
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ కేంద్ర మంత్రి, బిహార్ సీనియర్ నేత, మాజీ ఆర్జేడీ నాయకుడు రఘువంశ్ ప్రసాద్ సింగ్ మరణం పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. గత రెండు రోజులుగా ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న సింగ్ (74) ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. క్షేత్రస్ధాయి నుంచి ఎదిగిన రఘువంశ్ ప్రసాద్ సింగ్‌కు గ్రామీణ భారతంపై పూర్తి అవగాహన ఉండేదని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఆయన మరణం విషాదకరమని కుటుంబ సభ్యులు, అభిమానులకు రాష్ట్రపతి సానుభూతి తెలిపారు. సీనియర్ నేత రఘువంశ్ ప్రసాద్ సింగ్ మన మధ్యలేరని, ఆయన మృతి బిహార్‌తో పాటు దేశానికి తీరనిలోటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బిహార్ ఓ రాజకీయ దిగ్గజాన్ని కోల్పోయిందని అన్నారు. నవభారత్, నవ బిహార్ నిర్మాణానికి రఘువంశ్ ప్రసాద్ సింగ్ పాటుపడ్డారని వ్యాఖ్యానించారు.
ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు సింగ్ మరణం పట్ల దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బలహీనవర్గాలు, గ్రామీణ ప్రాంత వికాసానికి ఆయన గట్టిగా పోరాడేవారని అన్నారు. ఎల్జేపీ చీఫ్, కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ సింగ్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ సామాజిక న్యాయం కోసం నిత్యం తపించేవారని కొనియాడారు. బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తమ సహచరుడి మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రఘువంశ్ ప్రసాద్ సింగ్‌తో శుక్రవారం తాను మాట్లాడానని, ఇంతలోనే ఇలా జరగడంతో మాట రావడం లేదని, ఆయన మరణవార్త తనను కలచివేసిందని అన్నారు. చదవండి : అమెరికా ఎన్నికల్లో మన ప్రధాని మోదీ!
Comments
Please login to add a commentAdd a comment