జి.రోహిణి
న్యూఢిల్లీ: ఇతర వెనుకబడిన వర్గాల(ఓబీసీలు) జనాభా అంచనా వేసేందుకు దేశవ్యాప్త సర్వే చేపట్టాలని జస్టిస్(రిటైర్డు)జి.రోహిణి కమిషన్ నిర్ణయించింది. నమ్మకమైన ఏజెన్సీ ద్వారా నిర్వహించే ఈ సర్వేకు రూ.200 కోట్లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ‘ఓబీసీల కేంద్ర జాబితాలో 2,600కు పైగా కులాలున్నాయి. వీరి జనాభా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఓబీసీ జన గణన చేపట్టలేదు. ఓబీసీ కులాల జనాభాపై కచ్చితమైన లెక్క తేలాలంటే జాతీయ స్థాయి సర్వే తప్పనిసరి. పది లక్షలకు పైగా కుటుంబాల్లో జరిపే ఈ సర్వే బాధ్యతలను ఒక ఏజెన్సీకి అప్పగించాలని యోచిస్తున్నాం.
2011 సామాజిక–ఆర్థిక జనగణనకు కేటాయించిన బడ్జెట్‌ను బట్టి ఓబీసీ సర్వేకు రూ.200 కోట్లు అవసరమవుతాయని అంచనా. ఈ మేరకు బడ్జెట్ కేటాయించాలని ప్రభుత్వానికి లేఖ రాశాం. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావంతో ఉన్నాం’ అని కమిషన్ తెలిపింది. ఓబీసీ రిజర్వేషన్లు అన్ని కులాల వారికి సమానంగా దక్కేందుకు అవసరమైన నిబంధనలు రూపొందించే ఉద్దేశంతో కేంద్రం 2017లో జస్టిస్(రిటైర్డు)జి.రోహిణి అధ్యక్షతన ఐదుగురు సభ్యుల కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర బీసీ కమిషన్ల, వివిధ కుల సంఘాలు, సంబంధిత వర్గాలతో చర్చలు జరిపింది.
Comments
Please login to add a commentAdd a comment