జైట్లీ అస్తమయం | Veteran BJP leader Arun Jaitley passes away | Sakshi
Sakshi News home page

జైట్లీ అస్తమయం

Published Sun, Aug 25 2019 2:51 AM | Last Updated on Sun, Aug 25 2019 8:26 AM

Veteran BJP leader Arun Jaitley passes away - Sakshi

జైట్లీ కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న రాష్ట్రపతి కోవింద్‌

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ అగ్రనేత, స్వతంత్ర భారతంలో అతిపెద్ద పన్ను సంస్కరణకు ఆద్యుడు అరుణ్‌ జైట్లీ (66) ఇకలేరు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. చికిత్స పొందుతూ ఢిల్లీలోని ఏయిమ్స్‌లో శనివారం మధ్యాహ్నం 12.07 గంటలకు కన్నుమూశారు. బీజేపీ అగ్రనేతగా.. కష్టకాలంలో బీజేపీని అదుకున్న మూలస్తంభాల్లో ఒకరిగా అభిమానుల గుండెల్లో ఆయన స్థానం చెరగనిది. సుష్మాస్వరాజ్‌ వంటి మహానేత హఠాన్మరణాన్ని (ఆగస్టు 6న) మరవక ముందే.. అదేతరానికి చెందిన జైట్లీ వంటి మరో రాజకీయ ప్రముఖుడిని కోల్పోవడం దేశానికి మరీ ముఖ్యంగా బీజేపీకి పెద్దలోటు.

ఆగస్టు 9న శ్వాస ఇబ్బందులతో ఆయన్ను ఆసుపత్రిలో చేర్చగా అప్పటి నుంచి వెంటిలేటర్‌పై చికిత్సపొందుతూ.. శనివారం తుదిశ్వాస విడిచారని ఏయిమ్స్‌ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. అరుణ్‌ జైట్లీ మృతి బీజేపీకి తీరని శోకాన్ని మిగిల్చింది. జైట్లీ మృతిపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ ప్రముఖులు, బీజేపీయేతర పార్టీల నేతలు, తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ రాజకీయాలకు ఆయన లోటు పూడ్చలేనిదన్నారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో జైట్లీ భౌతికకాయానికి అంత్యక్రియలు జరుగుతాయి.

పార్టీలకతీతంగా అభిమానం పొంది..
రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ రాజకీయ పక్షాల మధ్య ఏకాభిప్రాయ సాధనలో జైట్లీ చొరవను ప్రశంసించకుండా ఉండలేం. స్వతంత్ర భారతంలో అతిపెద్ద పన్ను సంస్కరణ అయిన జీఎస్టీ విషయంలో అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూనే ఏకాభిప్రాయంతో అద్భుతమైన చట్టానికి రూపకల్పన చేశారు. నరేంద్ర మోదీ తొలి ఐదేళ్ల ప్రభుత్వంలో జైట్లీది క్రియాశీలక పాత్ర. కీలక వ్యూహకర్తగా ఆయన వ్యవహరించిన తీరు అందరికీ గుర్తే. ఆర్థిక శాఖతోపాటు రక్షణ, కార్పొరేట్‌ వ్యవహారాలు, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వంటి కీలక బాధ్యతలను ఆయన సమర్థంగా నిర్వర్తించారు.

ఏబీవీపీతో రాజకీయ ప్రస్థానం మొదలై.. బీజేపీలో ఉన్నతస్థానానికి చేరినా.. కరడుగట్టిన హిందుత్వ రాజకీయాల జోలికి ఆయనెప్పుడూ వెళ్లలేదు. అందుకే పార్టీలకు అతీతంగా ఆయనంటే ఎనలేని గౌరవాభిమానాలు ఉన్నాయి. నరేంద్ర మోదీ బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఆమోదం పొందడం, ఆ తర్వాత ప్రభుత్వం సమర్థవంతంగా నడవడం వెనక కూడా జైట్లీ కృషి చాలా ఉంది. రాజకీయాల్లో ఉంటూ.. న్యాయవాదిగా పలు ముఖ్యమైన కేసుల్లో తనముద్ర వేశారు. ప్రముఖ కంపెనీలకు న్యాయవాదిగా, న్యాయ సలహాదారుగా ఆయన పనిచేశారు. బీజేపీలో ఆయనో ట్రబుల్‌ షూటర్‌గా పేరు సంపాదించారు.

విషాదంలో బీజేపీ శ్రేణులు...
సుష్మాస్వరాజ్‌ మృతి నుంచి తేరుకోకముందే మరో అగ్రనేత జైట్లీని కోల్పోవడంతో బీజేపీ శ్రేణులు నిర్వేదంలో (విషాదం) మునిగిపోయాయి.  జైట్లీ ఇకలేరనే వార్త తెలియగానే కార్యకర్తలు భారీ సంఖ్యలో ఎయిమ్స్‌ వద్దకు చేరుకున్నారు. భౌతికకాయం జైట్లీ ఇంటికి చేరాక అక్కడికి కూడా భారీగా అభిమానులు చేరుకున్నారు. బీజేపీలో కొత్తతరం నేతలకు స్ఫూర్తిగా నిలిచే జైట్లీ... 2019 ఎన్నికల సమయంలో ఆరోగ్యం సహకరించక బహిరంగ సభలకు వెళ్లకపోయినా.. పార్టీ కార్యాలయం నుంచే ప్రెస్‌మీట్ల ద్వారా విపక్షాల ఎత్తులను చిత్తు చేస్తూ.. పార్టీ విజయంలో కీలక భూమిక పోషించారు. ప్రభుత్వం, పాలన సమర్థవంతంగా మందుకెళ్లడంలోనూ కీలకంగా వ్యవహరించారు.

పార్టీ ట్రబుల్‌ షూటర్‌: అడ్వాణీ
‘అందరినీ కలుపుకుని పోయేవాడిగా.. పార్టీలకు అతీతంగా జైట్లీ అందరి మదిలో ఉంటారు. జైట్లీ భోజన ప్రియుడు. మంచి రెస్టారెంట్‌ అనిపిస్తే.. అక్కడోసారి భోజనం చేయండని సూచించేవాడు. ప్రతి దీపావళికి కుటుంబసమేతంగా ఇంటికొచ్చి శుభాకాంక్షలు చెప్పేవాడు’ అని బీజేపీ అగ్రనేత, మాజీ కేంద్ర మంత్రి ఎల్‌కే అడ్వాణీ గద్గదస్వరంతో జైట్లీతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కాంగ్రెస్‌ అధినేత సోనియాగాంధీ, ఇతర విపక్ష నేతలు కూడా జైట్లీ మృతిపై ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. జేడీయూ అధ్యక్షుడు, బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్, జైట్లీల మధ్య దశాబ్దాలుగా స్నేహం ఉంది.

గతేడాది నుంచే అనారోగ్యంతో..
2014లో ఆయన బరువు తగ్గించుకునేందుకు బేరియాట్రిక్‌ సర్జరీ చేయించుకున్నారు. గతేడాది మే 14న ఆయన కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం చాలా వేగంగా క్షీణించింది. దీంతో ఆయన విశ్రాంతి తీసుకునేందుకే ప్రాధాన్యమివ్వాల్సి వచ్చింది. ఈ ఏడాది ఆరంభంలో మృదు కణజాల కేన్సర్‌తో బాధపడుతున్నట్లు వెల్లడైంది. దీంతో 2019 ఎన్నికల్లో పోటీపై విముఖత చూపించటమే కాక... భారీ విజయం సాధించిన తర్వాత కేబినెట్‌లో తనకు చోటు వద్దని కరాఖండిగా చెప్పేశారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2000 నుంచి ఆయన రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజ్యసభలో పార్టీ పక్షనేతగా బాధ్యతలు నిర్వర్తించారు.

ప్రముఖుల నివాళి
దక్షిణ ఢిల్లీలోని కైలాశ్‌ కాలనీలో ఉన్న ఆయన నివాసానికి భౌతికకాయాన్ని తరలించారు. అక్కడే రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, బీజేపీ అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయుష్‌ గోయల్, హర్షవర్ధన్, జితేంద్ర సింగ్, ఎస్‌ జైశంకర్‌ సహా పలువురు కేంద్ర మంత్రులు తదితరులు జైట్లీ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కాంగ్రెస్‌ నేతలు గులాంనబీ ఆజాద్, అహ్మద్‌ పటేల్, జ్యోతిరాదిత్య సింధియా, రాజీవ్‌ శుక్లా కూడా ఆయన నివాసానికి చేరుకుని భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డాతోపాటు వివిధ పార్టీల రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు.  

మరణవార్త విని బాధపడ్డాను: సీజేఐ
‘దేశం ఓ ఉన్నతమైన సీనియర్‌ లాయర్, గొప్ప నేతను కోల్పోయింది. ఆయన మరణ వార్త వినగానే బాధపడ్డాను. అతడి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా’ అని అన్నారు.

న్యాయవాదిగా ప్రస్థానం  
జైట్లీది న్యాయవాద కుటుంబం. న్యూఢిల్లీలో డిసెంబర్‌ 28, 1952లో జన్మించారు. ఆయన తండ్రి ఢిల్లీలో పేరు ప్రఖ్యాతులున్న న్యాయవాది మహరాజ్‌ కిషన్‌ జైట్లీ. తల్లి రతన్‌ ప్రభ సామాజిక కార్యకర్త. చిన్నప్పటి నుంచి చర్చాగోష్టుల్లో పాల్గొనటం అంటే జైట్లీకి చాలా ఇష్టం. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ చేశారు. 1975లో దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించినప్పుడు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ఏబీవీపీ విద్యార్థి నాయకుడిగా పాల్గొని ఆ ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. దాదాపు 19 నెలలు జైల్లో ఉన్నారు కూడా. అప్పట్లో ఏబీవీపీ యువమోర్చా కన్వీనర్‌ బాధ్యతలు నిర్వహించేవారు. 1977లో ఏబీవీపీ అ«ఖిల భారత కార్యదర్శిగా ఉన్నారు. 1980లో బీజేపీలో చేరారు. పార్టీ తరఫున ఎన్నో కేసులు వాదించారు. బోఫోర్స్‌ వంటి కుంభకోణాలను వెలికితీయడంలో జైట్లీ పాత్ర కీలకం. కాంగ్రెస్‌ నేత మాధవరావు సింధియా, జనతాదళ్‌ నేత శరద్‌యాదవ్‌ వంటి వారు కూడా జైట్లీ క్లయింట్లే. న్యాయపరమైన అంశాలపై  పుస్తకాలు కూడా రాశారాయన. జైట్లీ భార్య సంగీత. ఆయనకు కుమారుడు రోహన్, కుమార్తె సొనాలీ. పిల్లలిద్దరూ న్యాయవాద వృత్తిలోనే ఉన్నారు.  


జైట్లీ పార్థివ దేహం వద్ద అమిత్‌ షా నివాళి, జైట్లీ భార్య సంగీతను ఓదారుస్తున్న సోనియా


2001లో వాజ్‌పేయితో..


2004లో కలకత్తా హైకోర్టులో లాయర్‌గా..


1974లో ఢిల్లీ వర్సిటీ స్టూడెంట్స్‌ యూనియన్‌ అధ్యక్షుడిగా..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement