నిర్మాణంలో ఉన్న ఎయిమ్స్‌ను పరిశీలించనున్న సభ్యులు
సాక్షి, హైదరాబాద్: మంగళగిరిలో నిర్మాణం చేపట్టిన ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్)ను పరిశీలించేందుకు ఆరుగురు సభ్యుల ఉన్నతస్థాయి బృందం నేడు అమరావతికి రానుంది. రాయ్‌పూర్, న్యూఢిల్లీ ఎయిమ్స్ సభ్యులతోపాటు పీఎంఎస్‌ఎస్‌వై, పీజీఐ ఛండీగఢ్ సభ్యులు కూడా రానున్నారు. వీరితోపాటు వైద్య విద్యా సంచాలకుల కార్యాలయానికి చెందిన ఒకరు ఇందులో ఉంటారు. ఈనెల 5, 6 తేదీల్లో అమరావతిలో నిర్మాణ దశలో ఉన్న ఎయిమ్స్‌ను పరిశీలిస్తారు. ఎయిమ్స్‌ను వీలైనంత త్వరగా అమల్లోకి తెచ్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్చించనున్నారు.
ఇప్పటికే ఎయిమ్స్‌కు అనుమతులు వచ్చి రెండేళ్లు పూర్తయింది. ఇప్పటివరకూ ప్రహరీ గోడ, హైటెన్షన్ కరెంటు లైన్ల ఏర్పాటు కూడా పూర్తికాలేదు. భవన నిర్మాణాలన్నీ పూర్తయ్యేవరకూ వేచిచూస్తే మరో నాలుగేళ్లు పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పూర్తయిన భవనాల నిర్మాణాలను పరిశీలించి అనుకూలంగా వాటిని ఉపయోగించుకుని కొన్ని విభాగాలనైనా అమల్లోకి తెస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు. దీనికి సంబంధించి గుంటూరు, తెనాలి, మంగళగిరిలో అనుకూల భవనాలను పరిశీలిస్తారు. బృందంలో రాయ్‌పూర్ ఎయిమ్స్ డెరైక్టర్ డా.నితిన్ ఎం నాగార్కర్, ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు డీకే శర్మలు ఉంటారు. వైద్య కళాశాలకు సంబంధించిన సీనియర్ రెసిడెంట్లకు కావాల్సిన భవనాలు, హాస్టల్ గదులు, వైద్య సిబ్బందికి నివాసం ఉండటానికి కావాల్సిన భవనాలు అద్దెకు తీసుకుంటామని కేంద్రానికి రాష్ట్రం ఇప్పటికే లేఖ రాసింది.
నేడు మంగళగిరికి కేంద్ర బృందం
Published Mon, Sep 5 2016 12:55 AM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM
Advertisement
Advertisement