ఇందిరమ్మ జాగా.. వేసెయ్‌ పాగా | Indira Gandhi House Land Kabza In Karimnagar | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ జాగా.. వేసెయ్‌ పాగా

Published Mon, Feb 25 2019 1:13 PM | Last Updated on Mon, Feb 25 2019 1:13 PM

Indira Gandhi House Land Kabza In Karimnagar - Sakshi

పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఇందిరమ్మ ఇంటి పథకం ఎంతోమందికి నీడనిచ్చింది. పేదోడికి గూడు దరిచేరింది. అయితే రామగుండం ఎన్టీపీసీ ప్రాంతంలో పేదలకు చెందాల్సిన నివాస స్థలాలు ధనవంతుల, ఆక్రమణదారుల చేతుల్లో చేరిపోతున్నాయి. రామగుండం కార్పొరేషన్‌ పరిధిలోని మూడో డివిజన్‌లో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా అవుతోంది.

ఆక్రమణపై రెండేళ్ల క్రితం అధికారులకు ఫిర్యాదులు అందడంతో అధికారులు ఇందిరమ్మకాలనీలో ఇంటింటా సర్వే చేపట్టారు. అయితే ఈ సర్వే   తూతూ మంత్రంగా నిర్వహించడంతో దళారులు ఇష్టారాజ్యంగా ఆక్రమణల పర్యవ కొనసాగిస్తున్నారు. ఈ ప్రాంతంలో భూమి కొనాలన్నా, అమ్మాలన్నా వీరి ప్రమేయం తప్పనిసరి. ఇందిరమ్మకాలనీలోని స్థలాలను విక్రయించరాదని నిబంధనలు ఉన్నా యథేచ్చగా విక్రయాలు కొనసాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. 

జ్యోతినగర్‌(రామగుండం): రామగుండం కార్పొరేషన్‌ మూడో డివిజన్‌లో పేదల కోసం కేటాయించిన ఇందిరమ్మ నివాస స్థలాలు ధనికుల చేతుల్లోకి వెళ్లి ఖరీదైన భవంతులు వెలుస్తున్నాయి. ప్రభుత్వం పేదలు నివసించడానికి ఏర్పాటు చేసిన ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం ఉన్న వాళ్ల చేతిలోకి వెళ్లడంతో పేదలకు అన్యాయం జరుగుతోంది. ఇందిరమ్మ కాలనీలో 2008 నుంచి ఇప్పటి వరకు అధికారికంగా 6,365 ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనట్లు సమాచారం. మంజూరైన ఇళ్లలో సుమారు 500 మంది లబ్ధిదారులు మాత్రమే నిర్మించుకుని నివాసముంటున్నారు. మిగతా నిర్మాణాలు వివిధ దశల్లో నిలిచిపోయాయి. ఈ ప్రాంతంలో ఉన్న కొందరు ప్లాట్లను తమ అజమాయిషీలో తెచ్చుకుని వ్యాపార కేంద్రంగా మలుచుకున్నారు.

గతంలో పేదవారుగా ఇక్కడికి వచ్చి ఇప్పుడు ధనవంతులుగా మారిపోయారు. ఖాళీగా ఉన్న స్థలాలను గుర్తించి ఒక్కోప్లాటు  రూ.30 వేల నుంచి రూ.60 వేల వరకు విక్రయిస్తున్నారు. అమ్మకాలు, కొనుగోలు అంతా సాదా పత్రాలలోనే మారుతూ ఉంది. సొంతంగా పట్టా ఉన్నవారి ప్లాట్లను ఆక్రమించిన సంఘటనలు ఇక్కడ సర్వసాధారణంగా మారాయి. అసలైన ఇందిరమ్మ లబ్ధిదారులు తమకు ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు, తాము పోగుచేసుకున్న డబ్బులతో అరకొరగా నిర్మించుకుని నివసిస్తున్నారు. దళారుల నుంచి కొనుగోలు చేసిన కొందరు ఖరీదైన భవంతులు నిర్మిస్తున్నారు. ఇందిరమ్మకాలనీలో ఇంత ఖరీదైనా ఇళ్లు ఉంటుందా.. వీరు కూడా పేదవారేనా అని చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

కొనసాగుతున్న చదును పనులు
ఇందిరమ్మకాలనీలో కొందరు ఒక టీంగా ఏర్పడి పేదలకు భూములు ఇస్తాం అంటూ ఖాళీ స్థలాల చదును ప్రారంభించారు. చదును చేపట్టడంతోపాటు స్థలాలు కావాల్సినవారి నుంచి ముందస్తుగా చదును పనుల కోసం రూ.1,000 ఇవ్వాలని వసూళ్లు చేస్తున్నారు. ఇలా ఇప్పటివరకు సుమారు 70 మంది వద్ద వసూలు చేసినట్లు సమాచారం.
 
100 ఫీట్ల రోడ్డు కబ్జా..
ఇందిరమ్మ కాలనీలో  100 ఫీట్ల రోడ్డు నిర్మించేందుకు వీలుగా ప్లాట్లను ఏర్పాటు చేసి గతంలో అందించారు. అయితే వంద ఫీట్ల రోడ్డు నిర్మాణం కాకపోవడంతో  30 ఫీట్లు రోడ్డు వదిలి ఇరువైపులా మిగిలిన 35 ఫీట్ల చొప్పన ఉన్న భూమిని కూడా కాజేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ విషయంపై ఇటీవల మేయర్‌ పర్యటించిన క్రమంలో స్థానిక కార్పొరేటర్‌ ఫిర్యాదు కూడా చేశారు. అర్హులైన పేదలకు అన్యాయం జరిగిందని సమాచారం మేరకు రామగుండం రెవెన్యూ అధికారులు రెండేళ్ల క్రితం ఇందిరమ్మకాలనీలో ఎవరు నివిసిస్తున్నారు.

స్థలాలు ఎవరి పేరుమీద ఉన్నాయనే సమాచారాన్ని సేకరించేందుకు సర్వే చేశారు. సర్వే పూర్తి చేయకపోవడమే దళారులకు వరంగా మారింది. పూర్తిస్థాయిలో కాలనీలోని మొత్తం నివాసాలు సర్వే చేసి అసలైన లబ్ధిదారులు ఎవరెవరు ఉన్నారు అనే విషయాలను సేకరించి మిగతా స్థలాలను పేదలకు ఇవ్వాల్సిన అవసరం అధికారులపై ఉంది. సర్వే అనంతరమే బినామీగా ఉన్నవారు ఎందరు, అసలు మంజూరు ఉన్నవారు ఎవరు.. అనే విషయాలు వెలుగులోకి రానున్నాయి.

అక్రమంగా చదును చేస్తే చర్యలు
కార్పొరేషన్‌ మూడో డివిజన్‌ ఇందిరమ్మకాలనీలోని ఖాళీ స్థలాలను కొందరు చదును చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. సమాచారం మేరకు రెవెన్యూ అధికారులను సంఘటన స్థలానికి పంపించి విచారణ చేపట్టాం. అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌కు కూడా సమాచారం ఇచ్చాం. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటాం. - హనుమంతరావు, రామగుండం తహసీల్దార్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement