అమెరికాలో మధ్యంతర ఎన్నికల తేదీ దగ్గరపడుతున్నకొద్దీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వింత పోకడలకు పోతున్నారు. తన పాలన బ్రహ్మాండంగా ఉందనుకుంటే చేసిన ఆ మంచి పనులేమిటో చెప్పి ఓట్లడగాలి. ఎన్ని రంగాల్లో ఎంత అభివృద్ధి సాధించామో లెక్కలు చూపాలి. చిత్తశుద్ధిగల పాల కులు చేసే పని అది. కానీ ట్రంప్ ఇందుకు విరుద్ధంగా వేరే దేశాలనుంచి వచ్చినవారిని, రాబోయే వారిని బూచిగా చూపుతున్నారు. వారి నుంచి దేశాన్ని కాపాడటమే తన కర్తవ్యమన్నట్టు మాట్లాడు తున్నారు. అమెరికా గడ్డపై పుట్టినవారికి సహజంగా లభించే పౌరసత్వాన్ని ఇకపై రద్దు చేస్తానని, అందుకోసం డిక్రీ జారీచేయడానికి సిద్ధమని రెండురోజులక్రితం ఆయన ప్రకటించి వలసవచ్చిన వారిలో గుబులు పుట్టించారు. 150 ఏళ్లనాటి ఆ చట్టాన్ని అధ్యక్ష డిక్రీ ద్వారా మార్చడం అసాధ్య మని, అందుకు రాజ్యాంగ సవరణే మార్గమని నిపుణులు చెబుతున్నారు. అలాగే మధ్య అమెరికా దేశాలైన ఎల్‌సాల్వెడార్, హోండూరస్, గ్వాటెమాలా తదితర ప్రాంతాలనుంచి అమెరికాలో ఆశ్ర యం పొందడానికి బయల్దేరినవారిపై ట్రంప్ చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. వారంతా కలిసి 4,000మందికి మించరు. వారేమీ దేశంలోకి అక్రమంగా ప్రవేశించే ఉద్దేశంతో రావడం లేదు.
అమెరికా చట్టాల్లో, అంతర్జాతీయ చట్టాల్లో ఉన్న నిబంధనల పరిధిలో తగిన కారణాలు చూపితేనే వారికి దేశంలో ప్రవేశం లభిస్తుంది. కానీ వారంతా దేశంపై దండయాత్రకొస్తున్నారన్నంత స్థాయిలో భయాందోళనలు సృష్టించి, వారిని ఆపడం కోసం అమెరికా–మెక్సికో సరిహద్దుల్లోకి హుటాహుటీన 15,000మంది సైన్యాన్ని పంపుతున్నట్టు వాణిజ్య ప్రకటన విడుదల చేశారు. ఇందులోని పదజాలం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. అమెరికాను తొలిసారిగా ట్రంపే రక్షించడానికి పూనుకు న్నాడని జనం అనుకోవడమే ఆయన లక్ష్యం. ఇంతా చేస్తే మధ్య అమెరికా దేశాలనుంచి వచ్చేవారు ఇంకా వేల కిలోమీటర్ల ఆవల ఉన్నారు. వారంతా రావడానికి పక్షం రోజులపైనే పడుతుంది. పైగా ఇలా వచ్చేవారిని నియంత్రించడం కోసం సరిహద్దులకు దళాలను తరలించడం కొత్తేమీ కాదు. కాకపోతే ఈసారి భారీ సంఖ్యలో పంపుతున్నారు. సెనికులు ఎంత మంది ఉన్నా వారు చేసేదల్లా కస్టమ్స్ సిబ్బందికి, సరిహద్దుల్లో పహారాకాసే సిబ్బందికి తోడ్పాటునందించడమే. ఆశ్రయం ముసు గులో మనుషుల అక్రమ రవాణా, మాదకద్రవ్యాల చేరవేత వంటివి ఏమైనా ఉన్నాయా అని చూడటం, అటువంటివారు దొరికితే ఆయా దేశాలకు సమాచారం ఇచ్చి వారికి అప్పగిస్తారు. తమ న్యాయబద్ధమైన హక్కును హరిస్తున్నారని భావించిన వలసదారులెవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారు.
దీనికి ముందు ట్రంప్ మరో బాంబు పేల్చారు. దేశంలోకి అక్రమంగా వచ్చినవారుగాని, తాత్కాలిక అవసరాల కోసం, ఉద్యోగాల కోసం వచ్చినవారుగాని ఇక్కడ పిల్లల్ని కంటే ఆ పిల్లలకు జన్మతః లభించే పౌరసత్వ హక్కును ఇకపై రద్దు చేయాలని అనుకుంటున్నట్టు ఆయన ప్రక టించారు. ఇది ప్రపంచంలో మరెక్కడా లేదని, అమెరికాలో మాత్రం ఎందుకుండాలని ఆయన ప్రశ్నించారు. అమెరికా రాజ్యాంగంలోని 14వ అధికరణ ఈ హక్కు కల్పిస్తోంది. దాన్ని తొలగించా లంటే ఆ అధికరణను సవరించడమే మార్గం తప్ప పాలనాపరమైన డిక్రీ ద్వారా అది సాధ్యపడదు. పైగా ప్రపంచంలో మరే దేశంలోనూ ఈ తరహా హక్కు లేదని చెప్పడం జనాన్ని పక్కదోవపట్టించ డమే. బ్రెజిల్, అర్జెంటినా, మెక్సికో దేశాలతోపాటు దక్షిణ అమెరికా, మధ్య అమెరికా దేశాలన్ని టిలో, కెనడాలో–మొత్తం 33 దేశాల్లో ఇలాంటి చట్టాలున్నాయి. కాకపోతే వీటిలో అమెరికా, కెనడా మాత్రమే అభివృద్ధి చెందిన దేశాలు.
ఈ చట్టాలకింద అమెరికాలో ఏటా దాదాపు పది లక్షలమంది పౌరసత్వాన్ని పొందుతుంటే, కెనడాలో రెండున్నర లక్షలమందికి వీటి ద్వారా పౌరసత్వం లభి స్తుంది. నిజానికి ట్రంప్ 2016లో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనే ఈ పౌరసత్వ హక్కు చట్టాన్ని గురించి ప్రస్తావించారు. తాను అధ్యక్షుణ్ణయితే రద్దు చేస్తానని చెప్పారు. అయితే మధ్యంతర ఎన్ని కల సమయంలో వాడుకోవడం కోసం దాన్ని దాచిపెట్టినట్టున్నారు. నిజానికి ఈ రెండేళ్లలోనూ ట్రంప్ కొద్దో గొప్పో సాధించారు. దేశ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంది. భారీ మొత్తంలో పన్ను కోతనూ అమలు చేశారు. నిరుద్యోగిత తగ్గింది. కానీ ఈ నిర్ణయాలు అనుకున్న స్థాయిలో ప్రజల్లో ఆయనకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించలేకపోయాయి. అందుకు కారణముంది. స్వల్పా దాయ వర్గాలకు ఆరోగ్య బీమా సదుపాయం కల్పించే ‘ఒబామా కేర్’ను నీరుగారుస్తున్న తీరు జనంలో ట్రంప్‌పై తీవ్ర వ్యతిరేకతను తీసుకొస్తున్నాయి. పోనీ రంగంలో బలమైన ప్రత్యర్థి ఉంటే వారిపై విమర్శలు చేస్తూ కాలక్షేపం చేయొచ్చు. ఇవి అధ్యక్ష ఎన్నికలు కాదు గనుక ఆ అవకాశం లేదు. అందుకే ఏం చేయాలో తోచక ఆయన వలసదారులపై పడ్డారు.
అయితే ట్రంప్ వ్యూహం అత్యంత ప్రమాదకరమైనది. ఈ చర్య శ్వేత జాతి అమెరికన్లలో ఇత రులపై అకారణ ద్వేషాన్ని రగిల్చి అవాంఛనీయ ఘటనలకు పురికొల్పుతుంది. అధ్యక్ష ఎన్నికల్లో తనకు మద్దతిచ్చిన వర్గాలను పోలింగ్ కేంద్రాలకు రప్పించడానికి ఆయన ఈ ఎత్తుగడవేశారు. ప్రతినిధుల సభలోని 435 స్థానాలకు, సెనేట్‌లోని 35 స్థానాలకు ఈ నెల 6న జరగబోయే మధ్యం తర ఎన్నికల్లో ఇప్పటికైతే డెమొక్రాట్లు రిపబ్లికన్లకంటే 8 శాతం ఆధిక్యతతో ఉన్నట్టు సర్వేలు చెబు తున్నాయి. ప్రతి సర్వేకూ డెమొక్రాట్ల బలం అంతకంతకు పెరుగుతున్నదని గణాంకాలు చెబు తున్నాయి. అయితే వీటితోపాటు జరిగే స్థానిక ఎన్నికల ప్రభావం వల్ల రిపబ్లికన్లు ఉభయసభ ల్లోనూ ఎంతో కొంత మెరుగ్గా ఉండే అవకాశం లేకపోలేదంటున్నారు. ఏదేమైనా గెలుపుకోసం సమాజంలో అనవసర విద్వేషాలను రగల్చడం, అబద్ధాలను ప్రచారం చేయడం ట్రంప్‌కు తగని పని. ఇలాంటి నాయకుడిపై అమెరికా ప్రజలు ఈ మధ్యంతర ఎన్నికల్లో అంతిమంగా ఏ తీర్పు ఇస్తారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment