Delhi Aims
-
ఆస్పత్రిలో ప్రముఖ జానపదగాయని.. పరామర్శించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: బీహర్‌కు చెందిన ప్రముఖ జానపద గాయని శారదా సిన్హా అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరి, చికిత్స పొందుతున్నారు. ఈ నేపధ్యంలో శారదా సిన్హా కుమారుడు అన్షుమన్ సిన్హాకు ప్రధాని నరేంద్రమోదీ ఫోన్ చేసి, శారదా సిన్హా క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు.శారదా సిన్హా ప్రస్తుతం వెంటిలేటర్ సపోర్టుపై చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. భర్త బ్రిజ్కిషోర్ సిన్హా మరణానంతరం శారదా సిన్హా ఆందోళనకు లోనయ్యారు. శారదా సిన్హాను బీహార్ కోకిల అని కూడా అంటారు. ఆమె భోజ్‌పురి, మైథిలి, మాగాహి జానపద గీతాలను ఆలపించడంలో పేరొందారు. శారదా సిన్హా బీహార్ సంప్రదాయ సంగీతాన్ని ప్రోత్సహించడంలో కీలకపాత్ర పోషించారు. ఆమె పాడిన 'కహే తో సే సజ్నా','పెహ్లే పెహిల్ హమ్ కయేని' పాటలు ఎంతో ఆదరణ పొందాయి. శారదా సిన్హా 2018లో పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు.ఇది కూడా చదవండి: రాహుల్ రెండు గంటల పర్యటన -
ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. నాలుగో అంతస్తు నుండి దట్టమైన పొగలు బయటకు రావడంతో చుట్టుపక్కల వార్డుల్లోని రోగులు, సిబ్బంది భయంతో పరుగులు తీశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి విషయం చేరవేయడంలో వారు సమయానికి ఆసుపత్రికి చేరుకొని ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎయిమ్స్ ఆసుపత్రిలోని ఎండోస్కోపీ విభాగంలో మంటలు రావడంతో ప్రమాదం సంభవించినట్లు చెబుతున్నారు ఆసుపత్రి సిబ్బంది. ఒక్కసారిగా మంటలు చెలరేగి ఎమర్జెన్సీ విభాగానికి కూడా వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన ఆసుపత్రి వర్గాలు వెంటనే స్పందించి ఎమర్జెన్సీ వార్డులోని రోగులను సురక్షిత వార్డులకు తరలించారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించడంతో ఆరు ఫైరింజన్లతో వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది సమయానికి స్పందించి రోగులను సురక్షిత వార్డులకు తరలించడంతో ఎటువంటి అనర్ధం జరగలేదు. ప్రమాదానికి కారణమైతే ఇంకా తెలియరాలేదు కానీ షార్ట్ సర్క్యూట్ వల్లనే ప్రమాదం జరిగి ఉండొచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాయి ఆసుపత్రి వర్గాలు. -
పారాలింపిక్స్ కాంస్య పతక విజేతకు ఛాతీ నొప్పి
Paralympic Bronze Medallist Sharad Kumar Diagnosed With Heart Swelling: ఇటీవల ముగిసిన టోక్యో పారాలింపిక్స్‌లో పురుషుల హై జంప్‌లో కాంస్య పతకం సాధించిన శరద్ కుమార్‌కు ఛాతీలో నొప్పి రావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షలు నిర్వహించే క్రమంలో అతను గుండె వాపు సమస్యతో బాధ పడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని శరద్ కుమార్ స్వయంగా మీడియాకు వెల్లడించాడు. కాగా, పారాలింపిక్స్ కమిటీ ఆఫ్ ఇండియా(పీసీఐ) ఇటీవలే శరద్ కుమార్ పేరును ఈ ఏడాది మేజర్ ధాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డుకు సిపార్సు చేసింది. శరద్‌తో పాటు టోక్యో పారాలింపిక్స్ పతక విజేతలు ప్రమోద్ భగత్(బ్యాడ్మింటన్), మనీశ్ నర్వాల్(షూటింగ్), సుందర్ సింగ్ గుర్జార్(జావెలిన్ త్రో)ల పేర్లను కూడా పీసీఐ ఖేల్‌రత్న అవార్డులకు రెకమెండ్ చేసింది. చదవండి: ఆర్నెళ్ల క్రితమే 'ఆ' సలహా ఇచ్చాడు.. అయినా పట్టించుకోని కోహ్లి..! -
ఏపీలో కరోనా కట్టడి చర్యలు బాగున్నాయి: ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్
సాక్షి, అమరావతి : ఏపీలో కరోనా కట్టడి చర్యలు బాగున్నాయని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. ప్రభుత్వ చర్యల వల్ల ఏపీలో కేసులు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎస్వోపీ పాటించడంపైనే థర్డ్‌వేవ్ ఆధారపడి ఉంటుంది. పిల్లలపై థర్డ్‌వేవ్ ప్రభావం చూపుతుందనడానికి ఆధారాలు లేవు. ఇప్పటికే చాలామంది పిల్లలు వైరస్ బారినపడి రికవరీ అయ్యారు. కోవిడ్‌ను ఎదుర్కోవడానికి మాస్క్, టీకా తప్ప మరో మార్గం లేదు’’ అని అన్నారు. -
పల్లెల్లో మూడేళ్లు వైద్య సేవలు
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఎంబీబీఎస్ పూర్తిచేసే వైద్యులు తప్పకుండా మూడేళ్లపాటు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాలని వైద్యారోగ్య రంగంపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అలా పనిచేయని వారి వైద్య డిగ్రీలను, రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని సూచించింది. ఈ మేరకు కేంద్రానికి సమగ్ర నివేదిక సమర్పించింది. ఎంబీబీఎస్ వైద్యులు గ్రామాల్లో ఉండేలా మౌలిక సదుపాయాలు కల్పించాలని.. వారి పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది. ప్రజల అవసరాలకు, ప్రభుత్వ ఆస్పత్రులకు మధ్య అగాధం నెలకొందని, ఈ పరిస్థితిని మార్చాలని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. దేశంలోని 23 రాష్ట్రాల్లో జనాభాకు తగినట్లుగా డాక్టర్లు, నర్సుల నిష్పత్తి చాలా తక్కువగా ఉందని వెల్లడించింది. అందుకోసం దేశవ్యాప్తంగా 22 ఎయిమ్స్‌లు, 155 మెడికల్ కాలేజీలు నెలకొల్పాలని.. ఇందుకు అవసరమైన నిధుల్లో 60 శాతం కేంద్రం భరించాలని సూచించింది. ఇప్పటికే కొన్ని ఎయిమ్స్‌లు, కాలేజీలు పూర్తయ్యాయని తెలిపింది. సబర్బన్ ఏరియాల్లో మెడిసిటీలు ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)తో పెద్ద స్థాయి ఆస్పత్రులను తీసుకురావాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం సూచించింది. మెడికల్ హబ్‌ల మాదిరిగా మెడిసిటీలు తీసుకురావాలని.. వీటిని గ్రామాలకు సమీపంలో ఏర్పాటు చేస్తే అక్కడకు డాక్టర్లు, నర్సులు వెళ్తారని పేర్కొంది. మెడిసిటీలలో పూర్తిస్థాయిలో ఆధునిక మౌలిక సదుపాయాలు ఉండేలా చూడాలని స్పష్టం చేసింది. ఆరోగ్య రంగంలో నాణ్యతను పెంచాలని, రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందేలా చూడాలని, దీని ఆధారంగా ఆస్పత్రులకు ర్యాంకులు ఇవ్వాలని ప్రతిపాదించింది. ర్యాంకులకు అనుగుణంగా నిధులు ఇవ్వాలని సూచించింది. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం తమ బడ్జెట్లో 8 శాతం ఆరోగ్య రంగానికి కేటాయించాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం మేఘాలయ (9.1%), ఢిల్లీ (13.7%), పాండిచ్చేరి (8.6%) రాష్ట్రాలు మాత్రమే ఆ స్థాయిలో నిధులు కేటాయిస్తున్నాయని, మిగతా రాష్ట్రాలు 8 శాతం కంటే తక్కువే ఇస్తున్నాయని తెలిపింది. జీడీపీలో ఆరోగ్య రంగానికి 1.5 శాతమే కేటాయింపు ఉందని, వచ్చే రెండేళ్లలో 2.5 శాతానికి పెంచాలని, 2025 నాటికి 5 శాతానికి చేరుకోవాలని సూచించింది. చాలా దేశాలు 5 శాతానికిపైగా కేటాయిస్తున్నాయని వివరించింది. ప్రజలు ఆరోగ్యం కోసం అయ్యే ఖర్చులో 62.4 శాతాన్ని సొంతంగానే ఖర్చు చేస్తున్నారని.. ఈ విషయంలో మన దేశం 15వ స్థానంలో ఉందని తెలిపింది. ఏటా ఆరోగ్య ఖర్చులు భరించలేక 4.16 శాతం మంది పేదరికంలోకి వెళ్తున్నారని స్పష్టం చేసింది. ఇష్టమైన వ్యాక్సిన్ వేసుకునే వెసులుబాటు ఇప్పటికే ట్రయల్స్‌లో ఉన్న కరోనా వ్యాక్సిన్లను ప్రోత్సహించాలని.. సమగ్రంగా పరిశీలించి అనుమతులు ఇవ్వాలని పార్లమెంటరీ సంఘం సిఫార్సు చేసింది. ప్రజలు తమకు ఇష్టమైన కంపెనీలకు చెందిన కరోనా వ్యాక్సిన్ వేయించుకునే వెసులుబాటు కల్పించాలని.. కోవిడ్ తర్వాత వచ్చే ఇబ్బందులకు చికిత్స చేసే క్లినిక్‌లను నెలకొల్పాలని సూచించింది. ఢిల్లీ ఎయిమ్స్ మాత్రమే ఇలా ఒక క్లినిక్‌ను నెలకొల్పిందని, అలా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. దేశంలో కరోనా కాలంలో ప్రైవేట్ ఆస్పత్రులు రూ. 14 వేల కోట్ల మేర నష్టపోయాయని.. కరోనా కాలంలో ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య 75 శాతం తగ్గిందని పేర్కొంది. సాధారణ ఆపరేషన్లు తగ్గాయని, కీమోథెరపీ చికిత్స 64 శాతం తగ్గిందని వెల్లడించింది. నాన్ కోవిడ్ వైద్య సేవలు తగ్గాయని.. కరోనా మొదలైన మొదటి మూడు నెలల కాలంలో దేశంలో 4 లక్షల మంది చిన్నారులు ఇతర సాధారణ వ్యాక్సిన్లు వేయించుకోలేకపోయారని పేర్కొంది. కంటి, కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు 90 శాతం తగ్గాయని వివరించింది. కమిటీ నివేదికలోని మరికొన్ని అంశాలు ►మన దేశంలో 10.6 శాతం మంది ఏదో రకమైన మానసిక సమస్యతో బాధపడుతున్నారు. వారికి అవసరమైన చికిత్స అందించే సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు, సైకియాట్రిక్ సోషల్ వర్కర్లు, ఆశ వర్కర్లు తక్కువగా ఉన్నారు. కాబట్టి నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాం ద్వారా నిధులతో మానవ వనరులను పెంచాలి. ►ఐఏఎస్, ఐపీఎస్ తరహాలో ఇండియన్ మెడికల్ సర్వీస్ (ఐఎంఎస్)ను ఏర్పాటు చేయాలి. ►కేన్సర్‌పై పీపీపీ పద్ధతిలో పరిశోధనా సంస్థలను ఏర్పాటు చేయాలి. ఏ ఏరియాలో ఏ రకంగా కేన్సర్ వస్తుందో గుర్తించాలి. దేశంలో 39 క్యాన్సర్ ఆస్పత్రులు నెలకొల్పాలి. ►జంతు సంబంధిత మానవ వ్యాధులు మరింతగా పెరుగుతున్నాయి. కాబట్టి దాన్ని అధిగ మించడానికి జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ►దేశంలో కేవలం 13 వైరస్ జబ్బుల పరిశోధన కేంద్రాలు (వీఆర్డీఎల్) ఉన్నాయి. వాటిని పెంచాల్సిన అవసరం ఉంది. ►వైద్యులకు కరోనా వస్తే వాళ్లకు ప్రత్యేకంగా సె లవు ప్రకటించాలి. ప్రోత్పాహకాలు ఇవ్వాలి. ఉన్నత చదువులకు వెళితే సాయం చేయాలి. -
ప్రధాని మోదీకి తొలి డోస్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(70) ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్)లో సోమవారం ఉదయం 6.30 గంటలకు కరోనా టీకా మొదటి డోసు తీసుకున్నారు. అర్హులైన వారంతా టీకా తీసుకోవాలని కోరారు. 60 ఏళ్లు దాటిన వారికి, 45 ఏళ్లకుపైగా వయసున్న వ్యాధిగ్రస్తులకు టీకా ఇచ్చేందుకు ఉద్దేశించిన కరోనా వ్యాక్సినేషన్ రెండో దశ సోమవారం దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థ దేశీయంగానే అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌ను పుదుచ్చేరికి చెందిన నర్సు పి.నివేదా ప్రధాని మోదీకి ఇచ్చారని, ఆమెకు కేరళకు చెందిన నర్సు రోజమ్మ అనిల్ సహకరించారని అధికార వర్గాలు తెలిపాయి. వ్యాక్సినేషన్ అనంతరం మోదీ ట్వీట్ చేశారు. ‘‘కోవిడ్–19 వ్యాక్సిన్ ఫస్టు డోసు ఈ రోజే తీసుకున్నా. ఈ మహమ్మారిపై జరుగుతున్న పోరాటాన్ని బలోపేతం చేయడంలో భాగంగా మన డాక్టర్లు, సైంటిస్టులు సాగిస్తున్న కృషి ప్రశంసనీయం. అర్హులైన వారంతా టీకాను తీసుకోవాలి. అంతా కలిసి భారత్‌ను కరోనారహిత దేశంగా మార్చేద్దాం’’ అని పిలుపునిచ్చారు. టీకా తీసుకుంటున్న ఫొటోను మోదీ ట్విట్టర్లో పోస్టు చేశారు. ఇందులో నర్సు నివేదాతోపాటు కేరళకు చెందిన నర్సు రోజమ్మ అనిల్ కూడా కనిపిస్తున్నారు. వ్యాక్సినేషన్ సందర్భంగా మోదీ అస్సామీ సంప్రదాయ కండువా ‘గమోచా’ ధరించారు. టీకా ఇస్తున్నప్పుడు ముఖంపై చిరునవ్వు చెదర నివ్వలేదు. అసలు టీకా ఇచ్చినట్లే అనిపించలేదు ఢిల్లీలో రహదారులపై ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు ప్రధాని మోదీ ఉదయా న్నే వెళ్లి కరోనా టీకా తీసుకున్నారని అధికారులు చెప్పారు. మోదీకి టీకా ఇచ్చిన నర్సు నివేదా తన అనుభవాన్ని పంచుకున్నారు. ‘‘అప్పుడే అయిపోయిందా! కనీసం టీకా ఇచ్చినట్లు కూడా నాకు అనిపించలేదు’’ అని మోదీ తనతో అన్నారని తెలిపారు. మూడేళ్లుగా ఎయిమ్స్‌లో పని చేస్తున్నానని, ప్రస్తుతం ఇక్కడి వ్యాక్సిన్ సెంటర్లో విధులు నిర్వర్తిస్తున్నానని చెప్పారు. కరోనా టీకా కోసం ప్రధాని మోదీ వస్తున్నట్లు సోమవారం ఉదయమే తాను ఎయిమ్స్‌కు వచ్చిన తర్వాతే తెలిసిందన్నారు. ఆయనను కలవడం, స్వయంగా టీకా ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. రెండో డోసు కోసం ఆయన 28వ రోజున మళ్లీ రావాల్సి ఉంటుందని చెప్పారు. మోదీ తమతో(నర్సులు) మాట్లాడారని, తాము ఎక్కడి నుంచి వచ్చామన్నది అడిగి తెలుసుకున్నారని వివరించారు. టీకా ఇస్తున్న సమయంలో మోదీ చాలా సౌకర్యవంతంగా కనిపించారని మరో నర్సు రోజమ్మ అనిల్ చెప్పారు. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు అని, మోదీజీ చేతులు జోడించి వణక్కం అంటూ నమస్కారం చేశారని తెలిపారు. టీకా ఇచ్చిన తర్వాత ఆయన అరగంట పాటు పరిశీలనలో ఉన్నారని, ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదని వెల్లడించారు. టీకా తీసుకున్నందుకు మోదీ సంతోషించారని అన్నారు. వెళ్లిపోయే ముందు తమ దగ్గరికి వచ్చి, చేతులు జోడించి థాంక్యూ, వణక్కం అని చెప్పారని రోజమ్మ వివరించారు. ప్రధాని రాక గురించి ఆదివారం రాత్రి పొద్దుపోయాక తమకు సమాచారం అందిందని ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా చెప్పారు. ఉల్లాసంగా.. సరదాగా ఎయిమ్స్‌లో వ్యాక్సినేషన్ సందర్భంగా నరేంద్ర మోదీ చాలా ఉల్లాసంగా కనిపించారు. అక్కడి గంభీరమైన వాతావరణాన్ని తేలికపర్చడానికి నర్సులతో సరదాగా సంభాషించారు. నాకు టీకా వేయడానికి మందంగా ఉన్న ప్రత్యేకమైన సూది, పశువులకు ఇచ్చేలాంటిది ఏదైనా వాడుతున్నారా.. ఎందుకంటే రాజకీయ నాయకులకు తోలుమందం అంటుంటారు కదా! అని అన్నారు. దీంతో అక్కడున్న వైద్య సిబ్బంది హాయిగా నవ్వేశారు. టీకా కోసం జనం బారులు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ రెండో దశ సోమవారం దేశవ్యాప్తంగా మొదలయ్యింది. 60 ఏళ్లు దాటిన వారికి, 45 నుంచి 59 ఏళ్ల వయసుండి వ్యాధులతో బాధపడుతున్నవారికి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా టీకా ఇస్తున్నారు. ప్రధాని మోదీ ఢిల్లీ ఎయిమ్స్‌లో కరోనా టీకా తీసుకొని రెండో దశ వ్యాక్సినేషన్‌కు శ్రీకారం చుట్టారు. టీకా కోసం అర్హులు ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్ల వద్ద బారులు తీరిన దృశ్యాలు దేశమంతటా కనిపించాయి. కొందరు చక్రాల కుర్చీలపై తరలిరావడం విశేషం. కర్ణాటక రాజధాని బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్లో 97 ఏళ్ల రామస్వామి పార్థసారథి సోమవారం కరోనా టీకా తీసుకున్నారు. ఢిల్లీలో దాదాపు 90 ఏళ్ల వయసున్న వృద్ధులు టీకా పొందారు. టీకా పంపిణీలో అక్కడక్కడ కొన్ని లోపాలు బయటపడ్డాయి. మరోవైపు కో–విన్ 2.0 పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోలేకపోయామని, అపాయింట్మెంట్ పొందలేకపోయామని కొందరు చెప్పారు. రెండో దశలో మొదటి రోజే దేశంలో పలువురు ప్రముఖులు టీకా తీసుకున్నారు. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు అమిత్ షా, ఎస్.జైశంకర్, రాజస్తాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా, తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, నేషలిస్టు కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, గోపాలకృష్ణన్ టీకా వేయించుకున్నారు. ఇలా ఉండగా, కోవాగ్జిన్ టీకా తీసుకున్న ప్రధానికి హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థ సీఎంyీ కృష్ణ ఎల్లా కృతజ్ఞతలు తెలిపారు. -
విషమించిన లాలూ ప్రసాద్ ఆరోగ్యం
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమించింది. దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బిహార్ కురవృద్దుడు ఇప్పటికే రాంచీలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో గతకొంత కాలంగా చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడంతో గత మూడు రోజులుగా ఆరోగ్యం మరింత క్షీణించింది. జైలు అధికారుల సమాచారం మేరకు తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్, రబ్రీదేవి శుక్రవారం రాత్రి రాంచీ చేరుకుని ఆయన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా తన తండ్రికి మెరుగైన ఆరోగ్యం అందించాలని తేజస్వీ యాదవ్ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్‌ను కోరారు. దీంతో వైద్యుల సూచనల మేరకు శనివారం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీలు ప్రస్తుతం 25 శాతం మాత్రమే పనిచేస్తున్నాయని, మెరగైన వైద్యం కోసం ఢిల్లీ తరలిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై లాలూ కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అనారోగ్య పరిస్థితుల కారణంగా లాలూకు వెంటనే బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరుఫు న్యాయవాదులు పట్నా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణలో ఉంది. -
ఏలూరు ఘటన: మరింత లోతుగా పరిశీలన
సాక్షి, అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పలువురు అస్వస్థతకు గురి కావటానికి కారణాలపై మరింత లోతుగా పరిశీలన జరపాలని, ఏ అంశాన్నీ తేలిగ్గా తీసుకోవద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నివారించాలంటే అన్ని కోణాల్లో పరిశీలించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. కేంద్ర వైద్య, సాంకేతిక, పరిశోధన సంస్థల నిపుణులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. బహుశా పురుగు మందుల అవశేషాలే ఇందుకు కారణం కావచ్చని, బాధితుల శరీరంలోకి చేరి అనారోగ్యానికి దారి తీసి ఉండవచ్చని, అయితే దీనిపై మరింత అధ్యయనం అవసరమని ఢిల్లీ ఎయిమ్స్, ఐఐసీటీ సహా పలు ప్రఖ్యాత సంస్థలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై దీర్ఘకాలిక అధ్యయనం నిర్వహించే బాధ్యతలను ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ ఎయిమ్స్, ఐఐసీటీకి అప్పగించారు. దేన్నీ కొట్టి పారేయకుండా మరింత క్షుణ్నంగా పరీక్షలు జరపాలని కోరారు. ఏలూరుతోపాటు పశ్చిమ గోదావరి జిల్లా అంతా పరీక్షలు నిర్వహించాల్సిందిగా సూచించారు. ఏలూరు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), కలెక్టర్ ముత్యాలరాజు తదితరులు పాల్గొనగా క్యాంప్ ఆఫీసు నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ నీలం సాహ్ని, జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్‌తోపాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. సీఎం జగన్ సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ... సమగ్రంగా తాగునీటి వనరుల పరిశీలన.. డంపింగ్ యార్డుల నిర్వహణపై దృష్టి సారించాలి. అన్ని జిల్లాల్లో తాగు నీటి వనరులన్నింటినీ పరిశీలించాలి. ఒక పద్ధతి ప్రకారం శాంపిల్స్ తీసుకుని నిపుణులతో విశ్లేషణ చేయించాలి. ఫలితాలను లోతుగా అధ్యయనం చేసి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. ఎయిమ్స్, ఐఐసీటీ కార్యాచరణలోకి దిగి ఏలూరు ఘటనలకు దారి తీసిన పరిస్థితులపై నిరంతర పరిశీలన చేయాలి. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాచరణ రూపొందించాలి. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా నివారించాలి. సేంద్రీయ సాగును ప్రోత్సహించాలి.. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతులకు విస్తృత అవగాహన కల్పించాలి. ఆర్బీకేల ద్వారా ప్రచారం చేయాలి. ఆరోగ్యానికి హాని కలిగించే పురుగు మందులను మార్కెట్ నుంచి పూర్తిగా నిర్మూలించేలా వ్యవసాయ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. మూడు ప్రాంతాల్లో రాష్ట్ర స్థాయి ల్యాబ్‌లు.. ప్రతి జిల్లాలో పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌లను పటిష్టం చేయాలి. క్రమం తప్పకుండా శాంపిళ్లను స్వీకరించి ఫలితాల ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలి. మూడు ప్రాంతాల్లో రాష్ట్ర స్థాయి ల్యాబ్‌ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి. ఎలా చేరాయో గుర్తించాలి.. మనుషుల శరీరాల్లోకి పురుగు మందుల అవశేషాలు ఎలా చేరాయన్న దానిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ దృష్టి పెట్టాలి. – డా.ఆశిష్ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రతినిధి విచ్చలవిడి వ్యర్థాలే కారణం పలువురు బాధితుల నమూనాల్లో పురుగు మందుల అవశేషాలు కనిపించాయి. అవి కూరగాయల ద్వారా చేరుకున్నాయా? లేక మరో రకంగా ప్రవేశించాయా? అనే విషయం ఇంకా తేలలేదు. చాలా చోట్ల పెస్టిసైడ్స్ వాడిన తర్వాత ఖాళీ డబ్బాలను అలాగే వదిలేశారు. పురుగు మందుల డబ్బాలను ఇలా పడేయడం వల్ల ఎక్కువ ప్రమాదం జరుగుతోంది. వీటిని తగిన విధంగా నిర్వీర్యం చేయాలి. ఇక్కడ ఎలాంటి ఫ్యాక్టరీలు లేకపోయినా లెడ్, నికెల్ లాంటి హెవీ మెటల్స్ రక్తంలోకి వచ్చాయంటే దీనికి కారణం ఎలక్ట్రానిక్ వ్యర్థాలే. బ్యాటరీలు, మరికొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు ఎక్కడపడితే అక్కడ పడేయడం, కాల్చడం వల్ల విష పదార్థాలు కలుషితమయ్యాయి. పెస్టిసైడ్స్, ఎలక్ట్రానిక్ వస్తువుల నిర్వీర్యం పద్ధతి ప్రకారం జరగాలి –డా.బి.చంద్రశేఖర్‌రెడ్డి, ప్రముఖ న్యూరో ఫిజీషియన్ కచ్చితమైన కారణం కోసం కొద్ది నెలలు పరీక్షలు బాధితుల రక్తంలో లెడ్ కనిపించింది. పాలకు సంబంధించి అన్ని శాంపిళ్లలో నికెల్ కనిపించింది. ఆర్గానో క్లోరిన్ వల్ల ఈ పరిస్థితి వచ్చిందని భావిస్తున్నాం. బహుశా పెస్టిసైడ్స్ (పురుగు మందులు) కారణంగానే ఇలా జరిగి ఉండవచ్చు. ఆహార చక్రంలో భాగంగా అది బాధితుల శరీరాల్లోకి చేరే అవకాశం ఉంది. బాధితుల బంధువుల రక్త నమూనాల్లో కూడా లెడ్ కనిపించింది. దీర్ఘకాలంలో దీనిపై ప్రత్యేక దృష్టి అవసరం. కొన్ని నెలల పాటు ఆహార పదార్థాలు, తాగు నీరు, కూరగాయలు తదితర శాంపిళ్లను పరిశీలిస్తే అస్వస్థతకు దారి తీసిన పరిస్థితులపై కచ్చితమైన కారణాన్ని కనిపెట్టే అవకాశం ఉంది. –ఢిల్లీ ఎయిమ్స్ సీఎం వైఎస్ జగన్‌తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కేంద్ర సంస్థల ప్రతినిధులు, నిపుణులు వాటర్ క్లీన్‌గానే ఉంది.. ఏలూరులో 21 చోట్ల నుంచి నీటి శాంపిల్స్ తీసుకున్నాం. తాగునీటిలో ఎలాంటి గుర్తించదగ్గ భార లోహాలు కనిపించ లేదు. లెడ్, ఆర్సెనిక్, నికెల్ తరహా లోహాలు లేవు. పురుగు మందుల అవశేషాలు కూడా గుర్తించదగ్గ స్థాయిలో లేవు. ఒకటికి రెండు సార్లు పరీక్షలు చేసి నిర్ధారించుకున్నాం. వాటర్ క్లీన్‌గా ఉంది. మనుషులు, పశువుల నుంచి కూడా రక్త నమూనాలు సేకరించాం. రక్త నమూనాల్లో ఎండో సల్ఫాన్, డీడీడీ కనిపించాయి,. కొన్ని రక్త నమూనాల్లో లెడ్ కనిపించింది. ఆర్గనో ఫాస్పేట్స్ కనిపించలేదు. –ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, హైదరాబాద్ సేంద్రీయ విధానాలపై చైతన్యం చేయాలి ఏలూరు ఘటనను పరిగణనలోకి తీసుకుని మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితులపై అధ్యయనం చేయాల్సి ఉంది. పెస్టిసైడ్స్ మనుషుల శరీరంలోకి ఎలా చేరాయో పరిశీలించాలి. పురుగు మందుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలి. దీర్ఘకాలంలో సేంద్రీయ పద్ధతులను అనుసరించడంపై చైతన్యం కలిగించాలి. వైద్య పరంగా కూడా కార్యాచరణ అవసరం. –ఎయిమ్స్, మంగళగిరి మెర్క్యురీ మోతాదు దాటింది ఏలూరులో గాలిలో కాలుష్య కారక పదార్థాలపై పరిశీలన జరిపాం. గాలి సాధారణ స్థాయిలోనే ఉంది. భూగర్భ జలాల శాంపిళ్లను పరీక్షించాం. మెర్క్యురీ మినహా మిగిలిన లోహాలన్నీ పరిమిత స్థాయిలోనే ఉన్నాయి. ఉపరితల జలాల్లో కూడా అన్నీ పరిమిత స్థాయిలోనే ఉన్నాయి. మెర్క్యురీ మాత్రం సాధారణ పరిమితికి మించి ఉంది. సాలిడ్ వేస్ట్ బర్నింగ్ (వ్యర్థ పదార్ధాలు కాల్చడం) కూడా దీనికి కారణం కావచ్చు. ఆర్గనో క్లోరిన్, ఆర్గనో ఫాస్పేట్స్ కనిపించ లేదు. లెడ్ కూడా లేదు. మట్టి నమూనాలపై విశ్లేషణ, పరీక్షలు జరుగుతున్నాయి. –నీరి (నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్) వైరల్ ఇన్ఫెక్షన్కు ఆధారాలు లేవు సీరం, యూరిన్ తదితర శాంపిళ్లు పరీక్షించాం. వైరల్ ఇన్ఫెక్షన్ అనేందుకు ఎలాంటి ఆధారాలు కానరాలేదు. –నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, పుణె కూరగాయల్లో పెస్టిసైడ్స్ అవశేషాలు టమోటా, వంకాయలపై పురుగు మందుల అవశేషాలు కనిపించాయి. బహుశా పెస్టిసైడ్స్ కారణంగానే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండొచ్చు. –ఎన్ఐఎన్, హైదరాబాద్ అంతా పరిమితిలోనే ఉన్నాయి పరీక్షించిన శాంపిళ్లలో పరిమితికి మించి ఏవీ కనిపించ లేదు. వైరస్, బాక్టీరియా కనిపించ లేదు. –సీసీఎంబీ, హైదరాబాద్ -
ఏలూరు అంతు చిక్కని వ్యాధిపై వీడిన మిస్టరీ
సాక్షి, అమరావతి/ పశ్చిమ గోదావారి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఏలూరు ఘటనపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు కలెక్టరేట్ నుంచి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని, జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు, జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్లా, డీఎంహెచ్‌వో డాక్టర్ సునంద, డీసీహెచ్‌మో డాక్టర్ ఏవీఆర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అస్వస్థతకు కారణాలపై శాస్త్రవేత్తలతో చర్చించారు ముఖ్యమంత్రి. పురుగు మందుల అవశేషాలే ఏలూరు పరిస్థితికి కారణమని ఎయిమ్స్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సహా ప్రఖ్యాత సంస్థలు అభిప్రాయపడ్డాయి. అవి ఎలా మనుషుల శరీరాల్లోకి ప్రవేశించాయన్నదానిపై దీర్ఘకాలంలో మరింత అధ్యయనం అవసరమని నిపుణులు తెలిపారు. ముఖ్యమంత్రి అధ్యయన బాధ్యతల్ని న్యూఢిల్లీ, ఎయిమ్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి అప్పగించారు. (ఏలూరులో కేసులు తగ్గాయ్) అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. మరింత లోతుగా పరీక్షలు: దేన్నీ కొట్టి పారయేకుండా వీలైనంత మేర పరీక్షలు చేయించాలి. అప్పుడే ఏలూరు లాంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా చూడగలం. డంపింగ్ యార్డులు నిర్వహణపైనా దృష్టి పెట్టండి. ఏలూరుతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా అంతటా కూడా అలాంటి పరీక్షలు చేయించాలి. అలాగే తాగు నీటి వనరులన్నింటినీ అన్ని జిల్లాల్లో పరిశీలన చేయండి. ఒక పద్దతి ప్రకారం శాంపిల్స్ తీసుకుని, వాటిని నిపుణులచేత విశ్లేషణ చేయించాలి. వాటన్నింటినీ లోతుగా అధ్యయనం చేయడం ద్వారా, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. ఎయిమ్స్, ఐఐసీటీ కార్యాచరణలోకి దిగి ఏలూరు ఘటనలకు దారి తీసిన పరిస్థితులపై నిరంతర పరిశీలన చేయాలి. దానికి కార్యాచరణ తయారు చేయాలని చీఫ్ సెక్రటరీకి ఆదేశం.ఇంకా అందు కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, మార్గాలను ఖరారు చేయాలని నిర్దేశం. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా చూడాలి. (ఏలూరు ఘటనలో అంతుచిక్కని కారణం) సేంద్రీయ వ్యవసాయం: సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి .రైతులకు దీనిపై అవగాహన కల్పించాలి: అందు కోసం ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం చేయాలి. ఆరోగ్యానికి హాని కలిగించే పురుగు మందులను పూర్తిగా మార్కెట్ నుంచి తొలగించాలి. దీనిపై వ్యవసాయ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ప్రజారోగ్య ల్యాబ్‌లు: ప్రతి జిల్లాలో పబ్లిక్ హెల్త్ (ప్రజారోగ్య) ల్యాబ్‌లు పటిష్టం చేయాలి. క్రమం తప్పకుండా శాంపిళ్లను స్వీకరించి పరీక్షలు చేసి, ఫలితాల ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలి. అలాగే మూడు ప్రాంతాల్లో మూడు రాష్ట్ర స్థాయి ల్యాబ్‌లఏర్పాటుకు ఆలోచన చేయాలి. ఢిల్లీ ఎయిమ్స్: అస్వస్థతకు గురైన వారి రక్తంలో లెడ్ కనిపించింది. అలాగే పాలకు సంబంధించి అన్ని శాంపిల్స్‌లో నికెల్ కనిపించింది. పేషెంట్లను పరిశీలిస్తే ఆర్గానో క్లోరిన్ కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని భావిస్తున్నాం. బహుశా పెస్టిసైడ్స్ (పురుగు మందులు) కారణంగానే ఇది వచ్చి ఉండొచ్చు. ఆహార సైకిల్లో భాగంగా అది శరీరంలో చేరే అవకాశం ఉంది. అస్వస్థతకు గురైన వారితో పాటు, వారి బంధువుల రక్త నమూనాల్లో కూడా లెడ్ కనిపించింది. దీర్ఘకాలంలో దీనిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సి ఉంటుంది. వివిధ సంస్థలు చేసిన పరీక్షల ఫలితాలు, అస్వస్థతకు గురైన వారి కేసు షీట్లను పోల్చి చూస్తే ఆర్గనో క్లోరిన్ కారణం కావొచ్చని భావిస్తున్నాం. కొన్ని నెలల పాటు ఆహార పదార్థాలు, తాగు నీరు, కూరగాయలు తదితర శాంపిళ్లను పరిశీలిస్తే అస్వస్థతకు దారి తీసిన వైనంపై కచ్చితమైన కారణం కనుక్కునే అవకాశం ఉంది. శాంపిళ్లకు జియో ట్యాగింగ్ కూడా చేయాలి. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, హైదరాబాద్ తమ పరీక్షలకు సంబంధించి ప్రజంటేషన్ ఇచ్చిన ఐఐసీటీ: ఏలూరులో 21 చోట్ల నుంచి నీటి శాంపిల్స్ తీసుకున్నాం. అలాగే మనుషులు, పశువుల నుంచి కూడా రక్తపు నమూనాలు సేకరించాం. తాగునీటిలో ఎలాంటి గుర్తించదగ్గ భారీ లోహాలు కనిపించ లేదు. లెడ్ కాని, ఆర్సెనిక్ కాని, నికెల్ తరహా లోహాలు కాని లేవు అలాగే పురుగుమందుల అవశేషాలు కూడా గుర్తించదగ్గ స్థాయిలో లేవు. ఒకటికి రెండు సార్లు పరీక్షలు చేసి నిర్ధారించుకున్నాం. వాటర్ క్లీన్‌గా ఉంది. రక్తపు నమూనాల్లో ఎండో సల్ఫాన్, డీడీడీ కనిపించాయి. కొన్ని రక్తపు నమూనాల్లో లెడ్ కనిపించింది. ఆర్గనో ఫాస్పేట్స్ కనిపించలేదు నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్ఈఈఆర్ఐ) హైదరాబాద్ ఏలూరులో గాలిలో కాలుష్యకారక పదార్థాలపై పరిశీలన: గాలి కూడా సాధారణ స్థాయిలోనే ఉందని వెల్లడి. భూగర్భ జలాల శాంపిళ్లపై పరిశీలన. మెర్క్యురీ తప్ప మిగిలిన లోహాలన్నీ పరిమితి స్థాయిలోనే ఉన్నాయని వెల్లడి ఉపరితల జలాల్లో కూడా అన్ని పరిమిత స్థాయిలోనే ఉన్నాయని, మెర్క్యురీ మాత్రం సాధారణ పరిమితికి మించి ఉందని వెల్లడి ఆర్గనో క్లోరిన్ కాని, ఆర్గనో ఫాస్పేట్స్కాని కనిపించలేదని వెల్లడి. లెడ్ కూడా లేదని వెల్లడి మట్టి నమూనాలపై విశ్లేషణ, పరీక్షలు జరుగుతున్నాయని వెల్లడి ఉపరితల జలంతో పోలిస్తూ భూగర్భజలాల్లో మెర్క్యురీ ఎక్కువ స్థాయిలో ఉందని వెల్లడి సాలిడ్ వేస్ట్ బర్నింగ్ (వ్యర్థ పదార్ధాలు కాల్చడం) వల్ల కూడా ఇది జరిగే అవకాశాలు ఉంటాయి. సీసీఎంబీ, హైదరాబాద్ మేం పరిశీలించిన శాంపిళ్లలో పరిమితి మించి ఏవీ కనిపించ లేదు వైరస్ కాని, బాక్టీరియా కాని కనిపించ లేదు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, పుణె సీరెం, యూరిన్ తదితర శాంపిళ్లు తీసుకుని పరిశీలన చేశాం. వైరల్ ఇన్ఫెక్షన్ అయ్యిందనడానికి ఎలాంటి ఆధారాలు కనిపించ లేదు. ఎన్ఐఎన్, హైదరాబాద్ టమోటాలు, వంకాయలపై పురుగుమందుల అవశేషాలు కనిపించాయి ఫెస్టిసైడ్స్ (పురుగుమందుల) కారణంగానే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండొచ్చు ఎయిమ్స్, మంగళగిరి ఏలూరు అంశాన్ని పరిగణలోకి తీసుకుని మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితులపై అ«ధ్యయనం చేయాల్సి ఉంది. పెస్టిసైడ్స్ ఎలా మనుషుల శరీరంలోకి చేరాయన్న దానిపై పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది పురుగు మందుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలి. దీర్ఘకాలంలో సేంద్రీయ పద్ధతులను అనుసరించడంపై చైతన్యం కలిగించాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మరోచోట జరిగితే ఏం చేయాలన్న దానిపై వైద్య పరంగా కార్యాచరణను రూపొందించాల్సి ఉంది. -
సుశాంత్ కేసులో మరో మలుపు
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కేసుని విచారిస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఐపీసీలో సెక్షన్ 302ని (హత్య) చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలోని ఎయిమ్స్ సీబీఐకి సమర్పించిన నివేదికలో సుశాంత్‌పై విష ప్రయోగం జరగలేదని చెప్పినప్పటికీ, ఆయనది ఆత్మహత్యా, హత్యా అన్నది తాము నిర్ధారించలేమని పేర్కొంది. సుశాంత్‌ని విష ప్రయోగం ద్వారా కాకుండా మరో రకంగా హత్య చేసి ఉండే అవకాశాలను కొట్టి పారేయలేమని పేర్కొంది. ఊపిరాడకే సుశాంత్ మరణించారని అందువల్ల అది కచ్చితంగా ఆత్మహత్య అని నిర్ధారించలేమని కూడా ఎయిమ్స్ వైద్యుడు ఒకరు చెప్పినట్టుగా ప్రచారంలో ఉంది. దీంతో సందేహాలను నివృత్తి చేసుకోవడానికి సెక్షన్ 302ని చేర్చాలని యోచిస్తున్నట్టుగా సీబీఐ వర్గాలు గురువారం వెల్లడించాయి. సుశాంత్ సింగ్ మృతి కేసులో భవిష్యత్ విచారణపై సీబీఐ త్వరలోనే ఒక కార్యాచరణ రూపొందించనుంది. జూన్ 14 ఉదయం సుశాంత్ సింగ్ శవమై కనిపించిన రోజు ఆయన అపార్ట్మెంట్లో ఉన్న దీపేష్ సావంత్ , సిద్ధార్థ్ పితాని ఇతర సిబ్బందిని మరోసారి విచారించడానికి సిద్ధమవుతోంది. ఈ కేసులో పితాని, సుశాంత్ కుక్ నీరజ్ కూడా సాక్షులుగా మారే అవకాశాలున్నాయి. 13 రాత్రి సుశాంత్, రియా కలుసుకున్నారా? సుశాంత్ మృతి చెందడానికి ముందు రోజు రాత్రి జూన్ 13న సుశాంత్, నటి రియా చక్రవర్తిని కలుసుకున్నారని ముంబైకి చెందిన బీజేపీ స్థానిక నాయకుడు వివేకానంద గుప్తా చెబుతున్నారు. వాళ్లిద్దరూ తెల్లవారు జామున 3 గంటల వరకు కలిసే ఉన్నారని, ఆ తర్వాత సుశాంత్ రియాను ఆమె ఇంటి వద్ద డ్రాప్ చేశారని తనకి కొంత మంది ప్రత్యక్ష సాక్షులు చెప్పారని వెల్లడించారు. ఈ విషయాన్ని సీబీఐ అధికారుల వద్ద చెబుతానని వివేకానంద తెలిపారు. -
రఘువంశ్ ప్రసాద్ కన్నుమూత
పట్నా/న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, రఘువంశ్ ప్రసాద్ సింగ్(74) కన్నుమూశారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో ఆదివారం ఉదయం 11 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారని సన్నిహితులు తెలిపారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న రఘువంశ్ మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ తదితర ప్రముఖులు సంతాపం ప్రకటించారు. రఘువంశ్‌కు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. భార్య కొంతకాలం క్రితమే మరణించారు. గత శుక్రవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను ఎయిమ్స్ ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచారు. జూన్‌లో రఘువంశ్‌కు కోవిడ్–19 నిర్ధారణ కావడంతో పట్నా ఎయిమ్స్‌లో చికిత్స పొందారు. ఇటీవల మళ్లీ కోవిడ్ లక్షణాలు బయటప డటంతో ఢిల్లీ ఎయిమ్స్‌కు తీసుకువచ్చారు. ఆయన మృతదేహాన్ని ఆదివారం రాత్రి పట్నాకు తరలించారు. వైశాలి జిల్లాలోని స్వగ్రామం షాపూర్ గ్రామంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి. సోషలిస్టు నేత అయిన రఘువంశ్ ప్రసాద్ బిహార్‌లోని వైశాలి లోక్‌సభ స్థానం నుంచి ఐదు పర్యాయాలు ఎన్నికయ్యారు. యూపీఏ హయాంలో కేంద్రగ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్‌కు విశ్వాసపాత్రునిగా ఉంటూ రాష్ట్ర, జాతీయ స్థాయి రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించారు. 4 రోజుల క్రితం ఆస్పత్రిలో ఉండగానే ఆర్జేడీ నుంచి వైదొలుగుతున్నట్లు ఆ పార్టీ చీఫ్ లాలూప్రసాద్కు లేఖ రాశారు. కానీ, ఆయన రాజీనామాను రాంచీ జైలులో ఉన్న లాలూ అంగీకరించలేదు. ఆరోగ్యం కుదుటపడ్డాక మాట్లాడుకుందామంటూ జవాబిచ్చారు. -
దేశంలో వ్యాక్సిన్ పరీక్షల జోరు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో అతలాకుతలమవుతున్న భారత్ స్వదేశీ వ్యాక్సిన్ ప్రయోగాలను వేగవంతం చేసింది. భారత్ బయోటెక్, జైడస్ క్యాడిలా సంస్థలకు చెందిన వ్యాక్సిన్లను దేశవ్యాప్తంగా ఆరు నగరాల్లో మనుషులపై ప్రయోగించి చూస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను ఢిల్లీలో ఎయిమ్స్ ఆస్పత్రిలో 30 ఏళ్ల వ్యక్తికి తొలి డోసు ఇచ్చారు. ఈ రెండు కంపెనీలకు చెందిన వ్యాక్సిన్లు మొదటి, రెండో దశ ప్రయోగాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇక బ్రిటన్‌కు చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన వ్యాక్సిన్‌ను పుణేకు చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ రెండు/మూడో దశ ప్రయోగాల అనుమతుల కోసం వేచిచూస్తోంది. స్వల్పంగా సైడ్ ఎఫెక్ట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) భాగస్వామ్యంతో భారత్ బయోటెక్ తయారు చేసిన వ్యాక్సిన్‌ను మొత్తం 12 ఆస్పత్రుల్లో 500 మంది వాలంటీర్లపై ప్రయోగించి చూశారు. 18–55 మధ్య వయసున్న వీరికి వ్యాక్సిన్ డోసు ఇచ్చాక స్వల్పంగా సైడ్ ఎఫెక్ట్లు వచ్చినట్టుగా ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. కొద్దిగా జ్వరం తప్ప ఇతరత్రా అనారోగ్య సమస్యలేవీ రాలేదని ఢిల్లీలో ఎయిమ్స్ డైరెక్టర్ వెల్లడించారు. జూలై 29 నుంచి రెండో దశ ప్రయోగాలు మొదటి దశలో చేసిన ప్రయోగాలు విజయవంతంగా ముగిస్తే ఈ నెల 29 నుంచి రెండో దశ వ్యాక్సిన్ ప్రయోగాలు చేపడతారు. మొదటి దశలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేవని నిర్ధారించుకోవడం, యాంటీ బాడీలు ఏ స్థాయిలో ఉత్పన్నమయ్యాయో తెలుసుకోవడానికి వాలంటీర్లకు మరికొన్ని టెస్టులు చేయాల్సి ఉందని ఎయిమ్స్ పట్నా డైరెక్టర్ సింగ్ చెప్పారు. కొవాగ్జిన్ ట్రయల్స్ హైదరాబాద్, పట్నా, కాంచీపురం, రోహ్తక్, ఢిల్లీలో ప్రారంభమయ్యాయి. నాగపూర్, భువనేశ్వర్, బెల్గామ్, గోరక్‌పూర్, కాన్పూర్, గోవా, విశాఖపట్నంలలో ప్రయోగించాల్సి ఉంది. రెండో దశ ప్రయోగాలు పట్నా, రోహ్తక్లలో 26 నుంచి ప్రారంభం కానున్నాయి. జైడస్‌కి చెందిన జైకోవిడ్ టీకాని అహ్మదాబాద్‌లో ప్రయోగించి చూస్తున్నారు. -
ఒకే రోజు 49 వేల కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా.. ఎక్స్ ప్రెస్ కంటే వేగంగా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకూ ఒకే రోజులో అత్యధికంగా 49,310 కేసులు నమోదు కావడంతో కేసుల సంఖ్య 12,87,945కి చేరుకుంది. గడచిన 24 గంటల్లో 740 మంది మరణించారని కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. శుక్రవారానికి కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 8,17,208కి చేరుకుంది. దీంతో మొత్తం కోలుకున్న వారి వాతం 63.45కు చేరుకుంది. మరణాల రేటు 2.38కి పడిపోయింది. పరీక్షల సంఖ్య జూలై 20 నాటికి ప్రతి 10 లక్షల మందిలో 10,180 మందికి చేరింది. లేబొరేటరీల సంఖ్య 1290కి పెంచడంతో భారీగా పరీక్షలు పెరిగినట్లు చెప్పింది. ప్రస్తుతం దేశంలో 4,40,135 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది. గత 24 గంటల్లో మరణించిన వారిలో 298 మంది మహారాష్ట్రకు, 97 మంది కర్ణాటకకు, 88 మంది తమిళనాడుకు, 34 పశ్చిమ బెంగాల్ కు, 28 మంది గుజరాత్ కు, 26 మంది ఉత్తరప్రదేశ్ కు, మరో 26 మంది ఢిల్లీకి, 11 మంది రాజస్తాన్ కు, 10 మంది మధ్యప్రదేశ్ కు, 9 మంది జమ్మూ కశ్మీర్‌కు చెందిన వారని తెలిపింది. జూలై 23 వరకూ మొత్తం 1,54,28,170 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. గురువారం 3,52,901 శాంపిళ్లను పరీక్షిస్తున్నట్లు తెలిపింది. అత్యధిక కేసుల్లోనూ, అత్యధిక కరోనా మరణాల్లోనూ మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. కోల్ కతాకు విమానాల్లేవు.. లాక్డౌన్ అమలవుతుండటంతో కోల్‌కతా విమానాశ్రయంలో జూలై 25 నుంచి 29 వరకూ విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ప్రకటన చేసే అవకాశం ఉందని తెలిపారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం వారానికి రెండు సార్లు పూర్తి స్థాయి లాక్ డౌన్ విధిస్తోంది. ఢిల్లీ ఎయిమ్స్‌లో ‘కోవాగ్జిన్’ తొలి డోసు భారత్ బయోటెక్ సంస్థ ఐసీఎంఆర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ భాగస్వామ్యంతో కలిసి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ ‘కోవాగ్జిన్’ తొలి దశ మానవ ప్రయోగాలు ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలో(ఎయిమ్స్) శుక్రవారం ప్రారంభమయ్యా యి. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తికి ఈ వ్యాక్సిన్ తొలి డోసు ఇచ్చారు. ఎయిమ్స్‌లో ఈ ప్రయోగం కోసం ఇప్పటికే 3,500 మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. కోవాగ్జిన్ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ కోసం ఐసీఎంఆర్ దేశవ్యాప్తంగా 12 ఆసుపత్రులను ఎంపి క చేసింది. ఈ ప్రయోగాన్ని రెండు దశల్లో నిర్వహిస్తారు. కోవాగ్జిన్‌లో మూడు రకాల ఫార్ములేషన్స్ ఉన్నాయి. మొదట 50 మం దిపై తక్కువ తీవ్రత కలిగిన వ్యాక్సిన్ ప్రయోగిస్తారు. వారిలో ఎలాంటి ప్రతికూల ప్రభావాలు లేకపోతే మరో 50 మందికి కొంత ఎక్కువ తీవ్రత కలిగిన వ్యాక్సిన్ ఇస్తారు. -
జైట్లీ అస్తమయం
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ అగ్రనేత, స్వతంత్ర భారతంలో అతిపెద్ద పన్ను సంస్కరణకు ఆద్యుడు అరుణ్ జైట్లీ (66) ఇకలేరు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. చికిత్స పొందుతూ ఢిల్లీలోని ఏయిమ్స్‌లో శనివారం మధ్యాహ్నం 12.07 గంటలకు కన్నుమూశారు. బీజేపీ అగ్రనేతగా.. కష్టకాలంలో బీజేపీని అదుకున్న మూలస్తంభాల్లో ఒకరిగా అభిమానుల గుండెల్లో ఆయన స్థానం చెరగనిది. సుష్మాస్వరాజ్ వంటి మహానేత హఠాన్మరణాన్ని (ఆగస్టు 6న) మరవక ముందే.. అదేతరానికి చెందిన జైట్లీ వంటి మరో రాజకీయ ప్రముఖుడిని కోల్పోవడం దేశానికి మరీ ముఖ్యంగా బీజేపీకి పెద్దలోటు. ఆగస్టు 9న శ్వాస ఇబ్బందులతో ఆయన్ను ఆసుపత్రిలో చేర్చగా అప్పటి నుంచి వెంటిలేటర్‌పై చికిత్సపొందుతూ.. శనివారం తుదిశ్వాస విడిచారని ఏయిమ్స్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. అరుణ్ జైట్లీ మృతి బీజేపీకి తీరని శోకాన్ని మిగిల్చింది. జైట్లీ మృతిపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ ప్రముఖులు, బీజేపీయేతర పార్టీల నేతలు, తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ రాజకీయాలకు ఆయన లోటు పూడ్చలేనిదన్నారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో జైట్లీ భౌతికకాయానికి అంత్యక్రియలు జరుగుతాయి. పార్టీలకతీతంగా అభిమానం పొంది.. రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ రాజకీయ పక్షాల మధ్య ఏకాభిప్రాయ సాధనలో జైట్లీ చొరవను ప్రశంసించకుండా ఉండలేం. స్వతంత్ర భారతంలో అతిపెద్ద పన్ను సంస్కరణ అయిన జీఎస్టీ విషయంలో అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూనే ఏకాభిప్రాయంతో అద్భుతమైన చట్టానికి రూపకల్పన చేశారు. నరేంద్ర మోదీ తొలి ఐదేళ్ల ప్రభుత్వంలో జైట్లీది క్రియాశీలక పాత్ర. కీలక వ్యూహకర్తగా ఆయన వ్యవహరించిన తీరు అందరికీ గుర్తే. ఆర్థిక శాఖతోపాటు రక్షణ, కార్పొరేట్ వ్యవహారాలు, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వంటి కీలక బాధ్యతలను ఆయన సమర్థంగా నిర్వర్తించారు. ఏబీవీపీతో రాజకీయ ప్రస్థానం మొదలై.. బీజేపీలో ఉన్నతస్థానానికి చేరినా.. కరడుగట్టిన హిందుత్వ రాజకీయాల జోలికి ఆయనెప్పుడూ వెళ్లలేదు. అందుకే పార్టీలకు అతీతంగా ఆయనంటే ఎనలేని గౌరవాభిమానాలు ఉన్నాయి. నరేంద్ర మోదీ బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఆమోదం పొందడం, ఆ తర్వాత ప్రభుత్వం సమర్థవంతంగా నడవడం వెనక కూడా జైట్లీ కృషి చాలా ఉంది. రాజకీయాల్లో ఉంటూ.. న్యాయవాదిగా పలు ముఖ్యమైన కేసుల్లో తనముద్ర వేశారు. ప్రముఖ కంపెనీలకు న్యాయవాదిగా, న్యాయ సలహాదారుగా ఆయన పనిచేశారు. బీజేపీలో ఆయనో ట్రబుల్ షూటర్‌గా పేరు సంపాదించారు. విషాదంలో బీజేపీ శ్రేణులు... సుష్మాస్వరాజ్ మృతి నుంచి తేరుకోకముందే మరో అగ్రనేత జైట్లీని కోల్పోవడంతో బీజేపీ శ్రేణులు నిర్వేదంలో (విషాదం) మునిగిపోయాయి. జైట్లీ ఇకలేరనే వార్త తెలియగానే కార్యకర్తలు భారీ సంఖ్యలో ఎయిమ్స్ వద్దకు చేరుకున్నారు. భౌతికకాయం జైట్లీ ఇంటికి చేరాక అక్కడికి కూడా భారీగా అభిమానులు చేరుకున్నారు. బీజేపీలో కొత్తతరం నేతలకు స్ఫూర్తిగా నిలిచే జైట్లీ... 2019 ఎన్నికల సమయంలో ఆరోగ్యం సహకరించక బహిరంగ సభలకు వెళ్లకపోయినా.. పార్టీ కార్యాలయం నుంచే ప్రెస్మీట్ల ద్వారా విపక్షాల ఎత్తులను చిత్తు చేస్తూ.. పార్టీ విజయంలో కీలక భూమిక పోషించారు. ప్రభుత్వం, పాలన సమర్థవంతంగా మందుకెళ్లడంలోనూ కీలకంగా వ్యవహరించారు. పార్టీ ట్రబుల్ షూటర్: అడ్వాణీ ‘అందరినీ కలుపుకుని పోయేవాడిగా.. పార్టీలకు అతీతంగా జైట్లీ అందరి మదిలో ఉంటారు. జైట్లీ భోజన ప్రియుడు. మంచి రెస్టారెంట్ అనిపిస్తే.. అక్కడోసారి భోజనం చేయండని సూచించేవాడు. ప్రతి దీపావళికి కుటుంబసమేతంగా ఇంటికొచ్చి శుభాకాంక్షలు చెప్పేవాడు’ అని బీజేపీ అగ్రనేత, మాజీ కేంద్ర మంత్రి ఎల్కే అడ్వాణీ గద్గదస్వరంతో జైట్లీతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ, ఇతర విపక్ష నేతలు కూడా జైట్లీ మృతిపై ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. జేడీయూ అధ్యక్షుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, జైట్లీల మధ్య దశాబ్దాలుగా స్నేహం ఉంది. గతేడాది నుంచే అనారోగ్యంతో.. 2014లో ఆయన బరువు తగ్గించుకునేందుకు బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారు. గతేడాది మే 14న ఆయన కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం చాలా వేగంగా క్షీణించింది. దీంతో ఆయన విశ్రాంతి తీసుకునేందుకే ప్రాధాన్యమివ్వాల్సి వచ్చింది. ఈ ఏడాది ఆరంభంలో మృదు కణజాల కేన్సర్‌తో బాధపడుతున్నట్లు వెల్లడైంది. దీంతో 2019 ఎన్నికల్లో పోటీపై విముఖత చూపించటమే కాక... భారీ విజయం సాధించిన తర్వాత కేబినెట్లో తనకు చోటు వద్దని కరాఖండిగా చెప్పేశారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2000 నుంచి ఆయన రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజ్యసభలో పార్టీ పక్షనేతగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రముఖుల నివాళి దక్షిణ ఢిల్లీలోని కైలాశ్ కాలనీలో ఉన్న ఆయన నివాసానికి భౌతికకాయాన్ని తరలించారు. అక్కడే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయుష్ గోయల్, హర్షవర్ధన్, జితేంద్ర సింగ్, ఎస్ జైశంకర్ సహా పలువురు కేంద్ర మంత్రులు తదితరులు జైట్లీ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ నేతలు గులాంనబీ ఆజాద్, అహ్మద్ పటేల్, జ్యోతిరాదిత్య సింధియా, రాజీవ్ శుక్లా కూడా ఆయన నివాసానికి చేరుకుని భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతోపాటు వివిధ పార్టీల రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. మరణవార్త విని బాధపడ్డాను: సీజేఐ ‘దేశం ఓ ఉన్నతమైన సీనియర్ లాయర్, గొప్ప నేతను కోల్పోయింది. ఆయన మరణ వార్త వినగానే బాధపడ్డాను. అతడి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా’ అని అన్నారు. న్యాయవాదిగా ప్రస్థానం జైట్లీది న్యాయవాద కుటుంబం. న్యూఢిల్లీలో డిసెంబర్ 28, 1952లో జన్మించారు. ఆయన తండ్రి ఢిల్లీలో పేరు ప్రఖ్యాతులున్న న్యాయవాది మహరాజ్ కిషన్ జైట్లీ. తల్లి రతన్ ప్రభ సామాజిక కార్యకర్త. చిన్నప్పటి నుంచి చర్చాగోష్టుల్లో పాల్గొనటం అంటే జైట్లీకి చాలా ఇష్టం. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ చేశారు. 1975లో దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించినప్పుడు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ఏబీవీపీ విద్యార్థి నాయకుడిగా పాల్గొని ఆ ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. దాదాపు 19 నెలలు జైల్లో ఉన్నారు కూడా. అప్పట్లో ఏబీవీపీ యువమోర్చా కన్వీనర్ బాధ్యతలు నిర్వహించేవారు. 1977లో ఏబీవీపీ అ«ఖిల భారత కార్యదర్శిగా ఉన్నారు. 1980లో బీజేపీలో చేరారు. పార్టీ తరఫున ఎన్నో కేసులు వాదించారు. బోఫోర్స్ వంటి కుంభకోణాలను వెలికితీయడంలో జైట్లీ పాత్ర కీలకం. కాంగ్రెస్ నేత మాధవరావు సింధియా, జనతాదళ్ నేత శరద్‌యాదవ్ వంటి వారు కూడా జైట్లీ క్లయింట్లే. న్యాయపరమైన అంశాలపై పుస్తకాలు కూడా రాశారాయన. జైట్లీ భార్య సంగీత. ఆయనకు కుమారుడు రోహన్, కుమార్తె సొనాలీ. పిల్లలిద్దరూ న్యాయవాద వృత్తిలోనే ఉన్నారు. జైట్లీ పార్థివ దేహం వద్ద అమిత్ షా నివాళి, జైట్లీ భార్య సంగీతను ఓదారుస్తున్న సోనియా 2001లో వాజ్‌పేయితో.. 2004లో కలకత్తా హైకోర్టులో లాయర్‌గా.. 1974లో ఢిల్లీ వర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా.. -
విషమంగానే జైట్లీ ఆరోగ్యం
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన లైఫ్ సపోర్ట్ సిస్టంపై ఉన్నారు. వివిధ విభాగాలకు చెందిన వైద్యులు ఆయన్ను పర్యవేక్షిస్తున్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ శనివారం జైట్లీని పరామర్శించారు. కాంగ్రెస్‌కు చెందిన అభిషేక్ సింఘ్వీ, జ్యోతిరాదిత్య సింధియా, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ధనోవా ఆసుపత్రికి వచ్చారు. శ్వాసకోస సంబంధిత అనారోగ్యంతో ఈ నెల 9న ఆయన ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఆగస్టు 10 తర్వాత ఆయన ఆరోగ్యం గురించి ఎయిమ్స్ ఎలాంటి బులెటిన్ విడుదల చేయలేదు. ఇప్పటికే రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాన మంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షా జైట్లీని పరామర్శించారు. ఎయిమ్స్ నుంచి వెలువడుతున్న పొగ ఎయిమ్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎయిమ్స్‌లో శనివారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. 34 అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పేందుకు శ్రమించాయి. ప్రమాద సమయంలో ఎయిమ్స్‌లో ఉన్న రోగులు, వారి బంధువులు భయాందోళనకు గురయ్యారు. కొన్ని ఎమర్జెన్సీ సర్వీసులకు విఘాతం కలిగిందని రోగుల బంధువులు అన్నారు. మంటలు చెలరేగిన పై అంతస్తులో ఉన్న కొందరు రోగులను వేరే భవనానికి తరలించారు. టీచింగ్ భవనంలో విద్యుత్ సంబంధిత పనులు జరుతుగున్న మైక్రోబయాలజీలోని వైరాలజీ యూనిట్లో మంటలు ప్రారంభం అయినట్లు అధికారులు గుర్తించారు. -
అమ్మ మనసు చాటుకున్న ప్రియాంక
అలహాబాద్ : కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ అమ్మ మనసును చాటుకున్నారు. సార్వత్రిక ఎన్నికల పోరులో ప్రధాన ప్రత్యర్థి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పార్టీ తరపును గట్టి కౌంటర్లు ఇస్తూ.. రాజకీయ విశ్లేషకుల ప్రశంసలందుకుంటున్న ప్రియాంక తాజాగా కాంగ్రెస్ కార్యకర్తల మనసును దోచుకోవడంలో మరో మెట్టు పైకి ఎదిగారు. యూపీలోని ఒక చిన్నారికి అందాల్సిన వైద్యం పట్ల చురుకుగా స్పందించిన వైనం కాంగ్రెస్ శ్రేణులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తీవ్ర అనారోగ్యంతో (ట్యూమర్) బాధపడుతున్న తమ పాప వైద్య ఖర్చులను భరించే స్తోమత తమకు లేదని ఆదుకోవాలంటూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక పేద తల్లిందండ్రులు ప్రియాంకను ఆశ్రయించారు. దీనికి వెంటనే స్పందించిన ఆమె సీనియర్ పార్టీ నాయకుడు రాజీవ్ శుక్లా, హార్ధిక్ పటేల్, మహ్మద్ అజారుద్దీన్లను సంప్రదించారు. మెరుగైన వైద్యం కోసం పాపను ఢిల్లీకి తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో వారు ఆరు సీట్లు చార్టర్ విమానంలో మైనర్ బాలికతోపాటు ఆమె తల్లిదండ్రులను హుటాహుటిన ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు తరలించారు. పాపకు అందించే వైద్య సేవలను తాను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తానని ప్రియాంక చెప్పారని స్థానిక కాంగ్రెస్ నేత జితేంద్ర తివారి తెలిపారు. -
గోవాకు తిరిగొచ్చిన పరీకర్
పనజి: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ ఆదివారం మధ్యాహ్నం స్వరాష్ట్రానికి తిరిగొచ్చారు. ఆరోగ్యం కుదుటపడటంతో ఆయన ఆదివారం ఉదయం ఢిల్లీ ఎయిమ్స్ నుంచి డిశ్చార్జి అయ్యారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గోవా చేరిన పరీకర్.. అక్కడ నుంచి అంబులెన్స్‌లో డోనా పౌలాలో ఉన్న నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు గోవా మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్ల బృందాన్ని ఏర్పాటు చేశారు. పరీకర్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయనకు మరికొన్ని రోజులు విశ్రాంతి అవసరం అని కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ విలేకరులకు తెలిపారు. గోవా అసెంబ్లీ రద్దు వార్తలను ఆయన ఖండించారు. ఫిబ్రవరిలో అనారోగ్యానికి గురైన పరీకర్ గోవా, ముంబై, అమెరికాలో చికిత్స పొందారు. చివరికి సెప్టెంబర్ 15న ఎయిమ్స్‌లో చేరారు. -
జైట్లీకి కిడ్నీ మార్పిడి
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ(65)కి సోమవారం నిర్వహించిన మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైంది. ప్రస్తుతం జైట్లీతోపాటు ఆయనకు కిడ్నీ దానం చేసిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉందని ఢిల్లీలోని ఎయిమ్స్ (ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) వైద్య బృందం తెలిపింది. సోమవారం ఉదయం 8.30 గంటలకు మొదలైన శస్త్రచికిత్స నాలుగున్నర గంటలపాటు సాగింది. అనంతరం ఆయనను ఐసీయూకి తరలించి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వైద్యులు తెలిపారు. 20 మంది వైద్యులతో కూడిన బృందం జైట్లీకి శస్త్రచికిత్స నిర్వహించింది. జైట్లీ దూరపు బంధువు, మధ్య వయస్కురాలైన ఓ మహిళ తన మూత్రపిండాన్ని దానమిచ్చేందుకు ముందుకు రావడంతో సోమవారం కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను నిర్వహించారు. అంతకు కొద్దిసేపటి ముందు ప్రధాన మంత్రి మోదీ జైట్లీతో మాట్లాడారు. -
కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న అరుణ్ జైట్లీ
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. వైద్యులు త్వరలో జైట్లీకి శస్త్రచికిత్స నిర్వహించనున్నారు. పలు పరీక్షలు నిర్వహించిన వైద్యులు జైట్లీ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని వెల్లడించారని మంత్రి సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉండేందుకు మంత్రి జైట్లీని బహిరంగ ప్రదేశాలకు వెళ్లవద్దని వైద్యులు సూచించారు. కాగా, సోమవారం నుంచి ఆయన కార్యాలయానికి రావడం లేదు. యూపీ నుంచి మరోసారి రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన క్రమంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికీ హాజరు కాలేదు. 2014లో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన అనంతరం జైట్లీ బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోవడం వల్ల ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నది. డయాబెటిక్‌తో బాధపడుతున్న జైట్లీ బరువు తగ్గించుకునేందుకు బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారు. తొలుత మ్యాక్స్ ఆస్పత్రిలో ఈ సర్జరీ జరగ్గా, కొన్ని సమస్యలు తలెత్తడంతో ఎయిమ్స్‌లో చికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం జైట్లీని ఆయన నివాసంలో ఎయిమ్స్ వైద్యులు పరీక్షిస్తున్నారు. కిడ్నీ మార్పిడి అవసరమా, లేదా అనేది ఇంకా నిర్ధారించలేదని సమాచారం. వైద్యుల సూచన మేరకు ఎయిమ్స్‌లోని కార్డియో-న్యూరో టవర్‌లో జైట్లీని అడ్మిట్ చేస్తారని భావిస్తున్నారు. -
హనీ.. సింగ్.. ఓ కథ..
- తలలంటుకుని జన్మించిన చిన్నారులు - ఆర్థిక ఇబ్బందుల్లో కుటుంబం - శస్త్ర చికిత్సకు ఢిల్లీ ఎయిమ్స్‌లో ఏర్పాట్లు - చేయూతనందించిన రైల్వే శాఖ సాక్షి, భువనేశ్వర్: తెలుగునాట తలలంటుకుని జన్మించిన వీణావాణిలను మరిచిపోకముందే.. ఒడిశాలోని కంధమాల్ జిల్లా ఫిరంగియా గ్రామంలోనూ వీరిలానే ఇద్దరు చిన్నారులు తలలంటుకుని నరకయాతన అనుభవిస్తున్నారు. వారే రెండున్నరేళ్ల హానీ, సింగ్. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు తమ బిడ్డల బాధలు చూడలేక తల్లిదండ్రులు విలవిల్లాడుతున్నారు. ఒకేసారి జన్మించిన సోదరులు విధి వైచిత్రితో ఇంతవరకు ఒకరి ముఖం ఒకరు చూడలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అందరి సాయంతో చిన్నారుల దయనీయ పరిస్థితి అందరి హృదయాల్ని కలిచివేసింది. చికిత్స కోసం తల్లిదండ్రులు కటక్‌లోని ఎస్సీబీ మెడికల్ కళాశాల ఆస్పత్రి వైద్యుల్ని సంప్రదించారు. అయితే చిన్నారులకు చికిత్స అందించడానికి స్థానికంగా వైద్య సదుపాయాలు అందుబాటులో లేవు. దీంతో కళాశాల సలహా మేరకు చిన్నారులతో కలసి ఢిల్లీలోని ఎయిమ్స్‌కు బయలుదేరారు. వీరితోపాటు నువాపడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ఆయుష్ వైద్యుడు, జాతీయ బాలల ఆరోగ్య కార్యక్రమం విభాగం నుంచి మరో అధికారి కూడా ఉన్నారు. కంధమాల్ కలెక్టర్ స్వయంగా ఎయిమ్స్ డీఎంఈటీ డైరెక్టర్ డాక్టర్ అశోక్ మహాపాత్రోతో ఫోన్లో మాట్లాడారు. ఎయిమ్స్ న్యూరోవిభాగం వీరికి శస్త్రచికిత్స నిర్వహిస్తుంది. ఎయిమ్స్‌లో చికిత్స విజయవంతమై అన్నదమ్ములిద్దరూ ఆడుతూపా డుతూ ఉండాలని అందరూ నిరీక్షిస్తున్నారు. అయితే వీరికి శస్త్రచికిత్స నిర్వహించే తేదీని ఎయిమ్స్ ఇంకా ఖరారు చేయలేదు. మరోవైపు రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో న్యూఢిల్లీ బయల్దేరిన హానీ, సింగ్‌లకు దారిపొడవునా ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. టాటా నగర్ రైల్వే స్టేషన్లో ప్రత్యేక వైద్య నిపుణుల బృందం చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించింది. -
నేడు మంగళగిరికి కేంద్ర బృందం
నిర్మాణంలో ఉన్న ఎయిమ్స్‌ను పరిశీలించనున్న సభ్యులు సాక్షి, హైదరాబాద్: మంగళగిరిలో నిర్మాణం చేపట్టిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్)ను పరిశీలించేందుకు ఆరుగురు సభ్యుల ఉన్నతస్థాయి బృందం నేడు అమరావతికి రానుంది. రాయ్‌పూర్, న్యూఢిల్లీ ఎయిమ్స్ సభ్యులతోపాటు పీఎంఎస్ఎస్వై, పీజీఐ ఛండీగఢ్ సభ్యులు కూడా రానున్నారు. వీరితోపాటు వైద్య విద్యా సంచాలకుల కార్యాలయానికి చెందిన ఒకరు ఇందులో ఉంటారు. ఈనెల 5, 6 తేదీల్లో అమరావతిలో నిర్మాణ దశలో ఉన్న ఎయిమ్స్‌ను పరిశీలిస్తారు. ఎయిమ్స్‌ను వీలైనంత త్వరగా అమల్లోకి తెచ్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్చించనున్నారు. ఇప్పటికే ఎయిమ్స్‌కు అనుమతులు వచ్చి రెండేళ్లు పూర్తయింది. ఇప్పటివరకూ ప్రహరీ గోడ, హైటెన్షన్ కరెంటు లైన్ల ఏర్పాటు కూడా పూర్తికాలేదు. భవన నిర్మాణాలన్నీ పూర్తయ్యేవరకూ వేచిచూస్తే మరో నాలుగేళ్లు పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పూర్తయిన భవనాల నిర్మాణాలను పరిశీలించి అనుకూలంగా వాటిని ఉపయోగించుకుని కొన్ని విభాగాలనైనా అమల్లోకి తెస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు. దీనికి సంబంధించి గుంటూరు, తెనాలి, మంగళగిరిలో అనుకూల భవనాలను పరిశీలిస్తారు. బృందంలో రాయ్‌పూర్ ఎయిమ్స్ డెరైక్టర్ డా.నితిన్ ఎం నాగార్కర్, ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు డీకే శర్మలు ఉంటారు. వైద్య కళాశాలకు సంబంధించిన సీనియర్ రెసిడెంట్లకు కావాల్సిన భవనాలు, హాస్టల్ గదులు, వైద్య సిబ్బందికి నివాసం ఉండటానికి కావాల్సిన భవనాలు అద్దెకు తీసుకుంటామని కేంద్రానికి రాష్ట్రం ఇప్పటికే లేఖ రాసింది.