తప్పనిసరై జాతీయం.. తప్పులతో పతనం | Special Story on 50 Years Of Bank Nationalisation | Sakshi
Sakshi News home page

తప్పనిసరై జాతీయం.. తప్పులతో పతనం

Published Fri, Jul 19 2019 5:39 AM | Last Updated on Fri, Jul 19 2019 5:48 AM

Special Story on 50 Years Of Bank Nationalisation - Sakshi

సాగుకు రుణాల్లేవు. చిన్న సంస్థలను పట్టించుకునే వారే లేరు. అలాంటి దశలో బ్యాంకుల్ని జాతీయీకరించి... వాటి రుణ ప్రాధాన్యాలను పునఃనిర్వచించింది నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం. చాలా వర్గాలు వద్దన్నాయి. ఆర్‌బీఐ కూడా సరికాదని చెప్పింది. అయినాసరే... 50 ఏళ్ల కిందట ఇదే రోజున(1969, జూలై 19) ఇందిర తను అనుకున్నదే చేశారు. ప్రత్యేక ఆర్డినెన్స్‌తో 14 బ్యాంకుల్ని జాతీయం చేశారు. నిజానికి ఈ జాతీయీకరణ ఆశించిన మేర కొన్ని ప్రయోజనాలనైతే ఇచ్చింది. కానీ... ఆ ప్రయాణంలో బ్యాంకులు ప్రభుత్వం చేతిలో ఆటబొమ్మల్లా మారిపోయాయి. చివరికిపుడు శక్తికి మించిన మొండి బాకీల్ని మోస్తూ కుదేలవుతున్నాయి. చివరికి వీటిని ప్రైవేటీకరించాలన్న సలహాలూ వస్తున్నాయి. అంటే... మళ్లీ మొదలెట్టిన చోటికే చేర్చమని!!. అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? జాతీయీకరణ ఎందుకు జరిగింది? ఇపుడు దారేంటి? వీటన్నిటి సమాహారమే ఈ ప్రత్యేక కథనం...

సాక్షి, బిజినెస్‌ విభాగం
బ్యాంకుల జాతీయీకరణ వెనక రాజకీయాలు పక్కనపెడితే ఇతరత్రా కారణాలూ ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చిన చాన్నాళ్ల దాకా బ్యాంకులు స్పెక్యులేటివ్, వాణిజ్య కార్యకలాపాలకు తప్ప ఎక్కువగా పరిశ్రమకు, వ్యవసాయ రంగానికి రుణాలివ్వటంపై పెద్దగా దృష్టి పెట్టలేదు. అటు నియంత్రణ సంస్థగా రిజర్వ్‌ బ్యాంక్‌ కూడా పూర్తి స్థాయిలో పట్టు సాధించలేకపోయింది. దీంతో 300 పైచిలుకు ఉన్న బ్యాంకులను అదుపు చేయడం కష్టంగా మారింది.

1960ల్లో పాలయ్‌ సెంట్రల్‌ బ్యాంక్, లక్ష్మి కమర్షియల్‌ బ్యాంక్‌ దివాలా తీయడంతో అప్పటి ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్‌ ఒత్తిడితో బ్యాంకుల సంఖ్యను తగ్గించడంపై ఆర్‌బీఐ దృష్టి పెట్టింది. 1960లో 328 పైచిలుకు ఉన్న బ్యాంకుల సంఖ్యను విలీనాలు, మూసివేతలుతో 1965 నాటికి 94 స్థాయికి తెచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో 1969 జూలై 19న కనీసం రూ.50 కోట్ల మేర డిపాజిట్లున్న బ్యాంకులను జాతీయం చేస్తున్నట్లు ఇందిరా గాంధీ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అప్పటికే ప్రభుత్వ రంగంలో ఉన్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, దాని అనుబంధ బ్యాంకులతో పాటు 14 బ్యాంకులు ప్రభుత్వ రంగ పరిధిలోకి వచ్చాయి. అప్పటి బ్యాంకింగ్‌ రంగంలోని మొత్తం డిపాజిట్లలో వీటి వాటా ఏకంగా 85 శాతం!!. మళ్లీ 1980లో రూ.200 కోట్ల పైగా డిపాజిట్లున్న మరో 6 బ్యాంకులను జాతీయీకరించారు.

ఆర్‌బీఐని తోసిరాజని..  
బ్యాంకుల జాతీయీకరణ ప్రక్రియలో ఆర్‌బీఐ గవర్నర్‌ను కూడా ప్రభుత్వం పెద్దగా లెక్క చేయలేదనే చెప్పాలి. ఇందిరా గాంధీతో పాటు ప్రధాని ప్రిన్సిపల్‌ కార్యదర్శి పీఎన్‌ హక్సర్, ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ ఎ.బక్షి, డీఎన్‌ ఘోష్‌ అనే జూనియర్‌ స్థాయి అధికారి మాత్రమే ఈ ప్రక్రియలో పాలు పంచుకున్నారు. ఆర్‌బీఐ వర్గాల కథనం ప్రకారం.. బ్యాంకులు అప్పటికే సమగ్రమైన సామాజిక నియంత్రణ పరిధిలో పనిచేస్తున్నాయని, వాటి జాతీయీకరణ వల్ల ఎలాంటి లాభం ఉండకపోగా ప్రభుత్వం, ఆర్‌బీఐపై అనవసర బాధ్యతలు పెరుగుతాయంటూ ఆర్‌బీఐ గవర్నర్‌ ఎల్‌కే ఝా అప్పటికే ఒక నోట్‌ను సిద్ధం చేసుకుని ప్రధానికి తెలిపేందుకు వెళ్లారు. అయితే, ఆయన్ను చూసిన ప్రధాని ఇందిరాగాంధీ ‘మీ చేతిలో భారీ నోట్‌ ఏదో కనిపిస్తోంది. దాన్ని ఈ పక్కన టేబుల్‌ మీద ఉంచండి. పక్క గదిలో ప్రైవేట్‌ బ్యాంకుల జాతీయీకరణ ఆర్డినెన్స్‌పై కసరత్తు చేస్తున్న టీమ్‌కు కాస్త సాయం అందించండి‘ అని సూచించడంతో ఝా తప్పనిసరై ఆ ప్రక్రియలో భాగమయ్యారు.

బ్యాంకింగ్‌ విస్తరణకు ఊతం..
జాతీయీకరణకు ముందు బ్యాంకులిచ్చే రుణాల్లో దాదాపు 78 శాతం పెద్ద, మధ్య స్థాయి పరిశ్రమలు, హోల్‌సేల్‌ వ్యాపారాలకే కాగా... వ్యవసాయం వాటా 2.2 శాతం మాత్రమే. 1969లో రూ.162 కోట్లుగా ఉన్న వ్యవసాయ రుణాలు 2011 నాటికి రూ.4 లక్షల కోట్లకు చేరాయి. చిన్న పరిశ్రమలకు బ్యాంకు రుణాలు కూడా రూ.251 కోట్ల నుంచి రూ. 3.6 లక్షల కోట్లకు చేరాయి. బ్యాంకులిచ్చే మొత్తం రుణాల్లో ప్రాధాన్యతా రంగ రుణాల వాటా 1969లో 15 శాతంగా ఉంటే 2011 నాటికి 41 శాతానికి పెరిగింది. సాధారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు తమకు నిర్దేశించిన లక్ష్యాల సాధనలో మెరుగైన పనితీరే కనపర్చాయి. అందరికీ ఆర్థిక సేవలు అందుబాటులోకి రావాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన జన్‌ ధన్‌ ఖాతాల్లో 80 శాతం అకౌంట్లు ప్రభుత్వ రంగ బ్యాంకులే (పీఎస్‌బీ) ఇచ్చాయి. వ్యవసాయం, చిన్న తరహా సంస్థలకు ప్రాధాన్యతా రంగ రుణాల్లో 68 శాతం వాటా వీటిదే ఉంది.

మొండిబాకీలతో కుదేలు..
ఇవన్నీ నాణేనికి ఒకవైపు మాత్రమే. తాజా పరిస్థితి చూస్తే మాత్రం ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. మొండిబాకీలతో బ్యాంకులు కుదేలవుతున్నాయి. 2014 మేలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ చూస్తే పీఎస్‌బీల విలువ దాదాపు రూ.2.97 లక్షల కోట్ల మేర కరిగిపోయింది. బ్యాంకింగ్‌ రంగ మార్కెట్‌ క్యాప్‌లో వీటి వాటా 40 శాతం నుంచి 26కు పడిపోయింది. ఈ ఏడాది మార్చి క్వార్టర్‌లో ప్రైవేట్‌ బ్యాంకుల రుణ వృద్ధి 21 శాతంగా ఉంటే పీఎస్‌బీలది కేవలం 9.6 శాతమే. ప్రైవేట్‌ బ్యాంకుల డిపాజిట్లు 17.5 శాతం పెరిగితే పీఎస్‌బీలవి 6.5 శాతమే పెరిగాయి. ప్రైవేట్‌ బ్యాంకుల్లో ఎన్‌పీఏలు 3.7 శాతం స్థాయిలో ఉంటే పీఎస్‌బీలవి ఏకంగా 12.6 శాతం మేర ఉన్నాయి. దీంతో కేంద్రం దఫదఫాలుగా పీఎస్‌బీలకు అదనపు మూలధనం సమకూరుస్తూ కుప్పకూలకుండా చూస్తోంది.

తప్పెవరిదంటే..

పీఎస్‌బీల పరిస్థితి ఇంత అధ్వానంగా మారడానికి బాధ్యులెవరంటే.. ఇటు స్వయంగా బ్యాంకులు అటు ప్రభుత్వం కూడానని చెప్పాలి. ప్రత్యేక ఫైనాన్స్‌ సంస్థల స్థానంలో భారీ ప్రాజెక్టులకు పీఎస్‌బీలు రుణాలివ్వాల్సి వచ్చింది. ఇలాంటి అంశాల్లో అంతగా అవగాహన లేకపోవడంతో ఈ దీర్ఘకాలిక రుణాల విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోలేకపోయాయి. ఇవే నేటి మొండిబాకీలకు మూలకారణం. పీఎస్‌బీల్లో కేంద్రం వాటాలు తగ్గించుకుంది కానీ అజమాయిషీ మాత్రం దాని చేతుల్లోనే ఉంది. బ్యాంకింగ్‌తో సంబంధంలేని పనులకూ ఒకోసారి వాటిని ఉపయోగిస్తోంది. ఇక, పీఎస్‌బీ బ్యాంకర్లకు మార్కెట్‌ స్థాయిలో జీతభత్యాలు లేకపోవడం, నిరంతరం వారిపై దర్యాప్తు సంస్థల నిఘా ఉండటం వంటి అంశాలు సైతం వారిని సాహసోపేత నిర్ణయాలు తీసుకోనివ్వకుండా చేతులు కట్టేసినట్లుగా ఉంటున్నాయి.

తరుణోపాయం ఏంటి?
జాతీయీకరణ జరిగి 50 సంవత్సరాలవుతున్న ఈ తరుణంలోనైనా పీఎస్‌బీలపై కేంద్రం తగు నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత దివాలా చట్టంతో మొండిబాకీలకు కొంత పరిష్కారం దొరుకుతున్నా, ఊరట అంతంతమాత్రంగానే ఉంటోంది. అవి ఎదగకుండా చేతులు కట్టేసి.. మూలధనాన్ని అందిస్తూ కూర్చోవడమా.. లేక వాటి మానాన వాటిని వదిలేయడమా లేక ప్రైవేటీకరించడమా అన్నది ప్రభుత్వం తేల్చుకోవాలనేది బ్యాంకింగ్‌ వర్గాల మాట.

జాతీయీకరణ ఇలా
తొలి విడత 1969లో:
అలహాబాద్‌ బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా,
కెనరా బ్యాంక్, దేనా బ్యాంక్, ఇండియన్‌ బ్యాంక్, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, సిండికేట్‌ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్‌ బ్యాంక్, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

రెండో విడత 1980లో:
పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంక్, విజయ బ్యాంక్, ఓరియెంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కార్పొరేషన్‌ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, న్యూ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

మోడల్‌ మార్చాలి...
ప్రభుత్వ రంగ బ్యాంకుల మోడల్‌ కొన్నాళ్ల పాటు పనిచేసింది. అదనపు మూలధనం రూపంలో పీఎస్‌బీల్లోకి వెడుతున్న ట్యాక్స్‌పేయర్స్‌ సొమ్ము విలువ ఎంతో కొంత పెరగాలని కోరుకోవడంలో తప్పులేదు. కానీ పెరగడం మాట అటుంచి ఎందుకు తగ్గుతోంది అన్నదే ప్రశ్నార్థకం. ఒకవేళ ప్రస్తుతం అనుసరిస్తున్న విధానమే ఇందుకు కారణమైతే మోడల్‌ను మార్చే అంశాన్ని కచ్చితంగా పరిశీలించాలి.

– అరుంధతి భట్టాచార్య, ఎస్‌బీఐ మాజీ చైర్మన్‌
 
మెరుగైన బ్యాంకులకు తోడ్పాటు
అప్పట్లో ప్రైవేట్‌ బ్యాంకుల రికార్డు అంత బాగాలేకపోవడంతో బ్యాంకుల జాతీయీకరణ సమంజసమైనదే కావచ్చు. ప్రస్తుతం ప్రైవేట్‌ రంగ బ్యాంకులు మెరుగుపడ్డాయి.. కానీ పీఎస్‌బీల పరిస్థితే సందేహాస్పదంగా ఉంది. ఇలాంటప్పుడు పీఎస్‌బీల అంశాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉంది. కానీ రాజకీయ, ఆర్థికపరమైన అంశాల వల్ల ఈ వ్యవహారం చాలా సంక్లిష్టంగా మారింది. అయితే, అలాగని పీఎస్‌బీలు పూర్తిగా అవసరం లేదని కాదు. బ్యాంకింగ్‌లో నిర్దిష్ట శాతం ప్రభుత్వ రంగంలో ఉండాలని నిర్ణయించాలి. పోటీ ద్వారా ఏ బ్యాంకులు మెరుగ్గా ఉన్నాయో తేల్చి వాటికి తోడ్పాటునివ్వాలి. సరిగ్గా లేని వాటిల్లో షేర్లు అమ్మేసేయాలి. ఎకానమీ అవసరాలను తీర్చేలా ప్రభుత్వ నియంత్రణలో సుమారు 30 శాతం బ్యాంకింగ్‌ రంగం ఉంటే చాలని అంచనాలు ఉన్నాయి.

 – వైవీ రెడ్డి, ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement