బోల్తా కొట్టిన బాబు బుల్‌బుల్‌ పిట్ట | Sakshi
Sakshi News home page

బోల్తా కొట్టిన బాబు బుల్‌బుల్‌ పిట్ట

Published Tue, May 7 2024 5:09 AM

Bad propaganda of retired IAS PV Ramesh

బెడిసికొట్టిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ పీవీ రమేశ్‌ దుష్ప్రచారం

రమేశ్‌ భూమి కబ్జా చేసినది అని బయటపడ్డ వాస్తవం 

కబ్జా చేసిన భూమికి మ్యుటేషన్‌ చేయాలని అడ్డగోలు వాదన 

11.0 4 ఎకరాల భూమిని కబ్జా చేసిన ఆయన తండ్రి  

దానిపై కోర్టులో పిటిషన్‌ వేసిన జి.నాగేంద్ర 

ఆ భూమిని అప్పగించాలని తీర్పునిచ్చిన కోర్టు 

అయినా భూమిని అప్పగించని వైనం  

ఆ భూమికి మ్యుటేషన్‌ చేయాలని కోరిన రమేశ్‌ 

వివాదంలో ఉన్న భూమి మ్యుటేషన్‌ కుదరదన్న అధికారులు 

ఈ భూమిపై జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌కు కలెక్టర్‌ ఆదేశం 

రీసర్వే కోసం రావాలని నోటీసులు ఇస్తే ముఖం చాటేసిన రమేశ్‌ 

ఇప్పుడు బాబు పన్నాగంతో ప్రభుత్వంపై విష ప్రచారం  

సాక్షి, అమరావతి: ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంపై దుష్ప్రచారాన్ని కొనసాగించేందుకు చంద్రబాబు వదిలిన బుల్‌ బుల్‌ పిట్ట బోల్తా కొట్టింది. టీడీపీ గూటి చిలుక, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి పీవీ రమేశ్‌తో సోషల్‌ మీడియాలో చంద్రబాబు సాగించిన దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసే పచ్చ ముఠా సభ్యుడైన ఆయన చంద్రబాబు ఆదేశాలతో రంగంలోకి దిగి అడ్డంగా దొరికిపోయారు. 

తన తండ్రి నుంచి వారసత్వంగా వస్తున్న భూములకు మ్యుటేషన్‌ చేయడంలేదని, అందుకు ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టమే కారణమనే భావన కలిగిస్తూ అసత్య ఆరోపణలు చేశారు. దీంతో నెటిజన్లు ఆయనపై విరుచుకుపడ్డారు. అసలు ఇంకా అమలులోకి రాని చట్టం దుర్వినియోగం కావడం ఏమిటంటూ మండిపడ్డారు. మరోవైపు తీగ లాగితే డొంక కదిలింది. ఆయన చెబుతున్న 11.04 ఎకరాల భూమిని పీవీ రమేశ్‌ కుటుంబం కబ్జా  చేసిందన్న విషయం ఆధారాలతో సహా బయటç­³డింది. ప్రభుత్వ, అసైన్డ్, ప్రైవేటు భూమలు కబ్జా చేసేసి, న్యాయస్థానం తీర్పును కూడా ధిక్కరిస్తున్న పీవీ రమేశ్‌ బరితెగింపు బట్టబయలైంది.

పీవీ రమేశ్‌ కుటుంబమే భూ దొంగ
పీవీ రమేశ్‌ చేసిన దుష్ప్రచారం ఆయన కుటుంబం భూ కబ్జాను కూడా వెలుగులోకి తెచ్చింది. ఏ భూమి గురించి అయితే పీవీ రమేశ్‌ రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేశారో.. ఆ భూమి ఆయన కుటుంబం కబ్జా చేసిందన్న విషయం కూడా బయటప­డిపోయింది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం విన్నకోటలో 25ఏళ్ల క్రితం పలువురు రైతులు తమ భూములను కలిపి దాదాపు 100 ఎకరాల్లో చెరువు తవ్వి సహకార వ్యవసాయం తరహాలో చేపల సాగు చేపట్టారు. ఈ భూముల్లో పీవీ రమేశ్‌ తండ్రి పెనుమాక సుబ్బారావుకు చెందినవి 11.04 ఎకరాలు ఉన్నాయి. 

కానీ వాటిలో  3.29 ఎకరాల అసైన్డ్‌ భూమి, 0.29 ఎకరాల ప్రభుత్వ భూమి­తోపాటు తన భూమి కూడా ఉందని గాలంకి నాగేంద్ర అనే వ్యక్తి న్యాయస్థానంలో గతంలోనే పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన న్యాయ­స్థానం పెనుమాక సుబ్బారావు ఆక్రమించిన భూమిని తిరిగి ఇచ్చేయాలని 2022లోనే తీర్పుని­చ్చింది. పీవీ రమేశ్‌ పరపతికి భయపడి ఆ తీర్పును అధికారులు అమలు చేయలేకపోయారు. దాంతో బాధితుడు నాగేంద్ర కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణలో ఉంది. అంటే పీవీ రమేశ్‌ ఆయన తండ్రి నుంచి వచ్చిన వారసత్వ భూమిగా చెబుతున్న 11.04 ఎకరాలు ఆయన కుటుంబం కబ్జా చేసిన భూమి అన్న విషయం బయటపడింది.

కబ్జా భూమికి మ్యుటేషన్‌ సాధ్యం కాదన్న అధికారులు
అయినా సరే తమ కుటుంబం కబ్జా చేసిన భూములను తమ పేరిట మ్యుటేషన్‌ చేయాలని పీవీ రమేశ్‌ యత్నించడం గమనార్హం. ఆ మేరకు ఆయన 2023 డిసెంబర్‌ 16న రెవెన్యూ అధికారులకు లేఖ రాశారు. తన తండ్రి పెనుమాక సుబ్బారావు మరణించినందున ఆయన పేరిట ఉన్న భూములను తమ పేరిట మ్యుటేషన్‌ చేయాలని కోరారు. అప్పటికే ఆ భూములపై న్యాయ వివాదం ఉందన్న విషయం రెవెన్యూ అధికారులకు తెలుసు. కబ్జా భూములను ఖాళీ చేయాల్సింది పోయి, మ్యుటేషన్‌ చేయాలని కోరడంతో పీవీ రమేశ్‌ దరఖాస్తును తిరస్కరి­స్తున్నట్టు 2023 డిసెంబర్‌ 30న అధికారులు ఆయనకు లిఖితపూర్వకంగా తెలిపారు.

తొందరపడి అబద్ధం కూసి.. ఆపై మరోపోస్టు పెట్టి
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసే చంద్రబాబు కుట్రలో పాత్రధారి అయిన పీవీ రమేశ్‌ సోమవారం ఉదయం సోషల్‌ మీడియా వేదిక ఎక్స్‌ (ట్విట్టర్‌)లో ఓ పోస్టు పెట్టారు. ‘తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన భూములను మ్యుటే­షన్‌ చేయడానికి రెవెన్యూ అధికారులు నిరాకరించారు. తహశీల్దార్‌ నా దరఖా­స్తును తిరస్కరించారు. పోస్టు ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే ఆర్డీవో తిరిగి ఇచ్చేశారు. నా తల్లిదండ్రుల భూము­లపై నాకు హక్కు లేకుండా చేస్తున్నారు. 

ఓ ఐఏఎస్‌ అధికారిగా 36 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌కు సేవ చేసిన ఓ అధికారి పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్య రైతుల దుస్థితి ఊహించలేం’  అంటూ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన భూహక్కు చట్టం (ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌)పై దుష్ప్రచారం చేయాలన్న చంద్రబాబు కుట్రను పక్కాగా అమలు చేశారు. ప్రజల్ని తప్పుదారి పట్టించాలన్న దుర్బుద్ధితో పీవీ రమేశ్‌.. అసలు ఆ చట్టం రాష్ట్రంలో ఇంకా అమల్లోకి రాలేదన్న అసలు విషయాన్ని విస్మరించారు. 

వెంటనే నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. చట్టం ఇంకా అమల్లోకి  రాకముందే ఎలా దుర్వినియోగం అవు­తోందని అంటారు అంటూ నిలదీశారు. దాంతో బండారం బయటపడుతుందన్న ఆందోళనతో పీవీ రమేశ్‌ ఎక్స్‌ (ట్విట్టర్‌) ఖాతాలో తన పోస్టును ఎడిట్‌ చేశారు. ‘చట్టం అమలులోకి రాకముందే నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కులేకుండా చేస్తున్నారు’ అంటూ పోస్టులో మార్పు చేశారు.

ఆయన తండ్రిపై వరకట్న వేధింపుల కేసు కూడా
పీవీ రమేశ్‌ తండ్రి పెనుమాక సుబ్బారావు భూముల కబ్జాకు పాల్పడటమే కాదు.. ఆయనపై క్రిమినల్‌ కేసులు కూడా గతంలో నమోదు కావడం గమనార్హం. కట్నం కోసం కోడల్ని మానసికంగా, శారీరకంగా హింసించారన్న కారణంతో ఆయనపై విజయవాడ పోలీసులు 2018లో వరకట్న వేధింపుల కేసు నమోదు చేసిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. పీవీ రమేశ్‌ సోదరుడు రాజశేఖర్‌ జోషి భార్య పెనుమాక సంధ్య ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. 

1999లో తన పెళ్లి సమయంలో రూ.2 లక్షల కట్నం, నాలుగు ఎకరాల మామిడి తోట, కారు కట్నంగా ఇచ్చినప్పటికీ అదనపు కట్నం కోసం తనను వేధిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇద్దరు పిల్లల తల్లినైన తనను వేధిస్తున్నారంటూ భర్త పెనుమాక రాజశేఖర్‌ జోషి, మామగారు పెనుమాక సుబ్బారావు, అత్తగారు పెనుమాక మణిలపై ఆమె ఫిర్యాదు చేశారు. దాంతో ఆ ముగ్గురిపై పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. 

భూముల రీ సర్వేకు పీవీ రమేశ్‌ కుటుంబం హాజరు కాలేదని, కబ్జా చేసిన భూమిని పీవీ రమేశ్‌ పేరిట మ్యుటేషన్‌ చేయటం సాధ్యం కాదని రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఉత్తర్వులు   

రీసర్వేకు ముఖం చాటేసిన పీవీ రమేశ్‌
అంతేకాదు.. తమ భూకబ్జా బాగోతం బయటప­డుతుందనే ఉద్దేశంతోనే పీవీ రమేశ్‌ రెవెన్యూ అధికారుల రీ సర్వేకు ముఖం చాటేశారు. పీవీ రమేశ్‌ చెబుతున్న చెరువు భూముల్లో కూడా రీసర్వే నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. తద్వారా ఆ రైతుల భూములకు హద్దులను నిర్ణయించి వారి పేరిట పత్రాలు ఇవ్వాలని భావించారు. అందుకోసం ఈ ఏడాది (2024) ఫిబ్రవరి 26న కృష్ణా జిల్లా కలెక్టర్‌ జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌ కమిటీని కూడా నియమించారు. 

దాంతో గుడివాడ ఆర్డీవో ఆ చెరువు భూముల్లో 2024 మార్చి 5న నిర్వహించనున్న ఉమ్మడి సర్వేకు హాజరుకావాలని, ఇందుకు భూముల ఒరిజినల్‌ పత్రాలను తీసుకురావాలని భూ యజమానులు, రిట్‌ పిటిషన్లు దాఖలు చేసినవారందరికీ నోటీసులు జారీ చేశారు. పీవీ రమేశ్‌ కుటుంబానికి కూడా నోటీసులు జారీ చేశారు. ఆ రోజున రైతులందరూ వచ్చారు. వారి భూముల పత్రాలను చూపించి రీ సర్వేకు సహకరించారు. 

కానీ పీవీ రమేశ్‌ గానీ ఆయన కుటుంబ సభ్యులుగానీ ఆ రీ సర్వేకు హాజరు కాలేదు. రెవెన్యూ అధికారులు ఎన్ని సార్లు ఫోన్లు చేసినా, వాట్సాప్‌ ద్వారా సందేశాలు పంపినా వారు హాజరుకాలేదు. దాంతో అందరు రైతులు వచ్చి  పత్రాలు చూపించే వరకు రీసర్వే పూర్తి చేయడం సాధ్యం కాదని రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. అదీ పీవీ రమేశ్‌ కుటుంబ భూకబ్జా బాగోతం. 

 
Advertisement
 
Advertisement