పల్లెల్లో మూడేళ్లు వైద్య సేవలు | MBBS Students Should Service 3 Years In Villages For Certificattion | Sakshi
Sakshi News home page

పల్లెల్లో మూడేళ్లు వైద్య సేవలు

Published Thu, Mar 18 2021 7:59 AM | Last Updated on Thu, Mar 18 2021 8:06 AM

MBBS Students Should Service 3 Years In Villages For Certificattion - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  కొత్తగా ఎంబీబీఎస్‌ పూర్తిచేసే వైద్యులు తప్పకుండా మూడేళ్లపాటు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాలని వైద్యారోగ్య రంగంపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అలా పనిచేయని వారి వైద్య డిగ్రీలను, రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని సూచించింది. ఈ మేరకు కేంద్రానికి సమగ్ర నివేదిక సమర్పించింది. ఎంబీబీఎస్‌ వైద్యులు గ్రామాల్లో ఉండేలా మౌలిక సదుపాయాలు కల్పించాలని.. వారి పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది. ప్రజల అవసరాలకు, ప్రభుత్వ ఆస్పత్రులకు మధ్య అగాధం నెలకొందని, ఈ పరిస్థితిని మార్చాలని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. దేశంలోని 23 రాష్ట్రాల్లో జనాభాకు తగినట్లుగా డాక్టర్లు, నర్సుల నిష్పత్తి చాలా తక్కువగా ఉందని వెల్లడించింది. అందుకోసం దేశవ్యాప్తంగా 22 ఎయిమ్స్‌లు, 155 మెడికల్‌ కాలేజీలు నెలకొల్పాలని.. ఇందుకు అవసరమైన నిధుల్లో 60 శాతం కేంద్రం భరించాలని సూచించింది. ఇప్పటికే కొన్ని ఎయిమ్స్‌లు, కాలేజీలు పూర్తయ్యాయని తెలిపింది. 

సబర్బన్‌ ఏరియాల్లో మెడిసిటీలు 
ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ)తో పెద్ద స్థాయి ఆస్పత్రులను తీసుకురావాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం సూచించింది. మెడికల్‌ హబ్‌ల మాదిరిగా మెడిసిటీలు తీసుకురావాలని.. వీటిని గ్రామాలకు సమీపంలో ఏర్పాటు చేస్తే అక్కడకు డాక్టర్లు, నర్సులు వెళ్తారని పేర్కొంది. మెడిసిటీలలో పూర్తిస్థాయిలో ఆధునిక మౌలిక సదుపాయాలు ఉండేలా చూడాలని స్పష్టం చేసింది. ఆరోగ్య రంగంలో నాణ్యతను పెంచాలని, రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందేలా చూడాలని, దీని ఆధారంగా ఆస్పత్రులకు ర్యాంకులు ఇవ్వాలని ప్రతిపాదించింది.

ర్యాంకులకు అనుగుణంగా నిధులు ఇవ్వాలని సూచించింది. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం తమ బడ్జెట్‌లో 8 శాతం ఆరోగ్య రంగానికి కేటాయించాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం మేఘాలయ (9.1%), ఢిల్లీ (13.7%), పాండిచ్చేరి (8.6%) రాష్ట్రాలు మాత్రమే ఆ స్థాయిలో నిధులు కేటాయిస్తున్నాయని, మిగతా రాష్ట్రాలు 8 శాతం కంటే తక్కువే ఇస్తున్నాయని తెలిపింది. జీడీపీలో ఆరోగ్య రంగానికి 1.5 శాతమే కేటాయింపు ఉందని, వచ్చే రెండేళ్లలో 2.5 శాతానికి పెంచాలని, 2025 నాటికి 5 శాతానికి చేరుకోవాలని సూచించింది. చాలా దేశాలు 5 శాతానికిపైగా కేటాయిస్తున్నాయని వివరించింది. ప్రజలు ఆరోగ్యం కోసం అయ్యే ఖర్చులో 62.4 శాతాన్ని సొంతంగానే ఖర్చు చేస్తున్నారని.. ఈ విషయంలో మన దేశం 15వ స్థానంలో ఉందని తెలిపింది. ఏటా ఆరోగ్య ఖర్చులు భరించలేక 4.16 శాతం మంది పేదరికంలోకి వెళ్తున్నారని స్పష్టం చేసింది. 

ఇష్టమైన వ్యాక్సిన్‌ వేసుకునే వెసులుబాటు 
ఇప్పటికే ట్రయల్స్‌లో ఉన్న కరోనా వ్యాక్సిన్లను ప్రోత్సహించాలని.. సమగ్రంగా పరిశీలించి అనుమతులు ఇవ్వాలని పార్లమెంటరీ సంఘం సిఫార్సు చేసింది. ప్రజలు తమకు ఇష్టమైన కంపెనీలకు చెందిన కరోనా వ్యాక్సిన్‌ వేయించుకునే వెసులుబాటు కల్పించాలని.. కోవిడ్‌ తర్వాత వచ్చే ఇబ్బందులకు చికిత్స చేసే క్లినిక్‌లను నెలకొల్పాలని సూచించింది. ఢిల్లీ ఎయిమ్స్‌ మాత్రమే ఇలా ఒక క్లినిక్‌ను నెలకొల్పిందని, అలా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. దేశంలో కరోనా కాలంలో ప్రైవేట్‌ ఆస్పత్రులు రూ. 14 వేల కోట్ల మేర నష్టపోయాయని.. కరోనా కాలంలో ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య 75 శాతం తగ్గిందని పేర్కొంది. సాధారణ ఆపరేషన్లు తగ్గాయని, కీమోథెరపీ చికిత్స 64 శాతం తగ్గిందని వెల్లడించింది. నాన్‌ కోవిడ్‌ వైద్య సేవలు తగ్గాయని.. కరోనా మొదలైన మొదటి మూడు నెలల కాలంలో దేశంలో 4 లక్షల మంది చిన్నారులు ఇతర సాధారణ వ్యాక్సిన్లు వేయించుకోలేకపోయారని పేర్కొంది. కంటి, కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు 90 శాతం తగ్గాయని వివరించింది.

కమిటీ నివేదికలోని మరికొన్ని అంశాలు 
మన దేశంలో 10.6 శాతం మంది ఏదో రకమైన మానసిక సమస్యతో బాధపడుతున్నారు. వారికి అవసరమైన చికిత్స అందించే సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు, సైకియాట్రిక్‌ సోషల్‌ వర్కర్లు, ఆశ వర్కర్లు తక్కువగా ఉన్నారు. కాబట్టి నేషనల్‌ మెంటల్‌ హెల్త్‌ ప్రోగ్రాం ద్వారా నిధులతో మానవ వనరులను పెంచాలి. 
ఐఏఎస్, ఐపీఎస్‌ తరహాలో ఇండియన్‌ మెడికల్‌ సర్వీస్‌ (ఐఎంఎస్‌)ను ఏర్పాటు చేయాలి. 
కేన్సర్‌పై పీపీపీ పద్ధతిలో పరిశోధనా సంస్థలను ఏర్పాటు చేయాలి. ఏ ఏరియాలో ఏ రకంగా కేన్సర్‌ వస్తుందో గుర్తించాలి. దేశంలో 39 క్యాన్సర్‌ ఆస్పత్రులు నెలకొల్పాలి. 
జంతు సంబంధిత మానవ వ్యాధులు మరింతగా పెరుగుతున్నాయి. కాబట్టి దాన్ని అధిగ మించడానికి జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు చేయాలి. 
దేశంలో కేవలం 13 వైరస్‌ జబ్బుల పరిశోధన కేంద్రాలు (వీఆర్‌డీఎల్‌) ఉన్నాయి. వాటిని పెంచాల్సిన అవసరం ఉంది. 
వైద్యులకు కరోనా వస్తే వాళ్లకు ప్రత్యేకంగా సె లవు ప్రకటించాలి. ప్రోత్పాహకాలు ఇవ్వాలి. ఉన్నత చదువులకు వెళితే సాయం చేయాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement