీయాల్లో వచ్చాను. రాజ్యసభలో ప్రవేశించడానికి మా అధ్యక్షుడు జగన్ అవకాశం ఇచ్చారు. ప్రజల ఆకాంక్షలు, ఆలోచనలకు తగ్గట్లు పనిచేస్తా’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
ప్రదీప్ కుటుంబానికి పరామర్శ
హత్యకు గురైన ఇంజనీరింగ్ విద్యార్థి ప్రదీప్ కుటుంబ సభ్యులను విజయసాయిరెడ్డి శనివారం పరామర్శించారు. వారం రోజుల క్రితం విశాఖ జిల్లా కశింకోట సమీపంలో ప్రదీప్ హత్యకు గురైన విషయం తెలిసిందే.