Raghuvansh Prasad Singh
-
రఘువంశ్ ప్రసాద్ కన్నుమూత
పట్నా/న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, రఘువంశ్ ప్రసాద్ సింగ్(74) కన్నుమూశారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో ఆదివారం ఉదయం 11 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారని సన్నిహితులు తెలిపారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న రఘువంశ్ మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ తదితర ప్రముఖులు సంతాపం ప్రకటించారు. రఘువంశ్‌కు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. భార్య కొంతకాలం క్రితమే మరణించారు. గత శుక్రవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను ఎయిమ్స్ ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచారు. జూన్‌లో రఘువంశ్‌కు కోవిడ్–19 నిర్ధారణ కావడంతో పట్నా ఎయిమ్స్‌లో చికిత్స పొందారు. ఇటీవల మళ్లీ కోవిడ్ లక్షణాలు బయటప డటంతో ఢిల్లీ ఎయిమ్స్‌కు తీసుకువచ్చారు. ఆయన మృతదేహాన్ని ఆదివారం రాత్రి పట్నాకు తరలించారు. వైశాలి జిల్లాలోని స్వగ్రామం షాపూర్ గ్రామంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి. సోషలిస్టు నేత అయిన రఘువంశ్ ప్రసాద్ బిహార్‌లోని వైశాలి లోక్‌సభ స్థానం నుంచి ఐదు పర్యాయాలు ఎన్నికయ్యారు. యూపీఏ హయాంలో కేంద్రగ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్‌కు విశ్వాసపాత్రునిగా ఉంటూ రాష్ట్ర, జాతీయ స్థాయి రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించారు. 4 రోజుల క్రితం ఆస్పత్రిలో ఉండగానే ఆర్జేడీ నుంచి వైదొలుగుతున్నట్లు ఆ పార్టీ చీఫ్ లాలూప్రసాద్కు లేఖ రాశారు. కానీ, ఆయన రాజీనామాను రాంచీ జైలులో ఉన్న లాలూ అంగీకరించలేదు. ఆరోగ్యం కుదుటపడ్డాక మాట్లాడుకుందామంటూ జవాబిచ్చారు. -
రాజకీయ దిగ్గజాన్ని కోల్పోయాం : మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ కేంద్ర మంత్రి, బిహార్ సీనియర్ నేత, మాజీ ఆర్జేడీ నాయకుడు రఘువంశ్ ప్రసాద్ సింగ్ మరణం పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. గత రెండు రోజులుగా ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న సింగ్ (74) ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. క్షేత్రస్ధాయి నుంచి ఎదిగిన రఘువంశ్ ప్రసాద్ సింగ్‌కు గ్రామీణ భారతంపై పూర్తి అవగాహన ఉండేదని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఆయన మరణం విషాదకరమని కుటుంబ సభ్యులు, అభిమానులకు రాష్ట్రపతి సానుభూతి తెలిపారు. సీనియర్ నేత రఘువంశ్ ప్రసాద్ సింగ్ మన మధ్యలేరని, ఆయన మృతి బిహార్‌తో పాటు దేశానికి తీరనిలోటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బిహార్ ఓ రాజకీయ దిగ్గజాన్ని కోల్పోయిందని అన్నారు. నవభారత్, నవ బిహార్ నిర్మాణానికి రఘువంశ్ ప్రసాద్ సింగ్ పాటుపడ్డారని వ్యాఖ్యానించారు. ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు సింగ్ మరణం పట్ల దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బలహీనవర్గాలు, గ్రామీణ ప్రాంత వికాసానికి ఆయన గట్టిగా పోరాడేవారని అన్నారు. ఎల్జేపీ చీఫ్, కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ సింగ్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ సామాజిక న్యాయం కోసం నిత్యం తపించేవారని కొనియాడారు. బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తమ సహచరుడి మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రఘువంశ్ ప్రసాద్ సింగ్‌తో శుక్రవారం తాను మాట్లాడానని, ఇంతలోనే ఇలా జరగడంతో మాట రావడం లేదని, ఆయన మరణవార్త తనను కలచివేసిందని అన్నారు. చదవండి : అమెరికా ఎన్నికల్లో మన ప్రధాని మోదీ! -
కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత
బిహార్: కేంద్ర మాజీ మంత్రి రుఘువంశ్ ప్రసాద్ సింగ్ (74) ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఇటీవల కరోనాబారినపడ్డ ఆయన కోలుకున్నారు. అనంతరం అనారోగ్య సమస్యలు తలెత్తడంతో వారం క్రితం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. కాగా, ఆర్జేడీ పార్టీలో కీలక నేతగా ఉన్న రఘువంశ్ గురువారమే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. (చదవండి: అసెంబ్లీ ఎన్నికల వేళ ఆర్జేడీకి భారీ షాక్) -
అసెంబ్లీ ఎన్నికలు : ఆర్జేడీకి భారీ షాక్
పట్నా : అసెంబ్లీ ఎన్నికల ముందు బిహార్‌లో ప్రధాన ప్రతిపక్షం రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత రఘువంశ్ ప్రసాద్ రాజీనామా చేశారు. గురువారం ఆయన రాజీనామా లేఖను పార్టీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్‌కు పంపారు. అయితే రాజీనామాకు మాత్రం సరైన కారణాలు వెల్లడించలేదు. ప్రతిపక్షనేత తేజస్వీ యాదవ్‌తో ఆయనకు ఉన్న విభేదాల కారణంగానే పార్టీ నుంచి వైదొలిగనట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన ఎన్డీయే కూటమిలో చేరే అవకాశం ఉంది. కీలకమైన అసెంబ్లీ ఎన్నికల ముందు సీనియర్ నేత రాజీనామా ఆ పార్టీకి భారీ ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రఘువంశ్ ప్రసాద్ గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆర్జేడీలో లాలూ ప్రసాద్ యాదవ్ తరువాత అత్యంత సీనియర్ నేతగా, పార్టీ ఉపాధ్యక్షుడిగా గుర్తింపుపొందారు. కాగా ఈ ఏడాది చివరలో బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. (దేశంలో మరో ఎన్నికల సమరం) -
'ఆయన సీఎం అవడం నాకిష్టం లేదు'
న్యూఢిల్లీ: ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలకు నిలువనీడ లేకుండా పోయినట్లే రాజకీయాల్లో కూడా ఉమ్మడిగా కొన్ని పార్టీలు కలిసి పొత్తుపెట్టుకొని ముందుకు ఎక్కువకాలం మసిలే అవకాశం లేదు. బిహార్‌లో పరిస్థితి చూస్తుంటే అది నిజమేనేమో అనిపిస్తోంది. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ పై మరో ఆర్జేడీ నేత అసంతృప్తి వెళ్లగక్కారు. ఆయన సీఎం కావడం తనకు ఏ మాత్రం ఇష్టం లేదని ఆర్జేడీ సీనియర్ నేత రఘువంశ ప్రసాద్ సింగ్ అన్నారు. అంతకుముందు ఆర్జేడీకి చెందిన మాజీ ఎంపీ మహ్మద్ షహబుద్దీన్ కూడా దాదాపు ఇలాంటి విమర్శ చేశారు. ఆర్జేడీతో పొత్తుపెట్టుకోవడం వల్లే నితీశ్ జేడీయూ గెలిచిందని అందువల్లే ఆయన సీఎం అయ్యారని తేలికచేసి మాట్లాడారు. తాజాగా అదే వరుసలో రఘువంశ ప్రసాద్ నిలిచారు. 'మహాగట్భందన్ నాయకులు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అని నిర్ణయించారు. ఆ నిర్ణయాన్ని నేను వ్యతిరేకించాను. కానీ వారి మాట వినాల్సి వచ్చింది. నిజమైన నేత జనాల్లో నుంచి వస్తాడు. కానీ, వివిధ పార్టీల కలయికతో అధికారం చేపట్టాల్సి వస్తే అదృష్టం ఉన్న వ్యక్తి సీఎం అవుతారు. మా నేత ఎప్పటికీ లాలూ ప్రసాదే. నితీశ్ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి మాత్రమే' అంటూ ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇలా వరుసగా ఆర్జేడీ నేతలు నితీశ్ పై విమర్శల పర్వం కొనసాగిస్తే జేడీయూ నేతలు కూడా స్పందించి బిహార్‌లో వారి కూటమికి బీటలు వారే అవకాశం లేకపోలేదు. జేడీయూ, ఆర్జేడీ ఉమ్మడిగా బిహార్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.