3 భాగాలుగా ఓబీసీ కోటా? | Panel may recommend splitting 27 Percent OBC quota into three bands | Sakshi
Sakshi News home page

3 భాగాలుగా ఓబీసీ కోటా?

Published Fri, Jun 14 2019 4:33 AM | Last Updated on Fri, Jun 14 2019 4:33 AM

Panel may recommend splitting 27 Percent OBC quota into three bands - Sakshi

దేశంలో విద్య, ఉద్యోగాల్లో ఇతర వెనుకబడిన తరగతుల(ఓబీసీ)కు కేటాయించిన 27 శాతం రిజర్వేషన్‌ అమలులో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. దేశంలో ఓబీసీ కోటా అమలు తీరుతెన్నుల అధ్యయనానికి ఏర్పాటైన జస్టిస్‌ రోహిణి కమిషన్‌ ఓబీసీ కులాల్లో ఎవరెవరికి ఈ రిజర్వేషన్‌ వల్ల ఏ మేరకు లబ్ధి కలుగుతోందన్న అంశాన్ని పరిశీస్తోంది. ప్రస్తుతం ఓబీసీలో 2,633 కులాలున్నాయి. ఈ కులాలన్నిటీకీ ఉమ్మడిగా 27శాతం రిజర్వేషను అమలవుతోంది.

వీటిలో కొన్ని కులాల వారు రిజర్వేషన్‌ వల్ల ఎక్కువ లబ్ధి పొందుతోంటే, మరికొన్ని కులాల వారికి  ప్రయోజనం కలగడం లేదని కమిషన్‌ అభిప్రాయ పడినట్టు తెలిసింది. తేడాను దృష్టిలో పెట్టుకుని ఈ 27 శాతాన్ని మూడు భాగాలు చేయాలని, లబ్ధి స్థాయిని బట్టి ఆయా కులాలకు రిజర్వేషన్‌ అమలు చేయాలని కమిషన్‌ సిఫారసు చేయనున్నట్టు తెలిసింది.  27శాతంలో రిజర్వేషన్‌ వల్ల గరిష్టస్థాయిలో లబ్ధి పొందుతున్న కులాలకు 7శాతం, అసలేమీ ప్రయోజనం పొందని కులాలకు 10 శాతం, కొంత లబ్ధి కులాలకు 10శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని కమిషన్‌ ప్రతిపాదించనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. జూలై 31లోపు నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు జస్టిస్‌ రోహిణి తెలిపారు.

పది కులాలకే ఎక్కువ లబ్ధి
ఓబీసీ జాబితాలో ఉన్న వేల కులాల్లో కేవలం 10 ఉప కులాల వారే 25 శాతం రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందుతున్నారని, 983 ఉప కులాల వారికి ఒక్క శాతం లబ్ధి కూడా చేకూరడం లేదని కమిషన్‌ తన సంప్రదింపుల పత్రంలో పేర్కొంది. స్వాతంత్య్రానికి పూర్వం అంటే 1931 చేపట్టిన జనాభా లెక్కల్లో ఓబీసీల గణన జరిగింది. ఆ తర్వాత ఇంత వరకు ఓబీసీల గణన జరగలేదు. ఓబీసీ జనాభాపై కచ్చితమైన లెక్కలు అందుబాటులో లేనందున రోహిణి 1931నాటి ఓబీసీ లెక్కలనే పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

సంప్రదాయకంగా రాళ్లను పాలిష్‌ చేసే కలైగర్లు, కత్తులు సానపట్టే సిక్లిగర్లు,సరనియాలు వంటి వృత్తిపరమైన కులాలలో పాటు అనేక వెనకబడిన కులాలకు ఓబీసీ రిజర్వేషన్‌ ఫలాలు ఎంత మాత్రం అందడం లేదని కమిషన్‌ పేర్కొంది. ‘ఈ కులాల జనాభా తక్కువేం కాదు. అయినా వారికి ఓబీసీ ప్రయోజనాలు అందడం లేదు. రాజకీయ ప్రాతినిధ్యం కూడా లేదు’అని కమిషన్‌ సభ్యుడు డా.జేకే బజాజ్‌ అన్నారు. అలాగే, ఆంధ్ర ప్రదేశ్‌లో భిక్షాటన చేసే బుద్బుదీలు, గోసాయన కులాల వారు కూడా ఓబీసీ వల్ల లాభం పొందలేకపోతున్నారని, అయితే ఈ కులాలకు చెందిన ఒకరిద్దరు ఐఐటీ వంటి సంస్థల్లో విద్యార్థులుగా కనిపిస్తున్నారని ఆయన వివరించారు.

ఓబీసీ రిజర్వేషన్‌ వల్ల ఏ కులాలు ఎక్కువ లబ్ధి పొందాయి, ఏవి పొందలేదు అన్నది నిర్థారించడం కోసం కమిషన్‌ ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎం, ఎయిమ్స్‌ సహా దేశంలోని విద్యా సంస్థలు, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో గత మూడేళ్లుగా ఈ కోటా కింద పొందిన లక్ష అడ్మిషన్లను,  ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వంలో ఈ కోటా కింద పొందిన 1,30,000 ఉద్యోగాలను పరిశీలించింది. కమిషన్‌ ప్రతిపాదనలు అమల్లోకి రావాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. దీనిపై కేంద్ర సామాజిక న్యాయ, సాధికార శాఖ మంత్రి తావర్‌ చంద్‌ గెహ్లాట్‌ స్పందిస్తూ ‘ముందు కమిషన్‌ నివేదిక రానివ్వండి. దాన్ని అధ్యయనం చేసి ఏం చెయ్యాలో నిర్ణయిస్తాం’ అన్నారు. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే దేశంలో రాజకీయ సమీకరణాలు కూడా మారుతాయని పరిశీలకులు అంటున్నారు. ఉత్తరాదిన రాష్ట్రీయ జనతా దళ్, సమాజ్‌వాదీ పార్టీ, దక్షిణాన డీఎంకే, అన్నాడీఎంకే వంటి పార్టీలు ఓబీసీల ఓటు బ్యాంకులు కలిగి ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement