ప్రథమార్ధంలో 18,461 కేసులు
రూ. 21,367 కోట్ల విలువ
ఎనిమిది రెట్లు అప్
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో బ్యాంకింగ్ మోసాల సంఖ్య గణనీయంగా పెరిగింది. దాదాపు రూ. 21,367 కోట్ల విలువ చేసే మొత్తానికి సంబంధించి 18,461 కేసులు నమోదయ్యాయి. విలువపరంగా చూస్తే మోసాల పరిమాణం ఏకంగా ఎనిమిది రెట్లు పెరిగింది. దేశీయంగా బ్యాంకింగ్ తీరుతెన్నుల గురించి రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
ఇందులో 2023–24 ఆర్థిక సంవత్సరం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రథమార్ధం వరకు ధోరణులను పొందుపర్చారు. దీని ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య కాలంలో రూ. 21,367 కోట్ల మొత్తానికి సంబంధించి 18,461 కేసులు నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో రూ. 2,623 కోట్లకు సంబంధించి 14,480 కేసులు వచ్చాయి. వ్యాపారాలకు రిసు్కలు మొదలుకుని కస్టమర్ల నమ్మకం దెబ్బతినడం వరకు ఈ మోసాల వల్ల వివిధ సవాళ్లు ఉంటున్నాయని నివేదిక పేర్కొంది. ఆర్థిక స్థిరత్వంపై వీటి ప్రభావం గణనీయంగా ఉంటుందని వివరించింది.
నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు..
→ దశాబ్దకాలంలోనే అత్యంత తక్కువగా 2023–24లో ఫ్రాడ్ కేసులు వచ్చాయి. సగటు విలువ 16 ఏళ్ల కనిష్ట స్థాయిలో నమోదైంది. ఇక ఇంటర్నెట్, కార్డ్ ఫ్రాడ్‌ల విషయానికొస్తే.. విలువపరంగా చూస్తే 44.7 శాతంగా ఉండగా, కేసులపరంగా
చూసినప్పుడు 85.3 శాతంగా ఉంది.
→ 2023–24లో మొత్తం ఫ్రాడ్ కేసుల్లో ప్రైవేట్ రంగ బ్యాంకుల వాటా 67.1 శాతంగా ఉంది. అయితే, విలువపరంగా చూస్తే మాత్రం ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా అత్యధికంగా నమోదైంది. విదేశీ బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు మినహా అన్ని నియంత్రిత సంస్థలపై విధించిన పెనాల్టీలు రెట్టింపై రూ. 86.1 కోట్లకు చేరాయి. సహకార బ్యాంకులపై జరిమానాల పరిమాణం తగ్గింది.
→ బ్యాంకుల లాభదాయకత వరుసగా ఆరో ఏడాది 2023–24లోనూ మెరుగుపడింది. స్థూల మొండిబాకీలు 13 ఏళ్ల కనిష్టమైన 2.7 శాతానికి తగ్గాయి. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల నికర లాభం గత ఆర్థిక సంవత్సరం 32.8 శాతం పెరిగి రూ. 3,59,603 కోట్లకు చేరింది.
ఏఐ వినియోగంపై ప్రత్యేక కమిటీ
ఆర్థిక రంగంలో బాధ్యతాయుతంగా, నైతికంగా కృత్రిమ మేథను (ఏఐ) వినియోగించుకునేందుకు విధానాల రూపకల్పన కోసం రిజర్వ్ బ్యాంక్ ఎనిమిది సభ్యులతో ప్రత్యేక కమిటీని ప్రకటించింది. దీనికి ఐఐటీ బాంబే ప్రొఫెసర్ పుష్పక్ భట్టాచార్య సారథ్యం వహిస్తారు. తొలి సమావేశం అనంతరం ఆరు నెలల వ్యవధిలో కమిటీ తన నివేదికను సమరి్పస్తుందని ఆర్‌బీఐ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment