Village services
-
పల్లెల్లో మూడేళ్లు వైద్య సేవలు
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఎంబీబీఎస్ పూర్తిచేసే వైద్యులు తప్పకుండా మూడేళ్లపాటు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాలని వైద్యారోగ్య రంగంపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అలా పనిచేయని వారి వైద్య డిగ్రీలను, రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని సూచించింది. ఈ మేరకు కేంద్రానికి సమగ్ర నివేదిక సమర్పించింది. ఎంబీబీఎస్ వైద్యులు గ్రామాల్లో ఉండేలా మౌలిక సదుపాయాలు కల్పించాలని.. వారి పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది. ప్రజల అవసరాలకు, ప్రభుత్వ ఆస్పత్రులకు మధ్య అగాధం నెలకొందని, ఈ పరిస్థితిని మార్చాలని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. దేశంలోని 23 రాష్ట్రాల్లో జనాభాకు తగినట్లుగా డాక్టర్లు, నర్సుల నిష్పత్తి చాలా తక్కువగా ఉందని వెల్లడించింది. అందుకోసం దేశవ్యాప్తంగా 22 ఎయిమ్స్‌లు, 155 మెడికల్ కాలేజీలు నెలకొల్పాలని.. ఇందుకు అవసరమైన నిధుల్లో 60 శాతం కేంద్రం భరించాలని సూచించింది. ఇప్పటికే కొన్ని ఎయిమ్స్‌లు, కాలేజీలు పూర్తయ్యాయని తెలిపింది. సబర్బన్ ఏరియాల్లో మెడిసిటీలు ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)తో పెద్ద స్థాయి ఆస్పత్రులను తీసుకురావాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం సూచించింది. మెడికల్ హబ్‌ల మాదిరిగా మెడిసిటీలు తీసుకురావాలని.. వీటిని గ్రామాలకు సమీపంలో ఏర్పాటు చేస్తే అక్కడకు డాక్టర్లు, నర్సులు వెళ్తారని పేర్కొంది. మెడిసిటీలలో పూర్తిస్థాయిలో ఆధునిక మౌలిక సదుపాయాలు ఉండేలా చూడాలని స్పష్టం చేసింది. ఆరోగ్య రంగంలో నాణ్యతను పెంచాలని, రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందేలా చూడాలని, దీని ఆధారంగా ఆస్పత్రులకు ర్యాంకులు ఇవ్వాలని ప్రతిపాదించింది. ర్యాంకులకు అనుగుణంగా నిధులు ఇవ్వాలని సూచించింది. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం తమ బడ్జెట్లో 8 శాతం ఆరోగ్య రంగానికి కేటాయించాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం మేఘాలయ (9.1%), ఢిల్లీ (13.7%), పాండిచ్చేరి (8.6%) రాష్ట్రాలు మాత్రమే ఆ స్థాయిలో నిధులు కేటాయిస్తున్నాయని, మిగతా రాష్ట్రాలు 8 శాతం కంటే తక్కువే ఇస్తున్నాయని తెలిపింది. జీడీపీలో ఆరోగ్య రంగానికి 1.5 శాతమే కేటాయింపు ఉందని, వచ్చే రెండేళ్లలో 2.5 శాతానికి పెంచాలని, 2025 నాటికి 5 శాతానికి చేరుకోవాలని సూచించింది. చాలా దేశాలు 5 శాతానికిపైగా కేటాయిస్తున్నాయని వివరించింది. ప్రజలు ఆరోగ్యం కోసం అయ్యే ఖర్చులో 62.4 శాతాన్ని సొంతంగానే ఖర్చు చేస్తున్నారని.. ఈ విషయంలో మన దేశం 15వ స్థానంలో ఉందని తెలిపింది. ఏటా ఆరోగ్య ఖర్చులు భరించలేక 4.16 శాతం మంది పేదరికంలోకి వెళ్తున్నారని స్పష్టం చేసింది. ఇష్టమైన వ్యాక్సిన్ వేసుకునే వెసులుబాటు ఇప్పటికే ట్రయల్స్‌లో ఉన్న కరోనా వ్యాక్సిన్లను ప్రోత్సహించాలని.. సమగ్రంగా పరిశీలించి అనుమతులు ఇవ్వాలని పార్లమెంటరీ సంఘం సిఫార్సు చేసింది. ప్రజలు తమకు ఇష్టమైన కంపెనీలకు చెందిన కరోనా వ్యాక్సిన్ వేయించుకునే వెసులుబాటు కల్పించాలని.. కోవిడ్ తర్వాత వచ్చే ఇబ్బందులకు చికిత్స చేసే క్లినిక్‌లను నెలకొల్పాలని సూచించింది. ఢిల్లీ ఎయిమ్స్ మాత్రమే ఇలా ఒక క్లినిక్‌ను నెలకొల్పిందని, అలా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. దేశంలో కరోనా కాలంలో ప్రైవేట్ ఆస్పత్రులు రూ. 14 వేల కోట్ల మేర నష్టపోయాయని.. కరోనా కాలంలో ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య 75 శాతం తగ్గిందని పేర్కొంది. సాధారణ ఆపరేషన్లు తగ్గాయని, కీమోథెరపీ చికిత్స 64 శాతం తగ్గిందని వెల్లడించింది. నాన్ కోవిడ్ వైద్య సేవలు తగ్గాయని.. కరోనా మొదలైన మొదటి మూడు నెలల కాలంలో దేశంలో 4 లక్షల మంది చిన్నారులు ఇతర సాధారణ వ్యాక్సిన్లు వేయించుకోలేకపోయారని పేర్కొంది. కంటి, కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు 90 శాతం తగ్గాయని వివరించింది. కమిటీ నివేదికలోని మరికొన్ని అంశాలు ►మన దేశంలో 10.6 శాతం మంది ఏదో రకమైన మానసిక సమస్యతో బాధపడుతున్నారు. వారికి అవసరమైన చికిత్స అందించే సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు, సైకియాట్రిక్ సోషల్ వర్కర్లు, ఆశ వర్కర్లు తక్కువగా ఉన్నారు. కాబట్టి నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాం ద్వారా నిధులతో మానవ వనరులను పెంచాలి. ►ఐఏఎస్, ఐపీఎస్ తరహాలో ఇండియన్ మెడికల్ సర్వీస్ (ఐఎంఎస్)ను ఏర్పాటు చేయాలి. ►కేన్సర్‌పై పీపీపీ పద్ధతిలో పరిశోధనా సంస్థలను ఏర్పాటు చేయాలి. ఏ ఏరియాలో ఏ రకంగా కేన్సర్ వస్తుందో గుర్తించాలి. దేశంలో 39 క్యాన్సర్ ఆస్పత్రులు నెలకొల్పాలి. ►జంతు సంబంధిత మానవ వ్యాధులు మరింతగా పెరుగుతున్నాయి. కాబట్టి దాన్ని అధిగ మించడానికి జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ►దేశంలో కేవలం 13 వైరస్ జబ్బుల పరిశోధన కేంద్రాలు (వీఆర్డీఎల్) ఉన్నాయి. వాటిని పెంచాల్సిన అవసరం ఉంది. ►వైద్యులకు కరోనా వస్తే వాళ్లకు ప్రత్యేకంగా సె లవు ప్రకటించాలి. ప్రోత్పాహకాలు ఇవ్వాలి. ఉన్నత చదువులకు వెళితే సాయం చేయాలి. -
రంగంలోకి సర్కారీ సైనికులు !
సాక్షి, విజయవాడ : యువకులు, నిరుద్యోగులకు ప్రభుత్వ సేవకులుగా అవకాశం దక్కనుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోయే సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారుల ఇంటికి చేర్చడంలో వీరు కీలక భూమిక పోషించనున్నారు. ప్రతి కుటుంబంలోని కష్టాలను స్వయంగా తెలుసుకుని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ప్రస్తుతం ఈ గ్రామసేవకుల నియామకం దిశగా అడుగులు పడుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే గ్రామ వలంటీర్ల వ్యవస్థ రూపొందనుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటన వెలువరించడం.. తాజాగా జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలోనూ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో పాటు గ్రామ వలంటీర్లకు ఉండాల్సిన అర్హతలు, ఎలా దరఖాస్తు చేయాలన్న విషయాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు సైతం వెలువరించింది. సీఎం ప్రకటనతో జిల్లాలో 24,523 మందికి ఉద్యోగవకాశాలు లభించనున్నాయి. ఇదీ సంగతి.. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే పాలన వ్యవహరాల్లో తమదైన రీతిలో మార్పులకు అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ప్రస్తుతం గ్రామ వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. ఎన్నికల ముందు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రచార సభలోనే ఇదే అంశంపై ప్రస్తావించారు. సీఎం అయిన వెంటనే వ్యవస్థ ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేశారు. వీరు ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమల్లో కీలకం కానున్నారు. సంక్షేమ పథకాల అమలులో కీలకం ప్రతి 50 కుటుంబాలకు ఓ వలంటీర్‌ను నియమించనున్నారు. పింఛన్లు, పౌరసరఫరాల సరుకులు పంపిణీ నుంచి డ్వాక్రా రుణాలు, ఇళ్ల పన్నులు.. ఇలా అన్ని రకాల సేవలను చేరువ చేయడంలోనూ కీలకంగా వ్యవహరించాల్సి ఉంది. 50 కుటుంబాల అవసరాలను తెలుసుకుని వారికి నిర్ణీత సమయంలోపే సేవలను అందించాల్సిన బాధ్యత సైతం ఆ వలంటీర్‌పై ఉంది. ఒక్కో గ్రామ వలంటీర్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేల గౌరవ వేతనం చెల్లించనుండగా.. వేతనం తక్కువైనప్పటికీ పలువురు నిరుద్యోగులు ఆశ పడుతున్నారు. జిల్లాలో 24,523 మందికి ఉపాధి.. జిల్లాలో మొత్తం 47,28,816 జనాభా ఉండగా.. 7,36,193 కుటుంబాలు నివశిస్తున్నాయి. ప్రతి 50 కుటుంబాలకు ఒక్కో వలంటీర్ చొప్పున జిల్లాలో 14,723 మంది, గ్రామ సచివాలయాల్లో మరో 9,800 మంది మొత్తం కలిపి 24,523 మందికి ఉపాధి లభించనుంది. వీరికి ప్రతి నెలా వేతనంగా రూ.73.61 కోట్లు చెల్లించాల్సి ఉంది. పట్టణాల్లో డిగ్రీ, గ్రామాల్లో ఇంటర్, ఏజెన్సీ ప్రాంతాల్లో పదో తరగతి చదివిన వారికి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 18 నుంచి 39 ఏళ్ల వయసున్న వారికి అర్హులుగా దరఖాస్తు చేయడానికి అవకాశం ఇచ్చారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు ఆధార్ కార్డు, విద్యార్హత ధ్రువపత్రంతో పాటు జనన, కుల, స్వస్థల ధ్రువపత్రాలు అవసరమవుతాయి. గ్రామ వలంటీర్ల నియామకాలు ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలు, నోటిఫికేషన్ సైతం ప్రభుత్వం వెలువరించడంతో దరఖాస్తుల ప్రక్రియ కోసం పార్టీలకు అతీతంగా యువత ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. -
సత్యసాయి గ్రామసేవలు ప్రారంభం
దసరా వేడుకలను పురస్కరించుకుని సత్యసాయి ట్రస్ట్ గ్రామ సేవలను సోమవారం ఘనంగా ప్రారంభించింది. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు ఆర్జే రత్నాకర్రాజు, కార్యదర్శి ప్రసాద్‌రావు ప్రశాంతి నిలయంలో గ్రామసేవ కార్యక్రమాన్ని పూజలు నిర్వహించి ప్రారంభించారు. తొమ్మిది రోజులు పాటు నిర్వహించే గ్రామసేవలో పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు మండలాల పరిధిలోని 126 గ్రామాలకు చెందిన సుమారు 60 వేల కుటుంబాలకు చీర, ధోవతి, సత్యసాయి అన్న ప్రసాదాలను పంపిణీ చేయనున్నారు. సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థులు, సిబ్బంది సుమారు 600 మంది సేవలు అందించనున్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యుడు రత్నాకర్రాజు మాట్లాడుతూ ప్రతి ఏడాది లాగే సత్యసాయి చూపిన మార్గంలో నడుస్తూ ఆయన సేవలను ట్రస్ట్ కొనసాగిస్తోందన్నారు. దసరా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రశాంతి నిలయంలో ఏర్పాటు చేశామన్నారు. తొమ్మిది రోజుల పాటు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు సాయికుల్వంత్ సభా మందిరంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారన్నారు. తొలి రోజు పుట్టపర్తి నగరపంచాయతీ పరిధిలో గ్రామ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలరించిన సంగీత కచేరి సత్యసాయిపై భక్తిప్రపత్తులు చాటుతూ చక్కటి స్వరాలతో విద్యార్థులు నిర్వహించిన సంగీత కచేరి భక్తులను అలరించింది.సోమవారం సాయంత్రం ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత సత్యసాయి మిరుపురీ సంగీత కళాశాల విద్యార్థులు,సిబ్బంది సంగీత కచేరి నిర్వహించారు. అనంతం వారు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.