Constitutional amendment
-
జమిలి ఎన్నికల బిల్లు... రేపే లోక్‌సభ ముందుకు
న్యూఢిల్లీ: ఒకే దేశం–ఒకే ఎన్నిక విధానానికి సంబంధించిన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం ముహూర్తం ఖరారు చేసింది. జమిలి ఎన్నికలకు సంబంధించిన రెండు బిల్లులను సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. 129వ రాజ్యాంగ సవరణ, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లులను కేంద్ర న్యాయ శాఖ మంత్రి మేఘ్వాల్ సభ ముందు ఉంచనున్నారు. లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపేందుకు ఉద్దేశించిన ఈ బిల్లులకు కేంద్ర కేబినెట్ గురువారం ఆమోద ముద్ర వేయడం తెలిసిందే. -
రాజ్యాంగ పీఠికనూ పార్లమెంట్ సవరించొచ్చు
న్యూఢిల్లీ: 1976లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం రాజ్యాంగ పీఠికలో మార్పులు చేస్తూ తీసుకువచ్చిన 42వ రాజ్యాంగ సవరణపై అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. పీఠికలో సామ్యవాద, లౌకిక, సమగ్రత (సోషలిస్ట్, సెక్యులర్, ఇంటెగ్రిటీ) అనే పదాలను చేర్చుతూ చేసిన సవరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యం స్వామి, న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ ఈ మేరకు వేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం నవంబర్ 22తో వాదనలు ముగించి, సోమవారం తీర్పు వెలువరించింది. ‘రిట్ పిటిషన్లపై తదుపరి విచారణ కానీ, తీర్పు కానీ అవసరం లేదు. రాజ్యాంగంలోని పీఠికను కూడా సవరించే అధికారం పార్లమెంట్కుంది. సవరణకు ఇప్పటికే చాలా ఏళ్లు గడిచినందున ఆ ప్రక్రియ రద్దు సాధ్యం కాదు’అని తీర్పులో పేర్కొంది.‘ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగంలోని మార్పులకు ఆమోదించిన తేదీ ప్రభుత్వ అధికారాన్ని తగ్గించదు. పైపెచ్చు ఆ అధికారాలను సవాల్ చేయలేం. పీఠికకు సైతం మార్పులు చేపట్టే అధికారం పార్లమెంట్‌కు ఉంది’అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ అంశంపై ఇప్పటికే పలు న్యాయపరమైన సమీక్షలు జరిగాయని గుర్తు చేసింది. ఎమర్జెన్సీ సమయంలో పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాలను రద్దు చేయాలని చెప్పలేమని కూడా పేర్కొంది. ఎన్నో ఏళ్లు గడిచాక పీఠికలో చేసిన మార్పులపై ఇప్పుడెందుకు అభ్యంతరం చెబుతున్నారు?అంటూ ధర్మాసనం పిటిషనర్లను ప్రశ్నించింది.పిటిషనర్ల అభ్యంతరం ఏమంటే..సామ్యవాదం, లౌకికవాదం అనే పదాలపై చేరిక తనకూ సమ్మతమేనని పిటిషనర్ అశ్వినీ ఉపాధ్యాయ్ వాదనల సందర్భంగా తెలిపారు. అయితే, ఆ పదాలను రాజ్యాంగ పీఠికలో చేర్చడంపైనే తనకు అభ్యంతరం ఉందన్నారు. రాజ్యాంగ పీఠికలో సామ్యవాదం, లౌకిక, సమగ్రత అనే పదాల చేరికను ఇందిరాగాంధీ అనంతరం ఎన్నికైన జనతా పార్టీ ప్రభుత్వం కూడా సమర్థించిందని ఇదే అంశంపై వేరుగా పిటిషన్ వేసిన సుబ్రమణ్యస్వామి పేర్కొన్నారు. అయితే, 1949లో ఆమోదించిన రాజ్యాంగ పీఠికను యథాతథంగా ఉంచుతూ, 1976లో చేపట్టిన మార్పులను వేరుగా ప్రత్యేక పేరాలో ఉంచాలన్నదే తన ఉద్దేశమన్నారు. ఎమర్జెన్సీ సమయంలో..ఇందిరా గాంధీ ప్రభుత్వం దేశంలో 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21వ తేదీ వరకు అత్యవసర పరిస్థితి అమల్లో ఉండటం తెలిసిందే. ఆ సమయంలోనే రాజ్యాంగ పీఠికలోని సార్వభౌమ, ప్రజాస్వామ్య గణతంత్ర అనే పదాల స్థానంలో సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర అనే వాటిని చేరుస్తూ పార్లమెంట్ చట్టం చేసింది. ఈ కేసులో మొట్ట మొదటిసారిగా 2020లో బలరాం సింగ్ అనే వ్యక్తి విష్ణు శంకర్ జైన్ అనే న్యాయవాది ద్వారా పిటిషన్ వేశారు. ఇదే అంశంపై విస్తృత ధర్మాసనానికి బదలాయించాలంటూ దాఖలైన పిటిషన్‌ను గతంలో సుప్రీంకోర్టు కొట్టివేసింది. సామ్యవాదం అనే పదాన్ని మన దేశానికి వర్తింపజేసుకుంటే సంక్షేమ రాజ్యమనే అర్థమే వస్తుందని వివరించింది. -
భారత్ లౌకిక దేశంగా ఉండాలనుకోవడం లేదా?
న్యూఢిల్లీ: ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ పీఠికలో చేర్చిన సామ్యవాద, లౌకిక( సోషలిస్ట్, సెక్యులర్) పదాలను తొలగించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను సోమవారం సుప్రీంకోర్టు విచారించి పిటిషన్లపై పలు ప్రశ్నలు సంధించింది. మాజీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి, లాయర్ విష్ణు శంకర్ జైన్, బలరామ్ సింగ్, లాయర్ అశ్వినీ ఉపాధ్యాయ్ తదితరులు దాఖలుచేసిన ఈ పిల్లను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం విచారించింది. ‘‘సామ్యవాదం అనే పదానికి అర్ధాలను ప్రాశ్చాత్య దేశాల కోణంలో చూడొద్దు. సోషలిజం పదానికి అర్థాన్ని అందరికీ సమాన అవకాశాలు అనే దృక్కోణంలోనే చూడాలి. సెక్యులరిజం అనే పదం భారత రాజ్యాంగంలో భాగమని గతంలో ఎన్నో తీర్పుల్లో న్యాయస్థానాలు తేలి్చచెప్పాయి. సెక్యులర్ పదం రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం. ఫ్రెంచ్ వారి సెక్యులరిజంకు బదులు ఆధునిక భావజాల సెక్యులరిజాన్ని భారత్ సంగ్రహించింది. మీరు భారత్ లౌకిక దేశంగా ఉండాలనుకోవాట్లేరా?’’అని జస్టిస్ ఖన్నా ప్రశ్నించారు. దీనికి లాయర్ విష్ణుశంకర్ జైన్ బదులిచ్చారు. ‘‘మేం లౌకిక అనే పదానికి వ్యతిరేకం కాదు. కానీ ఆ పదాన్ని పీఠికలో చేర్చిన విధానాన్ని మాత్రమే సవాల్ చేస్తున్నాం. తప్పుడు మార్గంలో సోషలిజం పదాన్ని చేరిస్తే వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ప్రమాదంలో పడుతుందని బీఆర్ అంబేడ్కర్ అభిప్రాయపడ్డారు. 1949 నవంబర్ 26నాటి రాజ్యాంగ పీఠికనే కొనసాగిద్దాం. సవరణల ద్వారా పీఠికలో సవరణ చేయకూడదు. అదనపు పదాలను చేర్చడంలో హేతుబద్ధత లోపించింది’అని లాయర్ వాదించారు. ‘‘కొత్తగా చేరిన పదాలు దేశంలో ఎలాంటి మార్పులు తీసుకురాకున్నా ఒక గందరగోళానికి తెరలేపాయి. దీంతో పీఠికలో ఎలాంటి మార్పులైనా చేయొచ్చన్న భావన తదుపరి ప్రభుత్వాల్లో నెలకొంది’’అని లాయర్ అశ్వినీ ఉపాధ్యాయ్ వాదించారు. వాదోపవాదనల తర్వాత కేసు విచారణ నవంబర్ 18వ తేదీకి వాయిదాపడింది. -
India vs Bharat : ఒకే దేశం, ఒకే పేరు ?
ఇండియా పేరు శాశ్వతంగా భారత్‌గా మార్చనున్నారా ? నిజానికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో ఇప్పటికే ఇండియా దటీజ్ భారత్ అని రాసి ఉంది. ఇండియా అంటే భారత్ అని అర్థం. ఇండియా, భారత్ రెండు పేర్ల బదులుగా ఒకే పేరు తీసుకువచ్చే ఆలోచనలో మోదీ ప్రభుత్వం కనిపిస్తోంది. వలసవాద గుర్తులను తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనేక సందర్భాల్లో పిలుపునిస్తూ వస్తున్నారు. మరుగున పడిఉన్న దేశ సంస్కృతిని మళ్లీ వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెపుతున్నారు. అదే క్రమంలో 75 ఏళ్లుగా ఇండియాగా పిలవబడుతున్న దేశానికి ఒకే పేరు శాశ్వతంగా ఉండేలా అడుగులు వేస్తున్నారు. జి–20 సదస్సుకు తరలివస్తున్న ప్రపంచదేశాధినేతలకు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరుతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందుకు ఇన్విటేషన్ పంపారు. ఈ ఇన్విటేషన్ ఇప్పుడు దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నగరాల పేర్లనుంచి ...దేశం పేరు మార్పు వరకు నరేంద్రమోదీ ప్రభుత్వంలో ఇప్పటి వరకు అనేక నగరాల పేర్లను మార్చారు. అలహాబాద్‌ను ప్రయాగ్‌రాజ్ గా, గుర్గావ్ను గురుగ్రామ్ గా, ఫైజాబాద్ జిల్లాను అయోధ్య జిల్లాగా మార్చారు. త్వరలోనే లక్నో పేరును కూడా లక్ష్మణ నగరిగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా ఈ నగరాల పేర్ల మార్పు ప్రక్రియ కొనసాగుతుండగానే, దేశం పేరు మార్చేందుకు రంగం సిద్ధమైంది. వలసవాద చిహ్నలను తొలగించే ప్రక్రియలో భాగంగా ఇండియా పేరుకు చరమగీతం పాడాలనే డిమాండ్ చాలా రోజుల నుంచి బిజెపి, సంఘ్ పరివార్నుంచి వస్తోంది. వేద కాలం నుంచే ఈ ప్రాంతానికి భారత్ పేరు.. భారత్‌పేరు రుగ్వేద కాలం నుంచి వస్తోంది. వేద తెగ భరతుల పేరు నుంచి భారత్ అనే పేరు ఉద్భవించిందని చెపుతుంటారు. రుగ్వేదంలోని ఆర్యవర్తన తెగలవారని కూడా చరిత్ర చెపుతోంది. మహాభారత కాలంలోని శకుంతల–దుష్యంతుడు కుమారుడి పేరు కూడా భరతుడే. అలాగే భరతుడు పాలించిన ప్రాంతాన్ని భరత దేశంగా పిలుస్తుండేవారు. ఇలా ప్రాచీన కాలం నుంచి ఈ ప్రాంతానికి భారత్ అనే పేరు కొనసాగుతూ వస్తోంది. క్రీస్తుపూర్వం మొదటి శతాబ్దంలోని హతిగుంఫా శాసనంలో కూడా భారత్ ప్రస్తావన ఉంది. దీని ప్రకారం అయితే గంగా, మగద కు పశ్చిమాన ఉన్నభాగాన్నే భారత్ గా శాసనాలో ఉంది. దక్షిణభారతం, దక్కన్ పీఠభూమి దీని నుంచి మినహాయించారు. గ్రీకుల కాలంలో ఇండియా పేరు ఇక ఇండియా పేరు గ్రీకుల కాలం నుంచి కొనసాగింది. సింధు నదిని ఇంగ్లీష్‌లో ఇండస్ రివర్‌గా పిలుస్తుంటారు. ఇండస్ రివర్‌కు అవతల ఉండేవారిని ఇండియా అని, ఇండియాన్స్ అనే పిలవడం మొదలుపెట్టారు. 17వ శతాబ్దంలోకి ఇది బాగా వాడుకలోకి వచ్చింది. లాటిన్, స్పానిష్, పోర్చుగీస్ ఆ తర్వాత ఆంగ్లేయుల పాలనా ప్రభావంతో ఇండియా అనే పేరు స్థిరపడింది. ఇండియా పేరు ఎలా మారుస్తారంటే? రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ఉపయోగించి ఏవైనా సవరణలు చేయడానికి పూర్తి వెసులుబాటు ఉంది. స్వయంగా రాజ్యాంగ సభ ఈ అవకాశం కల్పించింది. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని మార్చుకునే అధికారం ఉంది. అయితే రాజ్యాంగంలో చేసే మార్పులకు పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. ఈ మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 1కి సవరణ ప్రతిపాదిస్తూ రాజ్యాంగ సవరణ బిల్లుగానీ, తీర్మానం గానీ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆర్టికల్ 1 ప్రకారం ఈ ప్రాంతాన్ని ఇండియా, భారత్‌గా పిలుచుకునే అధికారం ఉంది. ఇండియా పేరును పూర్తిగా తొలగించి కేవలం భారత్ ఉండేలా బిల్లు పెట్టే అవకాశముంది. నాగిళ్ల వెంకటేష్, సాక్షిటీవీ డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ -
Russia-Ukraine War: అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి!
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం రెండో ఏడాదిలోకి చొరబడింది. దురాక్రమణ ప్రయత్నాలు జోరుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఏడాది మారణహోమం తర్వాత కూడా వ్లాదిమిర్ వ్లాదిమిరోవిచ్ పుతిన్ రాజ్యకాంక్ష ఏమాత్రం చల్లారలేదు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా ఉక్రెయిన్‌పై ఉరుకులు పరుగుల మీద విరుచుకుపడ్డ రష్యాకు, తన అస్త్రాలేవీ పనికిరాకుండా పోయాయని జ్ఞానోదయం కలగడానికి ఎంతోసేపు పట్టలేదు. బాహుబలిగా కాలుదువ్విన పుతిన్ ఏడాది తిరిగేసరికి ప్రపంచం దృష్టిలో విలన్ అయ్యారు. సొంత ప్రజల దృష్టిలోనూ బాహుబలి హోదాను ఒకింత కోల్పోయారు. ఇంతకీ పుతిన్ ఊహించినదేమిటి? ఆయనకు ఎదురైందేమిటి...? ఎస్ రాజమహేంద్రారెడ్డి: పూర్వపు సోవియట్ యూనియన్ రిపబ్లిక్కులన్నింటినీ మళ్లీ ఒకే తాటిమీదకు తేవాలన్నది తన లక్ష్యమని పుతిన్ చెప్పుకుంటారు. పొరుగు దేశాలైన ఉక్రెయిన్, బెలారస్ కూడా ఒకప్పుడు రష్యాలో అంతర్భాగమేనని అంటారాయన. రెండేళ్ల క్రితం ఆయన రాసిన ఓ సుదీర్ఘ వ్యాసంలో కూడా ఈ విషయాన్ని సుస్పష్టం చేశారు. బెలారస్‌తో రష్యాకు ఎలాంటి విభేదాలూ లేవు. పైగా ఉక్రెయిన్‌పై దాడిలో రష్యాకు ఆదినుంచీ అది వెన్నుదన్నుగా ఉంది. రష్యా తొలుత ఉక్రెయిన్‌లో చొరబడేందుకు తన భూభాగాన్ని అనుమతించింది కూడా. ఎటొచ్చీ పుతిన్‌కు పేచీ అల్లా ఉక్రెయిన్‌తోనే! ఆ దేశ సార్వభౌమత్వాన్ని గుర్తించడానికి కూడా రష్యా ఎన్నడూ ఇష్టపడలేదు. రష్యా, ఉక్రెయిన్ ఒకే దేశమన్నదే పుతిన్ గట్టి నమ్మకం. లోగుట్టు వేరే నిగూఢంగా చూస్తే మాత్రం, ఈ గొడవంతా పైపై పటారమే. అసలు విషయం ఏమిటంటే సుదీర్ఘ కాలం పాటు రష్యాకు తిరుగులేని నాయకునిగా వెలిగిపోవాలన్నది పుతిన్‌లో అంతర్లీనంగా ఉన్న ఆశగా చెప్తారు. మూడేళ్ల క్రితం ఆయన ఆ దిశగా ప్రయత్నం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణతో రాజ్యాంగాన్ని మార్చి అధ్యక్షునిగా 16 ఏళ్లపాటు నిరాటంకంగా కొనసాగేలా కొత్త చట్టం తెచ్చేందుకు క్రెమ్లిన్ ప్రయత్నించింది. ఆ సమయంలో రష్యా టీవీ పుతిన్ కీర్తనలు, గుణగానాలతో హోరెత్తేది. ‘కల్లోల సాగరంలాంటి ప్రపంచంలో రష్యా నౌకను సమర్థంగా నడిపిస్తున్న కెప్టెన్ పుతిన్’ అంటూ ఊదరగొట్టేవారు. క్రెమ్లిన్ దృష్టిలో పుతిన్ సకల కళావల్లభుడు, సకలశాస్త్ర పారంగతుడు. అందుకే జూడో, రేసింగ్, స్విమ్మింగ్, హార్స్ రైడింగ్ విన్యాసాల్లో పుతిన్ సాహసకృత్యాల తాలూకు ఫొటోలను తరచూ ప్రపంచం ముందుకు తెస్తూంటుంది క్రెమ్లిన్. రష్యా ప్రజలను ప్రభావితం చేసి పుతిన్ పట్ల ఆరాధనా భావాన్ని పెంపొందించే ప్రయత్నాల్లో క్రెమ్లిన్ ఎంచుకున్న మార్గమిది. అసలు విషయమేమిటంటే 2024లో రష్యా అధ్యక్ష ఎన్నికలున్నాయి. ఆలోపు ఏదో ఒక ఘనకార్యం చేసి పుతిన్ కీర్తిని అమాంతం పెంచేయడం క్రెమ్లిన్ లక్ష్యం. పశ్చిమ దేశాల కనుసన్నల్లో సాగుతున్న ఉక్రెయిన్ను ఓ దారికి తెస్తే బాహుబలి పుతిన్ సత్తా ఏమిటో తెలుస్తుందని, అధ్యక్ష ఎన్నికల్లో మంచి ప్రచారాస్త్రంగా మారుతుందని క్రెమ్లిన్ థింక్‌టాంక్ అంచనా. అనుకున్నదే తడవుగా దాడికి దిగడం, ఆరంభంలో కొన్ని ప్రాంతాను ఆక్రమించి ఎగిరి గంతెయ్యడం... తర్వాత ఉక్రెయిన్ధాటికి తట్టుకోలేక వాటిని వదిలేసి తోకముడవడం చకచకా జరిగిపోయాయి. అయినా సరే, ఇప్పటికీ ఉక్రెయిన్‌పై దాడిని తప్పుగా పుతిన్ అంగీకరించడం లేదు. రెండు మూడు రోజుల క్రితం మాట్లాడుతూ ఇదంతా పశ్చిమ దేశాల కుట్రేనని సెలవిచ్చారు! దానికి జవాబుగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఏకంగా ఉక్రెయిన్ యుద్ధభూమిలో అడుగుపెట్టారు! ఈ పోరులో తమ వైఖరిని మరోసారి కుండబద్ధలు కొట్టారు. ఉక్రెయిన్ను గెలవడం రష్యా తరం కాదని అక్కడే మీడియాముఖంగా ప్రకటించేశారు. బహుశా పుతిన్ కూడా ఇలాంటి సవాలు కోసమే ఎదురు చూస్తున్నట్టున్నారు! ఏదోలా వచ్చే ఏడాది రష్యా అధ్యక్ష ఎన్నికల దాకా యుద్ధం కొనసాగాలన్నదే ఆయన అభిమతమని పరిశీలకుల అంచనా. యుద్ధం సమాధుల మీద 2024 అధ్యక్ష ఎన్నికలను నెగ్గాలని పుతిన్ భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఆపద్ధర్మ పాత్రతో మొదలై... 1999లో బోరిస్ యెల్సిన్ ఆకస్మిక రాజీనామాతో ఆపద్ధర్మ అధ్యక్షునిగా తొలిసారి గద్దెనెక్కిన పుతిన్ 2000–2004, 2004–08ల్లో రెండు దఫాలుగా అధ్యక్షునిగా కొనసాగారు. అప్పట్లో రష్యా అధ్యక్ష పదవీకాలం నాలుగేళ్లే. తర్వాత 2008 నుంచి 2012 దాకా ఆయన ప్రధానిగా ఉన్నారు. ఈ దశలో రాజ్యాంగ సవరణల ద్వారా అధ్యక్ష పదవీకాలాన్ని ఆరేళ్లకు పెంచారు. తర్వాత 2012 నుంచి 2018 దాకా, 2018 నుంచి ఇప్పటిదాకా పుతిన్ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. 2024 మార్చితో పదవీకాలం ముగుస్తుంది. ఒక వ్యక్తి వరుసగా రెండుసార్లకు మించి అధ్యక్షునిగా ఉండరాదన్న నిబంధనను కూడా రాజ్యాంగ సవరణ ద్వారా మార్చారు. ఫలితంగా 2024తో పాటు 2030 ఎన్నికల్లోనూ పోటీ చేసే అవకాశం పుతిన్‌కు సంక్రమించింది. ఈ రెండుసార్లూ గెలిస్తే 2036 దాకా ఆయనే రష్యా అధినేతగా చక్రం తిప్పుతారు. అలా ఒకే దెబ్బకు రెండు పిట్టల్లా ఒకే యుద్ధంతో అటు రాజ్యకాంక్షను, ఇటు పదవీకాంక్షనూ నెరవేర్చుకోవాలని పుతిన్ పట్టుదలగా ఉన్నారు. అందుకే యుద్ధానికి ఇప్పుడప్పట్లో ముగింపు పలికేందుకు ససేమిరా అంటున్నారు. యుద్ధంలో వెనకబడుతున్నట్టు అన్పించినప్పుడల్లా అణ్వాయుధ బూచితో ప్రపంచాన్ని బెదిరిస్తున్నారు. అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా అమెరికా మద్దతుతో లొంగేది లేదంటూ దీటుగా తలపడుతున్నారు. చివరికి గెలుపెవరిదైనా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం మాత్రం వైరి వర్గాలు రెండింటినీ వెంటాడుతూనే ఉంటాయి. చరిత్ర చెక్కిలిపై యుద్ధం ఎప్పుడూ ఓ కన్నీటి బిందువే! చెరిగిపోని మచ్చే!! కొసమెరుపు ఏడాది యుద్ధం బాహుబలిగా వ్లాదిమిర్ పుతిన్‌కున్న పేరుప్రతిష్టలను బలి తీసుకుంటే, పూర్వాశ్రమంలో సినిమాల్లో కమేడియన్ పాత్రలు పోషించిన వొలోదిమిర్ జెలెన్స్కీని మాత్రం నిజజీవితంలో హీరోను చేసింది! -
ఈడబ్ల్యూఎస్ కోటాపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ: విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు 10 కోటా కల్పిస్తూ చేసిన 103 రాజ్యాంగ సవరణ చట్టబద్దతపై దాఖలైన దాదాపు 40కిపైగా పిటిషన్లపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. దీనిపై తీర్పును రిజర్వ్‌లో ఉంచుతున్నట్లు సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం పేర్కొంది. 50 శాతం జనరల్ కోటాలో ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని సీనియర్ లాయర్లు రవి వర్మ కుమార్, పి. విల్సన్ సహా పలువురు లాయర్లు కోర్టులో వాదించారు. ఈడబ్ల్యూఎస్‌కు ఆర్థికపరిస్థితినే గీటురాయిగా తీసుకోకూడదని తమిళనాడు తరఫున హాజరైన సీనియర్ లాయర్ శేఖర్ నఫరే వాదించారు. వీటిని అటార్నీ జనరల్ వేణుగోపాల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తోసిపుచ్చారు. -
లంకలో నిరసనలకు తెర
కొలంబో: శ్రీలంకలో చరిత్రలోనే అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభానికి కారకులైన రాజపక్స కుటుంబ పాలనపై ఆగ్రహంతో వెల్లువెత్తిన దేశవ్యాప్త నిరసనలు ఎట్టకేలకు సద్దుమణిగాయి. రాజధానితో పాటు పలుచోట్ల ఏర్పాటైన నిరసన శిబిరాలను ఆందోళనకారులు మంగళవారం నాటికి పూర్తిగా ఖాళీ చేసి వెళ్లిపోయారు. దాంతో 123 రోజుల ఆందోళనలకు తాత్కాలికంగా తెర పడ్డట్టయింది. మరోవైపు, నిరసనకారుల ప్రధాన డిమాండ్లలో ఒకటైన అధ్యక్షుని అధికారాలకు కత్తెర వేసే రాజ్యాంగ సవరణ బిల్లును ప్రభుత్వం బుధశారం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఇది ఆమోదం పొందితే స్వతంత్ర ఎన్నికల సంఘం సభ్యులు, అవినీతి విచారణ అధికారులు, పోలీస్ తదితర ఉన్నతోద్యోగుల నియామకాధికారం అధ్యక్షుడి నుంచి రాజ్యాంగ మండలికి దఖలు పడుతుంది. -
Sakshi Cartoon: శ్రీలంక అధ్యక్షుడి అధికారాలకు కోత
శ్రీలంక అధ్యక్షుడి అధికారాలకు కోత -
బీసీల ప్రాతినిధ్యానికి రాజ్యాంగ సవరణ చేయాలి
హస్తినాపురం: చట్ట సభల్లో వెనుకబడిన తరగతులకు 52 శాతం ప్రాతినిధ్యం కోసం రాజ్యాంగ సవరణ చేసి ప్రజాస్వామ్యానికి, సోషలిజానికి పునాదులు వేయాల్సిన అవసరం ఉందని ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ అన్నారు. అంతర్జాతీయ ఆలోచన దినోత్సవం సందర్భంగా బీసీ కులాల వారీగా చట్ట సభలలో ప్రాతినిథ్యం కోసం మంగళవారం హస్తినాపురం చౌరస్తానిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఒకరోజు నిరాహార దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాజ్యాంగం అమలు కావాలంటే శ్రమజీవులు పాలకులు కావాల్సిన అవసరం ఉందని, ఢిల్లీ, తమిళనాడు తరహా ప్రత్యామ్నాయం చూపే నాయకత్వం అవసరం అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ వేదిక అధ్యక్షుడు వేల్పూరి కామేశ్వరరావు మాట్లాడుతూ.. 70 సంవత్సరాలు దేశాన్ని పాలించిన అగ్రవర్ణాలు బీసీలకు ఏమాత్రం ప్రాతినిథ్యం కలి్పంచలేదన్నారు. ఈ కార్యక్రమంలో రుక్మోద్దీన్, చెన్నోజు శ్రీనివాసులు, బర్మాల సత్యనారాయణ, పాండురంగం, జి.రాజు, వలిజాల యాదయ్య పాల్గొన్నారు. -
నిర్దిష్ట చర్చ లేకుండా చట్టాలా!?
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో చట్టాలను రూపొందిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టాల రూపకల్పన ప్రక్రియ సక్రమంగా సాగడం లేదని చెప్పారు. పార్లమెంట్లో నిర్దిష్ట చర్చ జరగకుండానే చట్టాలు రూపొందుతున్నాయని పేర్కొన్నారు. దీనివల్ల వాటిలో స్పష్టత లేకుండా పోతోందని తెలిపారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఢిల్లీలో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడారు. రాజ్యాంగ సవరణ బిల్లులపై, అవి ప్రజలపై చూపించే ప్రభావంపై గతంలో పార్లమెంట్లో ఎన్నో చర్చలు, సంవాదాలు జరిగేవని గుర్తుచేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదని పేర్కొన్నారు. న్యాయ పరిజ్ఞానం కలిగిన వారు చట్టసభలో లేకపోవడంవల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందన్నారు. పార్లమెంట్లో చట్టాలను రూపొందించే సమయంలో విస్తృతమైన చర్చ జరిగితే కోర్టులు వాటి ఉద్దేశాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటాయని, తద్వారా న్యాయ వివాదాలు తగ్గుతాయని సూచించారు. తొలి పార్లమెంట్లో చాలామంది న్యాయవాదులు ఉన్నారు. మహత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, బాబూ రాజేంద్ర ప్రసాద్ తదితర నేతలు న్యాయవాదులే. న్యాయవాదులు తమ జ్ఞానాన్ని, అనుభవాన్ని దేశానికి అందించాలి’’ అని జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాల నిరసనల కారణంగా చర్చ లేకుండానే కీలకమైన బిల్లులను ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
రాష్ట్రాలకు ‘ఓబీసీ జాబితా’ అధికారాలు
న్యూఢిల్లీ: ఇతర వెనుకబడిన కులాల(ఓబీసీ) జాబితాలో మార్పులు/చేర్పులకు సంబంధించిన హక్కులను మళ్లీ రాష్ట్రాలకు కట్టబెట్టేందుకు మోదీ సర్కార్ సిద్ధమైంది. అందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఓకే చెప్పిందని విశ్వసనీయ వర్గాలు బుధవారం వెల్లడించాయి. త్వరలో ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన వర్గాల(ఎస్ఈబీసీ)లను గుర్తించి వారిని ఓబీసీ జాబితాలో చేర్చే హక్కులు ప్రస్తుతం రాష్ట్రాలకు లేవని గతంలో సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు చెప్పడం తెల్సిందే. అంతకుపూర్వం రాష్ట్రాలకు ఈ హక్కులు ఉండేవి. అయితే, 102వ రాజ్యాంగ సవరణ తర్వాత రాష్ట్రాలకు ఈ హక్కులు లేవని కోర్టు తేల్చింది. జాతీయ బీసీ కమిషన్ విధివిధానాలను ఖరారుచేస్తూ 2018నాటి రాజ్యాంగ సవరణ చట్టంలో 338బీ ఆర్టికల్‌ను చేర్చారు. ఇదే చట్టంలోని ఆర్టికల్ 342ఏ ప్రకారం ఎస్ఈబీసీలను నోటిఫై చేసే అధికారం రాష్ట్రపతికే ఉంది. ఎస్ఈబీసీ జాబితాలో మార్పులు చేసే అధికారం పార్లమెంట్‌కు మాత్రమే ఉందంటూ మే ఐదున సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. కొత్తగా మరాఠాలకు కోటా ఇస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చెల్లదంటూ, 1992నాటి ‘మండల్’ తీర్పును విస్తృత ధర్మాసనానికి సమీక్షకోసం పంపలేమంటూ జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జీల ధర్మాసనం మే ఐదున సంచలన తీర్పు వెలువరించడం తెల్సిందే. ఈ తీర్పు తర్వాత రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత మొదలైంది. సమైక్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ తమ నుంచి కేంద్రం అధికారాలను లాగేసుకుందని రాష్ట్రాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. అందుకే మళ్లీ రాష్ట్రాలకు ఓబీసీ జాబితాలో మార్పులు చేసే అధికారాలు అప్పజెప్పే బిల్లుకు కేబినెట్ ఓకే చెప్పిందని సమాచారం. మరో ఐదేళ్లు సమగ్ర శిక్షా పథకం పాఠశాల విద్యకు సంబంధించిన సమగ్ర శిక్షా పథకాన్ని మరో ఐదేళ్ల పాటు కొనసాగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. అంగన్వాడీలకు శిక్షిణనిచ్చే మాస్టర్ ట్రెయినర్లకు శిక్షణనివ్వడం, విద్యార్థినుల హాస్టళ్లలో శానిటరీ ప్యాడ్ మెషీన్ల ఏర్పాటు, సీనియర్ సెకండరీ స్కూళ్లలో కొత్త సబ్జెక్టులను నేర్పించడం, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 12వ తరగతి వరకూ విద్యాబోధన, తదితరాలను సమగ్ర శిక్షా పథకంలో భాగంగా అమలుచేయనున్నారు. మరో రెండేళ్లు ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులు 389 పోక్సో కోర్టులుసహా దేశవ్యాప్తంగా 1,023 ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులను మరో రెండేళ్లపాటు కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది. 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ నిర్ణయాన్ని అమల్లోకి తెస్తామని మంత్రి అనురాగ్ ఠాకూర్ కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు. కోర్టుల నిర్వహణకు కేంద్రం తన వాటాగా రూ.971.70 కోట్లు ఖర్చుచేయనుంది. ‘నిర్భయ’ నిధి నుంచి కేంద్రం తన వాటా నిధులను అందజేయనుంది. -
‘రిజర్వేషన్’ తీర్పుపై రివ్యూ పిటిషన్
న్యూఢిల్లీ: సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు(ఎస్ఈబీసీ) రిజర్వేషన్లు కల్పించడానికి సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం రివ్యూ పిటిషన్ వేసింది. 102వ రాజ్యాంగ సవరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ తీర్పుతో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించే రాష్ట్రాల హక్కుకు విఘాతం కలుగుతోందని పేర్కొంది. ఆ సవరణ ద్వారా పొందుపర్చిన రెండు నిబంధనలు దేశ సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కాదని కేంద్రం ఆ పిటిషన్లో పేర్కొంది. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్ని మే 5న జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం తోసిపుచ్చిన విషయం తెలిసిందే. అలాగే, రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ 1992లో సుప్రీంకోర్టు ఇచ్చిన ‘మండల్’తీర్పును విస్తృత ధర్మాసనానికి నివేదించాలన్న అభ్యర్థనను కూడా కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. రివ్యూ పిటిషన్‌పై బహిరంగ కోర్టులోనే విచారణ జరగాలని, దీనిపై తీర్పు వెలువడే వరకు గత తీర్పులోని పలు అంశాలపై స్టే విధించాలని కేంద్రం కోరింది. గత తీర్పులో ఆర్టికల్ 342ఏను ధర్మాసనం సమర్ధిస్తూనే.. ఎస్ఈబీసీలను గుర్తించే విషయంలో రాష్ట్రాలకు ఉన్న హక్కును తప్పుగా అర్థం చేసుకుందని రివ్యూ పిటిషన్లో కేంద్రం పేర్కొంది. 342ఏతో పాటు రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపర్చిన ఇతర నిబంధనలపై తీర్పు వెలిబుచ్చిన ఆదేశాలపై స్టే విధించాలని కేంద్రం తన రివ్యూ పిటిషన్లో కోరింది. -
102వ సవరణ రాష్ట్రాలకు ఆటంకం కాదు
సాక్షి, న్యూఢిల్లీ: 102వ రాజ్యాంగ సవరణ ద్వారా సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల(ఎస్ఈబీసీ)కు రిజర్వేషన్లు ఇచ్చే అధికారాన్ని రాష్ట్రాలు కోల్పోలేదని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. 102వ రాజ్యాంగ సవరణ ద్వారా వెనుకబడిన కులాల జాతీయ కమిషన్(ఎన్సీబీసీ) అధికారాల్లో స్పష్టత, ఎస్ఈబీసీ జాబితా మార్చే అధికారం పార్లమెంట్‌కు దఖలు పడిందని ఈ సందర్భంగా కోర్టుకు వివరించారు. ఎన్ఈబీసీ విషయంలో రాష్ట్రాలకు స్వతంత్ర అధికారాలు అలాగే ఉన్నాయని, ఈ సవరణ ద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్ 342ఏను ఏ మాత్రం మార్చలేదన్నది తన అభిప్రాయమని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి ఆయన నివేదించారు. ‘102వ సవరణ ఫలితంగా రాష్ట్రాలకున్న అధికారాలను లాగేసుకునే ప్రయత్నం జరిగిందన్న వాదన సరికాదు. ఆర్టికల్స్ 15(4), 16(4) ప్రకారం వెనుకబడిన వర్గాలను గుర్తించే అధికారాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికీ ఉన్నాయి’అని చెప్పారు. ‘ప్రస్తుత విషయానికొస్తే, మరాఠాకు రిజర్వేషన్లు కల్పించడాన్ని ఎన్సీబీసీ వ్యతిరేకించింది. మరాఠాలు వెనుకబడిన తరగతికి చెందిన వారు కాదనేది కేంద్రం అభిప్రాయం. కానీ, రాష్ట్రం తన సొంత వైఖరి ఆవలంబించవచ్చు’అని వివరించారు. మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను విచారించిన ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్లున్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం.. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించరాదంటూ 1992 నాటి ఇందిరా సాహ్ని కేసు తీర్పును పునఃసమీక్షించేందుకు విస్తృత ధర్మాసనానికి ఈ కేసును బదిలీ చేసే విషయాన్ని పరిశీలించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు కేంద్ర రిజర్వేషన్ జాబితానే ప్రామాణికంగా తీసుకుంటారే తప్ప, రాష్ట్ర జాబితా కాదని తెలిపారు. తదుపరి వాదనలు సోమవారం వింటామని ధర్మాసనం పేర్కొంది. సోమవారం సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించనున్నారు. -
తమిళుల ఆకాంక్షలు నెరవేర్చండి
న్యూఢిల్లీ: శ్రీలంకలో మైనార్టీ వర్గమైన తమిళ ప్రజలకు మరిన్ని పాలనాధికారాలు కల్పించేందుకు ఉద్దేశించిన 13వ రాజ్యాంగ సవరణను అమలు చేయాలని శ్రీలంక ప్రధాని మహీందా రాజపక్సకు భారత ప్రధాని మోదీ సూచించారు. తమిళులు సమానత్వం, న్యాయం, శాంతి, గౌరవం కోరుకుంటున్నారని, వారి ఆకాంక్షలను నెరవేర్చాలని మోదీ చెప్పారు. మోదీ, రాజపక్స శనివారం వర్చువల్ ద్వైపాక్షిక సదస్సులో పాల్గొన్నారు. తమిళులకు అధికారాలను బదిలీ చేయాల్సిన అవసరాన్ని మోదీ ప్రస్తావించినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. లంకలో శాంతి, తమిళ వర్గంతో సయోధ్య కోసం 13వ రాజ్యాంగ సవరణను అమలు చేయాలని మోదీ పేర్కొన్నారు. 1987లో ఇండో–శ్రీలంక ఒప్పందం తర్వాత 13వ రాజ్యాంగ సవరణ జరిగింది. అయితే, ఇది ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. ద్వైపాక్షిక సదస్సులో మోదీ, రాజపక్స పలు కీలక అంశాలపై చర్చించుకున్నారు. రక్షణ, వ్యాపార, వాణిజ్య రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. లంకతో బౌద్ధపరమైన సంబంధాలను ప్రోత్సహించడానికి 15 మిలియన్ డాలర్ల సాయం అందించనున్నట్లు ఈ సందర్భంగా మోదీ ప్రకటించారు. శ్రీలంకలో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మహీందా రాజపక్స నేతృత్వంలోని శ్రీలంక పీపుల్స్ ఫ్రంట్ విజయం సాధించడం ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి దోహదపడుతుందని మోదీ అన్నారు. -
‘ఇండియా’ కాదు.. భారత్!
న్యూఢిల్లీ: రాజ్యాంగ సవరణ ద్వారా ఇండియా అన్న పేరు స్థానంలో భారత్ లేదా హిందుస్తాన్ అన్న పదం వాడేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు జూన్ 2వ తేదీన విచారించనుంది. ఈ పేరు మార్పు వల్ల మన జాతీయతపై గర్వంగా అనుభూతి చెందవచ్చునని, పరాయిపాలనను పౌరులు మరిచిపోయేలా చేస్తుందని ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. పేరు మార్పునకు సంబంధించి కేంద్రం రాజ్యాంగంలోని ఒకటో ఆర్టికల్‌లో మార్పులు చేయాలని కోరారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే అందుబాటులో లేకపోవడంతో విచారణ జూన్ 2వ తేదీకి వాయిదా పడింది. -
2024 తర్వాతా పుతినే అధ్యక్షుడు
మాస్కో: రష్యా అధ్యక్షుడిగా మరింత కాలం కొనసాగేందుకు వ్లాదిమిర్ పుతిన్ మార్గాన్ని సుగమం చేసుకున్నారు. పుతిన్ ప్రస్తుత అధ్యక్ష పదవీ కాలం 2024లో ముగియనుంది. ఆ తర్వాతా మరో 12ఏళ్లు తనే అధ్యక్షుడిగా కొనసాగించేందుకు వీలుగా చేసిన రాజ్యాంగ సవరణలను రష్యా పార్లమెంట్ బుధవారం ఆమోదించింది. దిగువ సభ ‘ద స్టేట్ డ్యూమా’ రాజ్యాంగంలో చేసిన పలు సవరణలకు ఓకే చెప్పింది. ఈ సవరణలకు 383 అనుకూల ఓట్లు లభించగా ఏ ఒక్క పార్లమెంటు సభ్యుడు వ్యతిరేకించకపోవడం గమనార్హం. కాకపోతే 43 మంది సభకు దూరంగా ఉన్నారు. అనంతరం కొన్ని గంటల వ్యవధిలోనే ఈ సవరణలు అన్నింటికీ ఎగువ సభ ఫెడరేషన్ కౌన్సిల్ ఆమోద ముద్ర వేసింది. ఏప్రిల్ 22న దేశవ్యాప్తంగా ఈ సవరణలపై ఓటింగ్ జరగనుంది. అంతకంటే ముందు రష్యా రాజ్యాంగ న్యాయస్థానం ఈ సవరణలను సమీక్షించనుంది. మాజీ కేజీబీ అధికారి అయిన వ్లాదిమిర్ పుతిన్ 20 ఏళ్లుగా రష్యా రాజకీయాల్లో ఆధిపత్యం కొనసాగిస్తుండటం తెల్సిందే. -
ఆర్టికల్ 370 రద్దుపై విస్తృత ధర్మాసనానికి నో
న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి రాజ్యాంగబద్ధతపై విచారించేందుకు ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం కావాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. విస్తృత ధర్మాసనానికి ఇవ్వాల్సిన కారణమేమీ కనబడటం లేదని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌ను పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్, జమ్మూ కశ్మీర్ హైకోర్ట్ బార్ అసోసియేషన్లు కలసి దాఖలుచేశాయి. -
తమిళుల సమస్యలను పరిష్కరించండి
న్యూఢిల్లీ: శ్రీలంకలోని తమిళుల సమస్యలను పరిష్కరించాలని, వారి హక్కుల కోసం అక్కడి రాజ్యాంగంలో ఉద్దేశించిన నిబంధనలను అమలు చేయాలని శ్రీలంక ప్రధాని మహిందా రాజపక్సను ప్రధాని మోదీ కోరారు. చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని, తమిళుల సయోధ్య ప్రక్రియను అమలు చేయాలని కోరారు. ఇందుకోసం శ్రీలంక రాజ్యాంగంలోని 13వ సవరణను అమలుచేయాలని తెలిపారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా భారత్‌కు చేరుకున్న రాజపక్స శనివారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. శ్రీలంకలో తమిళుల జీవన ప్రమాణాల పెంపు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం, మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపరచుకోవడం వంటి పలు అంశాలపై ఇరువురు నేతలు విస్తృ్తత స్థాయి చర్చలు జరిపారు. శ్రీలంకలో తమిళుల సమస్యల పరిష్కారానికి కొలంబో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. మత్స్యకారుల సమస్యలపై మానవతా కోణంలో స్పందించాలని ఇరుదేశాలు నిర్ణయించాయని వెల్లడించారు. ఉగ్రవాదంపై ఉమ్మడిగా పోరాడాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడటంలో సహకారం అందించినందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి రాజపక్స కృతజ్ఞతలు తెలిపారు. -
పుతిన్.. ఎన్నటికీ రష్యాధిపతే!
మాస్కో: రష్యాలో రెండు దశాబ్దాలుగా అప్రతిహతంగా సాగుతున్న తన అధికారాన్ని ఇకపైనా నిరాటంకంగా కొనసాగించే దిశగా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా తాజాగా పలు రాజ్యాంగ సంస్కరణలను ఆయన ప్రతిపాదించారు. పార్లమెంటు, కేబినెట్ అధికారాలను విస్తృతపరచాల్సి ఉందని బుధవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని ఈ మేరకు సవరించాల్సి ఉందన్నారు. 2024తో దేశాధ్యక్షుడిగా పుతిన్ పదవీకాలం ముగియనుండటంతో... ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పార్లమెంటు పాత్ర పెరగాలి: ప్రధానమంత్రిని, కేబినెట్‌ను ఎంపిక చేసే అధికారాన్ని పార్లమెంట్‌కు ఇవ్వాలని పుతిన్ తాజాగా ప్రతిపాదించారు. ప్రస్తుతం ఆ అధికారం అధ్యక్షుడి చేతిలో ఉంది. ‘ఆ అధికారాలను ఇవ్వడం ద్వారా పార్లమెంటరీ పార్టీలు, పార్లమెంట్ పాత్ర మరింత పెరుగుతుంది. ప్రధాన మంత్రి, కేబినెట్ మంత్రుల అధికారం, స్వతంత్రత కూడా పెరుగుతాయి’ అని ఆ ప్రసంగంలో పుతిన్ స్పష్టంచేశారు. కాకపోతే ఇక్కడో చిన్న మెలిక పెట్టారాయన. ‘‘అలాగని పార్లమెంటరీ పాలన విధానం గొప్పదని చెప్పలేం. పార్లమెంటరీ వ్యవస్థలోకి వెళ్తే దేశ సుస్థిరతకు ప్రమాదం కలిగే అవకాశముంది. ‘ప్రధానిని, కేబినెట్‌ను రద్దు చేసే అధికారం అధ్యక్షుడికే ఉండాలి. రక్షణ రంగంలోని అత్యున్నత అధికారులను నియమించే అధికారం సైతం దేశ అధ్యక్షుడికే ఉండాలి. రష్యా మిలటరీ, ఇతర దర్యాప్తు సంస్థల ఇన్చార్జిగా కూడా అధ్యక్షుడే ఉండాలి’ అని పుతిన్ స్పష్టం చేశారు. ప్రాంతీయ గవర్నర్లు సభ్యులుగా ఉన్న స్టేట్ కౌన్సిల్ అధికారాలను కూడా రాజ్యాంగంలో నిర్దిష్టంగా పేర్కొనాలని సూచించారాయన. ‘ఎక్కువమంది పిల్లలున్న వారికి ప్రభుత్వ సబ్సిడీలను పెంచాలి. తక్కువ ఆదాయం వల్లే జనం ఎక్కువ మంది పిల్లలు వద్దనుకుంటున్నారు. వారి ఆదాయాన్ని పెంచేలా పరిశ్రమలు తేవాలి’ అని చెప్పారాయన. రష్యా ప్రస్తుత జనాభా 14.7 కోట్లు. ప్రతిపాదిత సంస్కరణలను దేశవ్యాప్త ఓటింగ్‌కు పెట్టాలని పుతిన్ కోరారు. మెద్వదేవ్ రాజీనామా పుతిన్ ప్రసంగం అనంతరం, దేశ ప్రధాని దిమిత్రి మెద్వదేవ్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వ వ్యవస్థలో పుతిన్ తీసుకురాదలచిన మార్పులను సానుకూలపర్చేందుకు వీలుగా తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన చెప్పారు. మెద్వదేవ్ రాజీనామాను పుతిన్ ఆమోదించారు. ఆయన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం, ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉప దళపతిగా మెద్వదేవ్‌ను, తదుపరి ప్రధానిగా మైఖేల్ మిషుస్తిన్‌ను నియమించారు. ఆ వెంటనే, ఈ నియామకాల్ని పార్లమెంట్ ఆమోదించింది. కాగా, మెద్వదేవ్ పనితీరుపై గతంలో పుతిన్ పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. పుతిన్ ఆలోచన ఇదే!! రష్యా రాజ్యాంగం వరసగా రెండుసార్లు మాత్రమే అధ్యక్షుడిగా ఉండటానికి అవకాశం కల్పిస్తోంది. 2000వ సంవత్సరంలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన పుతిన్... నిబంధనల ప్రకారం నాలుగేళ్లు చొప్పున 2008 వరకూ రెండుసార్లు అధ్యక్షుడిగా కొనసాగారు. ఆ తరవాత ప్రధాని పదవిని చేపట్టారు. ప్రధానిగా ఉన్న తన అనుచరుడు మెద్వదేవ్‌ను అధ్యక్షుడిని చేశారు. తన పదవీకాలంలో మెద్వదేవ్... అధ్యక్ష పదవీ కాలాన్ని నాలుగేళ్ల నుంచి ఆరేళ్లకు పెంచేశారు. అంతేకాకుండా 2012లో పుతిన్ కోసం మెద్వదేవ్ తన పదవి నుంచి దిగిపోయారు. అప్పుడు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పుతిన్ 2018లో మొదటి విడతను పూర్తి చేసుకుని, రెండోవిడత కూడా కొనసాగుతున్నారు. 2024 వరకూ పదవీ కాలం ఉంది. గ్యాప్ కోసం 2024లో మళ్లీ దిగి... ప్రధానిగా బాధ్యతలు చేపడతారని, అప్పుడు కూడా తన చేతిలో అధికారమంతా ఉండేందుకే పుతిన్ ఈ ప్రతిపాదన చేశారని విశ్లేషకుల మాట. తన స్థానంలో అధ్యక్షుడిగా వచ్చే వ్యక్తి .. మళ్లీ తనకే పగ్గాలు అప్పగించేలా చేయడమే పుతిన్ వ్యూహమని చెబుతున్నారు. జోసెఫ్ స్టాలిన్ తరువాత అత్యధిక కాలం దేశ కీలక పదవిలో కొనసాగిన ఘనత పుతిన్‌దే కావడం విశేషం. రష్యా కొత్త ప్రధాని మైఖేల్ మిషుస్తిన్ -
జాతీయ రైతు కమిషన్ ఏర్పాటు చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: రైతు ప్రయోజనాల పరిరక్షణ, సంక్షేమం కోసం జాతీయ రైతు కమిషన్ ఏర్పాటుకు రాజ్యాంగాన్ని సవరించాలని ప్రతిపాదిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి శుక్రవారం రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. రైతు ప్రతినిధులతో ఏర్పాటు చేసే ఈ కమిషన్ రైతాంగ సంక్షేమం, సంరక్షణ కోసం చేసే సిఫార్సులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సక్రమంగా అమలు చేసేలా పర్యవేక్షించే అధికారం కమిషన్‌కు ఉంటుందన్నారు. దీంతో పాటు ప్రాక్టీసు చేసే న్యాయవాదుల సామాజిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం తగిన పథకాలకు రూపకల్పన చేయడం, న్యాయవాదుల సామాజిక భద్రత ఫండ్‌ను నెలకొల్పేందుకు వీలు కల్పించేలా 1961 నాటి అడ్వొకేట్స్ చట్టాన్ని సవరించాలని కోరుతూ రెండో బిల్లును ప్రవేశపెట్టారు. అలాగే మహిళల నుంచి గొలుసులు, ఆభరణాలు, పర్సులు ఇతర విలువైన వస్తువులను దొంగిలించే చర్యను భారతీయ శిక్షా స్మృతిలో విస్పష్టమైన నేరంగా నిర్వచిస్తూ ఈ నేరానికి పాల్పడిన వారికి 5 నుంచి 10 ఏళ్లపాటు కఠిన జైలు శిక్ష విధించేలా 1960 నాటి భారతీయ శిక్షా స్మృతిని సవరించాలని ప్రతిపాదిస్తూ మూడో బిల్లును ఆయన ప్రవేశపెట్టారు. -
వచ్చే 3నెలల్లో 50వేల ఉద్యోగాలు భర్తీ..
శ్రీనగర్/న్యూఢిల్లీ: వచ్చే మూడు నెలల్లో జమ్మూకశ్మీర్‌లో 50వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ ప్రకటించారు. రాష్ట్రంలో ఉద్రిక్తతలు, జననష్టం నివారణకే నిషేధాజ్ఞలు విధించి, కొనసాగిస్తున్నామన్నారు. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసిన అనంతరం జరిగిన మొదటి మీడియా సమావేశంలో గవర్నర్ మాట్లాడారు. ‘వచ్చే 3నెలల్లో రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నాం. రాష్ట్ర చరిత్రలో∙ఇది అతిపెద్ద రిక్రూట్మెంట్. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని యువతను కోరుతున్నా. రాష్ట్రానికి సంబంధించి కేంద్రం త్వరలోనే భారీ ప్రకటన చేసే వీలుంది’ అని చెప్పారు. ‘జాతి వ్యతిరేక శక్తులు ఇంటర్నెట్ను చాలా తేలిగ్గా స్వార్థానికి ఉపయోగించుకుంటాయి అందుకే సేవలను పునరుద్ధరించేందుకు మరికొంత సమయం పడుతుంది’ అని అన్నారు. ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా , మెహబూబా ముఫ్తీ తదితర రాజకీయ పార్టీల నేతల నిర్బంధంపై అడిగిన ప్రశ్నకు ఆయన.. ‘వాళ్లు పెద్ద నేతలవ్వాలని మీరు కోరుకోవడం లేదా? ఇప్పటి వరకు నేను 30 పర్యాయాలు జైలు కెళ్లా. ఎమర్జెన్సీ సమయంలో ఆరు నెలలు జైలు జీవితం గడిపా. వాళ్లను అక్కడే ఉండనివ్వండి. ఎంత ఎక్కువ కాలం జైలులో ఉంటే ఎన్నికలప్పుడు అంతపెద్ద నాయకులవుతారు’ అని వ్యాఖ్యానించారు. ‘రాష్ట్ర ప్రజలపై బయటి నుంచి ఎటువంటి ఒత్తిడులు ఉండబోవని హామీ ఇస్తున్నా. వారి గుర్తింపు, మతం, సంస్కృతులను పరిరక్షిస్తాం’ అని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం ప్రాణనష్టం నివారించేందుకు ముందు జాగ్రత్తగా రాష్ట్రంలో నిషేధాజ్ఞలు విధించామని, ఫలితంగా భద్రతా బలగాల చర్యల్లో ఒక్కరు కూడా చనిపోలేదన్నారు. ఇంటర్నెట్ చాలా ప్రమాదకరం ‘ఇంటర్నెట్ చాలా ప్రమాదకరమైంది. మనకు చాలా తక్కువగా ఇది ఉపయోగపడుతోంది. కానీ, భారత్ వ్యతిరేక విషప్రచారానికి, కశ్మీర్‌పై పుకార్ల వ్యాప్తికి ఉగ్రవాదులకు, పాక్‌కు ఇది సులువైన అస్త్రంగా మారింది. ఇంటర్నెట్ సేవలను క్రమేణా పునరుద్ధరిస్తాం’ అని తెలిపారు. రాహుల్ రాజకీయ బాలుడు కశ్మీర్లో హింస కొనసాగుతోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడంపై గవర్నర్ మాలిక్ ఎద్దేవా చేశారు. గొప్ప కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ తీరు రాజకీయాల్లో బాలుడి మాదిరిగా ఉందని వ్యాఖ్యానించారు. గత వారం రాహుల్ చేసిన ప్రకటనను వాడుకుని పాక్ ఐరాసలో భారత్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసిందన్నారు. ముందుగా కశ్మీర్‌పై కాంగ్రెస్ పార్టీ వైఖరిని వెల్లడించాలి.ఎన్నికల సమయంలో ఆర్టికల్ 370ను సమర్థించే కాంగ్రెస్ నేతలను ప్రజలే చెప్పులతో కొడతారు’ అని పేర్కొన్నారు. ‘రాహులే నాయకుడైతే పార్లమెంట్లో కాంగ్రెస్ నేత(ఆధిర్ రంజన్ చౌధురి) కశ్మీర్‌పై ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడినప్పుడే ఆపి తగిన బుద్ధి చెప్పి ఉండేవాడు’ అని గవర్నర్ అన్నారు. రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ కశ్మీర్ స్వతంత్రప్రతిపత్తిని నిర్వీర్యం చేసే ఆర్టికల్ 370 రద్దుని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణను బుధవారం చేపట్టిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పరిశీలనకు పంపింది. ఈ పిటిషన్ల విచారణకు అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని సుప్రీం బెంచ్ వెల్లడించింది. అక్టోబర్ మొదటి వారంలో రాజ్యాంగధర్మాసనం పిటిషన్లను విచారిస్తుందని స్పష్టం చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా రాజ్యాంగంలోని ఒక ఆర్టికల్‌ను ఎలా రద్దు చేస్తారంటూ దాఖలైన పిటిషన్లకు సంబంధించి కేంద్రానికి, జమ్ము కశ్మీర్ పాలనా యంత్రాంగానికి నోటీసులు పంపింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కశ్మీర్‌పై జీవోఎం రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఏర్పాటు చేసిన కేంద్రం కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాంత సమగ్రాభివృద్ధికి ప్రయత్నాలు ప్రారంభించింది. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్– 370 రద్దుతోపాటు రాష్ట్రాన్ని మూడు కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూ, కశ్మీర్, లదాఖ్‌గా విభజించడం తెల్సిందే. ఈ ప్రాంతాల అభివృద్ధితోపాటు, సామాజిక, ఆర్థిక సమస్యలను అధ్యయనం చేసేందుకు కేంద్రం మంత్రుల బృందాన్ని (జీవోఎం) నియమించింది. అక్టోబర్ 31వ తేదీ నుంచి పని ప్రారంభించే ఈ కమిటీలో న్యాయ, సామాజిక న్యాయం, సాధికారిత, వ్యవసాయ, పెట్రోలియం శాఖల మంత్రులు రవిశంకర్, గహ్లోత్, నరేంద్ర తోమర్, ప్రధాన్‌తోపాటు ప్రధాని కార్యాలయంలో మంత్రి జితేంద్ర సభ్యులు. ఈ బృందం ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం వంటి వాటిపై అధ్యయనం చేయనుంది. కేంద్ర పాలిత ప్రాంతాల అభివృద్ధి, ఆర్థిక, సామాజిక పరంగా తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది. ఈ బృందం తొలి సమావేశం సెప్టెంబర్‌లో ఉంటుంది. ‘కశ్మీర్’ అంతర్గత అంశమే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కశ్మీర్లో హింసను పాకిస్థాన్ ప్రేరేపిస్తోందని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కశ్మీర్ ఉగ్రవాదుల దుశ్చర్యల వెనుక పాక్ హస్తం ఉందన్నారు. కశ్మీర్ అంశం ముమ్మాటికీ భారతదేశ అంతర్గత వ్యవహారమని తేల్చిచెప్పారు. ఈ మేరకు రాహుల్ బుధవారం ట్విట్టర్లో ట్వీట్ చేశారు. చాలా విషయాల్లో ప్రభుత్వ చర్యలతో తాను విభేదించినప్పటికీ కశ్మీర్ అంశం భారత అంతర్గత వ్యవహారం అనడంలో తాను స్పష్టతతో ఉన్నట్లు తెలిపారు. ఇందులో జోక్యం చేసుకోవడానికి పాకిస్థాన్‌కు, ఇతర దేశాలకు ఎలాంటి హక్కు లేదన్నారు. అయితే, కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్ ప్రవేశపెట్టిన పిటిషన్లో రాహుల్ పేరును అనవసరంగా లాగారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రణదీప్ సూర్జేవాలా విమర్శించారు. పాక్ తన అసత్య ప్రచారానికి అండగా రాహుల్ పేరును వాడుకుంటోందని దుయ్యబట్టారు. రాహుల్ క్షమాపణ చెప్పాలి: జవదేకర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీరుపై జవదేకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్లో హింసాకాండ గురించి ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశాన్ని కించపరిచేవిగా, ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్‌కు మద్దతునిచ్చేవిగా ఉన్నాయని పేర్కొన్నారు. రాహుల్, కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని జవదేకర్ బుధవారం డిమాండ్ చేశారు. కశ్మీర్లో హింస కొనసాగుతోందని, ఎంతోమంది మరణిస్తున్నారని, అత్యంత బాధ్యతారహిత రాజకీయాల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని రాహుల్ ఇటీవల వ్యాఖ్యానించడం తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై జవదేకర్ అభ్యంతరం వ్యక్తంచేశారు. పాకిస్థాన్ వాదనకు ఊతమిచ్చేలా మాట్లాడడం ఏమిటని రాహల్‌ను ప్రశ్నించారు. కశ్మీర్ వ్యవహారం భారతదేశ అంతర్గత వ్యవహారమని రాహుల్ బుధవారం ట్వీట్ చేయడంపై జవదేకర్ స్పందించారు. ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో కశ్మీర్ అంశంపై రాహుల్ యూ–టర్న్ తీసుకున్నారని చెప్పారు. అంతేగానీ స్వయంగా ఆయనలో అలాంటి అభిప్రాయమేలేదన్నారు. రాహుల్‌కు ముద్దు వయనాడ్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీకి ఒక వ్యక్తి ముద్దు పెట్టాడు. ఒక చోట జనం గుమిగూడి ఉండగా.. కారులో వెళ్తున్న రాహుల్ అక్కడ ఆగాడు. అంతలోనే డ్రైవర్ పక్క సీటులో కూర్చొని ఉన్న రాహుల్ బుగ్గపై బయటి నుంచి నీలిరంగు చొక్కా ధరించిన ఒక వ్యక్తి ముద్దు పెట్టాడు. దీంతో వెంటనే ఆ వ్యక్తిని కొందరు వెనక్కి లాగేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
జడ్జీలను పెంచండి
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టుతో పాటు అన్నిహైకోర్టుల్లో న్యాయమూర్తుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ తెలిపారు. దేశంలో న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలపై గొగోయ్ శనివారం ప్రధాని నరేంద్ర మోదీకి మూడు లేఖలు రాశారు. ఈ సందర్భంగా హైకోర్టుల్లో జడ్జీల పదవీవిరమణ వయసును 62 నుంచి 65 ఏళ్లకు పెంచాలని కోరారు. అలాగే గుట్టలుగుట్టలుగా పేరుకుపోతున్న కేసుల్ని పరిష్కరించేందుకు పదవీవిరమణ చేసిన జడ్జీలను నిర్ణీతకాలానికి మళ్లీ విధుల్లో తీసుకోవాలని సూచించారు.‘సుప్రీంకోర్టులో ప్రస్తుతం 58,669 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కానీ తగినంత మంది న్యాయమూర్తులు లేకపోవడంతో ఈ కేసులను విచారించలేకపోతున్నాం. మీకు(మోదీకి) గుర్తుందనుకుంటా. 1988లో సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య 18 నుంచి 26కు చేరుకుంది. అనంతరం రెండు దశాబ్దాల తర్వాత అంటే 2009లో సీజేఐతో కలిపి జడ్జీల సంఖ్య 31కి చేరుకుంది. సుప్రీంకోర్టు తన విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని, ఇందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని మిమ్మల్ని కోరుతున్నాను. దీనివల్ల కోర్టు మెట్లు ఎక్కే ప్రజలకు నిర్ణీత సమయంలోగా న్యాయం దొరుకుతుంది’ అని లేఖలో గొగోయ్ తెలిపారు. సుప్రీం, హైకోర్టుల్లో జడ్జీల పోస్టులకు అర్హులైనవారి సంఖ్య పెరిగినప్పటికీ, అదే స్థాయిలో న్యాయమూర్తుల సంఖ్య మాత్రం పెరగలేదన్నారు. హైకోర్టుల్లో తీవ్రమైన కొరత.. హైకోర్టుల్లో జడ్జీల కొరత తీవ్రంగా వేధిస్తోందని జస్టిస్ గొగోయ్ ప్రధాని మోదీకి రాసిన తన రెండో లేఖలో తెలిపారు. ‘ప్రస్తుతం దేశంలోని అన్నిహైకోర్టుల్లో కలిపి 39 శాతం అంటే 399 జడ్జి పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలను వీలైనంత త్వరగా భర్తీ చేయాలి. శక్తివంచనలేకుండా కృషి చేస్తే తప్పించి ఈ ఖాళీలను భర్తీచేయడం సాధ్యం కాదు. అలాగే హైకోర్టుల్లో న్యాయమూర్తుల పదవీవిరమణ వయసును 62 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచాలని మిమ్మల్ని(ప్రధాని) కోరుతున్నా. ఇందుకోసం అవసరమైతే రాజ్యాంగ సవరణను చేపట్టండి. గతంలో పార్లమెంటరీ స్థాయీసంఘాలు కూడా దీన్ని సూచించాయి’ అని జస్టిస్ గొగోయ్ వెల్లడించారు. పదవీవిరమణ చేసిన సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల సేవలను వినియోగించుకునే అంశాన్ని పరిశీలించాలని ఆయన మరో లేఖలో కోరారు. నిర్ణీత కాలానికి వీరిని న్యాయమూర్తులుగా నియమించేందుకు వీలుగా రాజ్యాంగంలోని 128, 224ఏ అధికరణలకు సవరణ చేయాలని సూచించారు. దీనివల్ల అపార అనుభవం ఉన్న జడ్జీలు మరింత ఎక్కువకాలం సేవలు అందించడం వీలవుతుందని పేర్కొన్నారు. -
3 భాగాలుగా ఓబీసీ కోటా?
దేశంలో విద్య, ఉద్యోగాల్లో ఇతర వెనుకబడిన తరగతుల(ఓబీసీ)కు కేటాయించిన 27 శాతం రిజర్వేషన్ అమలులో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. దేశంలో ఓబీసీ కోటా అమలు తీరుతెన్నుల అధ్యయనానికి ఏర్పాటైన జస్టిస్ రోహిణి కమిషన్ ఓబీసీ కులాల్లో ఎవరెవరికి ఈ రిజర్వేషన్ వల్ల ఏ మేరకు లబ్ధి కలుగుతోందన్న అంశాన్ని పరిశీస్తోంది. ప్రస్తుతం ఓబీసీలో 2,633 కులాలున్నాయి. ఈ కులాలన్నిటీకీ ఉమ్మడిగా 27శాతం రిజర్వేషను అమలవుతోంది. వీటిలో కొన్ని కులాల వారు రిజర్వేషన్ వల్ల ఎక్కువ లబ్ధి పొందుతోంటే, మరికొన్ని కులాల వారికి ప్రయోజనం కలగడం లేదని కమిషన్ అభిప్రాయ పడినట్టు తెలిసింది. తేడాను దృష్టిలో పెట్టుకుని ఈ 27 శాతాన్ని మూడు భాగాలు చేయాలని, లబ్ధి స్థాయిని బట్టి ఆయా కులాలకు రిజర్వేషన్ అమలు చేయాలని కమిషన్ సిఫారసు చేయనున్నట్టు తెలిసింది. 27శాతంలో రిజర్వేషన్ వల్ల గరిష్టస్థాయిలో లబ్ధి పొందుతున్న కులాలకు 7శాతం, అసలేమీ ప్రయోజనం పొందని కులాలకు 10 శాతం, కొంత లబ్ధి కులాలకు 10శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కమిషన్ ప్రతిపాదించనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. జూలై 31లోపు నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు జస్టిస్ రోహిణి తెలిపారు. పది కులాలకే ఎక్కువ లబ్ధి ఓబీసీ జాబితాలో ఉన్న వేల కులాల్లో కేవలం 10 ఉప కులాల వారే 25 శాతం రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందుతున్నారని, 983 ఉప కులాల వారికి ఒక్క శాతం లబ్ధి కూడా చేకూరడం లేదని కమిషన్ తన సంప్రదింపుల పత్రంలో పేర్కొంది. స్వాతంత్య్రానికి పూర్వం అంటే 1931 చేపట్టిన జనాభా లెక్కల్లో ఓబీసీల గణన జరిగింది. ఆ తర్వాత ఇంత వరకు ఓబీసీల గణన జరగలేదు. ఓబీసీ జనాభాపై కచ్చితమైన లెక్కలు అందుబాటులో లేనందున రోహిణి 1931నాటి ఓబీసీ లెక్కలనే పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. సంప్రదాయకంగా రాళ్లను పాలిష్ చేసే కలైగర్లు, కత్తులు సానపట్టే సిక్లిగర్లు,సరనియాలు వంటి వృత్తిపరమైన కులాలలో పాటు అనేక వెనకబడిన కులాలకు ఓబీసీ రిజర్వేషన్ ఫలాలు ఎంత మాత్రం అందడం లేదని కమిషన్ పేర్కొంది. ‘ఈ కులాల జనాభా తక్కువేం కాదు. అయినా వారికి ఓబీసీ ప్రయోజనాలు అందడం లేదు. రాజకీయ ప్రాతినిధ్యం కూడా లేదు’అని కమిషన్ సభ్యుడు డా.జేకే బజాజ్ అన్నారు. అలాగే, ఆంధ్ర ప్రదేశ్‌లో భిక్షాటన చేసే బుద్బుదీలు, గోసాయన కులాల వారు కూడా ఓబీసీ వల్ల లాభం పొందలేకపోతున్నారని, అయితే ఈ కులాలకు చెందిన ఒకరిద్దరు ఐఐటీ వంటి సంస్థల్లో విద్యార్థులుగా కనిపిస్తున్నారని ఆయన వివరించారు. ఓబీసీ రిజర్వేషన్ వల్ల ఏ కులాలు ఎక్కువ లబ్ధి పొందాయి, ఏవి పొందలేదు అన్నది నిర్థారించడం కోసం కమిషన్ ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ సహా దేశంలోని విద్యా సంస్థలు, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో గత మూడేళ్లుగా ఈ కోటా కింద పొందిన లక్ష అడ్మిషన్లను, ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వంలో ఈ కోటా కింద పొందిన 1,30,000 ఉద్యోగాలను పరిశీలించింది. కమిషన్ ప్రతిపాదనలు అమల్లోకి రావాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. దీనిపై కేంద్ర సామాజిక న్యాయ, సాధికార శాఖ మంత్రి తావర్ చంద్ గెహ్లాట్ స్పందిస్తూ ‘ముందు కమిషన్ నివేదిక రానివ్వండి. దాన్ని అధ్యయనం చేసి ఏం చెయ్యాలో నిర్ణయిస్తాం’ అన్నారు. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే దేశంలో రాజకీయ సమీకరణాలు కూడా మారుతాయని పరిశీలకులు అంటున్నారు. ఉత్తరాదిన రాష్ట్రీయ జనతా దళ్, సమాజ్‌వాదీ పార్టీ, దక్షిణాన డీఎంకే, అన్నాడీఎంకే వంటి పార్టీలు ఓబీసీల ఓటు బ్యాంకులు కలిగి ఉన్నాయి. -
ఆ ‘సవరణ’ బిల్లు ఎవరి లబ్ధికోసం?
ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకి పరాభవం కలిగిన నేపథ్యంలో, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయంపై కలిగిన కలవరం ఫలి తంగానే అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. ఈబీసీలకు రిజర్వేషన్ రేపటి ఎన్నికలాట కోసం విప్పిన వరాలమూటే తప్ప మరేం కాదు. అడుగంటిపోయిన ఉపాధి, ఉద్యోగ అవకాశాల మధ్య అగ్రకులాలకు రిజర్వేషన్ ఎవరికీ మేలుకలిగించేది కాదు. జనాభా ప్రాతిపదికన 85 శాతం రిజర్వేషన్ కల్పిస్తే అన్ని వర్గాల, కులాలకు మేలు జరుగవచ్చు. రాజకీయ ప్రయోజనాలకై తీసుకొచ్చిన ఈ రాజ్యాంగ సవరణ ఎవరికీ లబ్ధి కలిగించదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొద్దిమంది ఎంపీలు తప్ప మిగిలిన అందరు సభ్యుల మద్దతుతో, దాదాపు ఏకగ్రీవమైన ఆమోదంతో, మన రాజ్యాంగానికి 124వ సవరణ ద్వారా కొత్త చట్టాన్ని తెచ్చింది. ఇప్పుడు ఎస్టీ, ఎస్సీ, బీసీలకు ఉన్న రిజర్వేషన్ దాదాపు 50 శాతంగా ఉండగా, ఈ కొత్త రాజ్యాంగ సవరణ ద్వారా అగ్రవర్ణాలలోని ఆర్థికంగా వెనుకబడిన (ఈబీఎస్) వారికి విద్య, ప్రభుత్వ ఉద్యోగాలు మొదలైన వాటిలో మరో 10 శాతం మందికి రిజర్వేషన్ లభిస్తుంది. అంతేకాదు, వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉన్న అగ్రవర్ణాల వారందరికీ ఈ రిజర్వేషన్ అమలవుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అనుకూలంగా ప్రభుత్వాలు వ్యవహరించడం వలన ఈ కులప్రాతిపదిక రిజర్వేషన్ల వల్ల తమకు అవకాశాలులేకుండా పోతున్నాయని అగ్రవర్ణాలు బలంగా విశ్వసిస్తున్నారు. మేధాసంపత్తి కాకుండా, కులం ఆధారంగా రిజర్వేషన్ల వలన దేశ ప్రగతి కుంటుపడుతున్నదనీ తమలో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఆ వెసులుబాటు లేకపోవడం వల్ల, తాము నష్టపోతున్నామన్న భావన అగ్రవర్ణాల్లో ఉండటంలో ఆశ్చర్యం లేదు. ఇప్పుడు ఓబీసీలకు 10 శాతం రిజర్వేషన్ వలన తమకూ విద్య, ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో వీరున్నారు. ఈ భావన, ఆశ ప్రభావమెంతో ముందు పరిశీలిద్దాం. ఈ రిజర్వేషన్ ప్రస్తుతానికి ప్రభుత్వ ఉద్యోగాలకు మాత్రమే వర్తిస్తుంది. ప్రైవేట్ సంస్థలకు వర్తించదు. అసలు వాస్తవమేమిటంటే, మొత్తం ఉద్యోగ మార్కెట్లో ప్రభుత్వ ఉద్యోగాల వాటా 3.5 శాతం మాత్రమే. ఇందులో 10 శాతం అంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల కంటే 0.35 శాతం మాత్రమే మేలు జరగవచ్చేమో! అయితే మోదీ ప్రభుత్వ హయాంలో ఈ ఉద్యోగ కల్పన దిగజారుతున్నది. నిజానికి మూడు నెలల క్రితమే విడుదల చేయవలసిన దేశ నిరుద్యోగ పరిస్థితిని మోదీ ప్రభుత్వం వెల్లడించడానికే భయపడుతోందనిపిస్తోంది. కొత్త ఉద్యోగాలు కల్పించలేకపోగా, పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి విధానం వలన దేశవ్యాప్తంగా ఉద్యోగులు చిరుద్యోగులవుతున్నారు. చిరుద్యోగులు నిరుద్యోగులయ్యారు. వీరి సంఖ్య లక్షల్లో ఉంటోంది. మన చంద్రబాబు విషయానికివస్తే బాబు వస్తే జాబు వస్తుందని చేసిన ఊకదంపుడు ప్రచారం ఆచరణలో ఉన్న జాబులు ఊడిపోవడంగా ప్రతిఫలిం చింది. కనుక రిజర్వేషన్ వల్లనే తమ నిరుద్యోగ సమస్య తీరుతుందనుకోవడం భ్రమ. ప్రధానంగా కావలసింది కోట్లలో ఉద్యోగ కల్పన. ఇది చాతగాని ప్రభుత్వాలు ఏదో గోసాయి చిట్కాల వంటి సవరణ ద్వారా ఉద్యోగ కల్పన చేస్తున్నట్లు ప్రజలను మభ్యపెట్టి ప్రయోజనం లేదు. అగ్రవర్ణ విద్యావంతులు సైతం ఆలోచించవలసిన విషయం మరొకటి. కేవలం తమ కులం ఆధారంగానే, తగిన విద్య మేధాసంపత్తి లేకపోయినా ఐఏఎస్, ఐపీఎస్ వంటి ప్రతిష్టాత్మక పరీక్షల్లో సైతం ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల వారు ప్రతిభ లేకపోయినా నెగ్గుకొస్తున్నారన్న అభిప్రాయం వీరిలో ఉంది. సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల కోసం ఒక లెక్కప్రకారం ఏటా 4,50,000 మంది ప్రయత్నిస్తుంటారు. కానీ వారిలో అంతి మంగా 1100 మంది అర్హత సాధిస్తారు. ఇలాంటి పరిస్థితిలో, ఏదో పరీక్ష రాస్తే చాలు, రిజర్వేషన్ వర్తించే విద్యార్థులకు ఉద్యోగాలు వస్తున్నాయని భావింపగలమా? అంతే కాదు. ప్రతిభ, మేధోసంపత్తులకు ఈరోజుల్లో పరీక్షలో వారు సాధించిన మార్కులే కొలబద్ద! అసలీ మార్కుల కొలబద్దే వాస్తవానికి ప్రశ్నార్థకం కూడా. ఈ మార్కుల విషయం ఆలోచిస్తే, ప్రస్తుత పరిస్థితిలో ఈ మార్కుల సాధన, ఆ విద్యార్థి కుటుంబ పరిస్థితి, చదువుకునే వెసులుబాటు, వాతావరణం, తగిన ప్రోత్సాహం, దానితో పాటు వ్యక్తిగత మేధోసంపత్తి వీటన్నింటిపై ఆధారపడి ఉంటుంది. ఈ వర్ణవ్యవస్థ దుర్మార్గం కారణంగా అంబేడ్కర్, ఎన్నో కష్టాలు, అవమానాలు స్వయంగా అనుభవించవలసి వచ్చింది. తన గురువు గారి ప్రోత్సాహం, ఆయన సమకూర్చిన సాయం, తన వ్యక్తిగత ప్రతిభ వలన ఆయన ఇంగ్లండ్, అమెరికా, దేశాలకు విద్యార్జన కోసం వెళ్లి రెండు డాక్టరేట్ డిగ్రీలు తీసుకుని భారతదేశం తిరిగొచ్చారు. కానీ మనదేశం తిరిగి వచ్చిన తర్వాత మామూలు కిరాయిబండి తోలుకునే వ్యక్తి కూడా, అంబేడ్కర్‌ని తన బండి ఎక్కించుకోలేదు. కారణం దళితుడి నీడ సైతం అంటరానిదే అనే తరతరాల భావదాస్యంలో ఉన్నవాడే ఆ వ్యక్తి కూడా. అంబేడ్కర్‌కు దాహం తీర్చుకోవడానికి మంచినీళ్లు ఇచ్చేందుకు సైతం మిగిలిన కులాలవారెవరూ సిద్ధపడలేదు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, పార్సీ మతస్థులు కూడా ఎవరూ అంబేడ్కర్‌కు ఒక గది ఇచ్చేందుకు అంగీకరించలేదు. చివరకు తన ఆఫీసులో తన కింద పనిచేసే ఫ్యూన్ ఆఫీసు ఫైల్ సైతం అంబేడ్కర్ చేతికి అందించేవాడు కాడట. మైలపడిపోతామన్న మూఢవిశ్వాసమే కారణం. అందుకే అంబేడ్కర్ ఈ వర్ణ వ్యవస్థ అంతమయితే గానీ మన దేశానికి విముక్తి ఉండదని ‘కులనిర్మూలన’ అనే గొప్ప గ్రంథం రచించారు. కానీ మన సామాజిక జీవనంలో నేటికీ ఈ కులోన్మాద వికృత రూపం కనబడుతున్నది. భారతదేశం ప్రపంచంలోనే 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా పురోగమించినా, నేటికీ సామాజిక జీవనంలో, ఈ కులవ్యవస్థ అలాగే ఉంది. అందుకే సామాజిక న్యాయ సాధన అవసరం నేటికీ ఉంది. నిజానికి దళితుల ఆర్థికపరిస్థితి చెప్పనక్కరలేదు. నేడు విద్య, ఉద్యోగ, రాజకీయ పదవుల్లో ఈ మేరకైనా దళితుల అభివృద్ధి సాధ్యమైందంటే అందుకు రిజర్వేషన్లే ప్రధాన కారణం. గతంతో పోలిస్తే చాలామంది దళితులు మధ్యతరగతి స్థాయికి వచ్చారు. కానీ ఇంకా ఎంతటి వ్యత్యాసం ఉందంటే పారిశ్రామికవేత్తలుగా ఎదిగిన దళిత, గిరిజనులు 0.4 శాతం కూడా లేరు. కనుక ఆర్థిక సమానత్వం పేరుతో, సామాజిక అన్యాయాన్ని తోసిరాజనడం సబబు కాదు. ఈ స్థితిలో కొత్తగా వచ్చిన ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా ప్రభుత్వం తెచ్చిన 10 శాతం రిజర్వేషన్ కల్పించే చట్టాన్ని కూడా స్థూలంగా పరిశీలిద్దాం. బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ, వెలమ, వైశ్య, క్షత్రియ ఇత్యాది అగ్రకులాలు జనాభాలో 23 శాతం మించి ఉండరు. మామూలుగా ఈ చట్టం చేయబోయేముందే అలాంటి కులాల గణాంకాలు, వారి ఆర్థిక, సామాజిక పరిస్థితులు అన్నింటినీ సాధికారంగా ప్రభుత్వాలు ఇచ్చి ఉండాల్సింది. నిరుద్యోగ పరిస్థితిపై అంచనాను కేంద్రంలో మోదీ నేతృత్వంలో ఉన్న బీజేపీ (ఎన్డీఏ) ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దాచి ఉంచింది. కొత్తగా దళితులపై మైనారిటీలపై గోరక్షణ పేరుతోనో, మరో వంకతోనో బీజేపీ, వీహెచ్‌పీ వంటి మతతత్వ సంస్థల మూకదాడులు పెరిగిపోయాయి. దానికితోడు సాధారణ ప్రజల జీవన ప్రమాణాలు తరి గిపోతున్నాయి. మోదీ డబ్బా వాయించుకున్న అవినీతి, అధికార కేంద్రీకరణ మరింతగా పెరిగిపోతోంది. మన రాజ్యాంగ వ్యవస్థలు చివరకు సర్వోన్నత న్యాయవ్యవస్థ సైతం ఈ విలువలు దిగజారుతున్న ఆరోపణలకు గురవుతున్నాయి. అన్నిటికీ మించి ఒకే దేశం, ఒకే జాతి, ఒకే పన్నుల విధానం, ఒకేసారి ఎన్నికలు, రాష్ట్రాల్లో, కేంద్రంలో ఒకే పార్టీ పాలన వంటి ప్రచారంతో ప్రజల్లో మోదీ ప్రతిష్ట మసకబారుతోంది. అందుకు ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే నిదర్శనం. దీనిపై తమ విజయంపై ఆందోళన చెందుతున్న బీజేపీ నేతలు, అగ్రవర్ణాల ఓటర్లను మరింతగా ఆకర్షించడమే మార్గం అని తన విశ్వసనీయమైన సర్వేల ద్వారా నిజనిర్ధారణకు వచ్చిందట! ఆ ఎన్నికలాటలో, వరాల మూటలో రూపొందినదే ఆర్థికంగా వెనుకబడిన కులాల రిజర్వేషన్ పేరుతో వచ్చిన చట్టం. పార్లమెంటు ఆమోదం పొందిన ఈబీసీ రిజర్వేషన్ వల్ల 8 లక్షల వార్షికాదాయం ఉన్న అగ్రవర్ణాల వారందరికీ విద్యా, ఉద్యోగ, రాజకీయ అవకాశాల్లో రిజర్వేషన్లు లభించినట్లే. ఆమేరకు రిజర్వేషన్ అనుభవిస్తున్న దళిత, ఆదివాసీ, బీసీలకు ప్రాధాన్యత తగ్గుతుంది. ఆర్థిక సమానత్వం ఉంటేనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని చెబుతూనే ఇంకా ఆ స్థాయికి మన దేశం చేరుకోలేదు కాబట్టి అది సాధించాలని రాజ్యాంగ ఆదేశిక సూత్రాల్లో దాన్ని చేర్చారు. ఇప్పుడు ఈ కొత్త చట్టం వల్ల సామాజిక న్యాయం మరింత దిగజారే అవకాశం ఉంది కనుక, విరుగుడుగా మరో 25 శాతం రిజర్వేషన్లను పెంచితే ఇప్పుడు కొత్తగా చేరినవారితో కలిపి దేశంలో 85 శాతం రిజర్వేషన్ అమలవుతుంది. నిజానికి వివిధ వర్గాల జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇస్తే అణగారిన వర్గాలకే కాదు.. జనాభా మొత్తానికి సామాజిక న్యాయం తగురీతిలో జరుగుతుంది. ఇప్పటికే తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు 69 రిజర్వేషన్లను కల్పిం చాయి కాబట్టి 85 శాతం రిజర్వేషన్ అసాధ్యం అని కొట్టిపారవేయాల్సిన అవసరం లేదు. నిజానికి ప్రతి వ్యక్తికీ పని కల్పించి, కనీన అవసరాలు తీర్చే తరహా సామాజిక వ్యవస్థను నెలకొల్పడం ఈ ప్రభుత్వాలకు అసాధ్యం కాబట్టే దేశంలో నిరుద్యోగుల సంఖ్య హనుమంతుని తోకలాగా పెరిగిపోతోంది. ఈ స్థితిలో దళిత, గిరిజన, ఇతర వెనుకబడిన కులాలకు కనీసం ఇప్పుడున్న రిజర్వేషన్కి ఏదో మేర నష్టం కలుగకుండా నిలబెట్టుకోవాలి. కమ్యూనిస్టులు, ఎస్పీ, బీఎస్పీ తదితర పార్టీలు సైతం రిజర్వేషన్ చట్టానికి సవరణలు కావాలని కోరుతూ పార్లమెంటులో ఓటింగులో పాల్గొనకుండా ఉండాల్సింది. కానీ దాదాపుగా అన్నిపార్టీలూ ఈ 124వ రాజ్యాంగ సవరణకు మద్దతు ఇచ్చాయి. సామాజిక న్యాయ అంశాన్ని కూడా ఓటు బ్యాంకు రాజకీయాల దృష్టితో చూడటం సరికాదు. ఓట్లాటలో మధ్యతరగతి ముఖ్యం కనుక వారి ఓట్లకోసమే అన్ని పార్టీలు రాజ్యాంగ సవరణను ఏకగ్రీవంగా అంగీకరించాయని అనుకోవాలి. ఈరోజు ప్రగతిశీల శక్తులు ఎన్నికల విజయాన్ని మాత్రమే లక్ష్యంగా పెట్టుకోకూడదు. సామాజిక న్యాయసాధన అవసరమైన అన్ని వర్గాల, అస్తిత్వ పోరాట శక్తుల ఐక్యత పునాదిగా సమరశీల ప్రజా ఉద్యమమే సామాజిక న్యాయ సాధనకు పరిష్కారం. డాక్టర్ ఏపీ విఠల్ వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు ‘ మొబైల్ : 98480 69720 -
పేదల కోటాపై స్టేకు సుప్రీం నో
న్యూఢిల్లీ: జనరల్ కేటగిరీలోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో ఇటీవల కల్పించిన 10 శాతం రిజర్వేషన్ల అమలును నిలుపుదల చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కానీ ఈ కోటాకు వీలుకల్పిస్తున్న రాజ్యాంగ సవరణ చట్ట చెల్లుబాటును పరిశీలించేందుకు అంగీకరించింది. 10 శాతం రిజర్వేషన్ల అమలు నిర్ణయాన్ని సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్లపై ప్రభుత్వ స్పందన కోరుతూ బెంచ్ శుక్రవారం నోటీసులు జారీచేసింది. జనహిత అభియాన్, యూత్ ఫర్ ఈక్వాలిటీ అనే స్వచ్ఛంద సంస్థలు ఈ పిటిషన్లను వేశాయి. ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ..ఈ పిటిషన్లకు విచారణార్హత లేదని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై స్టే ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందేందుకు ఆర్థిక స్థితిగతులు మాత్రమే ప్రాతిపదిక కావొద్దని యూత్ ఫర్ ఈక్వాలిటీ తన పిటిషన్లో పేర్కొంది. 50 శాతమే ఉండాలన్న రిజర్వేషన్ల పరిమితిని తాజా చట్టం ఉల్లంఘిస్తోందని గుర్తుచేసింది. ‘ఎస్సీ/ఎస్టీ చట్ట సవరణ’పై యోచన ఎస్సీ, ఎస్టీ(సవరణ) వేధింపుల నిరోధక చట్టం–2018పై కేంద్ర ప్రభుత్వ సమీక్షతోపాటు, ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టే అంశాన్ని పరిశీలించనున్నట్లు కోర్టు తెలిపింది. ఎస్సీ/ఎస్టీ వేధింపుల చట్టం తీవ్రంగా దుర్వినియోగం అవుతోందనీ, ఈ చట్టం కింద దాఖలైన ఫిర్యాదులపై తక్షణం ప్రభుత్వ ఉద్యోగులను కానీ ఇతరులను కానీ అరెస్టు చేయరాదంటూ గత ఏడాది కోర్టు ఆదేశాలిచ్చింది. మరోవైపు, క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించినప్పు డు జరిగే ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్స్‌లలో డబ్బు వెంటనే వాపసు అయ్యేలా చూడాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే, పిటిషనర్ ముందుగా ఈ సమస్యను ఆర్బీఐ దృష్టికి తీసుకెళ్లాలని సూచించింది.