సోషలిస్ట్, సెక్యులర్ పదాలను చేర్చడంపై సుప్రీంకోర్టు
ఇప్పటికే చాలా ఏళ్లు గడిచినందున రద్దు అసాధ్యం
పిటిషన్లను కొట్టివేసిన అత్యున్నత న్యాయస్థానం
న్యూఢిల్లీ: 1976లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం రాజ్యాంగ పీఠికలో మార్పులు చేస్తూ తీసుకువచ్చిన 42వ రాజ్యాంగ సవరణపై అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. పీఠికలో సామ్యవాద, లౌకిక, సమగ్రత (సోషలిస్ట్, సెక్యులర్, ఇంటెగ్రిటీ) అనే పదాలను చేర్చుతూ చేసిన సవరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యం స్వామి, న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ ఈ మేరకు వేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌ల ధర్మాసనం నవంబర్ 22తో వాదనలు ముగించి, సోమవారం తీర్పు వెలువరించింది. ‘రిట్ పిటిషన్లపై తదుపరి విచారణ కానీ, తీర్పు కానీ అవసరం లేదు. రాజ్యాంగంలోని పీఠికను కూడా సవరించే అధికారం పార్లమెంట్‌కుంది. సవరణకు ఇప్పటికే చాలా ఏళ్లు గడిచినందున ఆ ప్రక్రియ రద్దు సాధ్యం కాదు’అని తీర్పులో పేర్కొంది.
‘ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగంలోని మార్పులకు ఆమోదించిన తేదీ ప్రభుత్వ అధికారాన్ని తగ్గించదు. పైపెచ్చు ఆ అధికారాలను సవాల్ చేయలేం. పీఠికకు సైతం మార్పులు చేపట్టే అధికారం పార్లమెంట్‌కు ఉంది’అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ అంశంపై ఇప్పటికే పలు న్యాయపరమైన సమీక్షలు జరిగాయని గుర్తు చేసింది. ఎమర్జెన్సీ సమయంలో పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాలను రద్దు చేయాలని చెప్పలేమని కూడా పేర్కొంది. ఎన్నో ఏళ్లు గడిచాక పీఠికలో చేసిన మార్పులపై ఇప్పుడెందుకు అభ్యంతరం చెబుతున్నారు?అంటూ ధర్మాసనం పిటిషనర్లను ప్రశ్నించింది.
పిటిషనర్ల అభ్యంతరం ఏమంటే..
సామ్యవాదం, లౌకికవాదం అనే పదాలపై చేరిక తనకూ సమ్మతమేనని పిటిషనర్ అశ్వినీ ఉపాధ్యాయ్ వాదనల సందర్భంగా తెలిపారు. అయితే, ఆ పదాలను రాజ్యాంగ పీఠికలో చేర్చడంపైనే తనకు అభ్యంతరం ఉందన్నారు. రాజ్యాంగ పీఠికలో సామ్యవాదం, లౌకిక, సమగ్రత అనే పదాల చేరికను ఇందిరాగాంధీ అనంతరం ఎన్నికైన జనతా పార్టీ ప్రభుత్వం కూడా సమర్థించిందని ఇదే అంశంపై వేరుగా పిటిషన్ వేసిన సుబ్రమణ్యస్వామి పేర్కొన్నారు. అయితే, 1949లో ఆమోదించిన రాజ్యాంగ పీఠికను యథాతథంగా ఉంచుతూ, 1976లో చేపట్టిన మార్పులను వేరుగా ప్రత్యేక పేరాలో ఉంచాలన్నదే తన ఉద్దేశమన్నారు.
ఎమర్జెన్సీ సమయంలో..
ఇందిరా గాంధీ ప్రభుత్వం దేశంలో 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21వ తేదీ వరకు అత్యవసర పరిస్థితి అమల్లో ఉండటం తెలిసిందే. ఆ సమయంలోనే రాజ్యాంగ పీఠికలోని సార్వభౌమ, ప్రజాస్వామ్య గణతంత్ర అనే పదాల స్థానంలో సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర అనే వాటిని చేరుస్తూ పార్లమెంట్ చట్టం చేసింది. ఈ కేసులో మొట్ట మొదటిసారిగా 2020లో బలరాం సింగ్ అనే వ్యక్తి విష్ణు శంకర్ జైన్ అనే న్యాయవాది ద్వారా పిటిషన్ వేశారు. ఇదే అంశంపై విస్తృత ధర్మాసనానికి బదలాయించాలంటూ దాఖలైన పిటిషన్‌ను గతంలో సుప్రీంకోర్టు కొట్టివేసింది. సామ్యవాదం అనే పదాన్ని మన దేశానికి వర్తింపజేసుకుంటే సంక్షేమ రాజ్యమనే అర్థమే వస్తుందని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment