మంగళవారం ఢిల్లీలో ఎస్సీవర్గీకరణ అంశంపై ప్రధాని మోదీకి వినతిపత్రాన్ని అందిస్తున్న సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం కడియం
- ప్రధానికి కేసీఆర్, కడియం వినతిపత్రం
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ వర్గీకరణకు వీలుగా రాజ్యాంగ సవరణ చేపట్టాలని, దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు సమస్య ఉంటే ప్రస్తుతం తెలంగాణ వరకు వర్తించేలా సవరణ చేయాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వినతిపత్రం సమర్పించారు. ఈ వివరాలను కడియం మంగళవారమిక్కడ ఏపీభవన్‌లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
‘‘ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఎస్సీ వర్గీకరణకు అన్ని పార్టీల మద్దతు ఉంది. రాజ్యాంగ సవరణ చేయాలని ప్రధానిని కోరాం. ఎస్సీ, ఎస్టీల్లో అందరికీ రిజర్వేషన్లు అందడం లేదని, అనేక రాష్ట్రాల్లో సమస్య ఉందని, అందరికీ రిజర్వేషన్లు చెందాల్సి ఉందని ప్రధాని మాతో అన్నారు. తప్పకుండా పరిశీలిస్తామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు’’ అని ఆయన పేర్కొన్నారు. అఖిలపక్షంతో రావాలన్న డిమాండ్లపై స్పందిస్తూ.. ‘‘అఖిలపక్షంతో వస్తామని, అపాయింట్‌మెంట్ కావాలని ప్రధాని కార్యాలయాన్ని కోరాం. కానీ వారు సమాధానం ఇవ్వలేదు. ఇప్పుడు ఇచ్చింది ప్రభుత్వం తరఫునే. ఇదివరకు కూడా ఒక లేఖ ఇచ్చాం. వర్గీకరణపై మా చిత్తశుద్ధిని శంకించవద్దు. ఉద్యమం చేసే వారికి మా విజ్ఞప్తి ఏంటంటే వర్గీకరణ లక్ష్యానికి సహకరించే మాతో కలిసి రావాలి తప్ప వర్గాలు వద్దు. ఉద్యమం చేసే వారంతా కలిసికట్టుగా ఉండాలి..’’ అని కడియం అన్నారు.