Indira Gandhi government
-
రాజ్యాంగ పీఠికనూ పార్లమెంట్ సవరించొచ్చు
న్యూఢిల్లీ: 1976లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం రాజ్యాంగ పీఠికలో మార్పులు చేస్తూ తీసుకువచ్చిన 42వ రాజ్యాంగ సవరణపై అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. పీఠికలో సామ్యవాద, లౌకిక, సమగ్రత (సోషలిస్ట్, సెక్యులర్, ఇంటెగ్రిటీ) అనే పదాలను చేర్చుతూ చేసిన సవరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యం స్వామి, న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ ఈ మేరకు వేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం నవంబర్ 22తో వాదనలు ముగించి, సోమవారం తీర్పు వెలువరించింది. ‘రిట్ పిటిషన్లపై తదుపరి విచారణ కానీ, తీర్పు కానీ అవసరం లేదు. రాజ్యాంగంలోని పీఠికను కూడా సవరించే అధికారం పార్లమెంట్కుంది. సవరణకు ఇప్పటికే చాలా ఏళ్లు గడిచినందున ఆ ప్రక్రియ రద్దు సాధ్యం కాదు’అని తీర్పులో పేర్కొంది.‘ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగంలోని మార్పులకు ఆమోదించిన తేదీ ప్రభుత్వ అధికారాన్ని తగ్గించదు. పైపెచ్చు ఆ అధికారాలను సవాల్ చేయలేం. పీఠికకు సైతం మార్పులు చేపట్టే అధికారం పార్లమెంట్‌కు ఉంది’అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ అంశంపై ఇప్పటికే పలు న్యాయపరమైన సమీక్షలు జరిగాయని గుర్తు చేసింది. ఎమర్జెన్సీ సమయంలో పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాలను రద్దు చేయాలని చెప్పలేమని కూడా పేర్కొంది. ఎన్నో ఏళ్లు గడిచాక పీఠికలో చేసిన మార్పులపై ఇప్పుడెందుకు అభ్యంతరం చెబుతున్నారు?అంటూ ధర్మాసనం పిటిషనర్లను ప్రశ్నించింది.పిటిషనర్ల అభ్యంతరం ఏమంటే..సామ్యవాదం, లౌకికవాదం అనే పదాలపై చేరిక తనకూ సమ్మతమేనని పిటిషనర్ అశ్వినీ ఉపాధ్యాయ్ వాదనల సందర్భంగా తెలిపారు. అయితే, ఆ పదాలను రాజ్యాంగ పీఠికలో చేర్చడంపైనే తనకు అభ్యంతరం ఉందన్నారు. రాజ్యాంగ పీఠికలో సామ్యవాదం, లౌకిక, సమగ్రత అనే పదాల చేరికను ఇందిరాగాంధీ అనంతరం ఎన్నికైన జనతా పార్టీ ప్రభుత్వం కూడా సమర్థించిందని ఇదే అంశంపై వేరుగా పిటిషన్ వేసిన సుబ్రమణ్యస్వామి పేర్కొన్నారు. అయితే, 1949లో ఆమోదించిన రాజ్యాంగ పీఠికను యథాతథంగా ఉంచుతూ, 1976లో చేపట్టిన మార్పులను వేరుగా ప్రత్యేక పేరాలో ఉంచాలన్నదే తన ఉద్దేశమన్నారు. ఎమర్జెన్సీ సమయంలో..ఇందిరా గాంధీ ప్రభుత్వం దేశంలో 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21వ తేదీ వరకు అత్యవసర పరిస్థితి అమల్లో ఉండటం తెలిసిందే. ఆ సమయంలోనే రాజ్యాంగ పీఠికలోని సార్వభౌమ, ప్రజాస్వామ్య గణతంత్ర అనే పదాల స్థానంలో సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర అనే వాటిని చేరుస్తూ పార్లమెంట్ చట్టం చేసింది. ఈ కేసులో మొట్ట మొదటిసారిగా 2020లో బలరాం సింగ్ అనే వ్యక్తి విష్ణు శంకర్ జైన్ అనే న్యాయవాది ద్వారా పిటిషన్ వేశారు. ఇదే అంశంపై విస్తృత ధర్మాసనానికి బదలాయించాలంటూ దాఖలైన పిటిషన్‌ను గతంలో సుప్రీంకోర్టు కొట్టివేసింది. సామ్యవాదం అనే పదాన్ని మన దేశానికి వర్తింపజేసుకుంటే సంక్షేమ రాజ్యమనే అర్థమే వస్తుందని వివరించింది. -
తప్పనిసరై జాతీయం.. తప్పులతో పతనం
సాగుకు రుణాల్లేవు. చిన్న సంస్థలను పట్టించుకునే వారే లేరు. అలాంటి దశలో బ్యాంకుల్ని జాతీయీకరించి... వాటి రుణ ప్రాధాన్యాలను పునఃనిర్వచించింది నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం. చాలా వర్గాలు వద్దన్నాయి. ఆర్బీఐ కూడా సరికాదని చెప్పింది. అయినాసరే... 50 ఏళ్ల కిందట ఇదే రోజున(1969, జూలై 19) ఇందిర తను అనుకున్నదే చేశారు. ప్రత్యేక ఆర్డినెన్స్‌తో 14 బ్యాంకుల్ని జాతీయం చేశారు. నిజానికి ఈ జాతీయీకరణ ఆశించిన మేర కొన్ని ప్రయోజనాలనైతే ఇచ్చింది. కానీ... ఆ ప్రయాణంలో బ్యాంకులు ప్రభుత్వం చేతిలో ఆటబొమ్మల్లా మారిపోయాయి. చివరికిపుడు శక్తికి మించిన మొండి బాకీల్ని మోస్తూ కుదేలవుతున్నాయి. చివరికి వీటిని ప్రైవేటీకరించాలన్న సలహాలూ వస్తున్నాయి. అంటే... మళ్లీ మొదలెట్టిన చోటికే చేర్చమని!!. అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? జాతీయీకరణ ఎందుకు జరిగింది? ఇపుడు దారేంటి? వీటన్నిటి సమాహారమే ఈ ప్రత్యేక కథనం... సాక్షి, బిజినెస్ విభాగం బ్యాంకుల జాతీయీకరణ వెనక రాజకీయాలు పక్కనపెడితే ఇతరత్రా కారణాలూ ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చిన చాన్నాళ్ల దాకా బ్యాంకులు స్పెక్యులేటివ్, వాణిజ్య కార్యకలాపాలకు తప్ప ఎక్కువగా పరిశ్రమకు, వ్యవసాయ రంగానికి రుణాలివ్వటంపై పెద్దగా దృష్టి పెట్టలేదు. అటు నియంత్రణ సంస్థగా రిజర్వ్ బ్యాంక్ కూడా పూర్తి స్థాయిలో పట్టు సాధించలేకపోయింది. దీంతో 300 పైచిలుకు ఉన్న బ్యాంకులను అదుపు చేయడం కష్టంగా మారింది. 1960ల్లో పాలయ్ సెంట్రల్ బ్యాంక్, లక్ష్మి కమర్షియల్ బ్యాంక్ దివాలా తీయడంతో అప్పటి ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ ఒత్తిడితో బ్యాంకుల సంఖ్యను తగ్గించడంపై ఆర్బీఐ దృష్టి పెట్టింది. 1960లో 328 పైచిలుకు ఉన్న బ్యాంకుల సంఖ్యను విలీనాలు, మూసివేతలుతో 1965 నాటికి 94 స్థాయికి తెచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో 1969 జూలై 19న కనీసం రూ.50 కోట్ల మేర డిపాజిట్లున్న బ్యాంకులను జాతీయం చేస్తున్నట్లు ఇందిరా గాంధీ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అప్పటికే ప్రభుత్వ రంగంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దాని అనుబంధ బ్యాంకులతో పాటు 14 బ్యాంకులు ప్రభుత్వ రంగ పరిధిలోకి వచ్చాయి. అప్పటి బ్యాంకింగ్ రంగంలోని మొత్తం డిపాజిట్లలో వీటి వాటా ఏకంగా 85 శాతం!!. మళ్లీ 1980లో రూ.200 కోట్ల పైగా డిపాజిట్లున్న మరో 6 బ్యాంకులను జాతీయీకరించారు. ఆర్బీఐని తోసిరాజని.. బ్యాంకుల జాతీయీకరణ ప్రక్రియలో ఆర్బీఐ గవర్నర్‌ను కూడా ప్రభుత్వం పెద్దగా లెక్క చేయలేదనే చెప్పాలి. ఇందిరా గాంధీతో పాటు ప్రధాని ప్రిన్సిపల్ కార్యదర్శి పీఎన్ హక్సర్, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎ.బక్షి, డీఎన్ ఘోష్ అనే జూనియర్ స్థాయి అధికారి మాత్రమే ఈ ప్రక్రియలో పాలు పంచుకున్నారు. ఆర్బీఐ వర్గాల కథనం ప్రకారం.. బ్యాంకులు అప్పటికే సమగ్రమైన సామాజిక నియంత్రణ పరిధిలో పనిచేస్తున్నాయని, వాటి జాతీయీకరణ వల్ల ఎలాంటి లాభం ఉండకపోగా ప్రభుత్వం, ఆర్బీఐపై అనవసర బాధ్యతలు పెరుగుతాయంటూ ఆర్బీఐ గవర్నర్ ఎల్కే ఝా అప్పటికే ఒక నోట్‌ను సిద్ధం చేసుకుని ప్రధానికి తెలిపేందుకు వెళ్లారు. అయితే, ఆయన్ను చూసిన ప్రధాని ఇందిరాగాంధీ ‘మీ చేతిలో భారీ నోట్ ఏదో కనిపిస్తోంది. దాన్ని ఈ పక్కన టేబుల్ మీద ఉంచండి. పక్క గదిలో ప్రైవేట్ బ్యాంకుల జాతీయీకరణ ఆర్డినెన్స్‌పై కసరత్తు చేస్తున్న టీమ్‌కు కాస్త సాయం అందించండి‘ అని సూచించడంతో ఝా తప్పనిసరై ఆ ప్రక్రియలో భాగమయ్యారు. బ్యాంకింగ్ విస్తరణకు ఊతం.. జాతీయీకరణకు ముందు బ్యాంకులిచ్చే రుణాల్లో దాదాపు 78 శాతం పెద్ద, మధ్య స్థాయి పరిశ్రమలు, హోల్‌సేల్ వ్యాపారాలకే కాగా... వ్యవసాయం వాటా 2.2 శాతం మాత్రమే. 1969లో రూ.162 కోట్లుగా ఉన్న వ్యవసాయ రుణాలు 2011 నాటికి రూ.4 లక్షల కోట్లకు చేరాయి. చిన్న పరిశ్రమలకు బ్యాంకు రుణాలు కూడా రూ.251 కోట్ల నుంచి రూ. 3.6 లక్షల కోట్లకు చేరాయి. బ్యాంకులిచ్చే మొత్తం రుణాల్లో ప్రాధాన్యతా రంగ రుణాల వాటా 1969లో 15 శాతంగా ఉంటే 2011 నాటికి 41 శాతానికి పెరిగింది. సాధారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు తమకు నిర్దేశించిన లక్ష్యాల సాధనలో మెరుగైన పనితీరే కనపర్చాయి. అందరికీ ఆర్థిక సేవలు అందుబాటులోకి రావాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన జన్ ధన్ ఖాతాల్లో 80 శాతం అకౌంట్లు ప్రభుత్వ రంగ బ్యాంకులే (పీఎస్బీ) ఇచ్చాయి. వ్యవసాయం, చిన్న తరహా సంస్థలకు ప్రాధాన్యతా రంగ రుణాల్లో 68 శాతం వాటా వీటిదే ఉంది. మొండిబాకీలతో కుదేలు.. ఇవన్నీ నాణేనికి ఒకవైపు మాత్రమే. తాజా పరిస్థితి చూస్తే మాత్రం ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. మొండిబాకీలతో బ్యాంకులు కుదేలవుతున్నాయి. 2014 మేలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ చూస్తే పీఎస్‌బీల విలువ దాదాపు రూ.2.97 లక్షల కోట్ల మేర కరిగిపోయింది. బ్యాంకింగ్ రంగ మార్కెట్ క్యాప్‌లో వీటి వాటా 40 శాతం నుంచి 26కు పడిపోయింది. ఈ ఏడాది మార్చి క్వార్టర్లో ప్రైవేట్ బ్యాంకుల రుణ వృద్ధి 21 శాతంగా ఉంటే పీఎస్బీలది కేవలం 9.6 శాతమే. ప్రైవేట్ బ్యాంకుల డిపాజిట్లు 17.5 శాతం పెరిగితే పీఎస్‌బీలవి 6.5 శాతమే పెరిగాయి. ప్రైవేట్ బ్యాంకుల్లో ఎన్పీఏలు 3.7 శాతం స్థాయిలో ఉంటే పీఎస్‌బీలవి ఏకంగా 12.6 శాతం మేర ఉన్నాయి. దీంతో కేంద్రం దఫదఫాలుగా పీఎస్బీలకు అదనపు మూలధనం సమకూరుస్తూ కుప్పకూలకుండా చూస్తోంది. తప్పెవరిదంటే.. పీఎస్‌బీల పరిస్థితి ఇంత అధ్వానంగా మారడానికి బాధ్యులెవరంటే.. ఇటు స్వయంగా బ్యాంకులు అటు ప్రభుత్వం కూడానని చెప్పాలి. ప్రత్యేక ఫైనాన్స్ సంస్థల స్థానంలో భారీ ప్రాజెక్టులకు పీఎస్‌బీలు రుణాలివ్వాల్సి వచ్చింది. ఇలాంటి అంశాల్లో అంతగా అవగాహన లేకపోవడంతో ఈ దీర్ఘకాలిక రుణాల విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోలేకపోయాయి. ఇవే నేటి మొండిబాకీలకు మూలకారణం. పీఎస్బీల్లో కేంద్రం వాటాలు తగ్గించుకుంది కానీ అజమాయిషీ మాత్రం దాని చేతుల్లోనే ఉంది. బ్యాంకింగ్‌తో సంబంధంలేని పనులకూ ఒకోసారి వాటిని ఉపయోగిస్తోంది. ఇక, పీఎస్బీ బ్యాంకర్లకు మార్కెట్ స్థాయిలో జీతభత్యాలు లేకపోవడం, నిరంతరం వారిపై దర్యాప్తు సంస్థల నిఘా ఉండటం వంటి అంశాలు సైతం వారిని సాహసోపేత నిర్ణయాలు తీసుకోనివ్వకుండా చేతులు కట్టేసినట్లుగా ఉంటున్నాయి. తరుణోపాయం ఏంటి? జాతీయీకరణ జరిగి 50 సంవత్సరాలవుతున్న ఈ తరుణంలోనైనా పీఎస్‌బీలపై కేంద్రం తగు నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత దివాలా చట్టంతో మొండిబాకీలకు కొంత పరిష్కారం దొరుకుతున్నా, ఊరట అంతంతమాత్రంగానే ఉంటోంది. అవి ఎదగకుండా చేతులు కట్టేసి.. మూలధనాన్ని అందిస్తూ కూర్చోవడమా.. లేక వాటి మానాన వాటిని వదిలేయడమా లేక ప్రైవేటీకరించడమా అన్నది ప్రభుత్వం తేల్చుకోవాలనేది బ్యాంకింగ్ వర్గాల మాట. జాతీయీకరణ ఇలా తొలి విడత 1969లో: అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, దేనా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండో విడత 1980లో: పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్, విజయ బ్యాంక్, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా మోడల్ మార్చాలి... ప్రభుత్వ రంగ బ్యాంకుల మోడల్ కొన్నాళ్ల పాటు పనిచేసింది. అదనపు మూలధనం రూపంలో పీఎస్‌బీల్లోకి వెడుతున్న ట్యాక్స్‌పేయర్స్ సొమ్ము విలువ ఎంతో కొంత పెరగాలని కోరుకోవడంలో తప్పులేదు. కానీ పెరగడం మాట అటుంచి ఎందుకు తగ్గుతోంది అన్నదే ప్రశ్నార్థకం. ఒకవేళ ప్రస్తుతం అనుసరిస్తున్న విధానమే ఇందుకు కారణమైతే మోడల్‌ను మార్చే అంశాన్ని కచ్చితంగా పరిశీలించాలి. – అరుంధతి భట్టాచార్య, ఎస్బీఐ మాజీ చైర్మన్ మెరుగైన బ్యాంకులకు తోడ్పాటు అప్పట్లో ప్రైవేట్ బ్యాంకుల రికార్డు అంత బాగాలేకపోవడంతో బ్యాంకుల జాతీయీకరణ సమంజసమైనదే కావచ్చు. ప్రస్తుతం ప్రైవేట్ రంగ బ్యాంకులు మెరుగుపడ్డాయి.. కానీ పీఎస్‌బీల పరిస్థితే సందేహాస్పదంగా ఉంది. ఇలాంటప్పుడు పీఎస్‌బీల అంశాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉంది. కానీ రాజకీయ, ఆర్థికపరమైన అంశాల వల్ల ఈ వ్యవహారం చాలా సంక్లిష్టంగా మారింది. అయితే, అలాగని పీఎస్‌బీలు పూర్తిగా అవసరం లేదని కాదు. బ్యాంకింగ్‌లో నిర్దిష్ట శాతం ప్రభుత్వ రంగంలో ఉండాలని నిర్ణయించాలి. పోటీ ద్వారా ఏ బ్యాంకులు మెరుగ్గా ఉన్నాయో తేల్చి వాటికి తోడ్పాటునివ్వాలి. సరిగ్గా లేని వాటిల్లో షేర్లు అమ్మేసేయాలి. ఎకానమీ అవసరాలను తీర్చేలా ప్రభుత్వ నియంత్రణలో సుమారు 30 శాతం బ్యాంకింగ్ రంగం ఉంటే చాలని అంచనాలు ఉన్నాయి. – వైవీ రెడ్డి, ఆర్బీఐ మాజీ గవర్నర్ -
ఇందిరమ్మ జాగా.. వేసెయ్ పాగా
పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఇందిరమ్మ ఇంటి పథకం ఎంతోమందికి నీడనిచ్చింది. పేదోడికి గూడు దరిచేరింది. అయితే రామగుండం ఎన్టీపీసీ ప్రాంతంలో పేదలకు చెందాల్సిన నివాస స్థలాలు ధనవంతుల, ఆక్రమణదారుల చేతుల్లో చేరిపోతున్నాయి. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని మూడో డివిజన్లో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా అవుతోంది. ఆక్రమణపై రెండేళ్ల క్రితం అధికారులకు ఫిర్యాదులు అందడంతో అధికారులు ఇందిరమ్మకాలనీలో ఇంటింటా సర్వే చేపట్టారు. అయితే ఈ సర్వే తూతూ మంత్రంగా నిర్వహించడంతో దళారులు ఇష్టారాజ్యంగా ఆక్రమణల పర్యవ కొనసాగిస్తున్నారు. ఈ ప్రాంతంలో భూమి కొనాలన్నా, అమ్మాలన్నా వీరి ప్రమేయం తప్పనిసరి. ఇందిరమ్మకాలనీలోని స్థలాలను విక్రయించరాదని నిబంధనలు ఉన్నా యథేచ్చగా విక్రయాలు కొనసాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జ్యోతినగర్(రామగుండం): రామగుండం కార్పొరేషన్ మూడో డివిజన్లో పేదల కోసం కేటాయించిన ఇందిరమ్మ నివాస స్థలాలు ధనికుల చేతుల్లోకి వెళ్లి ఖరీదైన భవంతులు వెలుస్తున్నాయి. ప్రభుత్వం పేదలు నివసించడానికి ఏర్పాటు చేసిన ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం ఉన్న వాళ్ల చేతిలోకి వెళ్లడంతో పేదలకు అన్యాయం జరుగుతోంది. ఇందిరమ్మ కాలనీలో 2008 నుంచి ఇప్పటి వరకు అధికారికంగా 6,365 ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనట్లు సమాచారం. మంజూరైన ఇళ్లలో సుమారు 500 మంది లబ్ధిదారులు మాత్రమే నిర్మించుకుని నివాసముంటున్నారు. మిగతా నిర్మాణాలు వివిధ దశల్లో నిలిచిపోయాయి. ఈ ప్రాంతంలో ఉన్న కొందరు ప్లాట్లను తమ అజమాయిషీలో తెచ్చుకుని వ్యాపార కేంద్రంగా మలుచుకున్నారు. గతంలో పేదవారుగా ఇక్కడికి వచ్చి ఇప్పుడు ధనవంతులుగా మారిపోయారు. ఖాళీగా ఉన్న స్థలాలను గుర్తించి ఒక్కోప్లాటు రూ.30 వేల నుంచి రూ.60 వేల వరకు విక్రయిస్తున్నారు. అమ్మకాలు, కొనుగోలు అంతా సాదా పత్రాలలోనే మారుతూ ఉంది. సొంతంగా పట్టా ఉన్నవారి ప్లాట్లను ఆక్రమించిన సంఘటనలు ఇక్కడ సర్వసాధారణంగా మారాయి. అసలైన ఇందిరమ్మ లబ్ధిదారులు తమకు ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు, తాము పోగుచేసుకున్న డబ్బులతో అరకొరగా నిర్మించుకుని నివసిస్తున్నారు. దళారుల నుంచి కొనుగోలు చేసిన కొందరు ఖరీదైన భవంతులు నిర్మిస్తున్నారు. ఇందిరమ్మకాలనీలో ఇంత ఖరీదైనా ఇళ్లు ఉంటుందా.. వీరు కూడా పేదవారేనా అని చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొనసాగుతున్న చదును పనులు ఇందిరమ్మకాలనీలో కొందరు ఒక టీంగా ఏర్పడి పేదలకు భూములు ఇస్తాం అంటూ ఖాళీ స్థలాల చదును ప్రారంభించారు. చదును చేపట్టడంతోపాటు స్థలాలు కావాల్సినవారి నుంచి ముందస్తుగా చదును పనుల కోసం రూ.1,000 ఇవ్వాలని వసూళ్లు చేస్తున్నారు. ఇలా ఇప్పటివరకు సుమారు 70 మంది వద్ద వసూలు చేసినట్లు సమాచారం. 100 ఫీట్ల రోడ్డు కబ్జా.. ఇందిరమ్మ కాలనీలో 100 ఫీట్ల రోడ్డు నిర్మించేందుకు వీలుగా ప్లాట్లను ఏర్పాటు చేసి గతంలో అందించారు. అయితే వంద ఫీట్ల రోడ్డు నిర్మాణం కాకపోవడంతో 30 ఫీట్లు రోడ్డు వదిలి ఇరువైపులా మిగిలిన 35 ఫీట్ల చొప్పన ఉన్న భూమిని కూడా కాజేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ విషయంపై ఇటీవల మేయర్ పర్యటించిన క్రమంలో స్థానిక కార్పొరేటర్ ఫిర్యాదు కూడా చేశారు. అర్హులైన పేదలకు అన్యాయం జరిగిందని సమాచారం మేరకు రామగుండం రెవెన్యూ అధికారులు రెండేళ్ల క్రితం ఇందిరమ్మకాలనీలో ఎవరు నివిసిస్తున్నారు. స్థలాలు ఎవరి పేరుమీద ఉన్నాయనే సమాచారాన్ని సేకరించేందుకు సర్వే చేశారు. సర్వే పూర్తి చేయకపోవడమే దళారులకు వరంగా మారింది. పూర్తిస్థాయిలో కాలనీలోని మొత్తం నివాసాలు సర్వే చేసి అసలైన లబ్ధిదారులు ఎవరెవరు ఉన్నారు అనే విషయాలను సేకరించి మిగతా స్థలాలను పేదలకు ఇవ్వాల్సిన అవసరం అధికారులపై ఉంది. సర్వే అనంతరమే బినామీగా ఉన్నవారు ఎందరు, అసలు మంజూరు ఉన్నవారు ఎవరు.. అనే విషయాలు వెలుగులోకి రానున్నాయి. అక్రమంగా చదును చేస్తే చర్యలు కార్పొరేషన్ మూడో డివిజన్ ఇందిరమ్మకాలనీలోని ఖాళీ స్థలాలను కొందరు చదును చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. సమాచారం మేరకు రెవెన్యూ అధికారులను సంఘటన స్థలానికి పంపించి విచారణ చేపట్టాం. అసిస్టెంట్ సిటీ ప్లానర్‌కు కూడా సమాచారం ఇచ్చాం. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటాం. - హనుమంతరావు, రామగుండం తహసీల్దార్ -
మిగిలే ప్రభుత్వ బ్యాంకులు.. ఏడే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇరవై ప్రైవేటు బ్యాంకుల్ని 1969లో ఇందిరాగాంధీ ప్రభుత్వం జాతీయం చేసిన 45 సంవత్సరాల తర్వాత వీటిని ఒకదానిలో మరోదానిని విలీనం చేసేందుకు కొత్త ప్రభుత్వం పావులు కదుపుతోంది. గత కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్న ఈ అంశం బ్యాంకింగ్ వర్గాల్లో ఇటీవల బాగా చర్చకు దారితీస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, కేంద్ర ఆర్థిక సేవల శాఖ కార్యదర్శి జి.ఎస్.సంధు మాటలు వీటికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో కొన్ని ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ) బ్యాంకుల మధ్య విలీనాలను చేపడతామని జైట్లీ ఇప్పటికే పలుమార్లు బహిరంగంగా వ్యక్తం చేయడమే కాకుండా, మొన్నటి బడ్జెట్లో ఆ దిశగా గట్టి సంకేతాలనే ఇచ్చారు. ఈ ఏడాది కనీసం మూడు ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేసే విధంగా ముందుకెళుతున్నామని, ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల్లో ఒకటి రెండుతోపాటు మరో రెండు ప్రభుత్వరంగ బ్యాంకుల మధ్య విలీనం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు సంధు తెలిపారు. మిగిలేవి ఎన్ని? ఎస్బీఐ అనుబంధ బ్యాంకులతో కలుపుకుంటే దేశంలో ప్రస్తుతం 26 ప్రభుత్వరంగ బ్యాంకులు ఉన్నాయి. వీటిలో అత్యధిక బ్యాంకులను కలపడం ద్వారా మొత్తం పీఎస్‌యూ బ్యాంకుల సంఖ్యను ఏడుకు పరిమితం చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ భావిస్తోందని సమాచారం. ఇందుకోసం ప్రధానంగా మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. బ్యాంకులు వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, బ్యాంకులు అత్యధికంగా విస్తరించి ఉన్న ప్రాంతం, శాఖల సంఖ్య, బ్యాంకుల వ్యవహార శైలి వంటి అంశాల ఆధారంగా బ్యాంకుల మధ్య విలీనాలను ప్రోత్సహిస్తున్నట్లు సంధు తెలిపారు. బ్యాంకుల మధ్య సాంకేతిక పరిజ్ఞానం, వాటి వినియోగం ఆధారంగా ఎస్బీఐ క్యాప్ ఇచ్చిన నివేదిక ప్రకారం పీఎస్‌యూ బ్యాంకులను గ్రూపులుగా వర్గీకరించింది. ప్రధానంగా నాలుగు లక్షల కోట్ల వ్యాపారం దాటి ఉండి, నాలుగు వేలకు పైగా శాఖలు కలిగిన బ్యాంకులను ప్రధాన బ్యాంకులుగా చేసి వాటి కింద మిగిలిన బ్యాంకులను చేర్చడం జరిగింది. దీనికి కోర్ బ్యాంకింగ్ సేవలు ఇచ్చి పుచ్చుకోవడానికే అని పేరు పెట్టినప్పటికీ విలీన సమయంలో సాంకేతిక పరిజ్ఞానం విషయంలో బ్యాంకుల మధ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలో భాగంగా ఈ గ్రూపులను ఏర్పాటు చేసినట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీని ప్రకారం ఇప్పటికే పలు బ్యాంకులు కలిసి పనిచేస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఆంధ్రాబ్యాంక్‌ను ఓబీసీతో కలిపి బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రూపులో చేర్చారని, దీని ప్రకారం బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రాబ్యాంక్, ఓబీసీలు కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేరు చెప్పడానికి ఇష్టపడని బ్యాంకింగ్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ తన పేరెంట్ బ్యాంక్ ఎస్బీఐలో విలీనం కానుంది. ఇదే తరహాలో మిగిలిన బ్యాంకుల మధ్య విలీన ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై ఆంధ్రాబ్యాంక్ సీఎండీ సీవీఆర్ రాజేంద్రన్ స్పందిస్తూ, ప్రభుత్వ బ్యాంకుల మధ్య విలీనాలు తప్పవని, కానీ దీనికి ఇంకా సమయం పడుతుందన్నారు. అనుబంధ బ్యాంకుల విలీనం గురించి మూడు నాలుగు నెలల్లో ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు ఎస్బీఐ చైర్పర్సన్ అరుధంతీ భట్టాచార్య ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అనుబంధ బ్యాంకుల్లో ఎస్బీహెచ్ పటిష్టంగా ఉండటం, కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో లీడ్ బ్యాంక్‌గా ఉండటంతోఎస్బీహెచ్ విలీనం చివర్లో ఉంటుందని బ్యాంకింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముందుగా ఇప్పటికే స్టాక్ మార్కెట్లో నమోదైన ఎస్బీ బికనీర్ అండ్ జైపూర్, ఎస్బీ మైసూర్‌తో అనుబంధ బ్యాంకుల విలీనం మొదలు కావచ్చన్నది అంచనా. తట్టుకునే దిశగా.. రూ. 4 లక్షల కోట్ల వ్యాపారాన్ని, 4,000 మించి శాఖల్ని ఏర్పాటుచేయడం ద్వారా విలీనం నుంచి తప్పించుకోవచ్చని టార్గెట్ బ్యాంకులు భావిస్తున్నట్లు కొంతమంది బ్యాంకింగ్ అధికారుల మాటల్ని బట్టి అవగతమవుతోంది. ఇందుకు ఆయా బ్యాంకులు విభిన్నమైన వ్యూహాలను అనుసరిస్తున్నాయి. ఉదాహరణకు టేకోవర్ టార్గెట్‌లో ఉన్న ఇండియన్ బ్యాంక్ తన గ్రామీణ బ్యాంకులను విలీనం చేసుకోవడం, శాఖల విస్తరణ ద్వారా ప్రధాన బ్యాంక్ స్థాయికి చేరుకునే ప్రయత్నం చేస్తోంది. మా బ్యాంక్‌కు చెందిన మూడు ఆర్ఆర్బీలను కలుపుకుంటే బ్యాంకు శాఖల సంఖ్య పెరగడమే కాకుండా మూలధనం కూడా పెరుగుతుందని, దీనికి సంబంధించిన చర్చలు తుది దశలో ఉన్నట్లు ఇండియన్ బ్యాంక్ సీఎండీ టి.ఎం.భాసిన్ తెలిపారు. ఇదే దిశగా కెనరా బ్యాంక్ కూడా ఆర్ఆర్బీలను విలీనం చేసుకుంటున్నట్లు ఆ బ్యాంక్ సీఎండీ ఆర్.కె.దుబే తెలిపారు. మరో టేకోవర్ బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కూడా వచ్చే ఏడాదిలోగా రూ.5 లక్షల కోట్ల వ్యాపార పరిమాణం చేరుకోవడం ద్వారా టాప్ 5 బ్యాంకుల్లో ఒకటిగా నిలవాలనుకుంట్లున్న ఆ బ్యాంక్ సీఎండీ ఎం.నరేంద్ర పేర్కొన్నారు. విలీనం ఎందుకు..? ప్రపంచంలో టాప్ 10 బ్యాంకులను తీసుకుంటే అందులో మూడు చైనా బ్యాంకులే ఉన్నాయి. కానీ మన దేశంలో 26 ప్రభుత్వరంగ బ్యాంకులు ఉన్నా ఒక్కటి కూడా వాటి దరిదాపుల్లో లేవంటే అతిశయోక్తి కాదు. అంతే కాకుండా ఒక్క మధ్యస్థాయి ప్రాజెక్టుకు ఒక బ్యాంక్ సొంతంగా రుణం ఇచ్చే పరిస్థితి లేదు. ఇందు కోసం నాలుగైదు బ్యాంకులు కన్సార్షియంగా ఏర్పాటు కావాల్సి వస్తోంది. దీంతో పీఎస్‌యూ బ్యాంకులను కలిపి 5-6 ప్రధాన బ్యాంకులుగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఈ నిర్ణయాన్ని బ్యాంకింగ్ యూనియన్లు వ్యతిరేకిస్తున్నాయి. బ్యాంకుల మధ్య విలీనం చేస్తే అవి పెద్ద బ్యాంకులుగా తయారవుతాయే కాని పటిష్టమైన బ్యాంకులు కాలేవని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘ కార్యదర్శి బి.ఎస్.రాంబాబు అంటున్నారు. బ్యాంకుల విలీనానికి సంబంధించి ప్రధానమైన అడ్డంకి ఉద్యోగుల నుంచే వస్తోంది. ప్రస్తుత బ్యాంకుల్లో లభిస్తున్న ప్రయోజనాలు విలీన బ్యాంకుల్లో కలిపించినా, అదే విధంగా ప్రమోషన్ల విషయంలో కూడా స్పష్టమైన విధానం ప్రకటి చినా ఈ సారి ఉద్యోగుల నుంచి పెద్దగా వ్యతిరేకత ఉండకపోవచ్చని కొంతమంది యూనియన్ నాయకులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం నాయర్ కమిటీ సిఫార్సులను తిరస్కరించి, 51 శాతం ప్రభుత్వ వాటాను కొనసాగిస్తామన్న హామీ ఇవ్వడంతో యూనియన్లు పీఎస్‌యూ బ్యాంకుల మధ్య విలీనంపై కొంత మెత్తబడినట్లు కనిపిస్తోంది.