ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కేసుని విచారిస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఐపీసీలో సెక్షన్ 302ని (హత్య) చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలోని ఎయిమ్స్ సీబీఐకి సమర్పించిన నివేదికలో సుశాంత్‌పై విష ప్రయోగం జరగలేదని చెప్పినప్పటికీ, ఆయనది ఆత్మహత్యా, హత్యా అన్నది తాము నిర్ధారించలేమని పేర్కొంది. సుశాంత్‌ని విష ప్రయోగం ద్వారా కాకుండా మరో రకంగా హత్య చేసి ఉండే అవకాశాలను కొట్టి పారేయలేమని పేర్కొంది.
ఊపిరాడకే సుశాంత్ మరణించారని అందువల్ల అది కచ్చితంగా ఆత్మహత్య అని నిర్ధారించలేమని కూడా ఎయిమ్స్ వైద్యుడు ఒకరు చెప్పినట్టుగా ప్రచారంలో ఉంది. దీంతో సందేహాలను నివృత్తి చేసుకోవడానికి సెక్షన్ 302ని చేర్చాలని యోచిస్తున్నట్టుగా సీబీఐ వర్గాలు గురువారం వెల్లడించాయి. సుశాంత్ సింగ్ మృతి కేసులో భవిష్యత్ విచారణపై సీబీఐ త్వరలోనే ఒక కార్యాచరణ రూపొందించనుంది. జూన్ 14 ఉదయం సుశాంత్ సింగ్ శవమై కనిపించిన రోజు ఆయన అపార్ట్‌మెంట్‌లో ఉన్న దీపేష్ సావంత్ , సిద్ధార్థ్ పితాని ఇతర సిబ్బందిని మరోసారి విచారించడానికి సిద్ధమవుతోంది. ఈ కేసులో పితాని, సుశాంత్ కుక్ నీరజ్ కూడా సాక్షులుగా మారే అవకాశాలున్నాయి.
13 రాత్రి సుశాంత్, రియా కలుసుకున్నారా?
సుశాంత్ మృతి చెందడానికి ముందు రోజు రాత్రి జూన్ 13న సుశాంత్, నటి రియా చక్రవర్తిని కలుసుకున్నారని ముంబైకి చెందిన బీజేపీ స్థానిక నాయకుడు వివేకానంద గుప్తా చెబుతున్నారు. వాళ్లిద్దరూ తెల్లవారు జామున 3 గంటల వరకు కలిసే ఉన్నారని, ఆ తర్వాత సుశాంత్ రియాను ఆమె ఇంటి వద్ద డ్రాప్ చేశారని తనకి కొంత మంది ప్రత్యక్ష సాక్షులు చెప్పారని వెల్లడించారు. ఈ విషయాన్ని సీబీఐ అధికారుల వద్ద చెబుతానని వివేకానంద తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment