Socialist
-
భారత్ లౌకిక దేశంగా ఉండాలనుకోవడం లేదా?
న్యూఢిల్లీ: ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ పీఠికలో చేర్చిన సామ్యవాద, లౌకిక( సోషలిస్ట్, సెక్యులర్) పదాలను తొలగించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను సోమవారం సుప్రీంకోర్టు విచారించి పిటిషన్లపై పలు ప్రశ్నలు సంధించింది. మాజీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి, లాయర్ విష్ణు శంకర్ జైన్, బలరామ్ సింగ్, లాయర్ అశ్వినీ ఉపాధ్యాయ్ తదితరులు దాఖలుచేసిన ఈ పిల్లను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం విచారించింది. ‘‘సామ్యవాదం అనే పదానికి అర్ధాలను ప్రాశ్చాత్య దేశాల కోణంలో చూడొద్దు. సోషలిజం పదానికి అర్థాన్ని అందరికీ సమాన అవకాశాలు అనే దృక్కోణంలోనే చూడాలి. సెక్యులరిజం అనే పదం భారత రాజ్యాంగంలో భాగమని గతంలో ఎన్నో తీర్పుల్లో న్యాయస్థానాలు తేలి్చచెప్పాయి. సెక్యులర్ పదం రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం. ఫ్రెంచ్ వారి సెక్యులరిజంకు బదులు ఆధునిక భావజాల సెక్యులరిజాన్ని భారత్ సంగ్రహించింది. మీరు భారత్ లౌకిక దేశంగా ఉండాలనుకోవాట్లేరా?’’అని జస్టిస్ ఖన్నా ప్రశ్నించారు. దీనికి లాయర్ విష్ణుశంకర్ జైన్ బదులిచ్చారు. ‘‘మేం లౌకిక అనే పదానికి వ్యతిరేకం కాదు. కానీ ఆ పదాన్ని పీఠికలో చేర్చిన విధానాన్ని మాత్రమే సవాల్ చేస్తున్నాం. తప్పుడు మార్గంలో సోషలిజం పదాన్ని చేరిస్తే వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ప్రమాదంలో పడుతుందని బీఆర్ అంబేడ్కర్ అభిప్రాయపడ్డారు. 1949 నవంబర్ 26నాటి రాజ్యాంగ పీఠికనే కొనసాగిద్దాం. సవరణల ద్వారా పీఠికలో సవరణ చేయకూడదు. అదనపు పదాలను చేర్చడంలో హేతుబద్ధత లోపించింది’అని లాయర్ వాదించారు. ‘‘కొత్తగా చేరిన పదాలు దేశంలో ఎలాంటి మార్పులు తీసుకురాకున్నా ఒక గందరగోళానికి తెరలేపాయి. దీంతో పీఠికలో ఎలాంటి మార్పులైనా చేయొచ్చన్న భావన తదుపరి ప్రభుత్వాల్లో నెలకొంది’’అని లాయర్ అశ్వినీ ఉపాధ్యాయ్ వాదించారు. వాదోపవాదనల తర్వాత కేసు విచారణ నవంబర్ 18వ తేదీకి వాయిదాపడింది. -
రక్షణ మంత్రిగా, సీఎంగా ఎనలేని సేవలందించారు!
న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగిన దిగ్గజ నేత ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ట పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ ములాయం సింగ్‌తో ఉన్న అనుబంధం గుర్తుచేసుకుంటూ....ములాయం సింగ్ మృతితో సోషలిస్ట్ స్వరం మూగబోయింది. ఆయన రక్షణ మంత్రిగా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా అందించిన సహకారం మరువలేనిదని అన్నారు. అంతేగాదు ఆయన అణగారిన వర్గాల కోసం చేసిన కృషిని ఎవరూ మరిచిపోలేరని చెప్పారు. దేశంలోని రాజ్యంగ విలువలను పరీరక్షించాల్సి అవసరం వచ్చినప్పుడల్లా తన మద్దతు కాంగ్రెసుకు ఉంటుందని ములాయం సింగ్ అనేవారని సోనియా గాంధీ భావోద్వేగంగా చెప్పారు. ములాయం సింగ్ యాదవ్ దీర్ఘకాలిక అనారోగ్యంతో గురుగ్రాంలో మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. (చదవండి: ఓటమెరుగని నేత.. అయినా ములాయంకు ఆ కోరిక మాత్రం తీరలేదు) -
రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే కుట్ర
భారత రాజ్యాంగం దానికదే ఒక విప్లవం. రెండు వేల సంవత్సరాలకు పైగా ఉన్న ఒక అసమాన వ్యవస్థ నిర్మాణాన్ని అది బద్దలు చేసింది. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ ఒక్కటి చేయగలిగింది. అయితే కొంతకాలంగా రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతియ్యడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగమే రాజ్యాంగ పీఠిక నుంచి ‘సోషలిస్టు’ (సామ్యవాద), ‘సెక్యులర్’ (లౌకికవాద) పదాలను తొలగించాలని సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం! పైగా తన వాదనకు బలం చేకూర్చుకోవడానికి సోషలిస్టు భావనను వ్యతిరేకించినట్టుగా అంబేడ్కర్ మాటలను ఆయన ఉటంకించారు. ఇది అంబేడ్కర్‌ను పూర్తిగా తప్పుగా అర్థం చేసుకోవడమే! భారతదేశ చరిత్రను అర్థం చేసుకోవాలంటే, ‘భారత రాజ్యాంగం అమలుకు ముందు, అటు తర్వాత’ అని చూడాల్సి ఉంటుంది. భారత రాజ్యాంగానికి ముందు ఈ దేశంలో మనుషులంతా ఒక్కటి కాదు. కులాలు, మతాలు, ప్రాంతాలుగా విడివడి ఉన్నారు. కుల సమాజాన్ని సృష్టించి, పెంచి పోషించిన మనువాదం ఒక పరిపాలనాపత్రంగా, అదే శాసనంగా, అదే రాజ్యాంగంగా అమలు అవుతూ సమాజంలో అంత రాలను ఇంకా బలంగా వేళ్ళూనుకొనేలా చేసింది. అలాంటి సంద ర్భంలో కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ రాజ్యాంగం ఒక్కటి చేయగలిగింది. అప్పటి వరకు కులాన్ని బట్టి విలువ ఉండేది. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క విలువను మనువాదం ప్రబోధించింది. కానీ భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి ఒక ఓటు, ఒక ఓటుకు ఒకే విలువను కల్పించి, కనీసం దానిలోనైనా ఒక సమానత్వ ప్రపంచాన్ని అందించింది. అందుకే భారత రాజ్యాంగం దానికదే ఒక విప్లవం. రెండు వేల సంవత్సరాలకు పైగా ఉన్న ఒక అసమాన వ్యవస్థ నిర్మాణాన్ని అది బద్దలు చేసింది. అయితే కొంతకాలంగా భారత రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తియ్యడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగం గానే గతవారం కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్యస్వామి రాజ్యాంగ పీఠిక నుంచి ‘సోషలిస్టు’(సామ్యవాద), ‘సెక్యులర్’ (లౌకిక వాద) పదాలను తొలగించాలని పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ సెప్టెంబర్ 23న విచారణకు రానున్నది. ఇదే విషయమై, 2020 జూలైలో న్యాయవాది విష్ణు శంకర్ కూడా పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణకు అంగీకరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నేతృత్వంలోని ధర్మాసనం ముందు దీన్ని విచారించనున్నారు. సోషలిస్టు, సెక్యులర్ అనే పదాలు రాజ్యాంగ సభ ద్వారా ఆమోదించిన పీఠికలో లేవనీ, 1976లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ వీటిని చేర్చారనీ, రాజ్యాంగ సభ చర్చలలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ లాంటి వాళ్ళు కూడా వీటిని వ్యతిరేకించారనీ ఈ పిటిషన్లో పేర్కొ న్నారు. పిటిషనర్‌గా ఉన్న సుబ్రహ్మణ్యస్వామి తన వాదనకు బలం చేకూర్చుకోవడానికి బాబాసాహెబ్ అంబేడ్కర్ మాటలను ఉటం కించినట్టు కనిపిస్తున్నది. అయితే, అంబేడ్కర్ మాటలను పరిశీలిస్తే సుబ్రహ్యణ్యస్వామియే అంబేడ్కర్‌ను తప్పుగా అర్థంచేసుకున్నట్టు కనిపిస్తున్నది. ఆ రోజు సభలో అంబేడ్కర్ మాట్లాడుతూ... ‘‘రాజ్యాం గాన్ని మనం ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా రూపొందించు కోవాలి. భవిష్యత్‌లో ప్రజలు ఎటువంటి విధానాలను అవలంబించా లనుకుంటారో వారికి అవకాశం ఇవ్వాలి. అంతేగానీ ఇప్పుడే అన్ని విషయాలను ముగించకూడదు. అంతేకాకుండా, రాజ్యాంగంలోని నాలుగవ భాగమైన ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచిన అంశాలన్నీ కూడా సోషలిస్టు భావనలను సమర్థిస్తు్తన్నాయనే విషయాన్ని గుర్తుం చుకోవాలి’’ అంటూ రాజ్యాంగ సభకు కేటీ షా ప్రతిపాదించిన సవరణకు సమాధానమిచ్చారు. అంబేడ్కర్ ఎక్కడా, సోషలిస్టు భావనను వ్యతిరేకించింది లేదు. పైగా దాని సారాంశాన్ని ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచినట్టు పేర్కొన్నారు. సరిగ్గా ఇక్కడే అంబేడ్కర్‌ను అర్థం చేసుకోవడానికి రాజ్యాంగ సభలో మాట్లాడింది మాత్రమే సరిపోదు. ఒకరకంగా అది అప్పటి నాయకుల ఉమ్మడి అభిప్రాయం కూడా కావచ్చు. అయితే అంబేడ్కర్ మొదటినుంచీ సమానత్వ సమాజ స్థాపనకు పాటుపడిన వ్యక్తి. అంతేకాకుండా, రాజ్యాంగ సభలో తాను సభ్యుడిగా ఉంటానో లేదో నని భావించి, 1946లో రాజ్యాంగ సభకు ఒక మెమోరాండంను సమర్పించారు. దానినే ‘స్టేట్స్ అండ్ మైనారిటీస్’ అంటారు. అందులో ప్రభుత్వం సోషలిస్టు విధానాలను అనుసరించాలని, దానికి స్టేట్ సోషలిజం అనే మాటను కూడా ఆయన వాడారు. అందులో ఆర్థికపరమైన అంశాలను పేర్కొంటూ– దేశంలోని భారీ పరిశ్రమలను ప్రభుత్వమే నిర్వహించాలనీ, ఇన్సూరెన్స్ లాంటి ఆర్థిక సంస్థలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాలనీ, దేశవ్యాప్తంగా ఉన్న భూములను జాతీయం చేయాలనీ ప్రతిపాదించారు. ఈ విషయాలన్నింటినీ రాజ్యాంగంలో పొందుపరచడానికి తన శాయశక్తులా కృషి చేశారు. అయినా సఫలం కాలేదు. అటువంటి సామాజిక మార్పును కోరుకుని, దాని కోసమే యావత్ జీవితాన్నే ప్రజలకు సమర్పించిన ఓ మహో న్నత వ్యక్తి వ్యాఖ్యలను తప్పుగా, తమ సోషలిస్టు వ్యతిరేక భావాలకు మద్దతుగా వాడుకోవడం విచారకరం. ఈ విషయం అట్లా ఉంచితే, 1976లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ïపీఠికలో ‘సోషలిస్టు, సెక్యులర్’ అనే పదాలను మాత్రమే కాకుండా, ఇంకా చాలా విష యాలను రాజ్యాంగంలో చేర్చారు. అయితే 1977లో జనతాపార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చాలా విషయాలను 43వ సవరణ ద్వారా తొలగించారు. అయితే రాజ్యాంగ పీఠికలోని ఆ రెండు పదాల జోలికి మాత్రం పోలేదు. ప్రస్తుత పిటిషనర్ సుబ్రహ్యణ్యస్వామి అప్పుడు జనతాపార్టీ లోక్‌సభ సభ్యుడిగా గెలిచారు. మరి అప్పుడు తన గొంతును ఎందుకు వినిపించలేదో ఆయనకే తెలియాలి. 2008లో ‘గుడ్ గవర్నెన్స్ ఇండియా ఫౌండేషన్’కు చెందిన సంజీవ్ అగర్వాల్ ఇదే విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.జి.బాలకృష్ణన్ నాయకత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. ‘‘సోషలిజం అనగానే అదేదో కమ్యూనిస్టులకు సొంతమైనట్టు అను కోవడం సరైనది కాదు. ప్రజల సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం కూడా అందులో భాగమే’’ అని వ్యాఖ్యానించింది. అందు వల్ల ఆ పదాలను తొలగించాల్సిన అవసరమే లేదని భారత అత్యు న్నత న్యాయస్థానం ఆనాడు కుండ బద్దలుకొట్టింది. ప్రస్తుతం మళ్లీ ఎందుకు ఈ ప్రతిపాదన ముందుకుతెస్తున్నారనేది ప్రశ్న. దీనికి ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక, సామాజిక విధానాలు... సోషలిస్టు, సెక్యులర్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ పరిశ్రమలను, ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు, కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా మైనారిటీ మతాలను, వాటికి సంబంధించిన సంస్థలను వేధిస్తుండడం ఎక్కువైందని అంత ర్జాతీయ సంస్థలు ఎన్నో నివేదికల ద్వారా వెల్లడించాయి. ఎవరైనా ఈ విషయాలన్నింటినీ కోర్టుల్లో సవాల్ చేస్తారని ముందే ఊహించి, వాటిని తొలగిస్తే ఇక నైతికంగా కూడా తమకు ఎదురు ఉండదని భావించి అటువంటి పిటిషన్‌ను అధికార పార్టీ సభ్యుడే వేయడం జరిగి ఉండొచ్చనే అభిప్రాయానికి రావడవం తప్పేమీకాదు. అదే విధంగా భారత దేశంలో హిందూమతాన్ని అధికార మతంగా చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నది. దానికి రాజ్యాంగాన్నే మార్చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టు సా«ధువులు, సంతులు స్వయంగా ప్రకటించారు. అందుకనుగుణంగానే ఇప్పటికే ముప్ఫై పేజీల డాక్యుమెంటు రూపొందించినట్టు కూడా ప్రకటించారు. ఇటువంటి నేపథ్యం నుంచి ఈ పీఠికను చూడాల్సి ఉంది. నిజానికి రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు సోషలిస్టు, సెక్యులర్ స్ఫూర్తిని బలపరచడమే కాకుండా నిర్దిష్టమైన మార్గాన్ని చూపుతున్నాయి. సోషలిస్టు, సెక్యులర్ పదాలు భారత రాజ్యాంగాన్ని మరింత శక్తిమంతం చేస్తున్నాయే తప్ప ఎటువంటి దుష్ప్రభావాన్నీ కలిగించడం లేదు. భారత రాజ్యాంగ రక్షణ ఈ దేశ సామాజిక ప్రగతికీ, మనుగడకూ ఒక తక్షణ అవసరంగా ఉంది. అందువల్ల రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే ఇటువంటి కుట్రలను భారత సమాజం సహించబోదని ఆశిద్దాం. (చదవండి: చరిత్రను పాతిపెట్టి ఏం బావుకుంటారు?) - మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు -
రఘువంశ్ ప్రసాద్ కన్నుమూత
పట్నా/న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, రఘువంశ్ ప్రసాద్ సింగ్(74) కన్నుమూశారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో ఆదివారం ఉదయం 11 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారని సన్నిహితులు తెలిపారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న రఘువంశ్ మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ తదితర ప్రముఖులు సంతాపం ప్రకటించారు. రఘువంశ్‌కు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. భార్య కొంతకాలం క్రితమే మరణించారు. గత శుక్రవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను ఎయిమ్స్ ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచారు. జూన్‌లో రఘువంశ్‌కు కోవిడ్–19 నిర్ధారణ కావడంతో పట్నా ఎయిమ్స్‌లో చికిత్స పొందారు. ఇటీవల మళ్లీ కోవిడ్ లక్షణాలు బయటప డటంతో ఢిల్లీ ఎయిమ్స్‌కు తీసుకువచ్చారు. ఆయన మృతదేహాన్ని ఆదివారం రాత్రి పట్నాకు తరలించారు. వైశాలి జిల్లాలోని స్వగ్రామం షాపూర్ గ్రామంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి. సోషలిస్టు నేత అయిన రఘువంశ్ ప్రసాద్ బిహార్‌లోని వైశాలి లోక్‌సభ స్థానం నుంచి ఐదు పర్యాయాలు ఎన్నికయ్యారు. యూపీఏ హయాంలో కేంద్రగ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్‌కు విశ్వాసపాత్రునిగా ఉంటూ రాష్ట్ర, జాతీయ స్థాయి రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించారు. 4 రోజుల క్రితం ఆస్పత్రిలో ఉండగానే ఆర్జేడీ నుంచి వైదొలుగుతున్నట్లు ఆ పార్టీ చీఫ్ లాలూప్రసాద్కు లేఖ రాశారు. కానీ, ఆయన రాజీనామాను రాంచీ జైలులో ఉన్న లాలూ అంగీకరించలేదు. ఆరోగ్యం కుదుటపడ్డాక మాట్లాడుకుందామంటూ జవాబిచ్చారు. -
సోషలిజానికి సరికొత్త భాష్యం
లాటిన్ అమెరికాలోనే కాక ప్రపంచవ్యాప్తంగా లక్షలాది అభిమానులను సంపాదించుకొన్న విప్లవ తాత్వికవేత్త మార్తా హర్నేకర్. విద్యార్థి దశలోనే ఉద్యమ ధారగా మొదలైన ఆమె జీవితం తత్వవేత్తగా, మార్క్సిస్టు మేధావిగా, మహా రచయిత్రిగా, పాత్రికేయురాలిగా, ప్రపంచ ప్రఖ్యాత రచయిత్రిగా ఎదిగిన తీరు ప్రజాస్వామిక కాంక్షాపరులందరికీ ఆదర్శప్రాయంగా నిలిచింది. ఆమె తెలుగు రాష్ట్రాల్లోని మార్క్సిస్టు అభిమానులకు, ప్రజాస్వామిక ఉద్యమకారులకు పరిచయమున్న విప్లవ కంఠం. ప్రజాస్వామ్యం అట్టడుగు స్థాయి నుంచి పటిష్టం చేయడం ద్వారా మాత్రమే సోషలిజం కల సాకారమవుతుందని ఆమె తేల్చి చెప్పారు. నిత్య సంఘర్షణావాది, నిరంతర సత్య శోధకురాలు మార్తా హర్నేకర్ గతనెల 14వ తేదీన తుదిశ్వాస విడవడం ప్రజాస్వామిక అభిమానులకు తీరని లోటు. ‘‘ప్రపంచంలో రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. భారీ సైనిక శక్తి, శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధితో అమెరికాతో సహా అనేక బహుళజాతి కంపెనీలు నూతన దోపిడీ విధానాలను కొనసాగిస్తున్నాయి. దీనితో ప్రజలు మరింత అశక్తులుగా తయారవుతున్నారు. సంపద కొద్దిమంది చేతుల్లోకి చేరిపోతుండడం వల్ల పేదరికం, వివక్ష మరింతగా పెరిగిపోతున్నది’’ అని ఆధునిక మార్క్సిస్టు మేధావి మార్తా హర్నేకర్ చేసిన వ్యాఖ్యలు ఆధునిక సామాజిక స్థితిగతు లకు అద్దం పడుతున్నాయి. మార్క్సిజాన్ని సమకాలీన సమాజానికి అన్వయించడంలో నిరం తరం కృషి చేసిన గొప్ప తాత్విక వేత్త మార్తా హర్నేకర్. విద్యార్థి దశలోనే ఉద్యమధారగా మొదలైన ఆమె జీవితం తత్వవేత్తగా, మార్క్సిస్టు మేధావిగా, మహా రచయిత్రిగా, పాత్రికేయురాలిగా, ప్రపంచ ప్రఖ్యాత రచయిత్రిగా ఎదిగిన తీరు ప్రజాస్వామిక కాంక్షాపరులందరికీ ఆదర్శప్రా యంగా నిలిచింది. మార్తా హర్నేకర్ తెలుగు రాష్ట్రాల్లోని మార్క్సిస్టు అభి మానులకు, ప్రజాస్వామిక ఉద్యమకారులకు పరిచయమున్న విప్లవ కంఠం. తెలంగాణ ఆవిర్భావం తరువాత హైదరాబాద్‌లో 2014 మార్చిలో ఏర్పాటు చేసిన ‘‘సోషలిజం–ప్రజాస్వామ్యం’’ అంతర్జాతీయ సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని నాలుగు రోజుల పాటు ఎన్నో అంశాలపై చర్చించడం తెలంగాణ ఉద్యమకారులకూ, ప్రజాస్వామిక వాదులకూ, విప్లవాభిమానులకూ ఎంతో స్ఫూర్తినిచ్చింది. మార్తాహర్నే కర్ కలం నుంచి వెల్లువెత్తిన సైద్ధాంతిక భేదాభిప్రాయాలూ, సామాజిక అంచనాలూ వంటి వేనవేల రచనలు ఎందరినో ఆలోచింపజేశాయి. ఆమె ప్రపంచ మార్క్సిస్టు మేధావుల్లో ఒక నూతన ఆలోచనలకు పునా దులు వేసిన అగ్రగామి. లాటిన్ అమెరికాలోనే కాక ప్రపంచవాప్తంగా లక్షలాది అభిమానులను సంపాదించుకొన్న విప్లవ తాత్వికవేత్త. మార్తా రాసిన ‘రీ బిల్డ్ ద లెఫ్ట్’ ఎన్నో విమర్శలనెదుర్కొన్నప్పటికీ ప్రపంచవ్యా ప్తంగా కమ్యూనిస్టుల్లో సైద్ధాంతిక చర్చను రేపిన పుస్తకం, మార్క్సిస్టు సైద్ధాంతిక ఆచరణకు సరికొత్త అర్థం చెప్పిన రచన అని చెప్పొచ్చు. అటు వంటి నిత్య సంఘర్షణావాది, నిరంతర సత్య శోధకురాలు మార్తా హర్నే కర్ గతనెల 14వ తేదీన తుది శ్వాస విడవడం ప్రజాస్వామిక అభిమాను లకు తీరని లోటు. మార్తా హర్నేకర్ ఆస్ట్రియన్ మూలాలు కలిగిన కుటుంబంలో 1937లో చిలీలో జన్మించారు. చిలీలోని క్యాథలిక్ విశ్వ విద్యాలయంలో మానసిక శాస్త్రంలో పట్టా పొందారు. ఆ తర్వాత పారి స్లో పోస్ట్ గ్రాడ్యు యేషన్ చేశారు. ప్రముఖ విద్యావేత్త, లూయీస్ ఆల్తూసర్ వద్ద మార్తా హర్నేకర్ శిక్షణ పొందారు. 1963–1968 వరకు పారిస్‌లో ఉన్న మార్తా ఆనాడు ఉధృతంగా సాగిన పారిస్ విద్యార్థి ఉద్యమం నుంచి స్ఫూర్తిపొం దారు. 1968లో చిలీకి తిరిగి వచ్చిన మార్తా హర్నేకర్ చిలీ విశ్వవిద్యాల యంలో చారిత్రక భౌతికవాదం, రాజకీయా ర్థశాస్త్రం అధ్యాపకురాలిగా పనిచేశారు. 1968లోనే చిలీ సోషలిస్టు పార్టీలో చేరి క్రియాశీలకంగా పని చేసిన అనుభవం ఆమెను సైద్ధాం తికంగా, ఆచరణాత్మకంగా మరింతగా రాటుదేలేలా చేశాయి. కేరళ తర్వాత ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చిన కమ్యూనిస్టు ప్రభుత్వం చిలీలోని అలెండి ప్రభుత్వమే. 1970లో చిలీలో అలెండి ఎన్ని కల ద్వారా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. చిలీ సోషలిస్టు పార్టీ నేత సాల్వడర్ అలెండి నాయకత్వంలో మార్తా పనిచేశారు. అయితే 1973 సెప్టెంబర్ 11న అమెరికా కుట్రలో సైనిక తిరుగుబాటు జరిపి అలెండి ప్రభుత్వాన్ని కూలదోశారు. అలెండి అనుచరులందరినీ హత్య చేయ డమో, జైల్లో పెట్టడమో జరిగింది. మార్తా మాత్రం చిలీ నుంచి తప్పిం చుకొని క్యూబా చేరుకున్నారు. క్యూబాలో ఒక అధ్యయన సంస్థను స్థాపించి, తన పరిశోధనలను, రచనా వ్యాసంగాన్నీ కొనసాగించారు. అంతకు ముందు మార్తా విద్యార్థి దశలో ఉండగానే 1959లో క్యూబాను సందర్శించారు. అప్పటికే క్యూబా విముక్తిని సాధించింది. క్యూబా విప్లవంలో ‘ఎర్రగడ్డం’ యోధుడిగా పేరుపొందిన మాన్యుల్ పినెరోను మార్తా వివాహం చేసుకున్నారు. వారిద్దరికీ ఒక కూతురు. ఆమె పేరు కమిల. మార్తా భర్త పినెరో 1998లో కారు ప్రమాదంలో మరణించారు. క్యూబాలో ఉన్న సమయంలో మార్తా హర్నేకర్ లాటిన్ అమెరికా చరిత్ర, ఉద్యమాలు, అనుభవాలెన్నింటినో ప్రత్యక్షంగా పాల్గొన్న వారి ద్వారా సేకరించారు. ఆ విధంగా లాటిన్ అమెరికా ఉద్యమాల చరిత్రను ఒక ప్రత్యేక దృష్టితో పరిశీలించారు. మార్క్సిజాన్ని లాటిన్ అమెరికాకు అన్వ యించి ఆమె 80కి పైగా పుస్తకాలు రాశారు. అందులో మొట్టమొదట చెప్పుకోవాల్సింది. ‘చారిత్రక భౌతిక వాదం–ప్రాథమిక సూత్రాలు’ అన్న పుస్తకం. ఈ పుస్తకం 60కి పైగా ముద్రణలు పొందింది. మొదట స్పానిష్‌లో ప్రచురితమైన ఆ పుస్తకం, ఆ తర్వాత ఇంగ్లిష్తో పాటు ప్రపంచంలోని చాలా భాషల్లోకి అనువాదమైంది. ఆమె రచనల్లో ‘ఎ వరల్డ్ టు బిల్డ్’, ‘ఐడియాస్ ఫర్ స్ట్రగుల్’ వెనిజులా విప్లవనాయకుడు చావెజ్ ఇంటర్వ్యూతో రూపొందిన పుస్తకం, ‘రీ బిల్డింగ్ ద లెఫ్ట్’ పుస్తకాలు ప్రపంచ ప్రఖ్యాతి పొందినవి. చివరి రెండు పుస్తకాలు తెలుగు లోకి కూడా అనువాద మయ్యాయి. మార్తా మార్క్సిస్టు తాత్విక విష యాల వెలుగులో ఆచరణకు సంబంధించిన విషయాలను ప్రధానంగా చర్చించారు. ముఖ్యంగా మార్క్సిస్టు సిద్ధాంతాలతో పనిచేస్తోన్న రాజ కీయ పార్టీల ఆచరణను మార్తా విమర్శనాత్మక దృష్టితో చూశారు. కమ్యూనిస్టు, మార్క్సిస్టు పార్టీల సిద్ధాంత సంక్షోభాన్ని ప్రము ఖంగా ఎత్తిచూపారు. ముఖ్యంగా మూడు అంశాలను ఆమె లేవనెత్తారు. కారల్‌మార్క్స్ పేర్కొన్న పెట్టుబడిదారీ విధానానికి ప్రస్తుతం కొనసాగు తోన్న పెట్టుబడిదారీ పద్ధతులకూ ఎంతో తేడా ఉన్నదని, దానిని అర్థం చేసుకోవడంలో మార్కిస్టులుగా మనం విఫలమవుతున్నామని పేర్కొన్నారు. పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేసిన ఆటోమేషన్, డిజిటల్, కంప్యూ టర్లు, రోబోల పాత్ర గురించి విశ్లేషించుకోవాలని, అవి ఉత్పత్తి నుంచి కార్మిక వర్గాన్ని తొలగిస్తున్న అంశాలను అర్థం చేసు కోవాలని మార్తా అభిప్రాయపడ్డారు. కొద్ది మంది మినహా ప్రపంచం లోని అన్ని వర్గాల ప్రజల జీవన ప్రమాణాలు రోజురోజుకూ దిగజారి పోతున్నాయని, గతంలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగం పెరిగి పోతున్నదని చెప్పారు. సమాచార విప్లవం పెట్టుబడిదారీ విధానాన్ని ముందుకు తీసుకెళ్ళిందని, సామ్రాజ్యవాదం రూపంలో మార్చుకున్నదే కానీ, కను మరుగు కాలేదని కూడా ఆమె స్పష్టం చేశారు. రెండో అంశంగా, కమ్యూనిస్టుల ఒంటెద్దు పోకడలను ఎత్తిచూ పారు. ప్రపంచంలో కొనసాగుతున్న నయా ఉదారవాదం, ప్రపంచీకర ణకు వ్యతిరేకంగా పోరాడుతున్న సమయంలో కలిసివచ్చే శక్తులన్నిం టితో కలిసి పనిచేయాలని, కేవలం కమ్యూనిస్టు సభ్యులతో మాత్రమే విజయం సాధించలేమని ఆమె పేర్కొన్నారు. సోదరభావం, సమస మాజం ఆశించే వాళ్ళు, కార్మిక వర్గ హక్కుల కోసం, ప్రజాస్వామ్య రక్షణ కోసం పోరాడే వాళ్లందరితో కలిసి పోరాడాలని ఆమె స్పష్టం చేశారు. అంతేకాకుండా గత ఉద్యమాల నుంచి, గత సోషలిస్టు ప్రభుత్వాలు, వ్యవస్థలు అందించిన అనుభవాలను అధ్యయనం చేయాలని ఆమె సూచించారు. అందుకు గాను లాటిన్ అమెరికాలో గత రెండు వందల ఏళ్ళుగా సాగుతున్న ఉద్యమాలను మార్తా అధ్యయనం చేశారు. మరొక ముఖ్యమైన విషయాన్ని మార్తా పదే పదే చెపుతుండేవారు. మార్క్సిజంలో అత్యంత ముఖ్యమైన చారిత్రక భౌతిక వాదం గురించి ఆమెది ప్రత్యేకమైన అధ్యయనదృష్టి. చరిత్రను భౌతికవాద దృష్టితో చూడాలని మార్క్సిజం చెపుతున్న మాటను ఆమె గుర్తు చేస్తూ, ఇప్పటి వరకూ చారిత్రక భౌతిక వాదాన్ని యూరప్‌కే పరిమితం చేసి చూస్తు న్నామని ఆమె విమర్శించారు. ఏ దేశానికి ఆ దేశ ప్రత్యేక సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఉంటాయనే విషయాన్ని విస్మరించడం వల్ల చాలా దేశాల్లో విప్లవాలు విజయం సాధించలేకపోయాయి. మనదేశంలో ఉన్న సామాజిక సమస్యలు, ప్రత్యేకించి కుల వ్యవస్థ ప్రభావాన్ని ఇప్పటికీ కూడా శాస్త్రీయ పద్ధతిలో విశ్లేషించలేకపోతున్నాము. మార్తా హర్నేకర్ మరొక విషయాన్ని చాలా నిక్కచ్చిగా తేల్చి చెప్పారు. కార్మిక వర్గ నియంతృత్వం ద్వారానే సోషలిజం సాధ్యమవు తుందనే వాదనను ఆమె తిరస్కరించారు. ప్రజాస్వామ్యాన్ని అట్టడుగు స్థాయి నుంచి పటిష్టం చేయడం ద్వారా మాత్రమే సోషలిజం కల సాకారమవుతుందని ఆమె తేల్చి చెప్పారు. ఆ విధంగా మార్క్సిజాన్ని ఆధునిక ప్రజాస్వామ్య ఆలోచనల వెలుగులో విశ్లేషించి నూతన అధ్య యనానికి పునాదులు వేశారు. ఆమె రచనలు, భావాలు ఆధునిక ప్రపం చంలో ఒక నూతన వెలుగును నింపాయి. మార్తా లాటిన్ అమెరికా ఉద్యమాలు, విప్లవాల వెలుగులో అధ్యయనం సాగించినప్పటికీ ఆమె ఆలోచనలు ప్రపంచం లోని మార్క్సిస్టులందరికీ స్ఫూర్తినిస్తున్నాయి. ముఖ్యంగా మార్తా హర్నేకర్ జీవితం, ఉద్యమం, నిత్యం సమాజ మార్పు కోసమే సాగాయి. క్యాన్సర్‌తో పోరాడుతూ తుదిశ్వాస విడిచిన మార్తా మూసభావనలకు భిన్నంగా, ప్రవాహంతో కొట్టుకుపోకుండా, మారు తున్న సామాజిక ఆర్థిక పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ సరికొత్త, ఆచరణాత్మక పద్ధుతులతో మున్ముందుకు సాగాలని కోరు కున్నారు. మార్తా అంకిత భావం, పోరాట దీక్ష, శాస్త్రీయ అధ్యయనశక్తి భవిష్యత్ తరాలకు మార్గదర్శకం అవుతుందని ఆశిస్తున్నా...! వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘మొబైల్ : 81063 22077 మల్లెపల్లి లక్ష్మయ్య -
సోషలిస్టు దిగ్గజం కన్నుమూత
న్యూఢిల్లీ: సోషలిస్ట్ దిగ్గజం, ధీరోదాత్త రాజకీయాలకు కేరాఫ్‌గా నిలిచిన మాజీ కేంద్ర మంత్రి జార్జి ఫెర్నాండెజ్(88) మంగళవారం ఆయన స్వగృహంలో కన్నుమూశారు. కొంత కాలంగా అల్జీమర్స్‌తో బాధపడుతున్న ఫెర్నాండెజ్ ఇటీవల స్వైన్ ఫ్లూ బారిన పడ్డారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం 6.42 గంటలకు ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఫెర్నాండెజ్ మరణ వార్తను ఆయన సన్నిహితురాలు జయా జైట్లీ నిర్ధారించారు. అమెరికాలో ఉంటున్న జార్జి ఫెర్నాండెజ్ కుమారుడు సియాన్ ఫెర్నాండెజ్ వచ్చాక అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. ఫెర్నాండెజ్ పార్థివ దేహాన్ని ప్రధాని మోదీ సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రక్షణ మంత్రి నిర్మల సీతారామన్, బిహార్ సీఎం నితీశ్‌కుమార్, బీజేపీ చీఫ్ అమిత్ షా తదితరులు కూడా ఫెర్నాండెజ్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ‘ఉదయం ఆరు గంటల సమయంలో మా ఆస్పత్రికి ఫెర్నాండెజ్ ఇంటి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆస్పత్రి నుంచి ఆయన ఇంటికి వెళ్లిన వైద్యుల బృందం ఆయనను పరీక్షించి చనిపోయినట్లుగా నిర్ధారించింది’ అని మాక్స్‌క్యూర్ ఆస్పత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. జీవితాంతం సోషలిస్ట్ నేతగానే.. జీవితాంతం సోషలిస్టు భావాలనే నమ్మి ఆచరించిన నేతగా ఫెర్నాండెజ్ నిలిచారు. 1974లో రైల్వే సమ్మెతో దేశాన్ని స్తంభింపజేసిన కార్మిక నేతగా.. 1977లో బడా బహుళ జాతి సంస్థ కోకకోలాను దేశం వదిలివెళ్లేలా చేసిన కేంద్రమంత్రిగా.. 1999లో కార్గిల్ యుద్ధాన్ని, అణ్వస్త్ర పరీక్షలను పర్యవేక్షించిన రక్షణ మంత్రిగా ఫెర్నాండెజ్ చరిత్ర పుటల్లో నిలిచారు. రెండు విభిన్న భావజాలాల నేతృత్వాల్లోని ప్రభుత్వాల్లో ఆయన మంత్రిగా పనిచేయడం విశేషం. 1977లో సామ్యవాదులతో కూడిన జనతాపార్టీ ప్రభుత్వంలో, 1999లో హిందుత్వ వాదులతో కూడిన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వంలో ఆయన మంత్రిగా పనిచేశారు. నిజాయతీ, నిర్భీతి ఆయన సొంతం: మోదీ జార్జి ఫెర్నాండెజ్ మృతి పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తపరిచారు. ‘జార్జి సాహబ్ నిజాయతీపరుడు, నిర్భీతిగల నాయకుడు, నిరాడంబరుడు, వినయశీలి. తను నమ్మిన సామ్యవాద సిద్ధాంతాలను ఎన్నడూ విడనాడలేదు. భారత రాజకీయ నాయకత్వానికి నిజమైన ప్రతినిధి. ఆయన దేశానికి అందించిన సేవలు అమూల్యం. పేదలు, అణగారిన వర్గాల హక్కుల కోసం గట్టిగా పోరాడారు. ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన మంచి కార్మిక నేత, మంత్రిగా సమర్ధవంతమైన సేవలందించారు’ అని ప్రధాని మోదీ శ్లాఘించారు. ‘మాజీ పార్లమెంటేరియన్, కేంద్ర మంత్రి అయిన ఫెర్నాండెజ్ జీ మృతి బాధాకరం. ఆయన కుటుంబసభ్యులకు, సన్నిహితులకు నా సానుభూతి’ అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ఫేస్బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. అంత్యక్రియలు అయ్యేవరకు ఉంటా: నితీశ్ జార్జి ఫెర్నాండెజ్ అంత్యక్రియలు పూర్తయ్యే వరకు ఢిల్లీలోనే ఉంటానని బిహార్ సీఎం నితీశ్‌కుమార్ పేర్కొన్నారు. ఫెర్నాండెజ్ మృతికి సంతాప సూచకంగా రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. అనంతరం ఆయన పట్నా నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. తన రాజకీయ జీవితాన్ని ఫెర్నాండెజ్ తీర్చిదిద్దారని నితీశ్ తెలిపారు. ఫెర్నాండెజ్ పేరు మారుమోగిందిలా.. కర్ణాటకలో మంగళూరుకు చెందిన ఓ క్రైస్తవ కుటుంబంలో జన్మించిన జార్జి ఫెర్నాండెజ్ సామ్యవాద భావాల పట్ల ఆకర్షితుడై కార్మిక నేతగా ఎదిగారు. 1975–77 సంవత్సరాల మధ్య ఇందిరాగాంధీ హయాంలో దేశంలో విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారు. అనంతరం అధికారంలోకి వచ్చిన జనతాపార్టీ ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రిగా పనిచేశారు. రెండు విధాలుగా అంత్యక్రియలు జార్జి అంత్యక్రియలు లోధి శ్మశానవాటికలో జరుగుతాయని ఆయన సన్నిహితురాలు జయా జైట్లీ తెలిపారు. ‘ఆయన అంతిమ కోరిక మేరకు రెండు విధాలుగా అంత్యక్రియలు జరుపుతాం. గతంలో పార్థివ దేహాన్ని దహనం చేయాలని ఆయన కోరారు. ఇటీవల మాత్రం ఖననం చేయాలని చెప్పారు. ఆయన అభీష్టం ప్రకారం ఈ రెండింటిని నిర్వర్తిస్తాం. ముందుగా దహనం చేసి, అవశేషాలను ఖననం చేస్తాం’ అని చెప్పారు. నిత్య పోరాట యోధుడు జార్జి ఫెర్నాండెజ్ పేరు వినగానే 1974 రైల్వే సమ్మెతోపాటు 1975 ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటయోధుడు గుర్తుకొస్తాడు. గోవా మూలాలున్న రోమన్ కేథలిక్ కుటుంబంలో 1930 జూన్ 3న జన్మించిన జార్జిని 16 ఏళ్ల వయసులో క్రైస్తవ మత బోధకునిగా మార్చడానికి ఆయన కుటుంబం బెంగళూరు పంపించింది. శిక్షణ పూర్తయ్యాక ఆయన 1949లో సొంతూరు మంగళూరు నుంచి బొంబాయి వెళ్లి రాజకీయాలను జీవిత మార్గంగా ఎంచుకున్నారు. డాక్టర్ రాంమనోహర్ లోహియా నాయకత్వంలోని సోషలిస్ట్ పార్టీలో చేరి కార్మికోద్యమంలో కీలక పాత్ర పోషించారు. అప్పటి బొంబాయి మహా నగరంలో ఈ పార్టీ అనుబంధ కార్మికసంఘం హింద్ మజ్దూర్ కిసాన్ పంచాయత్(హెచ్‌ఎంకేపీ)ను ముందుకు నడిపించారు. నిప్పులు చెరిగే ట్రేడ్ యూనియన్ నేతగా, శ్రామికవర్గాన్ని ఉర్రూతలూగించే వక్తగా జార్జి ఈ నగరంలో అనేక సమ్మెలు, బంద్‌లు విజయవంతంగా నిర్వహించారు. జాన్ జోసెఫ్, అలిస్ మార్తాల ఆరుగురు కొడుకుల్లో పెద్దవాడైన జార్జి రాజకీయ జీవితాన్ని బొంబాయి గొప్ప మలుపు తిప్పింది. దక్షిణ బొంబాయి నుంచి వరుసగా మూడు సార్లు గెలిచిన ప్రముఖ కాంగ్రెస్ నేత ఎస్కే పాటిల్‌ను 1967 సాధారణ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గంలో సంయుక్త సోషలిస్ట్ పార్టీ(ఎసెస్పీ) టికెట్‌పై జార్జి ఓడించి తొలిసారి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి 2004 వరకూ ఆయన 9సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2009–10 మధ్య చివరిసారి రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. బరోడా డైనమైట్ కేసులో జైలు జీవితం జార్జి నాయకత్వంలో 1974లో జరిగిన రైల్వే సమ్మె విజయవంతమైంది. ప్రధాని ఇందిరాగాంధీ రైల్వే కార్మికుల్లో చీలికలు తెచ్చి వేలాది మందిని అరెస్ట్ చేయించడంతో సమ్మెను విరమించారు. 1975 జూన్ 25న ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు మిగిలిన ప్రతిపక్ష అగ్రనేతల మాదిరిగా అరెస్టు కాకుండా ఫెర్జాండెజ్ అజ్ఞాతంలోకి వెళ్లి పోరాటం సాగించారు. చివరికి బరోడా డైనమైట్ కేసులో నిందితునిగా 1976 జూన్‌లో కోల్‌కతాలో జార్జి అరెస్టయ్యారు. 1977 జనవరిలో ఎమర్జెన్సీని తొలగించాక ప్రతిపక్ష నేతలందరినీ విడుదల చేసినా జార్జికి బరోడా కేసులో బెయిలు రాలేదు. జైలు నుంచే బిహార్‌లోని ముజఫర్‌పూర్ నుంచి జనతాపార్టీ తరఫున పోటీచేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇదే స్థానం నుంచి ఆయన ఐదు సార్లు ఎన్నికయ్యారు. మధ్యలో మూడుసార్లు నలందా నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1977 ఎన్నికల్లో మొరార్జీదేశాయి ప్రధానిగా ఏర్పడిన జనతా పార్టీ ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రిగా, 1989 వీపీ సింగ్ ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా పనిచేశారు. జనతా పాలనలో జార్జి పట్టుబట్టి అమెరికాకు చెందిన కంపెనీలు కోకాకోలా, ఐబీఎంను దేశంలో మూతవేయించారు. బిహార్ సీఎం లాలూ ప్రసాద్ జనతాదళ్‌లో పెత్తనానికి నిరసనగా 1994లో బిహార్ ప్రస్తుత సీఎం నితీశ్‌కుమార్‌తో కలిసి సమతాపార్టీ ఏర్పాటు చేసి బీజేపీ అగ్రనేత ఏబీ వాజ్‌పేయి నేతృత్వంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వాల్లో 1998–99, 1999–2004 మధ్య కేంద్ర రక్షణ మంత్రిగా పనిచేశారు. ఆయన హయాంలోనే కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం సాధించింది. రక్షణ శాఖ బడ్జెట్ భారీ పెంపునకు కూడా ఆయనే కారకుడు. యుద్ధంలో మరణించిన జవాన్ల కోసం కొనుగోలు చేసిన శవపేటికల కుంభకోణం కారణంగా ఆయన 2004లో రాజీనామా చేశారు. 2004లో ముజఫర్‌పూర్ నుంచి చివరిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అయితే, 2009లో ఆయనకు జనతాదళ్(యూ)టికెట్ ఇవ్వలేదు. అదే ఏడాది ఈ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2010లోనే ఆయన అల్జీమర్స్ వ్యాధికి గురయ్యారు. కుష్వంత్ సింగ్లా ఎందుకు మారారు? దేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో పోలీసుల కళ్లుగప్పేందుకు జార్జి ఫెర్నాండెజ్ కుష్వంత్ సింగ్ పేరుతో చెలామణీ అయ్యారని ఆయన సహవాసి ఒకరు తెలిపారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన విజయ్ నారాయణ్ అప్పటి ఘటనలను గుర్తుకు తెచ్చుకున్నారు. ‘ఎమర్జెన్సీని వ్యతిరేకించే వారిని ఇందిర ప్రభుత్వం అరెస్టు చేస్తోంది. ఆ నిర్బంధం నుంచి తప్పించు కునేందుకు మేం మారువేషాల్లో తిరిగేవాళ్లం. ఫెర్నాండెజ్ సిక్కుగా మారిపోయారు. తలపాగా ధరించి, జట్టు, గడ్డం పొడుగ్గా పెంచుకుని తన పేరు కుష్వంత్ సింగ్‌గా చెప్పుకునేవారు. నేనేమో కాశీకి చెందిన ముస్లిం నేత పనివానిగా మారిపోయా. అలా మేం అజ్ఞాతంలో ఉంటూనే పని కొనసాగించేవాళ్లం. వివిధ ప్రాంతాలకు చెందిన ఉద్యమ నేతలకు ఆయన రాసే ఉత్తరాలను నేను రహస్యంగా రైల్వే మెయిల్లో పంపిస్తుండేవాణ్ని. మామూలుగానైతే ఫెర్నాండెజ్ బిహారీ మాదిరిగా ధోవతీ, కండువా ధరించేవారు’ అని నారాయణ్ తెలిపారు. అరంగేట్రం ఇలా.. కార్మిక నేతగా గుర్తింపు పొందిన ఫెర్నాండెజ్ రాజకీయ అరంగేట్రం మాత్రం ఆసక్తికరం. ముంబై (బాంబే)లోని న్యూ మున్సిపల్ కౌన్సిల్లో జార్జ్ ఫెర్నాండెజ్ కౌన్సిలర్‌గా ఉండేవారు. అప్పట్లో కాంగ్రెస్ నేత ఎస్కే పాటిల్ ముంబైకి మకుటం లేని మహారాజుగా చలామణి అయ్యేవారు. పెద్దపెద్ద పారిశ్రామికవేత్తల మద్దతు కూడా ఆయనకే ఉండేది. ఈ నేపథ్యంలో కార్మికవర్గాల మద్దతుతో 1967 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని జార్జి నిర్ణయించారు. సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్రావ్ పాటిల్‌ను కలుసుకుని ‘మీరు బాంబేకు మకుటం లేని మహారాజు కదా.. ఎవరో మున్సిపల్ కౌన్సిలర్ జార్జ్ ఫెర్నాండెజ్ మీపై పోటీకి దిగుతున్నాడట. ఒకవేళ మీరు ఓడిపోతే’ అని ప్రశ్నించారు. దీంతో పాటిల్ స్పందిస్తూ..‘ఈ జార్జి ఫెర్నాండెజ్ ఎవరు? ఆ దేవుడు కూడా నన్ను ఓడించలేడు’ అని జవాబిచ్చారు. మరుసటి రోజు పత్రికల్లో ఇదే ప్రచురితమైంది. దీన్ని ఆయుధంగా మలుచుకున్న ఫెర్నాండెజ్..‘తనను దేవుడు కూడా ఓడించలేడని పాటిల్ అంటున్నారు. కానీ ఆయన్ను మీరు (ప్రజలు) ఓడించగలరు’ అని పోస్టర్లు వేయించారు. దీంతో దక్షిణ ముంబై స్థానంలో పాటిల్‌పై 42వేల ఓట్ల మెజారిటీతో జార్జి గెలిచారు. లైలా కబీర్‌తో వివాహం..జయా జైట్లీతో సహజీవనం బెంగాల్ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి హుమాయూన్ కబీర్ కూతురు లైలాను 1971లో జార్జి వివాహమాడారు. వారి ఏకైక కుమారుడు అమెరికాలో ఉన్నారు. 1990లో కుటుంబ విభేదాలతో లైలాకు విడాకులివ్వకుండానే ఆయన విడిగా జీవించడం ప్రారంభించారు. తరువాత కాలంలో సమతా పార్టీ అధ్యక్షురాలు జయా జైట్లీతో తన నివాసంలో కలిసి జీవించారు. 2012లో లైలా, ఆమె కుమారుడు జయను ఇంట్లోంచి గెంటి వేయగా, సుప్రీంకోర్టు అనుమతితో ఆమె జార్జిని కలుసుకున్నారు. కార్మిక నేతగా, చురుకైన పార్లమెంటేరియన్‌గా, కేంద్ర మంత్రిగా మంచి పేరు తెచ్చుకోవడమేగాక మంత్రి పదవిలోని సమయంలో ఆయన హక్కుల ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు. పౌర హక్కుల ఉద్యమాలకు ఆయన మద్దతుగా నిలిచేవారు. డాక్టర్ లోహియాతో కలిసి పని చేసిన నేతల్లో ప్రముఖుడైన ఫెర్నాండెజ్ మరణంతో భారత రాజకీయాల్లో కీలక శకం ముగిసినట్టయింది. కన్నడం, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడిన జార్జి గొప్ప రాజకీయవేత్తగా దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఇంకో జన్మ ఉంటే వియత్నాం పౌరుడిగా! మళ్లీ జన్మంటూ ఉంటే వియత్నాం పౌరుడిగా పుట్టాలని కోరుకుంటానని జార్జి ఫెర్నాండెజ్ ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. అంతర్యుద్ధంతో అతలాకుతలం అయినప్పటికీ వియత్నాం భారత్ కంటే ముందుకు దూసుకుపోతోందనీ, రాబోయే వందేళ్ల భవిష్యత్ గురించి వాళ్లు ఆలోచిస్తున్నారని ప్రశంసలు కురిపించారు. 15 ఏళ్ల క్రితం బెంగళూరులోని కర్ణాటక ప్లాంటర్స్ అసోసియేషన్ సమావేశంలో ఫెర్నాండెజ్ మాట్లాడుతూ..‘వియత్నాం ప్రజలు క్రమశిక్షణ, అంకితభావం, దృఢసంకల్పం కలిగినవారు. తమ ఆశయసాధన కోసం ప్రాణత్యాగానికి సైతం వారు వెనుకాడరు. అమెరికా, చైనా, ఫ్రాన్స్ జోక్యం, అంతర్యుద్ధం కారణంగా 30 లక్షల మంది వియత్నాం పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ శరవేగంగా పురోగమిస్తున్న వియత్నాం.. తలసరి ఆదాయంలో భారత్‌ను దాటేస్తోంది. నేనేమీ అసూయతో మాట్లాడటం లేదు. ఆ దేశాన్ని సందర్శించిన తొలి భారత రక్షణమంత్రిని నేనే. మరో జన్మంటూ ఉంటే వియత్నాం పౌరుడిగా పుట్టాలని కోరుకుంటా’ అని ఫెర్నాండెజ్ తెలిపారు. -
1893లో భారతదేశమే నా ఇల్లు అన్న విదేశి మహిళ
‘‘నేను 1893లో భారతదేశానికి వచ్చాను. అప్పటి నుంచి ఇదే నా ఇల్లు. ఇక్కడ నేను గడిపిన జీవితమంతా ఈ పురాతన దేశం పూర్వకాలంలో అనుభవించిన స్వాతంత్య్రాన్ని తిరిగి సాధించి పెట్టడానికే పాటుపడ్డాను.’’ అన్నారామె. భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షత వహించిన తొలి మహిళ ఎవరో గుర్తుందా? ఆమె ఒక బ్రిటిష్ వనిత. దేశ చరిత్రలో కీలకమైన సమయంలో1917 నాటి కలకత్తా సమావేశాలకి ఆమె అధ్యక్షత వహించారు. (కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ సరోజినీ నాయుడు). ఆమె పేరు అనిబీసెంట్. ఐరిష్ మూలాలు ఉన్న ఈ బ్రిటిష్ వనిత భారతదేశానికీ, స్వాతంత్య్రోద్యమానికీ, సమాజానికీ చేసిన సేవ చిరస్మరణీమయమైనది. స్వాతంత్య్రోద్యమ కాలంలో బాలగంగాధర తిలక్, లజపతిరాయ్, మహమ్మదలీ జిన్నా, గాంధీ, మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, సరోజినీనాయుడులకు ఉన్నంత ఖ్యాతి, ఆకర్షణ అనిబీసెంట్‌కు కూడా ఉండేవి. ఆనాడు కాంగ్రెస్ సభ్యత్వం కంటే, అనిబీసెంట్ స్థాపించిన హోంరూల్ లీగ్‌కు ఎక్కువ సభ్యత్వం ఉండేది. ఎందరో మహామహులు ఆమె నాయకత్వంలో పనిచేశారు. అనిబీసెంట్ ఒక విప్లవ వనిత. పేదరికంలో పుట్టి పెరిగారు. ఐదో ఏటనే తండ్రి మరణించారు. ఆడబిడ్డను పెంచలేక ఆమె తల్లి తనకు తెలిసిన వారికి ఇచ్చి పోషణ ఏర్పాటు చేసింది. అలాంటి వాతావరణంలో ఉన్నా, ఆమె తనదైన ఆలోచనా విధానాన్ని నిర్మించుకున్నారు. మత విశ్వాసాల గురించి పల్లెత్తు మాట అన్నా తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటున్న కాలంలో ఆమె తన క్రైస్తవ మత విశ్వాసాలను, మతాధికారుల పాత్రను ప్రశ్నించారు. పైగా ఆమె భర్త క్రైస్తవ పురోహిత వర్గానికి (ఆంగ్లికన్ చర్చి) చెందినవారు. అనిబీసెంట్ (అక్టోబర్ 1,1847–సెప్టెంబర్ 20, 1933)ను ప్రపంచంలో విశిష్ట మహిళగా చరిత్రకారులు గౌరవిస్తారు. బ్రిటిష్ జాతిలో రాజకీయ సంస్కరణల కోసం, స్త్రీల హక్కుల కోసం ఆమె పోరాడారు. ఐర్లాండ్‌కు మాత్రమే కాదు, భారతదేశానికి కూడా స్వయం పాలన అవసరమేనని ఇంగ్లండ్ పాలన మీద చట్టబద్ధమైన ఉద్యమం నడిపారామె. లౌకికవాదం, కార్మికుల హక్కులు, మహిళల హక్కులు, కుటుంబ నియంత్రణ, నిరుద్యోగం ఇవన్నీ కూడా ఆమె చేసిన పోరాటాలలో భాగాలుగా కనిపిస్తాయి. దీనికి తోడు ఆమె మంచి రచయిత్రి. మంచి రచయితలు మంచి వక్తలు కారన్న అపప్రథను వమ్ము చేస్తూ గొప్ప వక్తగా కూడా పేరెన్నికగన్నారు. ఆమె కుటుంబ నియంత్రణ మీద ఉద్యమం ప్రారంభించి, ఫేబియన్ సోషలిస్టుగా పనిచేసి, చివరికి దివ్యజ్ఞాన సమాజం దిశగా ప్రయాణించారు. దివ్య జ్ఞాన సమాజం గురించి ప్రపంచమంతటా తిరిగి ప్రచారం చేసే క్రమంలోనే ఆమె 1893లో భారత్ వచ్చారు. ఇక్కడి స్వాతంత్య్రోద్యమం పట్ల సానుభూతి పెంచుకుని, పోరాటంలో పాల్గొన్నారు. ఇక్కడి ప్రజల కష్టాలను తన కష్టాలుగా భరించారు. కడ ఊపిరిని ఈ గడ్డ మీదే విడిచిపెట్టారు. ఆమె అసలు పేరు అనీ ఉడ్. లండన్‌లోని క్లాఫామ్‌లో ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టారు. తండ్రి ఐదో ఏటనే మరణించారు. ఆపై తల్లి ఒక భోజనశాల ఏర్పాటు చేసి జీవనం సాగించారు. కూతురుని సరిగా పెంచలేక ఇలాన్ మేరియట్ అనే తన స్నేహితురాలికి అప్పగించారామె. మేరియట్ పెంపకం నిజంగానే అనిబీసెంట్‌కు వరమైంది. మంచి విద్య చెప్పించారామె. ఐరోపా అంతా చూపించారు. అప్పుడే అనిబీసెంట్ భవిష్యత్తుకు సంబంధించిన చిత్రం రూపుదిద్దుకుంది కూడా. 19వ ఏట అనిబీసెంట్ ఫ్రాంక్ బీసెంట్ అనే ఒక చర్చి మత గురువును పెళ్లి చేసుకుంది. కానీ వివాహం తరువాత పాత ఆలోచనలకు తోడు రాజకీయాల మీదకు ఆమె దృష్టి మళ్లింది. అందులోను ఐరిష్ రాడికల్స్‌తో ఆమె పని చేయడం ఆరంభించింది. ఇంకా ఆమెలోని రచయిత్రిని కూడా ఆ ఆలోచనలు తట్టి లేపాయి. కథలు, వ్యాసాలు రాయడం ఆరంభించారు. ఇద్దరు పిల్లలకు తల్లయింది. వారు– మాబెల్ బిసెంట్ స్కాట్, ఆర్ధర్ డిగ్బి బిసెంట్. కానీ కుటుంబ నియంత్రణ గురించి ఆమె పుస్తకం రాయడంతో తీవ్రంగా ఆగ్రహించిన భర్త పిల్లలు ఆమె వద్ద పెరగడం సరికాదన్న వాదన తీసుకువచ్చి, విడిపోవడానికి నిర్ణయించుకున్నారు. అలా వారిద్దరు 1873లో వేరైపోయారు. నిజానికి ఆంగ్లికన్ చర్చికి సంబంధించిన భర్త ఆలోచనలను, అసలు ఆ మత సిద్ధాంతాలను కూడా అనిబీసెంట్ ప్రశ్నించడం మొదలుపెట్టినప్పటి నుంచే ఆ కాపురం బీటలు వారడం మొదలయింది. కాయకష్టం చేసుకునే కుటుంబాల వారు ఎక్కువ మంది పిల్లలను కనడం తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని అనిబీసెంట్ వాదించారు. పరిమిత కుటుంబంతోనే అలాంటి కుటుంబాలు ఆనందంగా జీవిస్తాయని కూడా ఆమె సూచించారు. నిజానికి ఈ అంశంతో రాసిన పుస్తకంతో రచయిత్రిగా అనిబీసెంట్ పేరు ఇంగ్లండ్‌లో ప్రతి ఇంటిలోను మారుమోగింది. కానీ ఈ పుస్తకం మీద చర్చి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భర్త నుంచి విడిపోయాక చర్చి మీద విమర్శను తన వ్యాసాల ద్వారా మరింత ఉధృతం చేశారామె. మత ప్రమేయం లేని రాజ్యాన్ని ఆమె ఆకాంక్షించారు. కానీ ఆమె భర్తకు విడాకులు మాత్రం ఇవ్వలేదు. చివరికంటా శ్రీమతి బిసెంట్గానే ఆమె ఉండిపోయింది. అనిబీసెంట్ రాజకీయ చింతన సోషలిస్టు సంస్థల సాహచర్యంతో విస్తరించింది. కార్మికోద్యమంలో పనిచేసినప్పుడు కొద్దికాలం మార్క్స్ భావాలను కూడా విశ్వసించారు. ఐరిష్ హోమ్ రూలర్స్‌తో ఏర్పడిన అనుబంధం ఆ చింతనకు మరింత పదును తెచ్చింది. ఈ ప్రభావాలతోనే ఐర్లండ్ రైతుల కష్టాలను ఏకరువు పెడుతూ, అక్కడి భూస్వాములను ఆమె విమర్శించేవారు. అప్పట్లోనే ‘బ్లడీ సండే’ ఉదంతం జరిగింది. అందుకు ఆమె ప్రత్యక్ష సాక్షి. నిరుద్యోగ సమస్యకు వ్యతిరేకంగా ఇంగ్లండ్ యువతరం ట్రఫాల్గర్ కూడలి దగ్గర నిరసన ప్రదర్శన చేశారు. 1887లో జరిగిన ఈ ప్రదర్శన సందర్భంగా జరిగిన హింసలో పదుల సంఖ్యలో యువకులు చనిపోయారు. వందలాది మందిని అరెస్టు చేశారు. తరువాత హఠాత్తుగా ఆమె పూర్తిగా ఆధ్యాత్మిక చింతన వైపు మళ్లారు. 1889లో దివ్యజ్ఞాన సమాజంలో సభ్యురాలిగా చేరారు. ఆ సంస్థను భారత్‌లో విస్తరించేందుకే ఆమె 1893లో వచ్చారు. ఇది ఆమె జీవితంలో మరో మలుపు. దేశ ప్రజల మధ్య ఐక్యత లేకుండా స్వాతంత్య్రం సాధ్యం కాదనేది ఆమె గ్రహించిన గొప్ప వాస్తవం. ఉద్యమంలో మమేకం కావడం ఆరంభించిన తరువాత ఒక గొప్ప విషయాన్ని ఆమె ఆంగ్లేయుల దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు కూడా. భారత్ స్వయం పాలన కోరుతోంది. వాళ్లకి కావలసింది మీ పాలనలో అలంకారప్రాయంగా ఉండే పదవులు కాదు. మీ పాలనాయంత్రాంగంలో మిగిలిపోవడం అంతకంటే కాదు అని ఆమె తెగేసి చెప్పారు. భారతదేశంలో బ్రిటిష్ పాలనను అదుపులో పెట్టాలంటే హిందువులు, ముస్లింల మధ్య ఐక్యత కూడా అవసరమని ఆమె వాస్తవంగానే భావించారు. అలాంటి ఐక్య వాతావరణం మొదటిసారి 1916లో కనిపించింది. ఆ సంవత్సరంలో లక్నోలో జరిగిన కాంగ్రెస్ వార్షిక సమావేశాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడానికి కారణం– హిందూ ముస్లిం ఐక్యతకు తొలిసారిగా జరిగిన నిజమైన ప్రయత్నం వల్లనే. అప్పుడు ఎంఏ జిన్నా ముస్లింలీగ్ అధ్యక్షులు. లీగ్, కాంగ్రెస్ కలసి పనిచేసే విధంగా జిన్నా ఒక ఒప్పందాన్ని చేయించారు. ఆ చెలిమిని కొనసాగించడానికి రెండు మూడు సంవత్సరాలు జాతీయ నాయకులంతా విశేషంగా పాటు పడ్డారు. అలాంటి సందర్భంలోనే 1917లో, కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ వార్షిక సమావేశాలకు అనిబీసెంట్ను అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. భారతదేశంలో ఆమె మూడు ప్రధాన పాత్రలు నిర్వహించారు. ఒకటి జాతీయ కాంగ్రెస్‌తో కలసి పనిచేయడం. రెండు దివ్యజ్ఞాన సమాజం అండగా ఆధ్యాత్మిక, ధార్మిక కార్యకర్త. మూడు విద్యా వ్యాప్తి. కాంగ్రెస్‌తో పనిచేసినప్పుడు భారతీయులలో రాజకీయ చైతన్యానికి సంబంధించిన కోణం ఏ విధంగా ఉండాలో ఆలోచించారామె. పాలనలో భారతీయులకు పరిమిత ప్రమేయమా? లేక స్వయం పాలనా? వీటిలో ఆమె స్వయంపాలన వైపు మొగ్గు చూపారు. కానీ ఆమె సమకాలీనులైన మితవాద కాంగ్రెస్ నాయకులు భారతీయులకు కొన్ని హక్కుల దక్కితే చాలునన్న ఆలోచనకే పరిమితమయ్యారు. అది కూడా చట్టబద్ధమైన రీతిలో విన్నపాలు, వినతులతో సాధించుకోవాలన్నదే మితవాదుల దృక్పథం. వీరిని పూర్తిగా వ్యతిరేకించినవారు అతివాదులు. తిలక్ అందులో ముఖ్యుడు. ఒకదశలో అనిబీసెంట్ తిలక్‌తో కలసి హోంరూల్ లీగ్ ఉద్యమాన్ని నడిపారు. దీనికే ఆమెను మద్రాస్‌లో ఇంటర్న్మెంట్కు గురి చేశారు. ఆమెకు స్వేచ్ఛ కల్పించడం కోసం మొత్తం భారతదేశమే బ్రిటిష్ ప్రభుత్వం మీద ఉద్యమం సాగించింది. ఆ క్రమంలో హోంరూల్ లీగ్‌లోకి వచ్చిన వారే మోతీలాల్, చిత్తరంజన్‌దాస్, జిన్నా తదితరులు. తరువాత గాంధీజీ ఈ సంస్థను కాంగ్రెస్‌తో కలసి పనిచేసే విధంగా ఒప్పించారు. దివ్యజ్ఞాన సమాజం భారతీయ సమాజం మీద వేసిన ముద్ర అసాధారణమైనది. దాదాపు మూడున్నర దశాబ్దాల కాలం అనిబీసెంట్ దివ్యజ్ఞాన సమాజం అధ్యక్ష హోదాలో కొనసాగారు. పలు చోట్ల ఆ సంస్థ పాఠశాలలను నిర్వహించేది. మద్రాస్‌లో సెంట్రల్ హిందూ స్కూల్, నేషనల్ హైస్కూల్, వసంత మహిళా కళాశాల ఆమె స్థాపించినవే. అలాగే వైద్యశాలలను కూడా ఏర్పాటు చేసేది. దివ్యజ్ఞాన సమాజం తరఫున ఒక విశ్వ గురువును ప్రతిష్టించేందుకు కూడా ఆమె ప్రయత్నించారు. అప్పటికి ఆమె హిందూ మతాన్ని స్వీకరించారు. జిడ్డు కృష్ణమూర్తిగారిని ఆ విశ్వగురువు పీఠం మీద అధిష్టింపచేయాలన్నది ఆమె ఆకాంక్ష. కానీ అందుకు ఆయన నిరాకరించడం విశేషం. భారతదేశంలో ఇప్పటికీ ప్రతిష్టాత్మకంగా భావించే కాశీ విశ్వవిద్యాలయం స్థాపనలో మదన్ మోహన మాలవీయకు అని బీసెంట్ పూర్తి సహాయ సహకారాలు అందించారు. తరువాత బీహెచ్‌యూ ఆమెకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది కూడా. 1933లో అనిబీసెంట్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మద్రాస్ నగరంలోని అడయార్లోనే దివ్యజ్ఞాన సమాజం ఆశ్రమంలోనే తుది శ్వాస విడిచారు. అక్కడే ఆమె పార్ధివదేహాన్ని పూడ్చి పెట్టారు. అడియార్ నది ఒడ్డున ఉండే దివ్యజ్ఞాన ఆశ్రమంలో మర్రిచెట్టు ఒక అద్భుతం. విస్తీర్ణంలో దీనికి ప్రపంచ ఖ్యాతి ఉంది. ఈ చెట్టు కిందే అని బీసెంట్ ఎందరినో సమావేశ పరిచింది. ఆ చెట్టు నీడన ఆమె ఏర్పాటు చేసిన తేనీటి విందులకు రాజకీయవేత్తలు, కవులు, కళాకారులు, స్త్రీజనోద్ధారకులు, సంస్కర్తలు హాజరయ్యేవారు. నిజం చెప్పాలంటే ఆ మహా మర్రి వలెనే అనిబీసెంట్ కీర్తి కూడా భారతీయ సాంస్కృతిక జీవనంలో, రాజకీయ ఉద్యమాలలో పరుచుకుని ఉంది. ∙డా. గోపరాజు నారాయణరావు అనిబీసెంట్ -
కంట్రోల్ రాజ్‌ను తెచ్చిన ‘రద్దు’
జాతిహితం నేటి తరానికి ఒకప్పటి మన సోషలిస్ట్ రేషనింగ్, కంట్రోళ్లు తెలియకపోవచ్చు. కానీ, మన అధికార యంత్రాంగానికి దానితో అనుబంధం ఉంది అందుకే కంట్రోల్ రాజ్ నాటి స్వాభావికత తిరిగి మందుకొచ్చింది. ‘వ్యవస్థ’ పెద్ద నోట్లను రద్దు చేస్తే ఏం చేయాలి? పాత నియమ నిబంధనల దుమ్ము దులపాలి. తలకు రూ. 4,000 మంజూరు చేయాలి. చాలా మంది వచ్చేస్తే సిరా గుర్తు పెట్టాలి. అదీ దొరక్కపోతే పరిమితిని సగం చెయ్యాలి. అయినా విత్‌డ్రాయల్స్ చేయలేరు. పర్వాలేదు, ఏది ఉత్తమమో ఎప్పుడూ ప్రభుత్వానికే తెలుసు. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం భటిండాలో తన పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ‘నల్ల ధనానికి, అవినీతికి వ్యతిరేక యుద్ధం’ అంటూ ఉద్రేక పూరి తంగా సమర్థించుకోవడం ప్రారంభించారు. అక్కడ కొత్తగా నిర్మిస్తున్న అభిల భారత వైద్య విజ్ఞానశాస్త్రాల సంస్థ(ఏఐఎంఎస్)కు శంకుస్థాపన చేస్తూ ఆయన మాట్లాడారు. 1966లో నేను హైస్కూలు ఇంగ్లిష్ చదువును ప్రారం భించినది కూడా భటిండాలోనే. నరేంద్ర మోదీ సమర్థనతో 1966కు, భటిం డాకూ సంబంధం ఉంది. ఇందిరాగాంధీ ప్రధాన మంత్రి బాధ్యతలను చేపట్టి, లోతైన పునాదులు గల ‘సోషలిస్టు’ రాజ్య నిర్మాణాన్ని ప్రారంభించినది 1966 లోనే. యుద్ధానంతర కాలపు దీర్ఘకాలిక కరువు వల్ల తలెత్తిన కొరతల ఆర్థిక వ్యవస్థ ఆమెకు వారసత్వంగా సంక్రమించింది. దీంతో ఆమె మన చరిత్రలోనే అత్యంత కఠినమైన, మొరటైన, నిర్హేతుకమైన రేషనింగ్‌ను (పరిమితుల విధింపు) ప్రారంభించారు. ఆనాటి ‘నౌక నుంచి నోటికి’ (ఆహార దిగుమతుల ఆధారిత) పరిస్థితిని ప్రజలు కొంత కాలంపాటూ నిర్లిప్తంగా భరించారు. కానీ, అధికార యంత్రాంగం రేషనింగ్‌లో, కంట్రోళ్లలో (నియంత్రణలు) మరిన్ని వినూత్న రూపాలను కనిపెట్టి తమ సొంత అధికారాన్ని విస్తరింప జేసుకుంది. దీంతో రెండేళ్లు తిరిగే సరికే అది శృతి మించిపోయింది. పెళ్లిళ్లకు చక్కెర కోటాలను అనుమతించే అధికారాన్ని జిల్లా మేజిస్ట్రేట్లకు ఇచ్చారు. ఆ తర్వాత మైదా, రవ్వలను కూడా చేర్చారు. కిరోసిన్‌పై అప్పటికే రేషనింగ్ విధించారు. సిమెంటూ ఆ జాబితాలో చేరింది (చిట్టచివర రేషనింగ్‌ను తొల గించినది దానిపైనే). ‘ఇందిరా! నీ పాలనలో చెత్తను కూడా రేషన్‌కే అమ్ము తారు’ అనే జనసంఘ్ నినాదం అప్పట్లో అత్యంత ప్రాచుర్యం పొందడంలో ఆశ్చర్యమేమీ లేదు. సోషలిస్ట్ గతంలోకి తిరోగమనం అయితే నిరాటంకంగా ఆ సోషలిస్ట్ రాజ్ కొనసాగింది. మావో సూట్ల ప్రేరే పణతోనో ఏమో గానీ 1970 నాటికి రేషన్ దుకాణాల ద్వారా నూలు బట్ట లను కూడా అమ్మేవారు. ఒక దశలో స్కూలు నోటు పుస్తకాలనూ అమ్మారు. ఐఏఎస్ అధికారులు ఇంకా తాము సాధికారులమయ్యామని భావించేవారు. ఉదాహరణకు, మీ బిడ్డ పెళ్లికి ఎంతమంది అతిథులు వస్తారనుకోవడం సహే తుకమో, పెళ్లికి ఎంత హల్వాను వడ్డించవచ్చో (చక్కెర, రవ్వ లేనిదే హల్వా లేదుగా) నిర్ణయించే అధికారం వారికి ఉండేది. పెళ్లికి హాజరయ్యే అతిథుల సంఖ్యను 25 మందికి పరిమితం చేయడం వివేకవంతమంటూ సోషలిస్టు సర్కారు అతిథుల నియంత్రణ చట్టాన్ని తెచ్చేవరకు పోయింది. అయితే దాన్ని ఎవరూ లెక్క చేసేవారు కారనుకోండి. దీంతో త్వరలోనే మధ్యవర్తిత్వ ఏర్పాటూ జరిగింది. అదనంగా ఎందరు అతిథులను ఆహ్వానిస్తారనేదాన్ని బట్టి తలకు ఇంత అని పర్యవేక్షణాధికారులు నేటి కేటరర్ (భోజనాల సర ఫరాదారు) లాగే డబ్బు వసూలు చేసేవారు. పాల సరఫరా తక్కువగా ఉండే వేసవిలో కోవా, పన్నీర్, బర్ఫీ, గులాబ్ జామూన్, రసగుల్ల వంటి పాల ఉత్పత్తులపై నిషేధం విధించడం దీనికి పరాకాష్ఠ. సోషలిస్టు రాజ్యం లక్ష్యం ధనిక, పేద అంతరాలను, పాలకులకు, ఓటర్లకు మధ్య అంతరాలను తగ్గించడం. ఫలితం మాత్రం సరిగ్గా వ్యతిరేక మైనది. ధనవంతులు మరింత ధనవంతులు అవుతూ, సంతోషంగా కావాల్సి నవన్నీ కొనుక్కుంటూ ఉండగా... మిగతా వారు అధికార యంత్రాంగపు వలస పాలనకు గురికావడం తప్ప గత్యంతరం లేదని మిన్నకుండేవారు. మన దీన స్థితిని చూసి మనమే నవ్వుకోవడాన్నిసైతం నేర్చుకున్నాం. ఉదా హరణకు, భటిండాలో ఒక రైతు ఒక ఫిరంగికి లెసైన్సు కావాలని దరఖాస్తు పెట్టుకున్నాడు. ఈ తలతిక్కవాడు ఎవడా? అని జిల్లా మేజిస్ట్రేటు అతడ్ని పిలిపించాడు. ‘‘హుజూర్ నేను నా కూతురి పెళ్లికి ఐదు క్వింటాళ్ల చక్కెర కావా లని దరఖాస్తు చేసుకుంటే, దొరగారు (డీఎమ్) 25 కిలోలు దయ చేయిం చారు. అందుకే నాకో పిస్తోలు మాత్రమే అవసరమున్నా, ఫిరంగితో మొదలు పెట్టాను’’ అని ఆ రైతు సమాధానమిచ్చాడు. లోపరహితం ‘వ్యవస్థ’ లేకపోతే, నాటి మనోజ్‌కుమార్ బ్రాండ్ బాలీవుడ్ హిట్ సినిమాలనే తీసు కోండి. వాటన్నిటిలో నల్లవర్తకులు, దొంగనిల్వదారులు, అక్రమ లాభార్జనా పరులే దుష్టులు, విలన్లు, హంతకులు, అత్యాచారాలు చేసేవారై ఉంటారు. ప్రభుత్వాధికారి అలాంటి విలన్‌గా ఉన్న సినిమా ఒక్కటీ కన పడదు. 1974 నాటి సూపర్ హిట్ సినిమా ‘రోటీ, కపడా, మకాన్’ను గూగుల్ సెర్చ్‌లో టైపు చేసి చూడండి. ఆ సినిమా సరిగ్గా ద్రవ్యోల్బణం చరిత్రాత్మకమైన గరిష్ట స్థాయికి 27 శాతానికి చేరినది కూడా 1974లోనే కావడం విశేషం. ఆ సినిమాలో ‘‘బాకీ కుచ్ బచాతో మెహంగాయీ మార్ జాయీ...’’ (ఆ మిగతా కొంచెమూ మిగుల్చుకోగలిగితే కరువు అంతమైపోతుంది) అనే ఎవర్గ్రీన్ మాటలను ఒక్కసారి చూడండి. నేడు తాజాగా రేషనింగ్ విధించిన వస్తువైన కరెన్సీని మన సొంత బ్యాంకు ఖాతాల నుంచే తీసుకోవడానికి క్యూలలో నిలుస్తున్న మనకు... వ ర్మ మాలిక్ రాసిన ఆ మాటలు నేడు ఎంత సుపరి చితమైనవిగా అనిపిస్తాయో మీరే చూడండి. ‘‘అంతేలేని పొడవాటి రేషన్ క్యూ లైన్ మనల్ని చంపేస్తుంది, లేకపోతే నిరసిస్తున్న ప్రజలు పడు తున్న బాధైనా ఆ పని చేస్తుంది’’. దశాబ్దాల సోషలిస్టు రేషనింగ్ వల్ల సమాజంలో సూపర్ (సర్కారీ) ఉన్నత వర్గాలను తయారైంది. అది ఎల్లప్పుడూ నిర్దాక్షి ణ్యంగా అసమాన మైనదే కాదు, అత్యధికంగా అవినీతిని, నల్లధనాన్ని కూడా సృష్టించింది. మనల్ని మనమే కొరడా దెబ్బలు కొట్టుకుని, మేం భారతీయులం ఇలా మాత్రమే ఉంటాం, జన్యుపరంగానే మేం వంచనాపరులం, అవినీతిప రులం. మనం లోపరహితులం కాము, కానీ మన అధికార వ్యవస్థ లేదా ప్రభుత్వం, మన నేతలు ఒక్క మాటలో చెప్పాలంటే ‘వ్యవస్థ’ మాత్రం ఏ లోపం లేనిది. ఇలాంటి ఆలోచనా ధోరణి మనల్ని దశాబ్దాల స్వీయ వినాశ నంలోకి తోసేసింది. అత్యధికమైన ప్రభుత్వ నియంత్రణలో ‘గరీబీ హటావో’ (పేదరికాన్ని నిర్మూలించండి) విధానం ఏళ్ల తరబడి అమలైనా 1971-83 మధ్య కాలంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారి శాతం తగ్గింది మాత్రం సున్న. అయినా అదే మన సోషలిస్ట్ రాజ్ ఘనత. దానికి ఇంకా అంటి పెట్టుకుని మనం ఇంకా ఇందిరాగాంధీని మన అతి గొప్ప నేతగా కీర్తిస్తూనే ఉన్నాం. అప్రతిష్టాకర గతంతోనే భవితలోకి? గూగుల్ అనంతర కాలపు తరానికి ఈ గతంతో అనుబంధం లేకపోవచ్చు. కానీ మన అధికార యంత్రాంగంవలే వారి తల్లిదండ్రులకు దానితో అను బంధం ఉంటుంది. కాబట్టే రేషనింగ్, కంట్రోళ్ల గురించి తాజా ఆలోచన ఏదైనా నోరూరేట్టు చేస్తోంది. ఇది పాత సోషలిస్టు, కంట్రోల్ రాజ్ నాటి ప్రాథమిక సహజ స్వాభావికతను కూడా తిరిగి ముందుకు తెస్తుంది. కాబట్టి ‘‘వ్యవస్థ’’ ఆశ్చర్యకరంగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయం చేస్తే ఏం చేయాలి? పాత నియమ నిబంధనల దుమ్ము దులపాలి. గుర్తింపు కార్డుల కాపీలతో తలకు రూ. 4,000 చొప్పున మంజూరు చేయాలి. చాలా మంది వచ్చేసరికి చెరగని సిరా ముద్రను వేలికి వేస్తుంది. హడావుడిగా అది దొరకకపోయే సరికి ఆ పరి మితిని సగం చెయ్యాలి. అయినా నగదు ఉపసంహరణలను (విత్‌డ్రాయల్స్) చేయలేరు. అయినా పర్వాలేదు, ప్రధాని, ఆర్బీఐలు రెండూ డిసెంబర్ 30 వరకు ఇదే పరిస్థితి ఉంటుందని హామీ ఇచ్చారు. ఏది ఉత్తమమో ప్రభు త్వానికి ఎప్పడూ తెలుసు. పెళ్లి ఖర్చుల కోసం మీ సొంత డబ్బు రూ. 2.5 లక్షలు విత్‌డ్రా చేసుకోడానికి నిబంధనలను రూపొందించినది 1960లలో పెళ్లికి చక్కెర కోటా నిబంధనలను తయారు చేసిన వ్యక్తే. నిజంగానే అది నిజమే అయినా కావచ్చు... ఎవరైనా ఆ పాత ఫైళ్లను తీసి ఖాళీలను నింపి ఉంటారు. దీన్ని ఇంతకంటే వివరించడానికి మరింత పరిశోధన అవసరం. అది కేవలం ఒక కాలమ్‌లో వివరించగలిగేది కాదు. భారత అధికార యంత్రాంగం ఎలా ఆలోచిస్తుందనే అంశానికిగానూ హార్వర్డ్ యూనివర్సిటీ ఆ పరిశోధనకు బహుశా డాక్టరేట్‌ను సైతం ఇవ్వొచ్చు. నవంబర్ 8 తర్వాత తీసుకున్న ప్రతి నిర్ణయమూ గాబరాగా మన సోషలిస్టు గతంలోకి తొంగి చూసి చేసినదే. మీకు ఇంకా అనుమానాలుంటే మీ పాత పాస్‌పోర్ట్‌లను ఒకసారి చూడండి. నిజానికి మరీ పాతవీ అక్కర్లేదు, 1990ల మొదట్లో పీవీ నర సింహారావు, మన్మోహన్‌సింగ్‌లు సంస్కరణలు తెచ్చి పరిస్థితిని మార్చడానికి ముందటి వాటిని చూస్తే సరి. వాటి చివరి పేజీలన్నీ అస్తవ్యస్తమైన, చాలా వరకు అర్థంకాకుండా ఉన్న ఎంట్రీలు, రబ్బురు స్టాంప్ ముద్రలు కని పిస్తాయి. విదేశీ ప్రయాణాలకు వెళ్లేటప్పుడు మార్చుకున్న నగదు మొత్తం, వచ్చేటప్పుడు తిరిగి తెచ్చిన నగదును ఎంత మార్చుకున్నారో లెక్కలు రాసి, బ్యాంకు గుమాస్తాలు పెట్టిన సంతకాలుంటాయి (కరెన్సీ గ్రేడు కాగితం మీద ఆ రాతలను ఆర్బీఐ అనుమతించింది). భారత్ రావడానికి సిద్ధపడేటంతటి మూర్ఖత్వం ఉండి, మనిషి సృష్టించిన కరెన్సీ కరువులో, రేషనింగ్‌లో ఇరు క్కున్న విదేశీ పర్యాటకులకు ‘‘వీలుగా’’ మన ‘‘వ్యవస్థ’’ ఏమి చేసిందో చూడండి : వారానికి రూ. 5,000 (71 అమెరికన్ డాలర్లు), నగదు ఇవ్వ డమూ, వారి పాస్‌పోర్టుల వెనుక ఖరాబు చేయడమూను. సందేహంలో పడ్డప్పుడల్లా లేదా బెంబేలెత్తిపోయినప్పుడు, ఆలోచనలు కరువైనప్పుడు మనం తిరిగి గతంలోకి పోతాం. అది ఎంత అధ్వానమైనదైనా, ఎంతగా అప ఖ్యాతిపాలైనదైనా అదే చేస్తాం. దేశాన్ని మార్చాలన్న ప్రధాని నరేంద్రమోదీ దృఢ సంకల్పాన్ని మనం సందేహించలేం. అయితే గతంలోని సోషలిస్టు రాజ్ అప్రతిష్టాకరమైన అవశేషాలనే పట్టుకుని, అదే పాత అధికార వ్యవస్థను అంటిపెట్టుకుని ఆయన ఆ పని చేయగలరా? అనేదే సందేహం. శేఖర్ గుప్తా twitter@shekargupta -
‘లౌకిక, సామ్యవాద పదాలను తొలగించాలి’
ముంబై: దేశ రాజ్యాంగం నుంచి ‘లౌకిక’, ‘సామ్యవాద’ పదాలను శాశ్వతంగా తొలగించాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ బుధవారం డిమాండ్ చేశారు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేరిన ఈ పదాలు లేని రాజ్యాంగ పీఠిక చిత్రాన్ని గణతంత్ర దినోత్సవం సందర్భంగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రకటనలో వాడడంపై దుమారం రేగిన నేపథ్యంలో సంజయ్ స్పందించారు. -
లెఫ్ట్ విలీనంతోనే ఫ్రంట్‌కు మనుగడ
విశ్లేషణ అసలు లోపం ఎక్కడుంది? పార్లమెంటరీ వ్యవస్థను ఎంచుకున్న తరువాత కూడా, ఉభయులూ విలీనం కావడానికి ఎలాంటి విభేదాలు అడ్డు వస్తున్నాయి? ఇది ప్రజలకూ మేధావులకే కాదు, ఉభయ పార్టీల కార్యకర్తలకు సయితం అంతుపట్టదు. ‘పెట్టుబడిదారీ ప్రభుత్వాలకు మనం ఒక సత్యాన్ని వెల్లడించాలి. మీది సాయుధమై ఉన్న రాజ్యశక్తి. దానిని మీరు కష్టజీవులైన శ్రామిక వర్గం మీద ఎక్కుపెట్టారు. కానీ, మేం మాత్రం మీకు వ్యతిరేకంగా సాధ్యమైన చోటల్లా శాంతియుత పద్ధతులతోనే పోరాడుతాం. అవసరమైనప్పుడు మేమూ సాయుధులమై పోరాడక తప్పదు.’ ఈ మాటలు అన్నదెవరో, అవి అందిస్తున్న సందేశం ఏమిటో ఎనభై ఏళ్ల చరిత్ర కలిగిన భారత ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీకీ, దానితో పాటే ఎదుగుతూ వచ్చిన ఇతర పక్షాలకూ (సోషలిస్టులు, ఫార్వార్డ్ బ్లాక్ వంటివి)తెలియనిది కాదు. ఇంటర్నేషనల్ వర్కింగ్‌మెన్స్ అసోసియేషన్ (1864) ప్రారంభ సభతో పాటు, ప్రపంచ వామపక్ష రాజకీయ ప్రతినిధులకు పునశ్చరణ తరగతులను ఏర్పాటు చేసినప్పుడు కారల్‌మార్క్స్ అన్నమాటలివి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా భారతదేశంలో పెట్టుబడిదారీ-భూస్వామ్య వర్గ పాలనా వ్యవస్థ కొనసాగింది. దేశ ప్రజల ఉమ్మడి సంపదనూ, వనరులనూ యథేచ్ఛగా దోచుకునేందుకు ధనిక వర్గానికీ, దేశ విదేశ కార్పొరేట్ సంస్థలకూ ద్వారాలు తెరిచి పెడుతోంది. కానీ భారత ప్రజాతంత్ర విప్లవ దశనూ, దిశనూ స్పష్టం చేయడంలో కమ్యూనిస్టులు సహా వామపక్షాలు నేటికీ విఫలమవుతూనే ఉన్నాయి. పెట్టుబడిదారీ భూస్వామ్య వ్యవస్థ అవశేషాలను నిర్మూలించగలిగే వ్యూహ రచన చేయడంలోనూ అలాంటి వైఫల్యం కనిపిస్తుంది. ఈ వాతావరణం వల్లనే ప్రజాతంత్ర, ప్రజాస్వామ్య శక్తులను నిర్దిష్ట ప్రణాళిక ప్రాతిపదికగా సమీకరించి తృతీయ ఐక్య సంఘటనను (థర్డ్ ఫ్రంట్) అందించలేకపోయారు. చిందరవందరైన కల 1960ల వరకు ఆంధ్రప్రదేశ్‌లోనూ, దేశ వ్యాప్తంగానూ కమ్యూనిస్టు పార్టీ ఐక్యంగా, పటిష్టంగా పని చేసింది. రాజకీయంగా, సాంస్కృతికంగా అనూ హ్య శక్తిగా అవతరించింది. తరువాత రెండుగా, ఆపై ‘కణ విభజన’ మాది రిగా పది పన్నెండు ముక్కలుగా విడిపోయింది. ఇదే ఆ వైఫల్యానికి ప్రధాన కారణం. అంతేకాదు, గడచిన 55 ఏళ్లలో కేరళ, పశ్చిమ బెంగాల్‌లలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుని కూడా (త్రిపుర ఇందుకు మినహాయింపు) వాటిని కమ్యూనిస్టు పార్టీ సంఘటితం చేసుకోలేకపోయింది. దీనికి తోడు క్రమంగా ధనికవర్గ కుహనా ‘ప్రజాస్వామ్య’ చట్రంలో బందీ అయిపోవడం వల్ల, పూర్వపు శ్రామిక వర్గ పార్టీ మిలిటెన్సీ లక్షణం కూడా సడలిపోయింది. పేద ప్రజల భూ సమస్య పరిష్కారంలోనూ, విద్యా ఉపాధిలోనూ కుహనా వ్యవస్థ అనుమతించిన మేరకే ఎన్నో ఆదర్శవంతమైన సంస్కరణలకు అధికారంలో ఉన్నప్పుడు కమ్యూనిస్టు పార్టీలు నాంది పలకడం దీని ఫలితమే. ఈక్రమంలోనే కుహనా ప్రజాస్వామ్య వ్యవస్థలో పదవులలోకి వచ్చిన కమ్యూనిస్టు-మార్క్సిస్టు పార్టీలు విధానాల పరంగా, ప్రవర్తన పరంగా ఆ వ్యవస్థ చట్రం నుంచి బయటపడలేకపోయాయి. దీనితోనే, ఎంత వామపక్ష ‘బ్రాండ్’ ఇమేజీ ఉన్నప్పటికీ వీటి పట్ల ప్రజలలో, శ్రేణులలో ఉన్న పలుకుబడి మసకబారక తప్పలేదు. చివరికి కమ్యూనిస్టేతర వామపక్ష ప్రజాతంత్ర శక్తుల మధ్య పరస్పర విమర్శలు, అసహనం చోటు చేసుకున్నాయి. ఉమ్మడి పార్టీ చీలికలో భాగంగా మావోయిస్టు పార్టీ దూసుకొచ్చింది. మిగిలిన ఏకోదరులకు భిన్నంగా మిలిటెన్సీ మార్గంలో సాగిపోతోంది. రాజ్యశక్తితో తలపడుతూ, తన ప్రభావాన్ని విస్తరించుకుంటూ వెళ్లగలిగే శక్తిగా రూపొందింది. విధానాలూ, విభేదాల పేరిట చీలకలూ పేలికలూ అయిపోయిన ఈ ముక్కలన్నీ ఏకం కావడానికి ఎన్నాళ్లు, నిజానికి ఎన్నేళ్లు పడుతుందో వాటికే తెలియని స్థితి. ఈ విభిన్న శాఖల మధ్యనే ‘కోవర్టులు’ పేరిట గొంతులు కోసుకుంటున్న దుస్థితి. ఈ గందరగోళం మధ్య ప్రజాస్వామ్య వ్యవస్థ పేరిట నిర్వహిస్తున్న కుహనా ఎన్నికలలో రాజకీయ పార్టీల పొత్తులు కూడా ప్రహసనప్రాయంగా మారిపోయాయి. బహుళజాతి సంస్థలకూ, బడా గుత్తవర్గాలకూ దాసోహమనడంలో పోటీ పడుతున్నప్పటికీ కాంగ్రెస్, బీజేపీ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నట్టు ఇతర పక్షాలు వీటిలో ఒకదానితో అంటకాగడానికి ఉబలాటపడుతున్నాయి. ఈ సమయంలో, కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసం కాకుండా, దేశ ప్రజల సంక్షేమం కోసం, బడుగులూ మైనారిటీల రక్షణ కోసం కాంగ్రెసేతర, బీజేపీయేతర తృతీయ ఫ్రంట్‌ను నిర్మించడం అనివార్య బాధ్యతగా వామపక్షాలు భావించాలి. విలీనమై తీరాలి ఈ బాధ్యత కోసం మొదటి మెట్టుగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు విలీనమై తీరాలి. ఇదొక చారిత్రక కర్తవ్యమని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు గుర్తించాలి. ఇవి పట్టుదలకు పోయి సమీక్షకూ, ఆత్మవిమర్శకూ దూరమవుతున్నాయి. అసలు లోపం ఎక్కడుంది? పార్లమెంటరీ వ్యవస్థను ఎంచుకున్న తరువాత కూడా, ఉభయులూ విలీనం కావడానికి ఎలాంటి విభేదాలు అడ్డు వస్తున్నాయి? ఇది ప్రజలకూ మేధావులకే కాదు, ఉభయ పార్టీల కార్యకర్తలకు సయితం అంతుపట్టదు. ఆ విభేదాలు రాజకీయ సంబంధమైనవా? వ్యక్తుల స్థాయిలో నాయకత్వాల మధ్య తగాదాలా? మళ్లీ ఏకైక పార్టీగా జాతీయస్థాయిలో అవతరిస్తే ప్రస్తుతం ఉన్న నాయకత్వాలూ, స్థిరపడిన పదవులూ కోల్పోవలసి వస్తుందన్న బెంగా? వీటిలో ఏది ప్రబలమైన కారణమో ఉభయ పక్షాలూ నిజాయితీతో క్యాడర్‌కూ, శ్రేయోభిలాషులకూ, సానుభూతిపరులకూ, ప్రజా బాహుళ్యానికీ విశదీకరించవలసిన సమయం వచ్చింది. సోవియెట్ విప్లవ రథసారథి, సోవియెట్ సోషలిస్ట్ రిపబ్లిక్ నిర్మాత లెనిన్ సహితం అంతిమ విప్లవానికి ముందు ‘డ్యూమా’ (రష్యన్ పార్లమెంట్)ను దోపిడీ వర్గాలనూ, విధానాలనూ ఎండగట్టడానికి వినియోగిచుకుంటూనే అవసరమైతే అంతిమ పోరాటానికి పార్టీ ‘అజ్ఞాత క్యాడర్’ను (సెమీలీగల్) కూడా నిర్మించుకున్నాడు. నేడు ఇండియాలో కూడా బూటకపు ప్రజాస్వామ్యానికీ పెట్టుబడి వ్యవస్థకూ ప్రత్యక్ష, పరోక్ష ప్రాతినిధ్య పక్షాలుగా నిలిచిన కాంగ్రెస్, బీజేపీ రెక్కలు కత్తిరించాలన్నా, ఈ రెండింటితో నిమిత్తం లేని సెక్యులర్ శక్తిగా మూడవ కూటమి అవతరించి నిలదొక్కుకోవాలన్నా సీపీఐ-సీపీఎం తక్షణం విలీనమై, దూసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో దురదృష్టకరమైన పరిణామం ఏమిటంటే- రేపటి సాధారణ ఎన్నికల పూర్వరంగంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు పొత్తుల కోసం పడుతున్న పాట్లు. ఆ పార్టీలు ప్రజాభిమానానికి దూరంగా ఉన్నాయని చెప్పడానికి ఇది చాలు. పైగా, పదవి కోసం తెలుగు జాతిని చీల్చడానికి ఉద్యమించిన దొరల పార్టీకీ, కాంగ్రెస్కీ మధ్య సీట్ల సర్దుబాటు కోసం మధ్యవర్తిత్వం వహించడానికి ఒక వామపక్షం గజ్జె కట్టడం హాస్యాస్పదం! వేరొక వామపక్షము అదే ‘దొరల’ పార్టీతో చేతులు కలపడానికి సిద్ధమయింది. విభజన మూలం అక్కడే ఉభయ కమ్యూనిస్టు పార్టీల దిగజారుడు రాజకీయ వ్యూహాల ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు పునాదులు పడినాయని గుర్తించాలి. ఎందుకంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట లక్ష్యం - తెలంగాణలో దొరల, భూస్వాముల పెత్తనాన్నీ, నిజాం నిరంకుశ పాలననూ ఏకకాలంలో అంతమొందించి తెలంగాణ ప్రజలకు శాశ్వత విమోచన కల్గించడం. యావత్తు తెలుగు జాతిని ఒకే భాషా రాష్ట్రంలో సమీకరించి, స్థిరపరచటం కూడా. ఇప్పుడు ఈ లక్ష్యానికి చేజేతులా తూట్లు పొడిచే అవకాశాలను ఇతరేతర శక్తులకు కల్పించి పెట్టింది ఉభయ కమ్యూనిస్టుల అనైక్యతేనని విస్మరించరాదు. ఈ రెండు పక్షాల పూర్వపు చైతన్యం చెక్కు చెదరకుండా ఉండి ఉంటే, వేర్పాటుశక్తులు విభజనకు సాహసించేవీ కాదు! ఇది ఉభయ కమ్యూనిస్టు పక్షాలకు పరీక్షా సమయం, సమీక్షించుకునే సమయం! కమ్యూనిస్టు లెప్పుడూ తమకు అనుకూల సమయాల్లో తప్పుటడుగులు వేస్తారు. తమకు ప్రతికూల సమయంలో, నిర్ణయాలు చేసినప్పుడు తప్పులు చేస్తారన్న నానుడిని వారు రూపుమాపుకునే శుభఘడియ కోసం వేచిచూద్దాం. (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు)