Sarah Ali Khan
-
నర్స్ నం.1
తాజా చిత్రం ‘కూలీ నెం.1’ కోసం కూలీగా మారారు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్. ఈ సినిమాలో హీరోయిన్ సారా అలీఖాన్‌ను ప్రేమలో పడేయడానికి చాలా వేషాలే వేశారట. అందులో నర్స్ వేషం ఒకటి. సినిమాలో కొద్దిసేపు ఈ నర్స్ గెటప్‌లో కనిపిస్తారు వరుణ్. ఈ సీన్స్ చిత్రీకరించే ముందు వరుణ్ నర్స్ గెటప్ మేకప్ చేసుకుంటున్న వీడియోను ఇన్‌స్టాగ్రా మ్లో పంచుకున్నారు సారా. ‘హాటెస్ట్ నర్స్ వరుణ్’ అని క్యాప్షన్ చేశారామె. వరుణ్ ధావన్ తండ్రి డేవిడ్ ధావన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ నెల 25న అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదల కానుంది. -
భలే అనుభవం
తమిళ నటుడు ధనుష్ మల్టీ టాలెంటెడ్ అని అందరికీ తెలిసిందే. హీరోగా బిజీగా ఉంటూనే అప్పుడప్పుడూ పాటలు రాస్తుంటారు, పాడుతుంటారు కూడా. ‘3, కొడి, మారి, మారీ 2, పటాస్, తిక్క’ సినిమాల్లో పాటలు పాడారాయన. అయితే ఇప్పుడు తొలిసారి రెహమాన్ సంగీతంలో పాడారు ధనుష్. అది కూడా హిందీ సినిమాకి. ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో ధనుష్ ఓ హిందీ సినిమా చేస్తున్నారు. ‘అత్రంగీ రే’ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్, సారా అలీఖాన్, ధనుష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో ఓ పాటను ధనుష్ పాడారు. ఆ పాటకు సంబంధించిన రికార్డింగ్ ఇటీవలే పూర్తయింది. ‘‘రెహమాన్ సార్ మ్యూజిక్‌లో పాడటం ఓ అద్భుతమైన అనుభవం. ఈ జ్ఞాపకం ఎప్పటికీ మిగిలిపోతుంది’’ అన్నారు ధనుష్. -
నలుగురిదీ ఒక్కటే మాట..
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో డ్రగ్స్ కోణంలో జరుపుతున్న విచారణలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) చేతికి కీలక విషయాలు లభ్యమైనట్లు సమాచారం. ఈ కేసు విచారణ సందర్భంగా హీరోయిన్లు దీపికా పదుకొణె, శ్రద్ధాకపూర్, రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్‌లు ఎన్సీబీకి చెప్పిన విషయాలు దాదాపు ఒకేలా ఉన్నాయని తెలుస్తోంది. ‘హ్యాష్’ మత్తు పదార్థం కాదనే విషయాన్నే వీరు నలుగురూ చెప్పినట్లు సమాచారం. అయితే, ఇదే విషయం వీరిని మరిన్ని చిక్కుల్లోకి నెట్టే అవకాశాలున్నాయని కూడా భావిస్తున్నారు. దీంతోపాటు, వీరు కీలక సమాచారాన్ని ఎన్సీబీ అధికారుల ఎదుట బయటపెట్టినట్లుగా సమాచారం. దీని ఆధారంగా ఈ హీరోయిన్లను మరోసారి ప్రశ్నించేందుకు ఎన్సీబీ సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాలంటున్నాయి. ఇప్పటి వరకు జరిపిన విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలపై ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా, సమీర్ వాంఖడే, అశోక్ జైన్ రూపొందించిన సమగ్ర నివేదికపై ఆదివారం రాత్రి ఎన్సీబీ డైరెక్టర్ జనరల్ ఆస్తానా నేతృత్వంలో సమావేశం జరిగింది. ముంబైలో విస్తరించిన డ్రగ్ మాఫియా మూలాలను వెలికితీసి, చార్జిషీటు వేసేందుకు దాదాపు ఆరు నెలల సమయం పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరిపేందుకు కూడా ఆస్తానా పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. 20 మంది బడా డ్రగ్ సరఫరాదారులపై ఎన్సీబీ కన్నువేసినట్లు సమాచారం. కోర్టులో కరణ్ పేరు సుశాంత్ సింగ్ మృతి, బాలీవుడ్– డ్రగ్స్ సంబంధాల కేసుల్లో దర్శకుడు కరణ్ జోహార్ పేరును ప్రస్తావించారు రియా చక్రవర్తి– క్షితిజ్ రవి ప్రసాద్ తరఫు లాయర్ సతీశ్ మనేషిండే. ఈ కేసులో కరణ్ పేరును ప్రస్తావిస్తూ వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా క్షితిజ్‌ను అధికారులు బెదిరింపులు, వేధింపులకు గురి చేశారని కోర్టుకు తెలిపారు. ముంబైలోని కోర్టు క్షితిజ్‌కు ఆదివారం రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన వాదనల్లో మనేషిండే..విచారణ సమయంలో అధికారులు క్షితిజ్‌పై థర్డ్‌డిగ్రీ ప్రయోగించారనీ, కరణ్ జోహార్ పేరు కూడా వాంగ్మూలంలో చెప్పాలంటూ ఒత్తిడి చేశారని అన్నారు. ఆ పేరు చెబితే వదిలిపెడతామంటూ ఆశ చూపారన్నారు. క్షితిజ్ ఇంట్లో సోదాల సమయంలో సిగరెట్ పీక మాత్రమే అధికారులకు దొరికినా అది గంజాయి అంటూ ఆరోపించారని తెలిపారు. 2019లో కరణ్ జోహార్ ఇంట్లో జరిగిన పార్టీలో పాల్గొన్న పలువురు బాలీవుడ్ నటులు డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. దీనిపై ముంబైకి వస్తున్న కరణ్‌ను గోవా ఎయిర్‌పోర్టులో మీడియా ప్రశ్నించగా ఆయన మాట్లాడలేదు. తనకు డ్రగ్స్ అలవాలు లేదనీ ఆయన గతంలోనే వ్యాఖ్యానించడం తెల్సిందే. -
ఆ ముగ్గురినీ ప్రశ్నించిన ఎన్సీబీ
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో బాలీవుడ్–డ్రగ్స్ సంబంధాలపై నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు విచారణలో భాగంగా ఎన్సీబీ శనివారం హీరోయిన్లు దీపికా పదుకొణె, సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్‌లను సుదీర్ఘంగా వేర్వేరుగా ప్రశ్నించింది. ఇదే కేసులో శుక్రవారం విచారించిన ధర్మా ప్రొడక్షన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ క్షితిజ్ రవి ప్రసాద్‌ను అరెస్టు చేసింది. దక్షిణ ముంబైలోని కొలాబాలో ఉన్న ఎన్సీబీ గెస్ట్‌హౌస్‌కు శనివారం ఉదయం 9.50 గంటల ప్రాంతంలో చేరుకున్న దీపికా పదుకొణె మధ్యాహ్నం 3.50 గంటల ప్రాంతంలో తిరిగి వెళ్లిపోయారు. దీపికను, ఆమె మేనేజర్ కరిష్మా ప్రకాశ్‌ను కలిపి విచారించినట్లు సమాచారం. కరిష్మా డ్రగ్స్ గురించి జరిపిన వాట్సాప్ చాట్‌లో ‘డి’అనే అక్షరం ఎవరిని ఉద్దేశించిందనే కోణంలో అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కరిష్మాను దాదాపు 7 గంటల పాటు ప్రశ్నించినట్లు ఎన్సీబీ వర్గాలు తెలిపాయి. విచారణ అనంతరం వీరిరువురూ పది నిమిషాల వ్యవధిలోనే వేర్వేరు కార్లలో వెళ్లిపోయారు. వీరి విచారణ సమయంలో ఎన్సీబీ కార్యాలయం బయట పెద్ద సంఖ్యలో మీడియా సిబ్బంది గుమికూడారు. దక్షిణ ముంబైలో..బల్లార్డ్ ఎస్టేట్‌లో ఉన్న ఎన్సీబీ జోనల్ కార్యాలయంలో శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్‌లను శనివారం సాయంత్రం ఎన్సీబీ అధికారులు ప్రశ్నించారు. ఎన్సీబీ కార్యాలయానికి మధ్యాహ్నం 12గంటలకు శ్రద్ధాకపూర్ చేరుకోగా ఒక గంట తర్వాత సారా అలీఖాన్ వచ్చారు. వీరిద్దరినీ అధికారులు వేర్వేరుగా ప్రశ్నించారు. దాదాపు నాలుగున్నర గంటల అనంతరం సాయంత్రం 5.30 గంటలకు సారా, 6 గంటల ప్రాంతంలో శ్రద్ధాకపూర్ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. ఇలా ఉండగా, డ్రగ్స్ కేసులో శుక్రవారం ప్రశ్నించిన నిర్మాత క్షితిజ్ రవి ప్రసాద్‌ను శనివారం ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు. వెర్సోవాలో ఉన్న ఆయన నివాసం నుంచి తీసుకెళ్లి, రోజంతా ప్రశ్నించినట్లు సమాచారం. తాజా అరెస్టుతో డ్రగ్స్ కేసుల్లో అరెస్టయిన వారి సంఖ్య 18కి చేరుకుంది. మీడియాకు పోలీసుల వార్నింగ్ డ్రగ్స్ కేసులో ఎన్సీబీ విచారణకు హాజరై తిరిగి వెళ్లే సినీ ప్రముఖుల వాహనాలను వెంబడించి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని డిప్యూటీ కమిషనర్ సంగ్రామ్‌సింగ్ మీడియా సిబ్బందికి విజ్ఞప్తి చేశారు. రోడ్డుపై వెళ్లే వారిని ప్రమాదంలోకి నెట్టవద్దని కోరారు. ఎవరైనా వెంబడిస్తున్నట్లు తేలితే ఆ వాహనాలను సీజ్ చేయడంతోపాటు సంబంధిత డ్రైవర్‌పై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం శ్రద్ధా కపూర్, దీపికా పదుకొణె ఎలాగోలా మీడియా కంటబడకుండా తప్పించుకోగా, మీడియా సిబ్బంది సారా అలీఖాన్ ప్రయాణిస్తున్న వాహనాన్ని వెంబడిస్తూ వచ్చారు. ఎన్సీబీ కార్యాలయం నుంచి తిరిగి వెళ్లే సమయంలో దీపిక పదుకొణె ప్రయాణిస్తున్న వాహనాన్ని మీడియా వెంబడించింది. అనంతరం పోలీసుల హెచ్చరికల ఫలితంగా శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్ విచారణ అనంతరం తిరిగి వెళ్లే సమయంలో ‘ఛేజింగ్’ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. శాండల్‌వుడ్ కేసులో టీవీ యాంకర్.. మంగళూరు: శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో టీవీ యాంకర్ అనుశ్రీని శనివారం బెంగళూరు క్రైమ్ బ్రాంచి పోలీసులు ప్రశ్నించారు. స్నేహితుడు తరుణ్ రాజ్‌తోపాటు అనుశ్రీ పార్టీలకు హాజరైందంటూ ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన డ్యాన్సర్–కొరియోగ్రాఫర్ కిశోర్ అమన్ శెట్టి వెల్లడించడంతో పోలీసులు అనుశ్రీకి సమన్లు జారీ చేశారు. తరుణ్ డ్రగ్స్ వాడకంతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినట్లు సమాచారం. విచారణలో వీరేమన్నారు ఈ సుదీర్ఘ విచారణలో అధికారులు ముగ్గురి స్టేట్మెంట్లను రికార్డు చేశారు. ఈ సందర్భంగా దీపిక.. 2017లో తన మేనేజర్ కరిష్మాతో డ్రగ్స్ గురించి చాటింగ్ చేసినట్లు అంగీకరించారు. అయితే, డ్రగ్స్ తీసుకున్నదా లేదా అనేది వెల్లడికాలేదని సమాచారం. ఎన్సీబీ విచారణను ఎదుర్కొన్న సారా, శ్రద్ధా తమకు డ్రగ్స్ అలవాటు లేదని తెలిపారు. వీరి ఫోన్లను అధికారులు సీజ్‌చేశారు. -
రకుల్, దీపిక, సారా, శ్రద్ధలకు సమన్లు
ముంబై : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) బాలీవుడ్లో డ్రగ్స్ కోణంపై సాగుతున్న విచారణ కీలక మలుపు తిరిగింది. అందరూ ఊహిస్తున్నట్టుగానే నటీమణులు దీపికా పదుకొనె, శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్‌లకు ఎన్సీబీ సమన్లు పంపింది. బాలీవుడ్లో డ్రగ్స్ వినియోగంపై మరింత దృష్టి సారించిన ఎన్సీబీ ‘‘ఏ’’లిస్ట్‌లో ఉన్న ప్రముఖుల్ని తొలుత విచారించడానికి నిర్ణయించినట్టుగా ఎన్సీబీ అధికారి ఒకరు బుధవారం వెల్లడించారు. ఈ నెల 25 శుక్రవారం దీపికని విచారణకు హాజరు కావాలని ఎన్సీబీ ఆదేశించింది. ఇక రకుల్ ప్రీత్ సింగ్, సుశాంత్ ట్యాలెంట్ మేనేజర్ శ్రుతి మోదీ, డిజైనర్ సైమన్ ఖంబటాలను ఎన్సీబీ కార్యాలయానికి గురువారమే రావాల్సిందిగా చెప్పినట్టుగా ఆ అధికారి వెల్లడించారు. హీరోయిన్లు శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్‌లను 26వ తేదీ శనివారం ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన రియా చక్రవర్తి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్‌లను విచారించనున్నట్టు ఎన్సీబీ అధికారులు తెలిపారు. గోవా షూటింగ్లో దీపిక ప్రస్తుతం గోవా షూటింగ్లో ఉన్న దీపిక పదుకొనె 12 మంది సభ్యులున్న తన న్యాయ బృందంతో చర్చలు జరిపారు. ఈ కేసుని ఎలా ఎదుర్కోవాలో న్యాయవాదులతో చర్చించినట్టుగా తెలుస్తోంది. ఈ చర్చల్లో దీపిక భర్త రణవీర్ సింగ్ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైనట్టు సమాచారం. నోటీసుల నేపథ్యంలో రాత్రికి దీపిక గోవా నుంచి ముంబై వచ్చారు. దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాశ్ వాట్సాప్ గ్రూప్ చాట్లలో హీరోయిన్ పేరులో ఇంగ్లిష్ అక్షరాలతో జరిగిన సంభాషణలు వెలుగులోకి వచ్చాయి. అందులో డి అంటే దీపిక, ఎస్ అంటే శ్రద్ధ అని భావించిన విషయం తెలిసిందే. ఇక కరిష్మా ప్రకాశ్‌కు కూడా ఇప్పటికే సమన్లు పంపినప్పటికీ ఆమె అనారోగ్య కారణాలతో ఎన్సీబీ ఎదుట హాజరు కాలేదు. దీంతో శుక్రవారం వరకు ఆమెకు మినహాయింపునిచ్చారు. దీపికతో పాటు కరిష్మా కూడా ఎన్సీబీ విచారణలో పాల్గొనే అవకాశం ఉంది. బాలీవుడ్ డ్రగ్స్ వినియోగంలో హీరోల పాత్రపై కూడా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు కన్నేశారు. రియా చక్రవర్తి, జయ సాహా ఇచ్చిన సమాచారం ఆధారంగా అగ్ర హీరోలపై కూడా ఓ కన్నేసి ఉంచినట్టు ఎన్సీబీ వర్గాలు వెల్లడించాయి. కీలక సమాచారమిచ్చిన జయ! గత మూడు రోజులుగా జయ సాహాను ప్రశ్నిస్తున్న అధికారులు పలు విషయాలను రాబట్టారు. అత్యంత కీలకమైన సమాచారాన్ని జయ సాహా బయటపెట్టినట్టు ఎన్సీబీ అధికారులు వెల్లడించారు. సుశాంత్‌తో పాటు నటి శ్రద్ధా కపూర్, రియా చక్రవర్తి, మధు, తాను డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఆమె ఎన్సీబీ విచారణలో అంగీకరించినట్టుగా జాతీయ మీడియా వెల్లడించింది. సీబీడీ ఆయిల్ అనే నిషేధిత డ్రగ్స్‌ని వారు సేవించినట్టుగా తెలుస్తోంది. మాదక ద్రవ్యాల చీకటి కోణంపై 2016లో వచ్చిన బాలీవుడ్ సినిమా ఉడ్తా పంజాబ్ సహ నిర్మాత అయిన మధు మాంతెనాను బుధవారం ఎన్సీబీ విచారణకు హాజరయ్యారు. జయ సాహా తన విచారణలో మధు పేరుని బయట పెట్టడంతో ఆయనను డగ్స్ర్ వినియోగంపై గుచ్చి గుచ్చి ప్రశ్నించారు. -
మలుపులు తిరుగుతున్న సుశాంత్ మృతి కేసు
-
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణ వేగవంతం
-
రకుల్ ప్రీత్.. సారా అలీఖాన్...
ముంబై/న్యూఢిల్లీ: సుశాంత్‌సింగ్ మృతి కేసులో డ్రగ్స్ సంబంధాలున్న మరికొందరు బాలీవుడ్ ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టయి, ప్రస్తుతం బైకుల్లా జైలులో ఉన్న నటి రియా చక్రవర్తి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ)అధికారుల విచారణలో హీరోయిన్లు సారా అలీఖాన్, రకుల్ ప్రీత్‌సింగ్‌తోపాటు, ఫ్యాషన్ డిజైనర్, ఓ అగ్రహీరో స్నేహితురాలు కూడా అయిన సిమోన్ ఖంబట్టా పేర్లను వెల్లడించినట్లు తెలుస్తోంది. సుశాంత్‌తోపాటు వీరు ముగ్గురూ తనతోపాటు డ్రగ్స్ తీసుకునే వారని అధికారుల ఎదుట అంగీకరించినట్లు ఐఏఎన్ఎస్ వార్తాసంస్థ తెలిపింది. వీరిలో ఒక హీరోయిన్ సుశాంత్ స్నేహితురాలు కాగా, మరొకరు తన ఫ్రెండని రియా చెప్పింది. సుశాంత్ కోసం డ్రగ్స్ కొనుగోలు చేయడంతోపాటు చెల్లింపులు కూడా చేసినట్లు అంగీకరించింది. డ్రగ్స్ కొనుగోలు విషయంలో తన సూచనల మేరకే శామ్యూల్ మిరాండా, దీపేశ్ సావంత్, సోదరుడు షోవిక్ వ్యవహరించేవారని రియా తెలిపినట్లు సమాచారం. బాలీవుడ్ ప్రముఖుల్లో 80 శాతం మందికి డ్రగ్స్ అలవాటుందని కూడా ఆమె వెల్లడించిందని తెలుస్తోంది. ఈ సమాచారం ఆధారంగా 25 మంది అగ్రశ్రేణి బాలీవుడ్ స్టార్స్‌కు సమన్లు ఇచ్చేందుకు ఎన్సీబీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘డ్రగ్స్‌ను సుశాంత్ సింగ్ సిబ్బంది తీసుకువెళ్లేవారు, వీటి కొనుగోలు, డెలివరీ వంటి విషయాలన్నిటినీ రియానే చూసుకునేది’అంటూ రియా సోదరుడు షోవిక్ ఇప్పటికే ఎన్సీబీకి తెలిపాడని ఐఏఎన్ఎస్ పేర్కొంది. ఈ నెల 8వ తేదీన అరెస్టయిన రియాకు న్యాయస్థానం 22 వరకు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టు రియా సహా ఆరుగురి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడంతో వీరంతా వచ్చే వారం బోంబే హైకోర్టును బెయిల్ కోసం ఆశ్రయించే అవకాశాలున్నాయి. నాకు బెయిల్ ఇవ్వండి.. సుశాంత్ మృతి కేసులో మాదక ద్రవ్యాల సరఫరాదారుగా అనుమానాలున్న జయిద్ విలాత్రా(20) బెయిల్ కోసం శనివారం బోంబే హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఈనెల 9వ తేదీన సెషన్స్ కోర్టు ఇతని బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. తాను అమాయకుడిననీ, ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేకున్నా ఇరికించారని ఆ పిటిషన్లో బోంబే హైకోర్టుకు తెలిపాడు. ఆగస్టులో అరెస్టయిన బాంద్రా వాసి అబ్బాస్ అలీ లఖానీ, మరో డ్రగ్స్ సరఫరాదారు కరన్ అరోరా వెల్లడించిన సమాచారం మేరకు ఎన్సీబీ ఈనెల 4న విలాత్రాను అదుపులోకి తీసుకుంది. ఈ సందర్భంగా విలాత్రా నుంచి రూ.9.55 లక్షల నగదుతోపాటు 2 వేల అమెరికన్ డాలర్లను స్వాధీనం చేసుకుంది. ఇదంతా డ్రగ్స్ ద్వారా సంపాదించిందేనని ఎన్సీబీ ఆరోపిస్తోంది. అయితే, తన వద్ద చాలా తక్కువ పరిమాణంలో డ్రగ్స్ దొరకడంతోపాటు, తనది బెయిల్ ఇచ్చేందుకు అవకాశమున్న అరెస్టని విలాత్రా అంటున్నాడు. రుజువైతే ఆ సర్వీసుపై నిషేధం: డీజీసీఏ ఈనెల 9వ తేదీన నటి కంగనా రనౌత్ ప్రయాణించిన ఇండిగో విమానం లోపల ఎవరైనా ఫొటోలు తీసినట్లు తేలితే ఆ విమాన సర్వీస్‌పై రెండు వారాల నిషేధం విధించనున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) స్పష్టం చేసింది. నిబంధనల ఉల్లంఘనకు బాధ్యులైన వారిపై ఆ విమానయాన సంస్థ చర్యలు తీసుకున్న తర్వాతే ఆ విమాన సర్వీసుకు తిరిగి అనుమతినిచ్చే విషయం పరిశీలిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు అన్ని దేశీయ విమానయాన సంస్థలకు ఉత్తర్వులు పంపింది. కంగనా ప్రయాణిస్తున్న విమానం చండీగఢ్ నుంచి ముంబైకి వస్తున్న సమయంలో కొందరు మీడియా సిబ్బంది ఫొటోలు తీయడంతోపాటు కోవిడ్–19 మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లుగా వచ్చిన వీడియోలపై శుక్రవారం డీజీసీఏ ఇండిగోకు నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. ఫొటోలు తీసి, నిబంధనలు ఉల్లంఘించిన వారి పేర్లను నో–ఫ్లై జాబితాలో పెట్టాలని కోరింది. ఏడుగురు డ్రగ్స్ పెడ్లర్స్ అరెస్ట్ ఎన్సీబీ శనివారం ముంబైతోపాటు గోవాలోని పలుప్రాంతాల్లో సోదాలు జరిపి ఏడుగురిని అరెస్టు చేయడంతోపాటు పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. అరెస్టయిన వారిలో కరంజీత్ అలియాస్ కేజే ముఖ్యమైన వ్యక్తి. సుశాంత్ సింగ్, రియా చక్రవర్తికి కూడా ఇతడు డ్రగ్స్ సరఫరా చేసేవాడు. శామ్యూల్ మిరాండా, షోవిక్ చక్రవర్తి వెల్లడించిన వివరాల్లో కేజే పేరు కూడా ఉండటం గమనార్హం. -
నిన్ను విసిగించడం మిస్ అవుతా
వరుణ్ ధావన్, సారా అలీ ఖాన్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘కూలీ నెం.1’. 1995లో వచ్చిన ‘కూలీ నెం.1’ చిత్రానికి ఇది రీమేక్. పాత సినిమాకి దర్శకత్వం వహించిన డేవిడ్ ధావనే రీమేక్‌ని తెరకెక్కించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా సారా మాట్లాడుతూ – ‘‘కూలీ’ సినిమాని ముగించాం. మా బెస్ట్, కూలెస్ట్ కూలీగా ఉన్నందుకు వరుణ్ ధావన్‌కు స్పెషల్ థ్యాంక్స్. నా లగేజ్‌ని నాతో నువ్వు మోయించినట్టుగా ఎవ్వరూ మోయించి ఉండలేరు. నిన్ను విసిగించడం కచ్చితంగా మిస్ అవుతాను’’ అని అన్నారు. ‘కూలీ నెం.1’ చిత్రం మే 1న విడుదల కానుంది. అన్నట్లు.. వరుణ్ ధావన్.. డేవిడ్ ధావన్ కుమారుడు అనే సంగతి తెలిసిందే. -
ముగ్గురున్నారు.. ముక్కోణం కాదు!
ఇద్దరు హీరోలు, ఒక హీరోయిన్ ఉంటే కచ్చితంగా అది ముక్కోణపు ప్రేమకథా చిత్రం అని చాలామంది ఊహిస్తారు. ఇప్పుడు అక్షయ్‌కుమార్–ధనుష్–సారా అలీఖాన్ నటించబోతున్న హిందీ చిత్రం ‘అట్రంగీరే’ ఆ టైప్ సినిమానే అనుకుంటున్నారు. ‘‘ముగ్గురు ఉన్నప్పటికీ ఇది ముక్కోణపు ప్రేమకథా చిత్రం కాదని, ప్రచారంలో ఉన్నట్లు అక్షయ్‌ది అతిథి పాత్ర కాదు’’ అని చిత్రదర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్ స్పష్టం చేశారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ మార్చి లో బీహార్‌లో ప్రారంభం కానుంది. ‘‘తొలి షెడ్యూల్లో ధనుష్, సారాలపై చిత్రీకరిస్తాం. తర్వాత మధురైలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుంది. ఈ రెండు షెడ్యూల్స్ తర్వాత ఏప్రిల్‌లో జరిగే చిత్రీకరణలో అక్షయ్ కుమార్ పాల్గొంటారు. జూలై కల్లా సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నాం. కేవలం ఒక జానర్‌కి చెందిన చిత్రం కాదు ఇది. సంగీతానికి ప్రాధాన్యం ఉంది. అందుకే ఏఆర్ రెహమాన్‌ను తీసుకున్నాం’’ అన్నారు ఆనంద్ ఎల్. రాయ్. ‘అట్రంగీ రే’ చిత్రం వచ్చే ఏడాది ప్రేమికుల రోజున విడుదల కానుంది. -
రంగురంగుల ప్రేమకథ
‘రాంఝనా’ సినిమాతో హిందీ పరిశ్రమకు పరిచయం అయ్యారు ధనుష్. తనను హిందీకి పరిచయం చేసిన ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో మళ్లీ ‘అట్రంగీ రే’ అనే సినిమా చేయనున్నారు. ‘అట్రంగీ’ అంటే రంగు లేనిది అని అర్థం. ఇందులో అక్షయ్ కుమార్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. సారా అలీ ఖాన్ హీరోయిన్. ‘అట్రంగీ రే’ చిత్రాన్ని గురువారం ప్రకటించారు. వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవానికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఓ ఎమోషనల్ లవ్‌స్టోరీతో ఈ సినిమా ఉంటుందని సమాచారం. సినిమా పేరు రంగు లేనిది కానీ.. ఈ ప్రేమకథ మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంటుందట. భూషణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. -
పెళ్లికి తయార్
ఇక్కడున్న ఫొటో చూశారుగా.. వధూవరులుగా వరుణ్ ధావన్, సారా అలీఖాన్ ఎలా మెరిసిపోతున్నారో! ఈ ఫొటో చూసి వరుణ్ ధావన్ ప్రేయసి నటాషా దలాల్ ఏమీ అనలేదా? అంటే ఏమి అనలేదట. ఎందుకంటే ఈ ఫొటో ‘కూలీ నెం1’ చిత్రంలోనిది. 1995లో డేవిడ్ ధావన్ దర్శకత్వంలో గోవిందా, కరిష్మా కపూర్ జంటగా నటించిన చిత్రం ‘కూలీ నెం1’. అదే పేరుతో ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు డేవిడ్ ధావన్. ఇందులో వరుణ్ ధావన్, సారా అలీఖాన్ జంటగా నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా కొత్త పోస్టర్ వైరల్ అవుతోంది. సినిమాలోని ఓ సీన్లో భాగంగా వరుణ్, సారా పెళ్లికి తయారైన గెటప్స్‌లో కనిపిస్తారు. ఈ చిత్రాన్ని మే 1న విడుదల చేయాలనుకుంటున్నారు. ఇలా ఆన్ స్క్రీన్ పెళ్లి సీన్లో నటించిన వరుణ్ ఆఫ్ స్క్రీన్ నటాషాతో పెళ్లికి రెడీ అవుతున్నారు. -
స్టార్‌డమ్‌ని పట్టించుకోను
యాక్టర్స్‌గా మారిన ప్రతి ఒక్కరూ స్టార్‌డమ్‌ను సంపాదించాలని కలలు కంటారు. కానీ సైఫ్ అలీఖాన్ కుమార్తె, బాలీవుడ్ నయా ఎంట్రీ సారా అలీఖాన్ మాత్రం స్టార్‌డమ్‌ని నమ్మను అంటున్నారు. ఈ విషయం గురించి సారా మాట్లాడుతూ – ‘‘ఇండస్ట్రీలో ఏ ఫిల్మ్ మేకర్ అయినా సరే ‘సారా ఈ పాత్ర చేయలేదేమో?’ అనే సందేహం వ్యక్తపరచకూడదు. యాక్టర్‌గా నా టార్గెట్ అదే. స్టార్డమ్ అనే కాన్సెప్ట్ నాకు అర్థం కాదు. ఆ టాపిక్కే చాలా విచిత్రంగా, ఫన్నీగా అనిపిస్తుంది. అలా అని మన స్టార్స్ మీద నాకు రెస్పెక్ట్ లేదని కాదు. నేను శ్రీదేవిగారికి వీరాభిమానిని. తనే లాస్ట్ సూపర్‌స్టార్ అని నా ఉద్దేశం. ఇప్పుడు స్టార్స్ కూడా చాలా కామన్ అయిపోయారు. అందరికీ ఈజీగా అందుబాటులో ఉంటున్నప్పుడు స్టార్డమ్ అనే కాన్సెప్ట్ ఏంటి? నా వరకూ ప్రతీ ప్రేక్షకుడు మన వర్క్‌కి కనెక్ట్ అవ్వాలి. అలాంటి సినిమాలు చేయడమే నా లక్ష్యం’’ అన్నారు. ప్రస్తుతం సారా అలీఖాన్ ‘లవ్ ఆజ్ కల్ 2’ సినిమా చేస్తున్నారు. -
నవ్వుల కూలీ!
జూలై నుంచి కూలీగా మారనున్నారు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్. 1991లో వెంకటేశ్ హీరోగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం ‘కూలీ నెం.1’ అదే పేరుతో హిందీలో రీమేక్ అయ్యింది. డేవిడ్ ధావన్ దర్శకత్వంలో గోవింద నటించారు. ఇప్పుడు ఈ హిందీ ‘కూలీ నెం.1’ లేటెస్ట్ రీమేక్‌లో హీరోగా నటించే బాధ్యతను డేవిడ్ ధావన్ తనయుడు వరుణ్ ధావన్ తీసుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా సారా అలీఖాన్ నటించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ జూలై నుంచి ఆరంభం కానుంది. ‘‘ఇప్పటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు కథలో మార్పులు చేశాం. మరింత హాస్యం ఉంటుంది. ప్రస్తుతం లొకేషన్స్‌ను సెలక్ట్ చేస్తున్నాం. ఫారిన్ షెడ్యూల్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. త్వరలో చిత్రీకరణ మొదలుపెడతాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
తండ్రీ కూతుళ్లుగా...
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ ఫస్ట్ సినిమా రిలీజ్ కాకముందే వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నారు. ఫస్ట్ సినిమా ‘కేధార్నాద్’ చిత్రం షూటింగ్ కంప్లీట్ అవ్వగానే డైరెక్ట్‌గా ‘టెంపర్’ హిందీ రీమేక్ ‘సింబా’లో జాయిన్ అయ్యారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ హీరో. ఈ సినిమా తర్వాత తండ్రి సైఫ్ అలీఖాన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారట సారా అలీఖాన్. నితిన్ కక్కర్ తెరకెక్కించనున్న ఫ్యామిలీ డ్రామాలో సైఫ్, సారా ఆన్‌స్క్రీన్ కూడా తండ్రీ కూతుళ్ల పాత్రల్లోనే యాక్ట్ చేయనున్నారు. ఈ సినిమా కథ తండ్రీ కూతుళ్ల రిలేషన్షిప్ మీద ఎక్కువగా ఉండబోతోందని సమాచారం. -
కొత్త స్టూడెంట్ టైగరే!
ఎందులో? ప్రముఖ హిందీ దర్శక–నిర్మాత కరణ్ జోహర్ కాలేజ్‌లో! వచ్చే ఏడాది (2018) కాలేజ్ అడ్మిషన్స్ ఓపెన్ చేస్తామని కరణ్ అనౌన్స్ చేశారు. బట్, టైగర్ ష్రాఫ్‌కి ఆల్రెడీ అడ్మిషన్ ఇచ్చేశారు. ఈ యంగ్ హీరోకి ఓ సీట్ కన్ఫర్మ్ చేశారు! నెక్ట్స్ ఎవరికి (హీరోయిన్) అడ్మిషన్ ఇస్తారో మరి? కరణ్ జోహార్ దర్శకత్వంలో షారూఖ్ ఖాన్ వైఫ్ గౌరి, కరణ్ మదర్ హీరూ యశ్జోహార్ నిర్మించిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’కి సీక్వెల్ అనౌన్స్ చేశారు. అయితే... దీనికి కరణ్ దర్శకుడు కాదు, నిర్మాత మాత్రమే. పునిత్ మల్హోత్రా దర్శకత్వం వహించనున్న ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్–2’లో టైగర్ ష్రాఫ్ హీరో. సారా అలీఖాన్, దిశా పాట్నీ, అనన్యా పాండేల పేర్లు హీరోయిన్ల రేసులో వినబడుతున్నాయి. ఈ ముగ్గురిలో ఎవరికి కాలేజ్‌లో సీట్ ఇస్తారో!! ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ లో సిద్ధార్థ్ మల్హోత్రా, వరుణ్ ధావన్, ఆలియా భట్ నటించారు. ఇప్పుడు వాళ్లందరూ హిందీలో క్రేజీ స్టార్స్. టైగర్ ష్రాఫ్ కూడా క్రేజీ స్టారే. అయితే... కరణ్ జోహార్ సంస్థలో సినిమా ఒప్పుకోవడం ఇదే తొలిసారి. ఇప్పటివరకూ ఎక్కువగా మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో యాక్షన్ సిన్మాలు చేసిన టైగర్, స్టూడెంట్‌గా ఎలా నటిస్తారోననే ఆసక్తి హిందీ ప్రేక్షకుల్లో నెలకొంది!! -
చరణ్‌తో సారా!?
సారా అంటే... సారా అలీఖాన్! హిందీ హీరో సైఫ్ అలీఖాన్, నటి అమృతా సింగ్‌ల కుమార్తె. త్వరలో ఈ అమ్మాయి తెలుగు తెరకు కథానాయికగా పరిచయం కానున్నారట. అదీ రామ్‌చరణ్ సినిమాతో! దీనికి దర్శకుడు ఎవరంటే... మణిరత్నం. ఎప్పట్నుంచో రామ్‌చరణ్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందనే వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. కానీ, అంతకు మించి ఆ సినిమా ముందుకు కదలడం లేదు. తాజా ఖబర్ ఏంటంటే... ‘రంగస్థలం’ తర్వాత మణిరత్నం దర్శకత్వంలోనే చరణ్ సినిమా చేస్తారట. అందులో కథానాయికగా సారా అలీఖాన్‌ను కన్ఫర్మ్ చేశారట. తెలుగుతో పాటు హిందీలోనూ ఏకకాలంలో బైలింగ్వల్‌గా ఈ సినిమా తీయాలని మణిరత్నం సన్నాహాలు చేస్తున్నారని చెన్నై టాక్. తమిళంలో డబ్ చేసే ప్లానులో ఉన్నారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల తరహాలో కాకుండా మణిరత్నం స్టైల్లో డిఫరెంట్ స్టోరీతో ఈ సినిమా రూపొందనుందట!! ఈ సంగతి పక్కనపెడితే... సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ‘రంగస్థలం’ చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.