ముంబై : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) బాలీవుడ్‌లో డ్రగ్స్ కోణంపై సాగుతున్న విచారణ కీలక మలుపు తిరిగింది. అందరూ ఊహిస్తున్నట్టుగానే నటీమణులు దీపికా పదుకొనె, శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్‌లకు ఎన్‌సీబీ సమన్లు పంపింది. బాలీవుడ్‌లో డ్రగ్స్ వినియోగంపై మరింత దృష్టి సారించిన ఎన్‌సీబీ ‘‘ఏ’’లిస్ట్‌లో ఉన్న ప్రముఖుల్ని తొలుత విచారించడానికి నిర్ణయించినట్టుగా ఎన్‌సీబీ అధికారి ఒకరు బుధవారం వెల్లడించారు.
ఈ నెల 25 శుక్రవారం దీపికని విచారణకు హాజరు కావాలని ఎన్‌సీబీ ఆదేశించింది. ఇక రకుల్ ప్రీత్ సింగ్, సుశాంత్ ట్యాలెంట్ మేనేజర్ శ్రుతి మోదీ, డిజైనర్ సైమన్ ఖంబటాలను ఎన్‌సీబీ కార్యాలయానికి గురువారమే రావాల్సిందిగా చెప్పినట్టుగా ఆ అధికారి వెల్లడించారు. హీరోయిన్లు శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్‌లను 26వ తేదీ శనివారం ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన రియా చక్రవర్తి ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్‌లను విచారించనున్నట్టు ఎన్‌సీబీ అధికారులు తెలిపారు.
గోవా షూటింగ్‌లో దీపిక
ప్రస్తుతం గోవా షూటింగ్‌లో ఉన్న దీపిక పదుకొనె 12 మంది సభ్యులున్న తన న్యాయ బృందంతో చర్చలు జరిపారు. ఈ కేసుని ఎలా ఎదుర్కోవాలో న్యాయవాదులతో చర్చించినట్టుగా తెలుస్తోంది. ఈ చర్చల్లో దీపిక భర్త రణవీర్ సింగ్ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైనట్టు సమాచారం. నోటీసుల నేపథ్యంలో రాత్రికి దీపిక గోవా నుంచి ముంబై వచ్చారు. దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాశ్ వాట్సాప్ గ్రూప్ చాట్లలో హీరోయిన్ పేరులో ఇంగ్లిష్ అక్షరాలతో జరిగిన సంభాషణలు వెలుగులోకి వచ్చాయి.
అందులో డి అంటే దీపిక, ఎస్ అంటే శ్రద్ధ అని భావించిన విషయం తెలిసిందే. ఇక కరిష్మా ప్రకాశ్‌కు కూడా ఇప్పటికే సమన్లు పంపినప్పటికీ ఆమె అనారోగ్య కారణాలతో ఎన్‌సీబీ ఎదుట హాజరు కాలేదు. దీంతో శుక్రవారం వరకు ఆమెకు మినహాయింపునిచ్చారు. దీపికతో పాటు కరిష్మా కూడా ఎన్‌సీబీ విచారణలో పాల్గొనే అవకాశం ఉంది. బాలీవుడ్ డ్రగ్స్ వినియోగంలో హీరోల పాత్రపై కూడా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు కన్నేశారు. రియా చక్రవర్తి, జయ సాహా ఇచ్చిన సమాచారం ఆధారంగా అగ్ర హీరోలపై కూడా ఓ కన్నేసి ఉంచినట్టు ఎన్‌సీబీ వర్గాలు వెల్లడించాయి.
కీలక సమాచారమిచ్చిన జయ!
గత మూడు రోజులుగా జయ సాహాను ప్రశ్నిస్తున్న అధికారులు పలు విషయాలను రాబట్టారు. అత్యంత కీలకమైన సమాచారాన్ని జయ సాహా బయటపెట్టినట్టు ఎన్‌సీబీ అధికారులు వెల్లడించారు. సుశాంత్‌తో పాటు నటి శ్రద్ధా కపూర్, రియా చక్రవర్తి, మధు, తాను డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఆమె ఎన్‌సీబీ విచారణలో అంగీకరించినట్టుగా జాతీయ మీడియా వెల్లడించింది. సీబీడీ ఆయిల్ అనే నిషేధిత డ్రగ్స్‌ని వారు సేవించినట్టుగా తెలుస్తోంది. మాదక ద్రవ్యాల చీకటి కోణంపై 2016లో వచ్చిన బాలీవుడ్ సినిమా ఉడ్తా పంజాబ్ సహ నిర్మాత అయిన మధు మాంతెనాను బుధవారం ఎన్‌సీబీ విచారణకు హాజరయ్యారు. జయ సాహా తన విచారణలో మధు పేరుని బయట పెట్టడంతో ఆయనను డగ్స్ర్ వినియోగంపై గుచ్చి గుచ్చి ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment