ముంబై: కేవైసీ అప్‌డేషన్ పేరిట జరుగుతున్న మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ హెచ్చరించింది. గుర్తుతెలియని వారికి పత్రాలను ఇవ్వకుండా జాగ్రత్త వహించాలని సూచించింది. ‘అపరిచిత వ్యక్తులు లేదా సంస్థలకు కేవైసీ (గుర్తింపు, చిరునామా ధృవీకరణకు ఆధారాలు) పత్రాలు లేదా వాటి కాపీలను ఇవ్వకండి‘ అని పేర్కొంది. అలాగే అకౌంట్ లాగిన్ వివరాలు, కార్డు సమాచారం, పిన్ నంబర్లు, పాస్‌వర్డ్‌లు, ఓటీపీలను కూడా ఎవరికీ చెప్పరాదంటూ సూచించింది.
‘సాధారణంగా ఈ తరహా మోసాల్లో.. కస్టమర్లు తమ వ్యక్తిగత సమాచారం, అకౌంటు వివరాలను తెలియజేసే విధంగా లేదా మెసేజీల్లో పంపే లింకుల ద్వారా అనధికారిక యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవాలంటూ మోసపుచ్చేలా ఖాతాదారులకు అవాంఛిత ఫోన్ కాల్స్, ఎస్‌ఎంఎస్, ఈమెయిల్స్ మొదలైనవి వస్తుంటాయి. కస్టమర్లు అప్పటికప్పుడు స్పందించకపోతే అకౌంటు ఫ్రీజ్ అవుతుందని లేదా మూతబడుతుందని బెదిరించే ధోరణిలో ఇవి ఉంటాయి.
అలాంటప్పుడు కస్టమర్లు తమ వ్యక్తిగత లేదా లాగిన్ వివరాలు గానీ ఇచ్చారంటే మోసగాళ్లు వారి ఖాతాల్లోకి అనధికారికంగా చొరబడతారు‘ అని ఆర్‌బీఐ పేర్కొంది. కేవైసీ అప్‌డేషన్ కోసం అభ్యర్ధన ఏదైనా వస్తే నేరుగా బ్యాంకు లేదా ఆర్థిక సంస్థనే సంప్రదించాలని సూచించింది. అలాగే, ఆయా సంస్థల అధికారిక వెబ్‌సైట్ల నుంచే కాంటాక్ట్ నంబర్లు తీసుకోవాలని పేర్కొంది. సైబర్ మోసం జరిగితే వెంటనే బ్యాంకు దృష్టికి తీసుకెళ్లాలని ఆర్‌బీఐ తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ గతంలో కూడా ఇలాంటి మోసాలపై ఈ తరహా హెచ్చరికలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment