Justice Rohini
-
3 భాగాలుగా ఓబీసీ కోటా?
దేశంలో విద్య, ఉద్యోగాల్లో ఇతర వెనుకబడిన తరగతుల(ఓబీసీ)కు కేటాయించిన 27 శాతం రిజర్వేషన్ అమలులో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. దేశంలో ఓబీసీ కోటా అమలు తీరుతెన్నుల అధ్యయనానికి ఏర్పాటైన జస్టిస్ రోహిణి కమిషన్ ఓబీసీ కులాల్లో ఎవరెవరికి ఈ రిజర్వేషన్ వల్ల ఏ మేరకు లబ్ధి కలుగుతోందన్న అంశాన్ని పరిశీస్తోంది. ప్రస్తుతం ఓబీసీలో 2,633 కులాలున్నాయి. ఈ కులాలన్నిటీకీ ఉమ్మడిగా 27శాతం రిజర్వేషను అమలవుతోంది. వీటిలో కొన్ని కులాల వారు రిజర్వేషన్ వల్ల ఎక్కువ లబ్ధి పొందుతోంటే, మరికొన్ని కులాల వారికి ప్రయోజనం కలగడం లేదని కమిషన్ అభిప్రాయ పడినట్టు తెలిసింది. తేడాను దృష్టిలో పెట్టుకుని ఈ 27 శాతాన్ని మూడు భాగాలు చేయాలని, లబ్ధి స్థాయిని బట్టి ఆయా కులాలకు రిజర్వేషన్ అమలు చేయాలని కమిషన్ సిఫారసు చేయనున్నట్టు తెలిసింది. 27శాతంలో రిజర్వేషన్ వల్ల గరిష్టస్థాయిలో లబ్ధి పొందుతున్న కులాలకు 7శాతం, అసలేమీ ప్రయోజనం పొందని కులాలకు 10 శాతం, కొంత లబ్ధి కులాలకు 10శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కమిషన్ ప్రతిపాదించనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. జూలై 31లోపు నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు జస్టిస్ రోహిణి తెలిపారు. పది కులాలకే ఎక్కువ లబ్ధి ఓబీసీ జాబితాలో ఉన్న వేల కులాల్లో కేవలం 10 ఉప కులాల వారే 25 శాతం రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందుతున్నారని, 983 ఉప కులాల వారికి ఒక్క శాతం లబ్ధి కూడా చేకూరడం లేదని కమిషన్ తన సంప్రదింపుల పత్రంలో పేర్కొంది. స్వాతంత్య్రానికి పూర్వం అంటే 1931 చేపట్టిన జనాభా లెక్కల్లో ఓబీసీల గణన జరిగింది. ఆ తర్వాత ఇంత వరకు ఓబీసీల గణన జరగలేదు. ఓబీసీ జనాభాపై కచ్చితమైన లెక్కలు అందుబాటులో లేనందున రోహిణి 1931నాటి ఓబీసీ లెక్కలనే పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. సంప్రదాయకంగా రాళ్లను పాలిష్ చేసే కలైగర్లు, కత్తులు సానపట్టే సిక్లిగర్లు,సరనియాలు వంటి వృత్తిపరమైన కులాలలో పాటు అనేక వెనకబడిన కులాలకు ఓబీసీ రిజర్వేషన్ ఫలాలు ఎంత మాత్రం అందడం లేదని కమిషన్ పేర్కొంది. ‘ఈ కులాల జనాభా తక్కువేం కాదు. అయినా వారికి ఓబీసీ ప్రయోజనాలు అందడం లేదు. రాజకీయ ప్రాతినిధ్యం కూడా లేదు’అని కమిషన్ సభ్యుడు డా.జేకే బజాజ్ అన్నారు. అలాగే, ఆంధ్ర ప్రదేశ్‌లో భిక్షాటన చేసే బుద్బుదీలు, గోసాయన కులాల వారు కూడా ఓబీసీ వల్ల లాభం పొందలేకపోతున్నారని, అయితే ఈ కులాలకు చెందిన ఒకరిద్దరు ఐఐటీ వంటి సంస్థల్లో విద్యార్థులుగా కనిపిస్తున్నారని ఆయన వివరించారు. ఓబీసీ రిజర్వేషన్ వల్ల ఏ కులాలు ఎక్కువ లబ్ధి పొందాయి, ఏవి పొందలేదు అన్నది నిర్థారించడం కోసం కమిషన్ ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ సహా దేశంలోని విద్యా సంస్థలు, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో గత మూడేళ్లుగా ఈ కోటా కింద పొందిన లక్ష అడ్మిషన్లను, ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వంలో ఈ కోటా కింద పొందిన 1,30,000 ఉద్యోగాలను పరిశీలించింది. కమిషన్ ప్రతిపాదనలు అమల్లోకి రావాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. దీనిపై కేంద్ర సామాజిక న్యాయ, సాధికార శాఖ మంత్రి తావర్ చంద్ గెహ్లాట్ స్పందిస్తూ ‘ముందు కమిషన్ నివేదిక రానివ్వండి. దాన్ని అధ్యయనం చేసి ఏం చెయ్యాలో నిర్ణయిస్తాం’ అన్నారు. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే దేశంలో రాజకీయ సమీకరణాలు కూడా మారుతాయని పరిశీలకులు అంటున్నారు. ఉత్తరాదిన రాష్ట్రీయ జనతా దళ్, సమాజ్‌వాదీ పార్టీ, దక్షిణాన డీఎంకే, అన్నాడీఎంకే వంటి పార్టీలు ఓబీసీల ఓటు బ్యాంకులు కలిగి ఉన్నాయి. -
ఓబీసీ ఉప వర్గీకరణకు దేశవ్యాప్త సర్వే
న్యూఢిల్లీ: ఇతర వెనుకబడిన వర్గాల(ఓబీసీలు) జనాభా అంచనా వేసేందుకు దేశవ్యాప్త సర్వే చేపట్టాలని జస్టిస్(రిటైర్డు)జి.రోహిణి కమిషన్ నిర్ణయించింది. నమ్మకమైన ఏజెన్సీ ద్వారా నిర్వహించే ఈ సర్వేకు రూ.200 కోట్లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ‘ఓబీసీల కేంద్ర జాబితాలో 2,600కు పైగా కులాలున్నాయి. వీరి జనాభా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఓబీసీ జన గణన చేపట్టలేదు. ఓబీసీ కులాల జనాభాపై కచ్చితమైన లెక్క తేలాలంటే జాతీయ స్థాయి సర్వే తప్పనిసరి. పది లక్షలకు పైగా కుటుంబాల్లో జరిపే ఈ సర్వే బాధ్యతలను ఒక ఏజెన్సీకి అప్పగించాలని యోచిస్తున్నాం. 2011 సామాజిక–ఆర్థిక జనగణనకు కేటాయించిన బడ్జెట్‌ను బట్టి ఓబీసీ సర్వేకు రూ.200 కోట్లు అవసరమవుతాయని అంచనా. ఈ మేరకు బడ్జెట్ కేటాయించాలని ప్రభుత్వానికి లేఖ రాశాం. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావంతో ఉన్నాం’ అని కమిషన్ తెలిపింది. ఓబీసీ రిజర్వేషన్లు అన్ని కులాల వారికి సమానంగా దక్కేందుకు అవసరమైన నిబంధనలు రూపొందించే ఉద్దేశంతో కేంద్రం 2017లో జస్టిస్(రిటైర్డు)జి.రోహిణి అధ్యక్షతన ఐదుగురు సభ్యుల కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర బీసీ కమిషన్ల, వివిధ కుల సంఘాలు, సంబంధిత వర్గాలతో చర్చలు జరిపింది. -
ఓబీసీలను ఐదు గ్రూపులుగా విభజించండి
సాక్షి, న్యూఢిల్లీ: ఓబీసీ కులాలను ఐదు గ్రూపులుగా విభజించి, గ్రూపుల వారీగా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని, ఓబీసీ కులాల వర్గీకరణపై ఏర్పాటైన కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ రోహిణిని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేతలు కోరారు. సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, భూపేశ్ సాగర్ బుధవారం ఢిల్లీలో జస్టిస్ రోహిణిని కలసి ఈ మేరకు వినతిపత్రాన్ని ఇచ్చారు. వర్గీకరణ శాస్త్రీయంగా సమన్యాయం జరిగేలా చేయాలని, ఒక్కో రాష్ట్రాన్ని యూనిట్‌గా పరిగణించి ఓబీసీల స్థితిగతులను విశ్లేషించాలని నేతలు కోరారు. 2011 జనాభా లెక్కల్లో కులాల వారీగా లెక్కలు సేకరించారని, కేంద్రం వీటిని ప్రకటిస్తే గ్రూపుల వారీగా రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించడానికి వీలవుతుందన్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటామని జస్టిస్ రోహిణి హామీ ఇచ్చినట్టు నేతలు తెలిపారు. అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాంతో సమావేశమైన నేతలు వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధ హోదా కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును ఆమోదింపజేయాలని కోరారు. -
సైబర్ నేరాలు సమాజానికి సవాల్
ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రోహిణి విశాఖ లీగల్: సాంకేతిక పరిజ్ఞానం తో కూడిన నేరాలు సమాజానికి ఒక సవాలుగా మారాయని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.రోహిణి చెప్పారు. విశాఖలోని ఒక హోటల్లో శనివారం జాతీయ మహిళా న్యాయవాదుల సమాఖ్య రాష్ట్ర విభాగం, విశాఖ శాఖలు సైబర్ నేరాలపై నిర్వ హించిన సదస్సును ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... పెరు గుతున్న సైబర్ నేరాలపై న్యాయవాదులకు అవగాహన అవసరమన్నారు. ఆన్లైన్, డేటా, ఇంటర్నెట్ వినియోగంలో సమస్యల ను గుర్తించాలన్నారు. సాంకేతికతతో నూతన నేరాలు పుట్టుకొస్తున్నాయని, ఈ మెయిల్, సైబర్, సామాజిక మాధ్యమాలు, క్రెడిట్‌కార్డు, సాంకేతిక ఉగ్రవాదం వంటివి నేర ప్రవృత్తికి అడ్డాగా మారాయని ఆందోళన వ్యక్తంచేశారు. వీటిని అధిగమించడానికి పౌరుల్లో అవగాహన పెరగాలని, నూతన సవాళ్ల పరిష్కారానికి ఒక అన్వేషణ జరగాలని చెప్పారు. మహిళా సాధికారత...అభివృద్ధి న్యాయవాద వృత్తిలో పరిస్థితి ఇతర వృత్తులకు భిన్నంగా ఉంటుందని, న్యాయవాద వృత్తిలో నిపుణత సాధిస్తేనే రాణింపు ఉంటుందని జస్టిస్ రోహిణి స్పష్టం చేశారు. న్యాయస్థానాల్లో న్యాయవాదులు, న్యాయమూర్తుల్లో స్త్రీల సంఖ్య పెరుగుతున్నా లింగవివక్ష కొనసాగుతూనే ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు సైబర్ నేరాలను సమగ్రంగా విశ్లేషించారు. మరో న్యాయమూర్తి జస్టిస్ టి.రజని మాట్లాడుతూ సాంకేతిక విజ్ఞానంపై అవగాహన, అప్రమత్తత అవసరమన్నారు. విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.వెంకటజ్యోతిర్మయి, సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు మంజరి, బార్ కౌన్సిల్ సభ్యురాలు చీకటి మాధవిలత, నగర అధ్యక్షురాలు డి.అరుణకుమారి, డి.మంజులత తదితరులు పాల్గొన్నారు. -
నాలుగు రాష్ట్రాలకు కొత్త సీజేలు!
జస్టిస్ రోహిణి మద్రాసు హైకోర్టుకు! న్యూఢిల్లీ: మేఘాలయ, రాజస్తాన్, కర్ణాటక, గువాహటి హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులు(సీజే)గా నియమించాలంటూ నలుగురు సీనియర్ జడ్జీల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆ హైకోర్టులకు ప్రస్తుతం ఆపద్ధర్మ సీజేలేఉన్నారు. వారిలో కర్ణాటక హైకోర్టు ఆపద్ధర్మ సీజే జస్టిస్ ఎస్కే ముఖర్జీని అదే హైకోర్టుకు సీజేగా నియమించాలని కొలీజియం సూచించింది. పంజాబ్, హరియాణా హైకోరు జడ్జి జస్టిస్ సతీశ్ కుమార్ మిట్టల్‌ను రాజస్తాన్ హైకోర్టుకు, రాజస్తాన్ హైకోర్టు జడ్జి జస్టిస్ అజిత్ సింగ్‌ను గువాహటి హైకోర్టుకు, అలహాబాద్ హైకోర్టు, లక్నో బెంచ్ జడ్జి జస్టిస్ దినేశ్ మహేశ్వరిని మేఘాలయ హైకోర్టుకు సీజేలుగా నియమించాలంది. ఢిల్లీ హైకోర్టు సీజే జస్టిస్ జీ రోహిణిని మద్రాసు హైకోర్టుకు అదే హోదాలో బదిలీ చేయాలని, మద్రాసు హైకోర్టు సీజే జస్టిస్ ఎస్కే కౌల్‌ను అలహాబాద్ హైకోర్టుకు, అలహాబాద్ హైకోర్టు సీజే జస్టిస్ డీవై చంద్రచూడ్‌ను ఢిల్లీ హైకోర్టు సీజేగా పంపించాలని సిఫారసు చేసింది. -
అడ్వాన్సు వెనక్కిచ్చేయండి
న్యూఢిల్లీ: నోయిడాలోని రెసిడెన్షియల్ బ్లాక్‌లకు చెందిన కొనుగోలుదారులకు వడ్డీతోసహా అసలు మొత్తాన్ని రోజుల వ్యవధిలోగా చెల్లించాలంటూ సూపర్‌టెక్ బిల్డర్స్ సంస్థను సుప్రీంకోర్టు బుధవారం ఆదేశిం చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి ఆర్.ఎం.లోధా, జస్టిస్ కురియన్, జస్టిస్ రోహిణిల నేతృత్వం లోని ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. కాగా నిబంధనలకు లోబడి నిర్మించని కారణంగా ఈ జంట భవనాలను కూల్చివేయాలంటూ గతంలో అలహాబాద్ ఉన్నత న్యాయస్థానం ఆదేశించిన సంగతి విదితమే. ‘వాళ్లు వ్యాజ్యాలను కొనుగోలు చేయలేదు. ఫ్లాట్లను మాత్రమే కొనుగోలు చేశారు. కొనుగోలుదారులందరూ బాధపడడాన్ని చూడాల్సి రావడం బాధాకరం’ అని ధర్మాసనం ఈ సందర్భంగా పేర్కొంది. ఏప్రిల్ 1వ తేదీన మీరు ప్రకటించిన విధంగానే వారు మూలధనం వెనక్కి ఇచ్చేయాలని కోరుకుంటున్నారు. వాళ్లు ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలి. ఎదురుచూసే పరిస్థితి లేదు. కొనుగోలుదారులు వివక్షకు గురవడాన్ని అనుమతించబోం. తమ సొమ్మును తాము వెనక్కి తీసుకునే అధికారం, హక్కు కొను గోలు దారులకు ఉంది. ఈ వివాదానికి మీరే కార కులు. ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకుని వారు ఈ మొత్తం మీకు చెల్లించారు. వ్యాజ్యాల కోసం వారు కోర్టుల చుట్టూ తిరగలేరు.’ అని పేర్కొంది. కాగా జంట భవనాల్లో ఒక్కొక్క ఫ్లాట్ ఖరీదు రూ. 65 నుంచి రూ. 90 లక్షలవరకూ ఉంది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను శిరసావహిస్తామని సూపర్‌టెక్ బిల్డర్స్ సంస్థ బుధవారం విడుదల చేసి న ఓ ప్రకటనలో పేర్కొంది. కొనుగోలుదారులకు వీలైనంత త్వరగా వారి మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించేందుకు యత్నిస్తామని తెలిపింది. ఇందులో ఎటువంటి అనుమానాలకు తావులేదని ఆ ప్రక టనలో వివరించింది. -
ఢిల్లీ హైకోర్టు సీజేగా జస్టిస్ రోహిణి
ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రోహిణి బాధ్యతలు స్వీకరించారు. నిన్నటివరకూ ఏపీ హైకోర్టులో న్యాయమూర్తిగా జస్టిస్ రోహిణి సేవలందించారు. ఆమె పదోన్నతిపై ఢిల్లీ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా వెళ్లారు. 1955 ఏప్రిల్ 14న విశాఖపట్నంలో జన్మించిన జస్టిస్ రోహిణి, 1976లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తిచేశారు. ఆంధ్రా యూనివర్సిటీలో లా చేశారు. 1980 డిసెంబర్లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుని నాటి బార్ కౌన్సిల్ చైర్మన్ కోకా రాఘవరావు వద్ద జూనియర్‌గా చేరారు. రాఘవరావు చీఫ్ ఎడిటర్‌గా ఉన్న ఆంధ్రప్రదేశ్ లా జర్నల్స్‌కు ఆమె రిపోర్టర్‌గా కూడా పనిచేశారు. 1995లో హైకోర్టులో గవర్నమెంట్ ప్లీడర్గాను, 2001లో అదనపు జడ్జిగాను, 2002 నుంచి పూర్తి స్థాయి జడ్జిగాను ఆమె నియమితులయ్యారు. అప్పటినుంచి రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసి, ఇప్పుడు ఢిల్లీ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా వెళ్లారు. -
జస్టిస్ రోహిణికి ఘనంగా వీడ్కోలు
హైకోర్టు న్యాయవాదుల సంఘం సన్మానం సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ జి.రోహిణికి హైకోర్టు గురువారం ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ నెల 21న ఆమె నూతన బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే శుక్రవారం నుంచి వరుసగా మూడు రోజుల పాటు హైకోర్టుకు సెలవు దినాలు కావడంతో గురువారమే ఆమెకు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా నేతృత్వంలో హైకోర్టు న్యాయమూర్తులందరూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎ.గిరిధరరావు, అదనపు ఏజీలు కె.జి.కృష్ణమూర్తి, బి.భాస్కరావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వినోద్‌కుమార్ దేశ్‌పాండే, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయవాదుల తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ న్యాయవ్యవస్థకు జస్టిస్ రోహిణి చేసిన సేవలను కొనియాడారు. తరువాత జస్టిస్ రోహిణి మాట్లాడుతూ, న్యాయవ్యవస్థలో తన సుదీర్ఘ ప్రస్థానంలో తనకు సహకరించిన వారిందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. న్యాయవృత్తిలో మెళకువలు నేర్చుకునే అవకాశం కల్పించిన సీనియర్ న్యాయవాది కోకా రాఘవరావుకు, సొంత బిడ్డలా చూసుకున్న ఆయన కుటుంబసభ్యులకు ధన్యవాదాలు చెప్పారు. సీనియర్ న్యాయవాది ఎస్.రామచంద్రరావు ఏజీగా ఉన్న సమయంలోనే తనను ప్రభుత్వ న్యాయవాది (జీపీ)గా నియమించారని, అలా తనను తాను నిరూపించుకునేందుకు గొప్ప అవకాశం లభించిందని జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. ‘‘ఇప్పటి వరకు నేను 58 మంది న్యాయమూర్తుల వీడ్కోల సమావేశంలో పాల్గొన్నా. ఇప్పుడు నా వంతు వచ్చింది. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేను భాగం కాదని తలచుకుంటే నాకు ఎంతో బాధేస్తోంది. నా జీవితంలో సగభాగం ఈ ప్రతిష్టాత్మక కోర్టులోనే గడిపాను. నా కుటుంబంలో ఎవ్వరూ న్యాయవాదిగా లేరు. కష్టపడి, నిజాయితీగా పనిచేయబట్టే ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నా. పని గురించి తప్ప ఇతర విషయాల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. నా సీనియర్ కోకా రాఘవరావు ఆంధ్రప్రదేశ్ లా జర్నల్స్‌కు ఎడిటర్‌గా ఉన్నారు. దానిలో నేను కూడా తరువాత భాగస్వామినయ్యాను. నా సీనియర్ సహకారంతో ఎంతో సాధించాను’’ అని చెప్పారు. తరువాత జస్టిస్ రోహిణిని ఎ.గిరిధరరావు నేతృత్వంలో న్యాయవాదుల సంఘం ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు వేణుమాధవ్, కార్యదర్శి పాశం కృష్ణారెడ్డి, సంయుక్త కార్యదర్శి పి.ఎస్.పి.సురేష్‌కుమార్, కోశాధికారి భారతీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
హైకోర్టు సీజేగా జస్టిస్ రోహిణి
ఢిల్లీ హైకోర్టుకు తొలి మహిళా సీజేగా చరిత్ర హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రోహిణికి పదోన్నతి లభించింది. ఆమె ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తద్వారా ఆమె ఢిల్లీ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా చరిత్రకెక్కారు. జస్టిస్ రోహిణి నియామకానికి సంబంధించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. వచ్చేవారం ఆమె ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. జస్టిస్ రోహిణి ప్రస్తుతం హైకోర్టులో నంబర్ టూగా కొనసాగుతున్నారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆమె పేరును సుప్రీంకోర్టు కొలీజియం గత నెలలో కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. తరువాత జస్టిస్ రోహిణి నియామకానికి సంబంధించిన ఫైల్‌ను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతికి పంపింది. దీంతో రాష్ట్రపతి ఆమెను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జస్టిస్ రోహిణి 1955, ఏప్రిల్ 14న విశాఖపట్నంలో జన్మించారు. ఆంధ్రా వర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 1980లో న్యాయవాదిగా నమోదై, సీనియర్ న్యాయవాది కోకా రాఘవరావు వద్ద జూనియర్‌గా న్యాయవాద వృత్తి ప్రారంభించారు. కోకా రాఘవరావు ఎడిటర్‌గా ఉన్న ఆంధ్రప్రదేశ్ లా జర్నల్స్‌కు జస్టిస్ రోహిణి 1985లో రిపోర్టర్‌గా వ్యవహరించారు. తరువాత అదే జర్నల్స్‌కు ఆమె ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. రిట్స్, సివిల్, క్రిమినల్, సర్వీసు కేసుల్లో నిపుణత సాధించారు. 1995లో ప్రభుత్వ న్యాయవాదిగా బాధ్యతలు చేపట్టి, 2001లో అదనపు న్యాయమూర్తిగా, 2002లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ధైర్యానికి మారుపేరుగా నిలిచే జస్టిస్ రోహిణి న్యాయమూర్తిగా పలు సంచలన తీర్పులు వెలువరించారు. -
లైంగిక దాడులపై విస్తృత చర్చలు చేపట్టాలి: జి. రోహిణి
చిత్తూరు, న్యూస్‌లైన్: పిల్లలపై జ రుగుతున్న లైంగిక దాడుల నివారణకు విస్తృతంగా చర్చలు జరగాలని హైకోర్టు సీనియర్ న్యాయమూ ర్తి, న్యాయ సేవాధికార సంస్థ రాష్ట్ర కార్యనిర్వాహక చైర్పర్సన్ జస్టిస్ రోహిణి అన్నారు. చిత్తూరులోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ‘పిల్లలపై లైంగిక దాడుల నివారణ చట్టం’పై అవగాహన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. జస్టిస్ రోహిణి మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో పిల్లలపై లైంగిక దాడులు, హింసాత్మక ఘట నలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. రెండేళ్ల క్రితం రూపొందించిన పిల్లలపై లైంగిక దాడుల నివారణ చట్టాన్ని అమలుచేయడంలో పోలీసులదే బాధ్యతని పేర్కొన్నారు. బాధిత పిల్లల్ని పదేపదే న్యాయస్థానాలకు పిలిపించకుండా ఘటన జరిగిన ఏడాదిలోపు కేసును పరిష్కరించి నిందితుల్ని శిక్షించడానికి న్యాయాధికారులు, పోలీసులు సహకరించాలని కోరారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి శ్యామ్‌ప్రసాద్ మాట్లాడుతూ దేశంలోని పిల్లల్ని రక్షించుకోవడానికి నూతన చట్టాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.