సోషలిజానికి సరికొత్త భాష్యం | Martha Honaker A Great Socialist | Sakshi
Sakshi News home page

సోషలిజానికి సరికొత్త భాష్యం

Published Thu, Jul 4 2019 3:28 AM | Last Updated on Thu, Jul 4 2019 3:28 AM

Martha Honaker A Great Socialist - Sakshi

లాటిన్‌ అమెరికాలోనే కాక ప్రపంచవ్యాప్తంగా లక్షలాది అభిమానులను సంపాదించుకొన్న విప్లవ తాత్వికవేత్త మార్తా హర్నేకర్‌. విద్యార్థి దశలోనే ఉద్యమ ధారగా మొదలైన ఆమె జీవితం తత్వవేత్తగా, మార్క్సిస్టు మేధావిగా, మహా రచయిత్రిగా, పాత్రికేయురాలిగా, ప్రపంచ ప్రఖ్యాత రచయిత్రిగా ఎదిగిన తీరు ప్రజాస్వామిక కాంక్షాపరులందరికీ ఆదర్శప్రాయంగా నిలిచింది. ఆమె తెలుగు రాష్ట్రాల్లోని మార్క్సిస్టు అభిమానులకు, ప్రజాస్వామిక ఉద్యమకారులకు పరిచయమున్న విప్లవ కంఠం. ప్రజాస్వామ్యం అట్టడుగు స్థాయి నుంచి పటిష్టం చేయడం ద్వారా మాత్రమే సోషలిజం కల సాకారమవుతుందని ఆమె తేల్చి చెప్పారు. నిత్య సంఘర్షణావాది, నిరంతర సత్య శోధకురాలు మార్తా హర్నేకర్‌ గతనెల 14వ తేదీన తుదిశ్వాస విడవడం ప్రజాస్వామిక అభిమానులకు తీరని లోటు.

‘‘ప్రపంచంలో రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. భారీ సైనిక శక్తి, శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధితో అమెరికాతో సహా అనేక బహుళజాతి కంపెనీలు నూతన దోపిడీ విధానాలను కొనసాగిస్తున్నాయి. దీనితో ప్రజలు మరింత అశక్తులుగా తయారవుతున్నారు. సంపద కొద్దిమంది చేతుల్లోకి చేరిపోతుండడం వల్ల పేదరికం, వివక్ష మరింతగా పెరిగిపోతున్నది’’ అని ఆధునిక మార్క్సిస్టు మేధావి మార్తా హర్నేకర్‌ చేసిన వ్యాఖ్యలు ఆధునిక సామాజిక స్థితిగతు లకు అద్దం పడుతున్నాయి. మార్క్సిజాన్ని సమకాలీన సమాజానికి అన్వయించడంలో నిరం తరం కృషి చేసిన గొప్ప తాత్విక వేత్త మార్తా హర్నేకర్‌. విద్యార్థి దశలోనే ఉద్యమధారగా మొదలైన ఆమె జీవితం తత్వవేత్తగా, మార్క్సిస్టు మేధావిగా, మహా రచయిత్రిగా, పాత్రికేయురాలిగా, ప్రపంచ ప్రఖ్యాత రచయిత్రిగా ఎదిగిన తీరు ప్రజాస్వామిక కాంక్షాపరులందరికీ ఆదర్శప్రా యంగా నిలిచింది. మార్తా హర్నేకర్‌ తెలుగు రాష్ట్రాల్లోని మార్క్సిస్టు అభి మానులకు, ప్రజాస్వామిక ఉద్యమకారులకు పరిచయమున్న విప్లవ కంఠం. తెలంగాణ ఆవిర్భావం తరువాత హైదరాబాద్‌లో 2014 మార్చిలో ఏర్పాటు చేసిన ‘‘సోషలిజం–ప్రజాస్వామ్యం’’ అంతర్జాతీయ సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని నాలుగు రోజుల పాటు ఎన్నో అంశాలపై చర్చించడం తెలంగాణ ఉద్యమకారులకూ, ప్రజాస్వామిక వాదులకూ, విప్లవాభిమానులకూ ఎంతో స్ఫూర్తినిచ్చింది. మార్తాహర్నే కర్‌ కలం నుంచి వెల్లువెత్తిన సైద్ధాంతిక భేదాభిప్రాయాలూ, సామాజిక అంచనాలూ వంటి వేనవేల రచనలు ఎందరినో ఆలోచింపజేశాయి. ఆమె ప్రపంచ మార్క్సిస్టు మేధావుల్లో ఒక నూతన ఆలోచనలకు పునా దులు వేసిన అగ్రగామి.

లాటిన్‌ అమెరికాలోనే కాక ప్రపంచవాప్తంగా లక్షలాది అభిమానులను సంపాదించుకొన్న విప్లవ తాత్వికవేత్త. మార్తా రాసిన ‘రీ బిల్డ్‌ ద లెఫ్ట్‌’ ఎన్నో విమర్శలనెదుర్కొన్నప్పటికీ ప్రపంచవ్యా ప్తంగా కమ్యూనిస్టుల్లో సైద్ధాంతిక చర్చను రేపిన పుస్తకం, మార్క్సిస్టు సైద్ధాంతిక ఆచరణకు సరికొత్త అర్థం చెప్పిన రచన అని చెప్పొచ్చు. అటు వంటి నిత్య సంఘర్షణావాది, నిరంతర సత్య శోధకురాలు మార్తా హర్నే కర్‌ గతనెల 14వ తేదీన తుది శ్వాస విడవడం ప్రజాస్వామిక అభిమాను లకు తీరని లోటు. మార్తా హర్నేకర్‌ ఆస్ట్రియన్‌ మూలాలు కలిగిన కుటుంబంలో 1937లో చిలీలో జన్మించారు. చిలీలోని క్యాథలిక్‌ విశ్వ విద్యాలయంలో మానసిక శాస్త్రంలో పట్టా పొందారు. ఆ తర్వాత పారి స్‌లో పోస్ట్‌ గ్రాడ్యు యేషన్‌ చేశారు. ప్రముఖ విద్యావేత్త, లూయీస్‌ ఆల్తూసర్‌ వద్ద మార్తా హర్నేకర్‌ శిక్షణ పొందారు. 1963–1968 వరకు పారిస్‌లో ఉన్న మార్తా ఆనాడు ఉధృతంగా సాగిన పారిస్‌ విద్యార్థి ఉద్యమం నుంచి స్ఫూర్తిపొం దారు. 1968లో చిలీకి తిరిగి వచ్చిన మార్తా హర్నేకర్‌ చిలీ విశ్వవిద్యాల యంలో చారిత్రక భౌతికవాదం, రాజకీయా ర్థశాస్త్రం అధ్యాపకురాలిగా పనిచేశారు. 1968లోనే చిలీ సోషలిస్టు పార్టీలో చేరి క్రియాశీలకంగా పని చేసిన అనుభవం ఆమెను సైద్ధాం తికంగా, ఆచరణాత్మకంగా మరింతగా రాటుదేలేలా చేశాయి.

కేరళ తర్వాత ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చిన కమ్యూనిస్టు ప్రభుత్వం చిలీలోని అలెండి ప్రభుత్వమే. 1970లో చిలీలో అలెండి ఎన్ని కల ద్వారా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. చిలీ సోషలిస్టు పార్టీ నేత సాల్వడర్‌ అలెండి నాయకత్వంలో మార్తా పనిచేశారు. అయితే 1973 సెప్టెంబర్‌ 11న అమెరికా కుట్రలో సైనిక తిరుగుబాటు జరిపి అలెండి ప్రభుత్వాన్ని కూలదోశారు. అలెండి అనుచరులందరినీ హత్య చేయ డమో, జైల్లో పెట్టడమో జరిగింది. మార్తా మాత్రం చిలీ నుంచి తప్పిం చుకొని క్యూబా చేరుకున్నారు. క్యూబాలో ఒక అధ్యయన సంస్థను స్థాపించి, తన పరిశోధనలను, రచనా వ్యాసంగాన్నీ కొనసాగించారు. అంతకు ముందు మార్తా విద్యార్థి దశలో ఉండగానే 1959లో క్యూబాను సందర్శించారు. అప్పటికే క్యూబా విముక్తిని సాధించింది. క్యూబా విప్లవంలో ‘ఎర్రగడ్డం’ యోధుడిగా పేరుపొందిన మాన్యుల్‌ పినెరోను మార్తా వివాహం చేసుకున్నారు. వారిద్దరికీ ఒక కూతురు. ఆమె పేరు కమిల. మార్తా భర్త పినెరో 1998లో కారు ప్రమాదంలో మరణించారు. క్యూబాలో ఉన్న సమయంలో మార్తా హర్నేకర్‌ లాటిన్‌ అమెరికా చరిత్ర, ఉద్యమాలు, అనుభవాలెన్నింటినో ప్రత్యక్షంగా పాల్గొన్న వారి ద్వారా సేకరించారు. ఆ విధంగా లాటిన్‌ అమెరికా ఉద్యమాల చరిత్రను ఒక ప్రత్యేక దృష్టితో పరిశీలించారు. మార్క్సిజాన్ని  లాటిన్‌ అమెరికాకు అన్వ యించి ఆమె 80కి పైగా పుస్తకాలు రాశారు. అందులో మొట్టమొదట చెప్పుకోవాల్సింది. ‘చారిత్రక భౌతిక వాదం–ప్రాథమిక సూత్రాలు’ అన్న పుస్తకం. ఈ పుస్తకం 60కి పైగా ముద్రణలు పొందింది. మొదట స్పానిష్‌లో ప్రచురితమైన ఆ పుస్తకం, ఆ తర్వాత ఇంగ్లిష్‌తో పాటు ప్రపంచంలోని చాలా భాషల్లోకి అనువాదమైంది. ఆమె రచనల్లో ‘ఎ వరల్డ్‌ టు బిల్డ్‌’, ‘ఐడియాస్‌ ఫర్‌ స్ట్రగుల్‌’ వెనిజులా విప్లవనాయకుడు చావెజ్‌ ఇంటర్వ్యూతో రూపొందిన పుస్తకం, ‘రీ బిల్డింగ్‌ ద లెఫ్ట్‌’ పుస్తకాలు ప్రపంచ ప్రఖ్యాతి పొందినవి. చివరి రెండు పుస్తకాలు తెలుగు లోకి కూడా అనువాద మయ్యాయి. మార్తా మార్క్సిస్టు తాత్విక విష యాల వెలుగులో ఆచరణకు సంబంధించిన విషయాలను ప్రధానంగా చర్చించారు. ముఖ్యంగా మార్క్సిస్టు సిద్ధాంతాలతో పనిచేస్తోన్న రాజ కీయ పార్టీల ఆచరణను మార్తా విమర్శనాత్మక దృష్టితో చూశారు. 

కమ్యూనిస్టు, మార్క్సిస్టు పార్టీల సిద్ధాంత సంక్షోభాన్ని ప్రము ఖంగా ఎత్తిచూపారు. ముఖ్యంగా మూడు అంశాలను ఆమె లేవనెత్తారు. కారల్‌మార్క్స్‌ పేర్కొన్న పెట్టుబడిదారీ విధానానికి ప్రస్తుతం కొనసాగు తోన్న పెట్టుబడిదారీ పద్ధతులకూ ఎంతో తేడా ఉన్నదని, దానిని అర్థం చేసుకోవడంలో మార్కిస్టులుగా మనం విఫలమవుతున్నామని పేర్కొన్నారు. పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేసిన ఆటోమేషన్, డిజిటల్, కంప్యూ టర్లు, రోబోల పాత్ర గురించి విశ్లేషించుకోవాలని, అవి ఉత్పత్తి నుంచి కార్మిక వర్గాన్ని తొలగిస్తున్న అంశాలను అర్థం చేసు కోవాలని మార్తా అభిప్రాయపడ్డారు. కొద్ది మంది మినహా ప్రపంచం లోని అన్ని వర్గాల ప్రజల జీవన ప్రమాణాలు రోజురోజుకూ దిగజారి పోతున్నాయని, గతంలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగం పెరిగి పోతున్నదని చెప్పారు. సమాచార విప్లవం పెట్టుబడిదారీ విధానాన్ని ముందుకు తీసుకెళ్ళిందని, సామ్రాజ్యవాదం రూపంలో మార్చుకున్నదే కానీ, కను మరుగు కాలేదని కూడా ఆమె స్పష్టం చేశారు.

రెండో అంశంగా, కమ్యూనిస్టుల ఒంటెద్దు పోకడలను ఎత్తిచూ పారు. ప్రపంచంలో కొనసాగుతున్న నయా ఉదారవాదం, ప్రపంచీకర ణకు వ్యతిరేకంగా పోరాడుతున్న సమయంలో కలిసివచ్చే శక్తులన్నిం టితో కలిసి పనిచేయాలని, కేవలం కమ్యూనిస్టు సభ్యులతో మాత్రమే విజయం సాధించలేమని ఆమె పేర్కొన్నారు. సోదరభావం, సమస మాజం ఆశించే వాళ్ళు, కార్మిక వర్గ హక్కుల కోసం, ప్రజాస్వామ్య రక్షణ కోసం పోరాడే వాళ్లందరితో కలిసి పోరాడాలని ఆమె స్పష్టం చేశారు. అంతేకాకుండా గత ఉద్యమాల నుంచి, గత సోషలిస్టు ప్రభుత్వాలు, వ్యవస్థలు అందించిన అనుభవాలను అధ్యయనం చేయాలని ఆమె సూచించారు. అందుకు గాను లాటిన్‌ అమెరికాలో గత రెండు వందల ఏళ్ళుగా సాగుతున్న ఉద్యమాలను మార్తా అధ్యయనం చేశారు. 

మరొక ముఖ్యమైన విషయాన్ని మార్తా పదే పదే చెపుతుండేవారు. మార్క్సిజంలో అత్యంత ముఖ్యమైన చారిత్రక భౌతిక వాదం గురించి ఆమెది ప్రత్యేకమైన అధ్యయనదృష్టి. చరిత్రను భౌతికవాద దృష్టితో చూడాలని మార్క్సిజం చెపుతున్న మాటను ఆమె గుర్తు చేస్తూ, ఇప్పటి వరకూ చారిత్రక భౌతిక వాదాన్ని యూరప్‌కే పరిమితం చేసి చూస్తు న్నామని ఆమె విమర్శించారు. ఏ దేశానికి ఆ దేశ ప్రత్యేక సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఉంటాయనే విషయాన్ని విస్మరించడం వల్ల చాలా దేశాల్లో విప్లవాలు విజయం సాధించలేకపోయాయి. మనదేశంలో ఉన్న సామాజిక సమస్యలు, ప్రత్యేకించి కుల వ్యవస్థ ప్రభావాన్ని ఇప్పటికీ కూడా శాస్త్రీయ పద్ధతిలో విశ్లేషించలేకపోతున్నాము. మార్తా హర్నేకర్‌ మరొక విషయాన్ని చాలా నిక్కచ్చిగా తేల్చి చెప్పారు. కార్మిక వర్గ నియంతృత్వం ద్వారానే సోషలిజం సాధ్యమవు తుందనే వాదనను ఆమె తిరస్కరించారు. ప్రజాస్వామ్యాన్ని అట్టడుగు స్థాయి నుంచి పటిష్టం చేయడం ద్వారా మాత్రమే సోషలిజం కల సాకారమవుతుందని ఆమె తేల్చి చెప్పారు. ఆ విధంగా మార్క్సిజాన్ని ఆధునిక ప్రజాస్వామ్య ఆలోచనల వెలుగులో విశ్లేషించి నూతన అధ్య యనానికి పునాదులు వేశారు. ఆమె రచనలు, భావాలు ఆధునిక ప్రపం చంలో ఒక నూతన వెలుగును నింపాయి. మార్తా లాటిన్‌ అమెరికా ఉద్యమాలు, విప్లవాల వెలుగులో అధ్యయనం సాగించినప్పటికీ ఆమె ఆలోచనలు ప్రపంచం లోని మార్క్సిస్టులందరికీ స్ఫూర్తినిస్తున్నాయి. ముఖ్యంగా మార్తా హర్నేకర్‌ జీవితం, ఉద్యమం, నిత్యం సమాజ మార్పు కోసమే సాగాయి. క్యాన్సర్‌తో పోరాడుతూ తుదిశ్వాస విడిచిన మార్తా  మూసభావనలకు భిన్నంగా, ప్రవాహంతో కొట్టుకుపోకుండా, మారు తున్న సామాజిక ఆర్థిక పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ సరికొత్త, ఆచరణాత్మక పద్ధుతులతో మున్ముందుకు సాగాలని కోరు కున్నారు. మార్తా అంకిత భావం, పోరాట దీక్ష, శాస్త్రీయ అధ్యయనశక్తి భవిష్యత్‌ తరాలకు మార్గదర్శకం అవుతుందని ఆశిస్తున్నా...!

వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘మొబైల్‌ : 81063 22077
మల్లెపల్లి లక్ష్మయ్య 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement