రకుల్‌ ప్రీత్‌.. సారా అలీఖాన్‌... | Rhea Chakraborty names Rakul Preet Singh and Sara Ali Khan during NCB Probe | Sakshi
Sakshi News home page

రకుల్‌ ప్రీత్‌.. సారా అలీఖాన్‌...

Published Sun, Sep 13 2020 4:05 AM | Last Updated on Sun, Sep 13 2020 8:49 AM

Rhea Chakraborty names Rakul Preet Singh and Sara Ali Khan during NCB Probe - Sakshi

ముంబై/న్యూఢిల్లీ: సుశాంత్‌సింగ్‌ మృతి కేసులో డ్రగ్స్‌ సంబంధాలున్న మరికొందరు బాలీవుడ్‌ ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టయి, ప్రస్తుతం బైకుల్లా జైలులో ఉన్న నటి రియా చక్రవర్తి నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ)అధికారుల విచారణలో హీరోయిన్లు సారా అలీఖాన్, రకుల్‌ ప్రీత్‌సింగ్‌తోపాటు, ఫ్యాషన్‌ డిజైనర్, ఓ అగ్రహీరో స్నేహితురాలు కూడా అయిన సిమోన్‌ ఖంబట్టా పేర్లను వెల్లడించినట్లు తెలుస్తోంది.

సుశాంత్‌తోపాటు వీరు ముగ్గురూ తనతోపాటు డ్రగ్స్‌ తీసుకునే వారని అధికారుల ఎదుట అంగీకరించినట్లు ఐఏఎన్‌ఎస్‌ వార్తాసంస్థ తెలిపింది. వీరిలో ఒక హీరోయిన్‌ సుశాంత్‌ స్నేహితురాలు కాగా, మరొకరు తన ఫ్రెండని రియా చెప్పింది. సుశాంత్‌ కోసం డ్రగ్స్‌ కొనుగోలు చేయడంతోపాటు చెల్లింపులు కూడా చేసినట్లు అంగీకరించింది. డ్రగ్స్‌ కొనుగోలు విషయంలో తన సూచనల మేరకే శామ్యూల్‌ మిరాండా, దీపేశ్‌ సావంత్, సోదరుడు షోవిక్‌ వ్యవహరించేవారని రియా తెలిపినట్లు సమాచారం. బాలీవుడ్‌ ప్రముఖుల్లో 80 శాతం మందికి డ్రగ్స్‌ అలవాటుందని కూడా ఆమె వెల్లడించిందని తెలుస్తోంది.

ఈ సమాచారం ఆధారంగా 25 మంది అగ్రశ్రేణి బాలీవుడ్‌ స్టార్స్‌కు సమన్లు ఇచ్చేందుకు ఎన్‌సీబీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘డ్రగ్స్‌ను సుశాంత్‌ సింగ్‌ సిబ్బంది తీసుకువెళ్లేవారు, వీటి కొనుగోలు, డెలివరీ వంటి విషయాలన్నిటినీ రియానే చూసుకునేది’అంటూ రియా సోదరుడు షోవిక్‌ ఇప్పటికే ఎన్‌సీబీకి తెలిపాడని ఐఏఎన్‌ఎస్‌ పేర్కొంది. ఈ నెల 8వ తేదీన అరెస్టయిన రియాకు న్యాయస్థానం 22 వరకు రిమాండ్‌ విధించిన విషయం తెలిసిందే. ఎన్‌డీపీఎస్‌ ప్రత్యేక కోర్టు రియా సహా ఆరుగురి బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించడంతో వీరంతా వచ్చే వారం బోంబే హైకోర్టును బెయిల్‌ కోసం ఆశ్రయించే అవకాశాలున్నాయి.  

నాకు బెయిల్‌ ఇవ్వండి..
సుశాంత్‌ మృతి కేసులో మాదక ద్రవ్యాల సరఫరాదారుగా అనుమానాలున్న జయిద్‌ విలాత్రా(20) బెయిల్‌ కోసం శనివారం బోంబే హైకోర్టులో పిటిషన్‌  వేశాడు. ఈనెల 9వ తేదీన సెషన్స్‌ కోర్టు ఇతని బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించింది. తాను అమాయకుడిననీ, ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేకున్నా ఇరికించారని ఆ పిటిషన్‌లో బోంబే హైకోర్టుకు తెలిపాడు. ఆగస్టులో అరెస్టయిన బాంద్రా వాసి అబ్బాస్‌ అలీ లఖానీ, మరో డ్రగ్స్‌ సరఫరాదారు కరన్‌ అరోరా వెల్లడించిన సమాచారం మేరకు ఎన్‌సీబీ ఈనెల 4న విలాత్రాను అదుపులోకి తీసుకుంది. ఈ సందర్భంగా విలాత్రా నుంచి రూ.9.55 లక్షల నగదుతోపాటు 2 వేల అమెరికన్‌ డాలర్లను స్వాధీనం చేసుకుంది. ఇదంతా డ్రగ్స్‌ ద్వారా సంపాదించిందేనని ఎన్‌సీబీ ఆరోపిస్తోంది. అయితే, తన వద్ద చాలా తక్కువ పరిమాణంలో డ్రగ్స్‌ దొరకడంతోపాటు, తనది బెయిల్‌ ఇచ్చేందుకు అవకాశమున్న అరెస్టని విలాత్రా అంటున్నాడు.  

రుజువైతే ఆ సర్వీసుపై నిషేధం: డీజీసీఏ
ఈనెల 9వ తేదీన నటి కంగనా రనౌత్‌ ప్రయాణించిన ఇండిగో విమానం లోపల ఎవరైనా ఫొటోలు తీసినట్లు తేలితే ఆ విమాన సర్వీస్‌పై రెండు వారాల నిషేధం విధించనున్నట్లు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) స్పష్టం చేసింది. నిబంధనల ఉల్లంఘనకు బాధ్యులైన వారిపై ఆ విమానయాన సంస్థ చర్యలు తీసుకున్న తర్వాతే ఆ విమాన సర్వీసుకు తిరిగి అనుమతినిచ్చే విషయం పరిశీలిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు అన్ని దేశీయ విమానయాన సంస్థలకు ఉత్తర్వులు పంపింది. కంగనా ప్రయాణిస్తున్న విమానం చండీగఢ్‌ నుంచి ముంబైకి వస్తున్న సమయంలో కొందరు మీడియా సిబ్బంది ఫొటోలు తీయడంతోపాటు కోవిడ్‌–19 మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లుగా వచ్చిన వీడియోలపై శుక్రవారం డీజీసీఏ ఇండిగోకు నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. ఫొటోలు తీసి, నిబంధనలు ఉల్లంఘించిన వారి పేర్లను నో–ఫ్లై జాబితాలో పెట్టాలని కోరింది.

ఏడుగురు డ్రగ్స్‌ పెడ్లర్స్‌ అరెస్ట్‌
ఎన్‌సీబీ శనివారం ముంబైతోపాటు గోవాలోని పలుప్రాంతాల్లో సోదాలు జరిపి ఏడుగురిని అరెస్టు చేయడంతోపాటు పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. అరెస్టయిన వారిలో కరంజీత్‌ అలియాస్‌ కేజే ముఖ్యమైన వ్యక్తి. సుశాంత్‌ సింగ్, రియా చక్రవర్తికి కూడా ఇతడు డ్రగ్స్‌ సరఫరా చేసేవాడు. శామ్యూల్‌ మిరాండా, షోవిక్‌ చక్రవర్తి వెల్లడించిన వివరాల్లో కేజే పేరు కూడా ఉండటం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement