'ఆయన సీఎం అవడం నాకిష్టం లేదు'
న్యూఢిల్లీ: ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలకు నిలువనీడ లేకుండా పోయినట్లే రాజకీయాల్లో కూడా ఉమ్మడిగా కొన్ని పార్టీలు కలిసి పొత్తుపెట్టుకొని ముందుకు ఎక్కువకాలం మసిలే అవకాశం లేదు. బిహార్లో పరిస్థితి చూస్తుంటే అది నిజమేనేమో అనిపిస్తోంది. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ పై మరో ఆర్జేడీ నేత అసంతృప్తి వెళ్లగక్కారు. ఆయన సీఎం కావడం తనకు ఏ మాత్రం ఇష్టం లేదని ఆర్జేడీ సీనియర్ నేత రఘువంశ ప్రసాద్ సింగ్ అన్నారు.
అంతకుముందు ఆర్జేడీకి చెందిన మాజీ ఎంపీ మహ్మద్ షహబుద్దీన్ కూడా దాదాపు ఇలాంటి విమర్శ చేశారు. ఆర్జేడీతో పొత్తుపెట్టుకోవడం వల్లే నితీశ్ జేడీయూ గెలిచిందని అందువల్లే ఆయన సీఎం అయ్యారని తేలికచేసి మాట్లాడారు. తాజాగా అదే వరుసలో రఘువంశ ప్రసాద్ నిలిచారు. 'మహాగట్భందన్ నాయకులు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అని నిర్ణయించారు. ఆ నిర్ణయాన్ని నేను వ్యతిరేకించాను. కానీ వారి మాట వినాల్సి వచ్చింది. నిజమైన నేత జనాల్లో నుంచి వస్తాడు.
కానీ, వివిధ పార్టీల కలయికతో అధికారం చేపట్టాల్సి వస్తే అదృష్టం ఉన్న వ్యక్తి సీఎం అవుతారు. మా నేత ఎప్పటికీ లాలూ ప్రసాదే. నితీశ్ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి మాత్రమే' అంటూ ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇలా వరుసగా ఆర్జేడీ నేతలు నితీశ్ పై విమర్శల పర్వం కొనసాగిస్తే జేడీయూ నేతలు కూడా స్పందించి బిహార్లో వారి కూటమికి బీటలు వారే అవకాశం లేకపోలేదు. జేడీయూ, ఆర్జేడీ ఉమ్మడిగా బిహార్లో అధికారాన్ని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.