పై చదువుల కోసమో, బతుకుదెరువు కోసమో, లేదా జీవన ప్రమాణాల్లో మెరుగుకోరుకునో.. పలు వీసాల ద్వారా ప్రతియేటా ఆశల రెక్కలు తొడుక్కొని అమెరికాలో అడుగుపెడుతోన్న వేలాది మంది భారతీయుల కడుపున బిడ్డలుపుడితే.. ఆ బిడ్డల పౌరసత్వ హక్కుకు విఘాతం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికాలో పుట్టిన ప్రతిబిడ్డకీ వర్తించే పౌరసత్వ హక్కు రాజ్యాంగబద్దమైనది కాదనీ, పుట్టుకద్వారా సంక్రమించే హక్కుని ఎట్టిపరిస్థితుల్లోనూ కొనసాగించే ప్రసక్తేలేదని ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ ప్రకటనతో ఇప్పుడు భారతీయుల్లో ఆందోళన నెలకొంది. అమెరికా సహా కెనడా, మెక్సికోలాంటి మొత్తం 35 దేశాల్లో అమలులో ఉన్న పుట్టుకతో వచ్చే పౌరసత్వ హక్కుని రద్దు చేస్తామంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు భారతీయులంతా అమెరికా రాజ్యాంగంలోని 14 సవరణపై దృష్టిసారించారు.
14వ సవరణ ఏం చెబుతోంది?
1968లో అమెరికా రాజ్యాంగానికి 14వ సవరణ చేపట్టారు. ఇతర దేశాల దౌత్యాధికారులు మినహా మిగతా వారికి అమెరికా గడ్డపై పుట్టే పిల్లలకు అమెరికా పౌరసత్వం లభిస్తుందని 14వ సవరణ చెబుతోంది. తల్లిదండ్రుల పౌరసత్వ స్థితి, జాతీయతతో సంబంధం లేకుండా అమెరికాలో పుట్టిన ప్రతి బిడ్డకీ (తల్లిదండ్రులు దౌత్యాధికారులు కానంతవరకు) ఇది వర్తిస్తుంది. ఈ వెసులుబాటు వల్లనే భారతీయ సంతతికి చెందిన వేలాది మంది గత ఎనిమిదిన్నర దశాబ్దాలుగా అమెరికా పౌరసత్వాన్ని హక్కుగా పొందగలిగారు. అమెరికాలో పుట్టిన వాళ్ళంతా అమెరికన్లే.
‘‘ఇండియన్ అమెరికన్’’లో ‘‘ఇండియన్’’ అనేది కేవలం గుర్తింపుకోసమే వాడుతున్నారు. వృత్తిరీత్యా అమెరికాకి వెళ్ళిన భారతీయులు, తదనంతర కాలంలో అమెరికా గర్వించదగ్గ వ్యక్తులుగా గౌరవాన్ని అందుకున్నారు. వారి సేవలకిప్పుడు గుర్తింపేలేదా? అన్న ప్రశ్న భారతీయ సంతతికి చెందిన అమెరికా పౌరులను తొలచేస్తోంది. ట్రంప్ అనుమానిస్తున్నట్టుగా ఏ ఒక్కరూ కూడా కేవలం అమెరికా పౌరసత్వం కోసం అమెరికాలో బిడ్డని కనరనీ, ప్రకృతి సహజసిద్ధమైన చర్యకు అమెరికా రాజ్యాంగంలో ఉన్న వెసులుబాటుని ఇకపై లేకుండా చేయడం అమానవీయమనీ భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అమెరికాలోకి పెరిగిపోతోన్న వలసలను అరికట్టే ఉద్దేశ్యంతోనే పుట్టుకద్వారా సంక్రమించే పౌరసత్వ హక్కుని ట్రంప్ ఆక్షేపిస్తున్నట్టు ఆయన విధానాలను సమర్థిస్తున్నవారు అభిప్రాయపడుతున్నారు. అక్రమంగా అమెరికాలోకి చొరబడిన వలసవచ్చిన వారి పిల్లలకు పుట్టుకతో వచ్చే పౌరసత్వహక్కును మాత్రమే ఇది తిరస్కరిస్తుందన్న వాదనకూడా ఉంది. అయితే అమెరికాలో పుట్టిన వాళ్ళందరికీ వర్తించే ఈ హక్కుని పూర్తిగా తొలగించాలన్న భావం చాలా మందిలో ఉండడం గమనార్హం.
ఏ దేశాల్లో ఎలా ఉంది
బిడ్డ ఏ దేశంలో పుడితే ఆ దేశ పౌరుడిగా గుర్తించే సంప్రదాయం అమెరికా, కెనడా సహా మొత్తం 35 దేశాల్లో అమలులో వుంది. దీనినే జస్ సోలీ అని పిలుస్తారు. ఇక మిగిలిన దేశాల్లో పిల్లలు పుట్టిన దేశం ఆధారంగా కాకుండా వారి తల్లిదండ్రుల పౌరసత్వం ఆధారంగా పిల్లలు ఏ దేశ పౌరులో నిర్ణయిస్తారు. దీనిని జస్ సాంగ్వినీస్ అని పిలుస్తారు. భారత్, పాకిస్తాన్‌తోపాటు ఆస్ట్రేలియా, పోలాండ్‌లు సహా అత్యధిక దేశాల్లో జస్ సాంగ్వినీస్ విధానాన్నే అవలంబిస్తున్నారు.
ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వు చాలు
వాషింగ్టన్: కీలక మధ్యంతర ఎన్నిక ల వేళ వలస విధానంపై కఠిన ఆంక్షలు విధించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సన్నద్ధమవుతున్నారు. దేశంలో అమెరికాయేతర దంపతులకు పుట్టే బిడ్డలకు ఆటోమేటిక్‌గా పౌరసత్వాన్నిచ్చే హక్కును రద్దుచేయాలని భావిస్తున్నట్లు ట్రంప్ తాజాగా చెప్పారు. రద్దుకు రాజ్యాంగ సవరణ అక్కర్లేదని, ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వు సరిపోతుందన్నారు. ‘జన్మతః పౌరసత్వ హక్కు రద్దుకు సుదీర్ఘ ప్రక్రియ అనవసరం. రాజ్యాంగ సవరణ అవసరం లేదు. పార్లమెంట్‌లో సాధారణ ఓటింగ్ సరిపోతుంది. అయితే ఈ వ్యవహారాన్ని అంతిమంగా సుప్రీంకోర్టు తేల్చుతుంది’ అని ట్రంప్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment