ఢిల్లీలోని ఎయిమ్స్‌లో వ్యాక్సినేషన్ సందర్భంగా నర్సులు నివేదా, రోజమ్మలతో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(70) ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్)లో సోమవారం ఉదయం 6.30 గంటలకు కరోనా టీకా మొదటి డోసు తీసుకున్నారు. అర్హులైన వారంతా టీకా తీసుకోవాలని కోరారు. 60 ఏళ్లు దాటిన వారికి, 45 ఏళ్లకుపైగా వయసున్న వ్యాధిగ్రస్తులకు టీకా ఇచ్చేందుకు ఉద్దేశించిన కరోనా వ్యాక్సినేషన్ రెండో దశ సోమవారం దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థ దేశీయంగానే అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌ను పుదుచ్చేరికి చెందిన నర్సు పి.నివేదా ప్రధాని మోదీకి ఇచ్చారని, ఆమెకు కేరళకు చెందిన నర్సు రోజమ్మ అనిల్ సహకరించారని అధికార వర్గాలు తెలిపాయి.
వ్యాక్సినేషన్ అనంతరం మోదీ ట్వీట్ చేశారు. ‘‘కోవిడ్–19 వ్యాక్సిన్ ఫస్టు డోసు ఈ రోజే తీసుకున్నా. ఈ మహమ్మారిపై జరుగుతున్న పోరాటాన్ని బలోపేతం చేయడంలో భాగంగా మన డాక్టర్లు, సైంటిస్టులు సాగిస్తున్న కృషి ప్రశంసనీయం. అర్హులైన వారంతా టీకాను తీసుకోవాలి. అంతా కలిసి భారత్‌ను కరోనారహిత దేశంగా మార్చేద్దాం’’ అని పిలుపునిచ్చారు. టీకా తీసుకుంటున్న ఫొటోను మోదీ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఇందులో నర్సు నివేదాతోపాటు కేరళకు చెందిన నర్సు రోజమ్మ అనిల్ కూడా కనిపిస్తున్నారు. వ్యాక్సినేషన్ సందర్భంగా మోదీ అస్సామీ సంప్రదాయ కండువా ‘గమోచా’ ధరించారు. టీకా ఇస్తున్నప్పుడు ముఖంపై చిరునవ్వు చెదర నివ్వలేదు.
అసలు టీకా ఇచ్చినట్లే అనిపించలేదు
ఢిల్లీలో రహదారులపై ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు ప్రధాని మోదీ ఉదయా న్నే వెళ్లి కరోనా టీకా తీసుకున్నారని అధికారులు చెప్పారు. మోదీకి టీకా ఇచ్చిన నర్సు నివేదా తన అనుభవాన్ని పంచుకున్నారు. ‘‘అప్పుడే అయిపోయిందా! కనీసం టీకా ఇచ్చినట్లు కూడా నాకు అనిపించలేదు’’ అని మోదీ తనతో అన్నారని తెలిపారు. మూడేళ్లుగా ఎయిమ్స్‌లో పని చేస్తున్నానని, ప్రస్తుతం ఇక్కడి వ్యాక్సిన్ సెంటర్‌లో విధులు నిర్వర్తిస్తున్నానని చెప్పారు. కరోనా టీకా కోసం ప్రధాని మోదీ వస్తున్నట్లు సోమవారం ఉదయమే తాను ఎయిమ్స్‌కు వచ్చిన తర్వాతే తెలిసిందన్నారు. ఆయనను కలవడం, స్వయంగా టీకా ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. రెండో డోసు కోసం ఆయన 28వ రోజున మళ్లీ రావాల్సి ఉంటుందని చెప్పారు.
మోదీ తమతో(నర్సులు) మాట్లాడారని, తాము ఎక్కడి నుంచి వచ్చామన్నది అడిగి తెలుసుకున్నారని వివరించారు. టీకా ఇస్తున్న సమయంలో మోదీ చాలా సౌకర్యవంతంగా కనిపించారని మరో నర్సు రోజమ్మ అనిల్ చెప్పారు. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు అని, మోదీజీ చేతులు జోడించి వణక్కం అంటూ నమస్కారం చేశారని తెలిపారు. టీకా ఇచ్చిన తర్వాత ఆయన అరగంట పాటు పరిశీలనలో ఉన్నారని, ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదని వెల్లడించారు. టీకా తీసుకున్నందుకు మోదీ సంతోషించారని అన్నారు. వెళ్లిపోయే ముందు తమ దగ్గరికి వచ్చి, చేతులు జోడించి థాంక్యూ, వణక్కం అని చెప్పారని రోజమ్మ వివరించారు. ప్రధాని రాక గురించి ఆదివారం రాత్రి పొద్దుపోయాక తమకు సమాచారం అందిందని ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా చెప్పారు.
ఉల్లాసంగా.. సరదాగా
ఎయిమ్స్‌లో వ్యాక్సినేషన్ సందర్భంగా నరేంద్ర మోదీ చాలా ఉల్లాసంగా కనిపించారు. అక్కడి గంభీరమైన వాతావరణాన్ని తేలికపర్చడానికి నర్సులతో సరదాగా సంభాషించారు. నాకు టీకా వేయడానికి మందంగా ఉన్న ప్రత్యేకమైన సూది, పశువులకు ఇచ్చేలాంటిది ఏదైనా వాడుతున్నారా.. ఎందుకంటే రాజకీయ నాయకులకు తోలుమందం అంటుంటారు కదా! అని అన్నారు. దీంతో అక్కడున్న వైద్య సిబ్బంది హాయిగా నవ్వేశారు.
టీకా కోసం జనం బారులు
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ రెండో దశ సోమవారం దేశవ్యాప్తంగా మొదలయ్యింది. 60 ఏళ్లు దాటిన వారికి, 45 నుంచి 59 ఏళ్ల వయసుండి వ్యాధులతో బాధపడుతున్నవారికి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా టీకా ఇస్తున్నారు. ప్రధాని మోదీ ఢిల్లీ ఎయిమ్స్‌లో కరోనా టీకా తీసుకొని రెండో దశ వ్యాక్సినేషన్‌కు శ్రీకారం చుట్టారు. టీకా కోసం అర్హులు ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్ల వద్ద బారులు తీరిన దృశ్యాలు దేశమంతటా కనిపించాయి. కొందరు చక్రాల కుర్చీలపై తరలిరావడం విశేషం. కర్ణాటక రాజధాని బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్‌లో 97 ఏళ్ల రామస్వామి పార్థసారథి సోమవారం కరోనా టీకా తీసుకున్నారు. ఢిల్లీలో దాదాపు 90 ఏళ్ల వయసున్న వృద్ధులు టీకా పొందారు.
టీకా పంపిణీలో అక్కడక్కడ కొన్ని లోపాలు బయటపడ్డాయి. మరోవైపు కో–విన్ 2.0 పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోలేకపోయామని, అపాయింట్‌మెంట్ పొందలేకపోయామని కొందరు చెప్పారు. రెండో దశలో మొదటి రోజే దేశంలో పలువురు ప్రముఖులు టీకా తీసుకున్నారు. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు అమిత్ షా, ఎస్.జైశంకర్, రాజస్తాన్ గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా, తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, నేషలిస్టు కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, గోపాలకృష్ణన్ టీకా వేయించుకున్నారు. ఇలా ఉండగా, కోవాగ్జిన్ టీకా తీసుకున్న ప్రధానికి హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థ సీఎంyీ కృష్ణ ఎల్లా కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment