![Former Union minister Raghuvansh Prasad Singh passes away - Sakshi](/styles/webp/s3/article_images/2020/09/14/rag.jpg.webp?itok=3gUzQJBd)
పట్నా/న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, రఘువంశ్ ప్రసాద్ సింగ్(74) కన్నుమూశారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో ఆదివారం ఉదయం 11 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారని సన్నిహితులు తెలిపారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న రఘువంశ్ మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ తదితర ప్రముఖులు సంతాపం ప్రకటించారు. రఘువంశ్‌కు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. భార్య కొంతకాలం క్రితమే మరణించారు.
గత శుక్రవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను ఎయిమ్స్ ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచారు. జూన్‌లో రఘువంశ్‌కు కోవిడ్–19 నిర్ధారణ కావడంతో పట్నా ఎయిమ్స్‌లో చికిత్స పొందారు. ఇటీవల మళ్లీ కోవిడ్ లక్షణాలు బయటప డటంతో ఢిల్లీ ఎయిమ్స్‌కు తీసుకువచ్చారు. ఆయన మృతదేహాన్ని ఆదివారం రాత్రి పట్నాకు తరలించారు. వైశాలి జిల్లాలోని స్వగ్రామం షాపూర్ గ్రామంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి.
సోషలిస్టు నేత అయిన రఘువంశ్ ప్రసాద్ బిహార్‌లోని వైశాలి లోక్‌సభ స్థానం నుంచి ఐదు పర్యాయాలు ఎన్నికయ్యారు. యూపీఏ హయాంలో కేంద్రగ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్‌కు విశ్వాసపాత్రునిగా ఉంటూ రాష్ట్ర, జాతీయ స్థాయి రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించారు. 4 రోజుల క్రితం ఆస్పత్రిలో ఉండగానే ఆర్జేడీ నుంచి వైదొలుగుతున్నట్లు ఆ పార్టీ చీఫ్ లాలూప్రసాద్‌కు లేఖ రాశారు. కానీ, ఆయన రాజీనామాను రాంచీ జైలులో ఉన్న లాలూ అంగీకరించలేదు. ఆరోగ్యం కుదుటపడ్డాక మాట్లాడుకుందామంటూ జవాబిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment