అలహాబాద్ : కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ అమ్మ మనసును చాటుకున్నారు. సార్వత్రిక ఎన్నికల పోరులో ప్రధాన ప్రత్యర్థి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పార్టీ తరపును గట్టి కౌంటర్లు ఇస్తూ.. రాజకీయ విశ్లేషకుల ప్రశంసలందుకుంటున్న ప్రియాంక తాజాగా కాంగ్రెస్ కార్యకర్తల మనసును దోచుకోవడంలో మరో మెట్టు పైకి ఎదిగారు. యూపీలోని ఒక చిన్నారికి అందాల్సిన వైద్యం పట్ల చురుకుగా స్పందించిన వైనం కాంగ్రెస్ శ్రేణులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
తీవ్ర అనారోగ్యంతో (ట్యూమర్) బాధపడుతున్న తమ పాప వైద్య ఖర్చులను భరించే స్తోమత తమకు లేదని ఆదుకోవాలంటూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక పేద తల్లిందండ్రులు ప్రియాంకను ఆశ్రయించారు. దీనికి వెంటనే స్పందించిన ఆమె సీనియర్ పార్టీ నాయకుడు రాజీవ్ శుక్లా, హార్ధిక్ పటేల్, మహ్మద్ అజారుద్దీన్లను సంప్రదించారు. మెరుగైన వైద్యం కోసం పాపను ఢిల్లీకి తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో వారు ఆరు సీట్లు చార్టర్ విమానంలో మైనర్ బాలికతోపాటు ఆమె తల్లిదండ్రులను హుటాహుటిన ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు తరలించారు. పాపకు అందించే వైద్య సేవలను తాను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తానని ప్రియాంక చెప్పారని స్థానిక కాంగ్రెస్ నేత జితేంద్ర తివారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment