సత్యసాయి గ్రామసేవలు ప్రారంభం
దసరా వేడుకలను పురస్కరించుకుని సత్యసాయి ట్రస్ట్ గ్రామ సేవలను సోమవారం ఘనంగా ప్రారంభించింది. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు ఆర్‌జే రత్నాకర్‌రాజు, కార్యదర్శి ప్రసాద్‌రావు ప్రశాంతి నిలయంలో గ్రామసేవ కార్యక్రమాన్ని పూజలు నిర్వహించి ప్రారంభించారు.
తొమ్మిది రోజులు పాటు నిర్వహించే గ్రామసేవలో పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు మండలాల పరిధిలోని 126 గ్రామాలకు చెందిన సుమారు 60 వేల కుటుంబాలకు చీర, ధోవతి, సత్యసాయి అన్న ప్రసాదాలను పంపిణీ చేయనున్నారు. సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థులు, సిబ్బంది సుమారు 600 మంది సేవలు అందించనున్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యుడు రత్నాకర్‌రాజు మాట్లాడుతూ ప్రతి ఏడాది లాగే సత్యసాయి చూపిన మార్గంలో నడుస్తూ ఆయన సేవలను ట్రస్ట్ కొనసాగిస్తోందన్నారు. దసరా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రశాంతి నిలయంలో ఏర్పాటు చేశామన్నారు. తొమ్మిది రోజుల పాటు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు సాయికుల్వంత్ సభా మందిరంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారన్నారు. తొలి రోజు పుట్టపర్తి నగరపంచాయతీ పరిధిలో గ్రామ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అలరించిన సంగీత కచేరి
సత్యసాయిపై భక్తిప్రపత్తులు చాటుతూ చక్కటి స్వరాలతో విద్యార్థులు నిర్వహించిన సంగీత కచేరి భక్తులను అలరించింది.సోమవారం సాయంత్రం ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత సత్యసాయి మిరుపురీ సంగీత కళాశాల విద్యార్థులు,సిబ్బంది సంగీత కచేరి నిర్వహించారు. అనంతం వారు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.