స్వాతంత్య్ర పోరాటంలో గిరిజనుల త్యాగాలు: మోదీ
మొత్తం క్రెడిట్‌ను ఒక పార్టీ, ఒక కుటుంబం కొట్టేశాయి
కాంగ్రెస్‌పై ప్రధాని ధ్వజం
పాట్నా: దేశ స్వాతంత్య్రం కోసం ఎంతోమంది గిరిజన యోధులు పోరాటం సాగించారని, క్రెడిట్ మాత్రం కాంగ్రెస్ పార్టీ, ఒక కుటుంబం కొట్టేశాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆక్షేపించారు. గిరిజన నాయకుల పోరాటాలు, త్యాగాలను కాంగ్రెస్ చిన్నచూపు చూసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాల కుట్రల వల్ల అడవి బిడ్డలకు పేరు ప్రతిష్టలు దక్కలేదని, వారు అనామకులుగా మిగిలిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. గిరిజన పోరాట వీరుడు బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా శుక్రవారం బిహార్‌లోని జమూయిలో నిర్వహించిన వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
గిరిజన సంక్షేమానికి సంబంధించి రూ.6,640 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులు ప్రారంభించారు. ‘పీఎం జన్ మన్ యోజన’కు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ప్రసంగించారు. ఆదివాసీ సమాజాన్ని తాము ఆరాధిస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా గిరిజన జాతికి తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వాలని సంకలి్పంచామని తెలిపారు. ఇందులో భాగంగా బిర్సా ముండా జయంతిని ‘జనజాతీయ గౌరవ్ దివస్’గా ప్రకటించి, వేడుకలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే...
నిజం సమాధికి కుట్రలు
‘‘శతాబ్దాలుగా దేశ సాంస్కృతిక చరిత్ర, ఘనమైన వారసత్వాన్ని పరిరక్షించడంలో గిరిజనుల పాత్ర వెలకట్టలేనిది. శ్రీరాముడు ఒక రాజకుమారుడి నుంచి భగవంతుడిగా మారడానికి గిరిపుత్రులు సహకరించారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలోనూ కీలక పాత్ర పోషించారు. ఎన్నో త్యాగాలు చేశారు. ప్రాణాలు పోగొట్టుకున్నారు. కానీ, గత ప్రభుత్వాలు ఈ నిజాన్ని సమాధి చేసేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయతి్నంచాయి. కొందరి కుట్రల కారణంగా స్వాతంత్య్ర ఉద్యమ క్రెడిట్ మొత్తం ఒక పార్టీకి, ఒక కుటుంబానికి(నెహ్రూ) దక్కింది. దీనివల్ల బిర్సా ముండా, తిల్కా మాంజీ(18వ శతాబ్దపు సంథాల్ నాయకుడు) పేర్లు మరుగునపడ్డాయి. కొందరు ప్రచారం చేస్తున్నట్లు కేవలం ఒక్క కుటుంబం పోరాటం వల్లే దేశానికి స్వాతంత్య్రం వస్తే మరి బిర్సా ముండా ఎందుకోసం పోరాటం చేసినట్లు?’’ అని మోదీ ప్రశ్నించారు.
రూ.24,000 కోట్లతో జన్ మన్ యోజన
ఈరోజు ‘పీఎం జన్ మన్ యోజన’ ప్రారంభించుకుంటున్నాం. గిరిజనుల్లో అత్యంత వెనుకబడ్డ వర్గాల సంక్షేమం కోసం రూ.24,000 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేయబోతున్నాం. పథకం అమల్లోకి రావడం వెనుక రాష్ట్రపతి ముర్ము చొరవ ఉంది. ఈ క్రెడిట్ ఆమెకే దక్కుతుంది. గిరిజనుల జీవన విధానం ప్రకృతికి దగ్గరగా, పర్యావరణ హితంగా ఉంటుంది. ఆధునిక యుగంలో వారి జీవన విధానం అందరికీ అనుసరణీయం.
ఇది కూడా చదవండి: Pakistan: ఊపిరాడక వేల మంది ఆస్పత్రులకు పరుగులు
Comments
Please login to add a commentAdd a comment