ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో బాలీవుడ్–డ్రగ్స్ సంబంధాలపై నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు విచారణలో భాగంగా ఎన్‌సీబీ శనివారం హీరోయిన్లు దీపికా పదుకొణె, సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్‌లను సుదీర్ఘంగా వేర్వేరుగా ప్రశ్నించింది. ఇదే కేసులో శుక్రవారం విచారించిన ధర్మా ప్రొడక్షన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ క్షితిజ్ రవి ప్రసాద్‌ను అరెస్టు చేసింది. దక్షిణ ముంబైలోని కొలాబాలో ఉన్న ఎన్‌సీబీ గెస్ట్‌హౌస్‌కు శనివారం ఉదయం 9.50 గంటల ప్రాంతంలో చేరుకున్న దీపికా పదుకొణె మధ్యాహ్నం 3.50 గంటల ప్రాంతంలో తిరిగి వెళ్లిపోయారు.
దీపికను, ఆమె మేనేజర్ కరిష్మా ప్రకాశ్‌ను కలిపి విచారించినట్లు సమాచారం. కరిష్మా డ్రగ్స్ గురించి జరిపిన వాట్సాప్ చాట్‌లో ‘డి’అనే అక్షరం ఎవరిని ఉద్దేశించిందనే కోణంలో అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కరిష్మాను దాదాపు 7 గంటల పాటు ప్రశ్నించినట్లు ఎన్‌సీబీ వర్గాలు తెలిపాయి. విచారణ అనంతరం వీరిరువురూ పది నిమిషాల వ్యవధిలోనే వేర్వేరు కార్లలో వెళ్లిపోయారు. వీరి విచారణ సమయంలో ఎన్‌సీబీ కార్యాలయం బయట పెద్ద సంఖ్యలో మీడియా సిబ్బంది గుమికూడారు.
దక్షిణ ముంబైలో..బల్లార్డ్ ఎస్టేట్‌లో ఉన్న ఎన్సీబీ జోనల్ కార్యాలయంలో శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్‌లను శనివారం సాయంత్రం ఎన్సీబీ అధికారులు ప్రశ్నించారు. ఎన్సీబీ కార్యాలయానికి మధ్యాహ్నం 12గంటలకు శ్రద్ధాకపూర్ చేరుకోగా ఒక గంట తర్వాత సారా అలీఖాన్ వచ్చారు. వీరిద్దరినీ అధికారులు వేర్వేరుగా ప్రశ్నించారు. దాదాపు నాలుగున్నర గంటల అనంతరం సాయంత్రం 5.30 గంటలకు సారా, 6 గంటల ప్రాంతంలో శ్రద్ధాకపూర్ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. ఇలా ఉండగా, డ్రగ్స్ కేసులో శుక్రవారం ప్రశ్నించిన నిర్మాత క్షితిజ్ రవి ప్రసాద్‌ను శనివారం ఎన్‌సీబీ అధికారులు అరెస్టు చేశారు. వెర్సోవాలో ఉన్న ఆయన నివాసం నుంచి తీసుకెళ్లి, రోజంతా ప్రశ్నించినట్లు సమాచారం. తాజా అరెస్టుతో డ్రగ్స్ కేసుల్లో అరెస్టయిన వారి సంఖ్య 18కి చేరుకుంది.
మీడియాకు పోలీసుల వార్నింగ్
డ్రగ్స్ కేసులో ఎన్‌సీబీ విచారణకు హాజరై తిరిగి వెళ్లే సినీ ప్రముఖుల వాహనాలను వెంబడించి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని డిప్యూటీ కమిషనర్ సంగ్రామ్‌సింగ్ మీడియా సిబ్బందికి విజ్ఞప్తి చేశారు. రోడ్డుపై వెళ్లే వారిని ప్రమాదంలోకి నెట్టవద్దని కోరారు. ఎవరైనా వెంబడిస్తున్నట్లు తేలితే ఆ వాహనాలను సీజ్ చేయడంతోపాటు సంబంధిత డ్రైవర్‌పై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం శ్రద్ధా కపూర్, దీపికా పదుకొణె ఎలాగోలా మీడియా కంటబడకుండా తప్పించుకోగా, మీడియా సిబ్బంది సారా అలీఖాన్ ప్రయాణిస్తున్న వాహనాన్ని వెంబడిస్తూ వచ్చారు. ఎన్‌సీబీ కార్యాలయం నుంచి తిరిగి వెళ్లే సమయంలో దీపిక పదుకొణె ప్రయాణిస్తున్న వాహనాన్ని మీడియా వెంబడించింది. అనంతరం పోలీసుల హెచ్చరికల ఫలితంగా శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్ విచారణ అనంతరం తిరిగి వెళ్లే సమయంలో ‘ఛేజింగ్’ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
శాండల్‌వుడ్ కేసులో టీవీ యాంకర్..
మంగళూరు: శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో టీవీ యాంకర్ అనుశ్రీని శనివారం బెంగళూరు క్రైమ్ బ్రాంచి పోలీసులు ప్రశ్నించారు. స్నేహితుడు తరుణ్ రాజ్‌తోపాటు అనుశ్రీ పార్టీలకు హాజరైందంటూ ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన డ్యాన్సర్–కొరియోగ్రాఫర్ కిశోర్ అమన్ శెట్టి వెల్లడించడంతో పోలీసులు అనుశ్రీకి సమన్లు జారీ చేశారు. తరుణ్ డ్రగ్స్ వాడకంతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినట్లు సమాచారం.
విచారణలో వీరేమన్నారు
ఈ సుదీర్ఘ విచారణలో అధికారులు ముగ్గురి స్టేట్‌మెంట్లను రికార్డు చేశారు. ఈ సందర్భంగా దీపిక.. 2017లో తన మేనేజర్ కరిష్మాతో డ్రగ్స్ గురించి చాటింగ్ చేసినట్లు అంగీకరించారు. అయితే, డ్రగ్స్ తీసుకున్నదా లేదా అనేది వెల్లడికాలేదని సమాచారం. ఎన్‌సీబీ విచారణను ఎదుర్కొన్న సారా, శ్రద్ధా తమకు డ్రగ్స్ అలవాటు లేదని తెలిపారు. వీరి ఫోన్‌లను అధికారులు సీజ్‌చేశారు.
Comments
Please login to add a commentAdd a comment