లండన్: ఈ నిర్ణయం కోసం ఐర్లాండ్ మహిళలు 35 ఏళ్లు పోరాటం సాగించారు. కేవలం అబార్షన్ కోసం బలవంతంగా, ఒంటరిగా బ్రిటన్‌కు వెళ్లేందుకు కష్టాలు పడ్డారు. అబార్షన్‌ను చట్టబద్ధం చేస్తూ శుక్రవారం ఐర్లాండ్ పార్లమెంట్ రాజ్యాంగ సవరణ చేసింది. 80 శాతం క్యాథలిక్‌లు ఉండే ఆ దేశంలో ఇదొక చరిత్రాత్మక నిర్ణయం. గత కొంతకాలంగా చర్చికి వెళ్లేవారి సంఖ్య క్షీణించడం కూడా ఈ మార్పునకు కారణమంటున్నారు. ఈ ఏడాది మేలో నిర్వహించిన రిఫరెండంలో 66 శాతం ప్రజలు అబార్షన్‌కు తమ సమ్మతి తెలిపారు.
దీంతో అబార్షన్‌ను చట్టబద్ధం చేయడానికి దారులు సుగమం అయ్యాయి. ఈ బిల్లును అధ్యక్షుడు ఆమోదించాల్సి ఉంది. ‘ఇది ఐరిష్ మహిళలు చరిత్రలో మరిచిపోలేని క్షణం. దీనికి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు’అని ఐర్లాండ్ ప్రధాని లియో వారద్కర్‡ ట్వీట్ చేశారు. 1980 నుంచి ఇప్పటివరకు 7.77 లక్షల మంది ఐర్లాండ్ మహిళలు అబార్షన్ కోసం బలవంతంగా బ్రిటన్‌కు వెళ్లి వచ్చారు. ‘ఇకపై ఐర్లాండ్ మహిళల ఒంటరి ప్రయణాలుండవు’అని ఐర్లాండ్ ఆరోగ్యమంత్రి సైమన్ హారిస్ ట్వీట్ చేశారు.
నిర్ణయం వెనుక భారతీయురాలు..
అబార్షన్‌కు అనుమతులు లేక సమయానికి అబార్షన్ జరగక ప్రాణాలు విడిచిన వారి విషాద కథనాలు ఎన్నో ఐర్లాండ్‌లో ఉన్నాయి. రక్తం విషతుల్యం అయిన కారణంగా భారత్‌కు చెందిన డెంటిస్ట్, సవిత హలప్పన్వర్ 2012లో స్థానిక గాల్వే ఆస్పత్రిలో చేరారు. ఆమె అప్పటికే గర్భవతి. ఆ సమయంలో ఆమె కడుపులో నొప్పిగా ఉందని, తనకు అబార్షన్ చేయమని చాలాసార్లు వేడుకున్నారు. చలించని వైద్యులు నిబంధనల్ని సాకుగా చూపి అబార్షన్‌కు నిరాకరించారు. దీంతో ఆమె 31 ఏళ్ల వయసులోనే ప్రాణాలు విడిచారు. ఆమె మృతి దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఐర్లాండ్ మహిళలు ఉద్యమించారు. దాని ఫలితమే నేటి చరిత్రాత్మక నిర్ణయానికి నాంది. 2019 జనవరిలో ఈ చట్టం అమల్లోకి రానుంది. దీని ప్రకారం..గర్భం దాల్చిన 12 వారాల వరకు ఎప్పుడైనా అబార్షన్ చేయించుకోవచ్చు. 12 వారాల అనంతరం అబార్షన్ చేస్తే తల్లి ప్రాణాలకు ప్రమాదం. అయితే, ఇది అనారోగ్య సమస్యలు తలెత్తిన వారికి మాత్రమే వర్తిస్తుంది. వారికి అబార్షన్ చేయాలా? వద్దా అని ఇద్దరు వైద్యులు పరిశీలించి నిర్ణయిస్తారు. ఈ నిర్ణయం వెనుక భారత మూలాలున్న వైద్యుడు, ప్రధాని వారద్కర్(39) చొరవ అభినందించదగినది. దేశ నిర్మాణంలో ప్రతిఒక్కరికీ అవకాశం కల్పిస్తానని లియో ఎన్నిక తర్వాత ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment